అవినీతిపై రాజీలేని పోరు | Uncompromising fight against corruption | Sakshi
Sakshi News home page

అవినీతిపై రాజీలేని పోరు

Published Sun, Jun 23 2019 4:20 AM | Last Updated on Sun, Jun 23 2019 5:35 AM

Uncompromising fight against corruption - Sakshi

ప్రథమ ప్రాధాన్యంగా పోలవరం ప్రాజెక్టు అక్రమాలపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలి.ఆ తర్వాత పట్టణ నిరుపేదల ఇళ్లు, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వంశధార ప్రాజెక్టుల పనులపై విచారించండి. అనంతరం ప్రాధాన్యతల వారీగా వివిధ రంగాల్లో చోటు చేసుకున్న కుంభకోణాలపై విచారణ చేయండి.

అత్యంత పారదర్శకంగా నిర్వహించిన టెండర్లపై ఎవరైనా ఆరోపణలు చేసినా, అసత్య కథనాలు ప్రచురించినా పరువు నష్టం దావా వేస్తాం. జ్యుడిషియల్‌ కమిషన్‌కు సాంకేతిక సలహాలు అందించడం కోసం నిపుణుల కమిటి సేవలు వినియోగించుకుంటాం. ప్రతి 15 రోజులకు ఒకసారి మీతో భేటీ అవుతా. విచారణ పురోగతిని సమీక్షించి ఏవైనా సమస్యలుంటే అప్పటికప్పుడు పరిష్కరిస్తా.

వంద రూపాయల వస్తువు రూ.80కే వస్తుందంటే.. రూ.80కే కొంటామా? లేక రూ.వందకు కొంటామా? కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన చంద్రబాబు సర్కార్‌ మాత్రం రూ.వందకే కొనుగోలు చేసింది.

రాజధానిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.పది వేలు ఖర్చు చేశారు. ఇటీవల మరమ్మతుల కోసం గోడలను పరిశీలిస్తే ఒక్క ఇటుక కూడా కనిపించ లేదు. 
ఫ్లైవుడ్‌తో గోడలు కట్టారు.

– నిపుణులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో చంద్రబాబు వ్యవస్థీకృతం చేసిన అవినీతిని కూకటి వేళ్లతో పెకలించడమే లక్ష్యంగా పోరాటం ప్రారంభించానని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నంత అవినీతి దేశంలో మరెక్కడా ఉండదని ఢిల్లీలో చర్చ జరుగుతోందన్నారు. దేశంలో అత్యంత అవినీతి సీఎంగా చంద్రబాబు పేరు తెచ్చుకున్నారని, ఆయన తీరు వల్లే జాతీయ స్థాయిలో రాష్ట్ర పరువు, ప్రతిష్టలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తాను కూడా కళ్లు మూసుకుంటే రాష్ట్రం భవిష్యత్‌ అధోగతిపాలవుతుందన్నారు. దేశంలోనే అత్యున్నత పారదర్శక విధానాలకు ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రంగా మార్చే వరకు విశ్రమించే ప్రశ్నే లేదని తెగేసి చెప్పారు.

రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ పనుల్లో అక్రమాలపై విచారణ చేయడానికి ప్రభుత్వం ఈనెల 14న నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఈ కమిటీ సభ్యులతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మొదటిసారి సమావేశమయ్యారు. నిపుణుల కమిటీ ఏర్పాటు చేయడానికి దారితీసిన పరిస్థితులను వివరించారు. రాష్ట్రంలో 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక.. అక్రమార్జన కోసం అవినీతిని వ్యవస్థీకృతం చేశారన్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లో అప్పటి వరకు పని చేస్తున్న కాంట్రాక్టర్లపై 60సీ నిబంధన కింద వేటు వేయడం.. మిగిలిపోయిన పని అంచనా వ్యయాన్ని అమాంతం పెంచేయడం.. కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు కుదిరితే నామినేషన్‌ పద్దతిలో కట్టబెట్టడం, కుదరకపోతే టైలర్‌ మేడ్‌ నిబంధనలతో టెండర్‌ నిర్వహించి అప్పగించడం.. అవసరం లేకపోయినా జీవో 22, జీవో 63 ద్వారా అదనపు నిధులు దోచిపెట్టడం ద్వారా చంద్రబాబు భారీ ఎత్తున దోచుకున్నారని, ఈ దోపిడీ వల్ల రాష్ట్ర ఖజానా అతలాకుతలమైందని వివరించారు. 

ప్రజా ధనాన్ని మిగిల్చే అధికారులకు సన్మానం
చెడిపోయిన వ్యవస్థను బాగు చేయడానికి తాను సిద్ధమైతే, అవినీతిని పట్టించుకోకుండా కళ్లు మూసుకోవాలని కొందరు తనకు ఉచిత సలహాలు ఇచ్చారని సీఎం వైఎస్‌ జగన్‌ వివరించారు. ఈ వ్యవస్థలో మార్పు తీసుకురాకపోతే రాష్ట్రానికి భవిష్యత్‌ ఉండదని, అందుకే అత్యంత పారదర్శకత కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు. ‘కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన చంద్రబాబు భారీ ఎత్తున కమీషన్లు దండుకుని.. అంచనా వ్యయాన్ని పెంచాలని ఒత్తిడి చేస్తే అధికారులు ఏం చేస్తారు.. ఆ ఒత్తిళ్లకు తలొగ్గి అంచనా వ్యయాన్ని పెంచేశారు.. ప్రజాధనాన్ని ఒకరు దోచేస్తే ఆ తప్పు అధికారులపై పడుతోంది’ అని చెప్పారు. ఉన్నత స్థానంలో ఉన్న వారు నిజాయితీగా ఉంటే దిగువ స్థాయిలో ఉన్న వారు కూడా అలాగే ఉంటారని అభిప్రాయపడ్డారు. అవినీతిని నిర్మూలించడం కోసం తాము కృత నిశ్చయంతో పని చేస్తున్నామని, ఇదే అంశాన్ని కార్యదర్శుల నుంచి విభాగాల అధిపతుల(హెచ్‌వోడీ) వరకూ స్పష్టం చేశానని.. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలూ తప్పవని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ ఒత్తిడి వల్ల అంచనా వ్యయం పెంచేసి.. ఖజానాకు జరిగిన నష్టాన్ని బయటపెట్టి.. ప్రజాధనాన్ని మిగిల్చే అధికారులకు ప్రజల సమక్షంలో ఘనంగా సన్మానం చేస్తామని పునరుద్ఘాటించారు.
శనివారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఇంజనీరింగ్‌ నిపుణుల కమిటీ సభ్యులతో సమావేశమైన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి   

కళ్లు.. చెవులూ మీరే..
చెడిపోయిన వ్యవస్థను బాగు చేయడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడం కోసం అనేక తర్జనభర్జనలు పడ్డామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ‘విభిన్న రంగాల్లో అత్యంత నిష్ణాతులు, నిజాయితీపరులు, నిబద్ధత కలిగిన వారైన మీ ఏడుగురిని నిపుణుల కమిటీకి ఎంపిక చేశాం. మా ప్రభుత్వ కళ్లూ, చెవులూ మీరే. నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా, పారదర్శకంగా విచారణ చేయండి. ఏ ప్రాజెక్టులు అవసరమో.. ఏవి అనవసరమో తేల్చి చెప్పండి.. రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించాల్సిన ప్రాజెక్టులు ఏవో సూచించండి.. విచారణకు అవసరమైన సాంకేతిక, మానవ వనరులు.. ఇతరత్రా అన్ని వసతులు సమకూర్చుతాం’ అంటూ నిపుణుల కమిటీకి  దిశానిర్దేశం చేశారు. అత్యంత ప్రధానమైన ప్రాజెక్టులకు విచారణ పేరుతో ఆటంకం కలిగించకూడదన్నారు. సాగునీటి ప్రాజెక్టులే కాదు.. పీఏంఏవై పథకం కింద పట్టణ పేదలకు నిర్మిస్తున్న ఇళ్లు మొదలు.. రాజధాని వరకు చంద్రబాబు భారీ కుంభకోణాలకు పాల్పడ్డారని వివరించారు. పట్టణ పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రం వాటా రూ.1.50 లక్షలు, రాష్ట్రం వాటా రూ.1.50 లక్షలు.. వెరసి రూ.మూడు లక్షలతో ఇళ్లు నిర్మించి ఇవ్వవచ్చని చెప్పారు. ఇసుక, భూమి ఉచితంగా ఇస్తున్న నేపథ్యంలో చదరపు అడుగు రూ.1,100కే నిర్మించి ఇవ్వవచ్చని, అయితే కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన చంద్రబాబు చదరపు అడుగు రూ.2,200 చొప్పున పనులు కట్టబెట్టడం వల్ల పేదలపై భారం పడిందన్నారు. ఉచితంగా రావాల్సిన ఇంటికి ఒక్కో లబ్ధిదారుడు నెలనెలా రూ.మూడు వేల చొప్పున బ్యాంకుకు కిస్తులు కట్టాల్సిన దుస్థితిని కల్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టులకు పారదర్శకంగా టెండర్లు నిర్వహించేందుకు నమూనా టెండర్‌ డాక్యుమెంట్‌ను రూపొందించి ఇవ్వాలని కోరారు.

జ్యుడిషియల్‌ కమిషన్‌ నేతృత్వంలో టెండర్లు 
విచారణ అనంతరం రివర్స్‌ టెండరింగ్‌ చేయాల్సిన ప్రాజెక్టులను సూచిస్తే, వాటి అంచనా వ్యయాన్ని అలానే ఉంచి.. ఎక్కువ మంది కాంట్రాక్టర్లు పోటీ పడేలా నిబంధనలు సడలించి టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేస్తామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. దీని వల్ల ప్రజాధనం ఎంత ఆదా అయిందో ప్రజలకు వివరిస్తామన్నారు. ఇందుకు కారణమైన నిపుణులు, అధికారులకు ప్రజల సమక్షంలో సన్మానం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొత్తగా భారీ ఎత్తున ప్రాజెక్టులు.. మౌలిక సదుపాయాల కల్పన పనులు తదితరాలు చేపడతామని.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి ప్రసారమాధ్యమాలు లేనిపోని ఆరోపణలు చేయడానికి సిద్ధంగా ఉంటాయన్నారు.

రాష్ట్రంలో నిర్వీర్యమైన టెండర్ల వ్యవస్థకు జీవం పోసేందుకు జ్యుడిషియల్‌ కమిషన్‌ నేతృత్వంలో టెండర్లు నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు. ఇప్పటికే హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ను కలిసి ఇందుకోసం జడ్జిని కేటాయించాలని కోరామని గుర్తు చేశారు. రూ.వంద కోట్ల కంటే ఎక్కువ విలువైన పనుల టెండర్‌ డాక్యుమెంట్‌ను జ్యుడిషియల్‌ కమిషన్‌కు పంపుతామని.. దాన్ని ఏడు రోజులపాటు పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచుతామని.. ప్రజలు చేసే సూచనల ఆధారంగా టెండర్‌ డాక్యుమెంట్‌లో జ్యుడిషియల్‌ కమిషన్‌ మార్పులు చేర్పులు చేసి ఎనిమిది రోజుల్లోగా సర్కార్‌కు అందిస్తుందని చెప్పారు. జ్యుడిషియల్‌ కమిషన్‌ ఖరారు చేసిన డాక్యుమెంట్‌తోనే టెండర్లు నిర్వహిస్తామని, దీని వల్ల అక్రమాలకు తావు ఉండదని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో నిపుణుల కమిటీ సభ్యులు రిటైర్డు ఈఎన్‌సీలు ఎల్‌.నారాయణరెడ్డి, అబ్దుల్‌ బషీర్, స్ట్రక్చరల్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా మాజీ అధ్యక్షుడు పి.సూర్యప్రకాశ్, రిటైర్డు ఈఎన్‌సీ సుబ్బరాయశర్మ (రహదారులు, భవనాల శాఖ), రిటైర్డు ఈఎన్‌సీ ఎఫ్‌సీఎస్‌ పీటర్‌ (రహదారులు, భవనాల శాఖ), ఏపీ జెన్‌కో రిటైర్డ్‌ డైరెక్టర్‌ ఆదిశేషు, సీడీవో రిటైర్డు సీఈ ఐఎస్‌ఎన్‌ రాజు, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ధనుంజయరెడ్డి, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement