సవాలుకు కట్టుబడి ఉన్నా!
టీడీపీ నేతలకు మంత్రి జూపల్లి బహిరంగ లేఖ
హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నిధులు వెచ్చించారని చెప్పుకుంటున్న టీడీపీ ఎమ్మెల్యేలు, నేతల ప్రకటనల్లో వాస్తవమెంతో తేల్చడానికి సిద్ధంగా ఉన్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం వారికి ఒక బహిరంగ లేఖ రాశారు. ‘మీ అధినేత చంద్రబాబు పాలమూరు జిల్లాతోపాటు తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా అనుసరించిన వైఖరిని, పాలమూరు- ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకుంటున్న తీరును ప్రజల ముందు ఆధారాలతో బట్టబయలు చేయడానికి నాతో పాటు, నా సహచర ఎమ్మెల్యేలు, ఎంపీలు సిద్ధంగా ఉన్నాం’ అని మంత్రి లేఖలో పేర్కొన్నారు.
పాత్రికేయులే న్యాయ నిర్ణేతలుగా.. టీవీ చానళ్లలో ప్రత్యక్ష ప్రసారం జరిగేలా చర్చ ఏర్పాటు చేయాలని, ఇందుకోసం పాత్రికేయులను తాను ప్రత్యేకంగా అభ్యర్థిస్తున్నానని చెప్పారు. అసెంబ్లీ కమిటీ హాల్లో ఈనెల 13, 15, 16 తేదీల్లో ఉదయం 11 నుంచి సిద్ధంగా ఉంటానని, లేదంటే మరే తేదీల్లోనైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. పాలమూరు ప్రాజెక్టుల విషయంలో జూపల్లి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే.