Fact Check: ‘సోలార్‌’పై వక్రించిన ఈనాడు కథ | Ramoji Rao Eenadu Fake News on Solar Power Projects | Sakshi
Sakshi News home page

Fact Check: ‘సోలార్‌’పై వక్రించిన ఈనాడు కథ

Published Sun, Nov 26 2023 6:22 AM | Last Updated on Sun, Nov 26 2023 5:01 PM

Ramoji Rao Eenadu Fake News on Solar Power Projects - Sakshi

సాక్షి, అమరావతి: కడప అల్ట్రా మెగా సోలార్‌ పార్క్‌ వద్ద సోలార్‌ పవర్‌ ప్రాజెక్టులకు టెండర్లు పిలిచి, వాటిని కంపెనీలకు అప్పజెప్పింది కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ). అదీ టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు హయాంలోనే జరిగింది. ఒప్పందాలూ అప్పుడే జరిగాయి. ఆ ప్రాజెక్టులు పొందిన సంస్థల్లో అదానీ లేదు. 250 మెగావాట్ల ప్రాజెక్టు పొందిన ఓ సంస్థను అదానీ సంస్థ గతంలో ఎప్పుడో టేకోవర్‌ చేసింది. అయినా రామోజీరావు వక్రబుద్ధితో సీఎం జగన్‌ ప్రభుత్వంపై బురద చల్లుతూ ‘అదానీ అయితే ఓకే‘ శీర్షికన శనివారం ఈనాడులో తప్పుడు కథనం అచ్చేశారు.

నాలుగేళ్లుగా ప్రాజెక్టులు అమలు కాకపోవడానికి కోర్టుల్లో వ్యాజ్యాలు వేసిన కంపెనీలే కారణమైనా సీఎం జగన్‌ సర్కారే కారణమంటూ మరో బండ వేసే ప్రయత్నం చేశారు. నిజానికి డిస్కంలు కోరిన వెంటనే ప్రాజెక్టులు త్వరగా ప్రారంభించేలా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కోర్టు వ్యాజ్యాల నుంచి అందరూ తప్పుకునేలా కృషి చేసి, ప్రాజెక్టులను శంకుస్థాపన వరకు తెచ్చింది. వీటన్నింటినీ విస్మరించి.. కనీస ఆలోచన, జ్ఞానం లేకుండా అసత్యాలతో, ప్రజలను పూర్తిగా తప్పుదారి పట్టించేలా  కథనాన్ని అచ్చేసింది ఈనాడు.

ఈ ప్రాజెక్టులు, వాటి వ్యవహారాలపై అసలు వాస్తవాలను ఆంధ్రప్రదేశ్‌ సోలార్‌ పవర్‌ కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌పీసీఎల్‌) ఎండీ, సీఈవో డాక్టర్‌ ఎం.కమలాకర్‌బాబు వెల్లడించారు.  ఇది ఏ ఒక్కరి లబ్ధి కోసమో చేసింది కాదని స్పష్టం చేశారు. సోలార్‌ ప్రాజెక్టుల కోసం మైలవరం వద్ద 3 వేల ఎకరాలకు పైగా భూమిని సిద్ధంగా ఉంచినప్పటికీ, సోలార్‌ పవర్‌ డెవలపర్‌ (ఎస్‌పీడీ)లు కాలయాపన చేశారని, ఈ వాస్తవాలను దాచి ప్రభుత్వంపై బురదజల్లేందుకు ఈనాడు కట్టుకథలు అల్లడంలో అర్ధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆయన తెలిపిన వాస్తవాలివీ..

ఈ ప్రాజెక్టుల ‘కథ’ ఇదీ..
చంద్రబాబు ప్రభుత్వం హయాంలో కడప అల్ట్రా మెగా సోలార్‌ పార్క్‌ వద్ద ఒక్కోటీ 250 మెగావాట్ల సామర్ధ్యం గల మూడు సోలార్‌ ప్రాజెక్టులకు టెండర్లను సెకీ 2018 జూలై 6నే పూర్తి చేసింది. వీటిలో ఎస్బీ ఎనర్జీ సెవెన్‌ లిమిటెడ్‌ 250 మెగావాట్ల ప్రాజెక్టు ఒక దానిని దక్కించుకుంది. ప్రాజెక్టు విలువ దాదాపు రూ. 1,250 కోట్లు. మిగతా రెండు ప్రాజెక్టులను మరో రెండు కంపెనీలు పొందాయి. ఆ తరువాత ఎస్బీ ఎనర్జీ సెవెన్‌ సంస్థను అదానీ సంస్థ టేకోవర్‌ చేసింది. డిస్కంలతో ఒప్పందాలు కూడా 2018 జూలై 27నే పూర్తి చేశారు.

టారిఫ్‌ను అనుమతించాలని 2019 ఫిబ్రవరిలో విద్యుత్‌ నియంత్రణ మండలిని డిస్కంలు కోరాయి. సెకీ,  ఎస్‌పీడీలు, ఎస్‌పీడీలకు ఏపీఎస్‌పీసీఎల్‌కు మధ్య ఒప్పందాలు 2019 మార్చికి పూర్తయ్యాయి. అంటే ఇదంతా చంద్రబాబు సీఎంగా ఉండగానే జరిగాయి. ఆ తర్వాత చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేసేలోగానే ఎస్‌పీడీలు వివిధ రకాల కారణాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. అంటే ఈ నాలుగేళ్ల కాలయాపన ఎస్‌పీడీలదే గానీ ప్రభుత్వంది కాదన్నది సుస్పష్టం. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నింటినీ పరిష్కరించి, ప్రాజెక్టులు అమలయ్యేందుకు చర్యలు చేపట్టింది.

బాబు తప్పిదాన్ని మోయక తప్పదు
చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన ఈ టెండర్లు, ఒప్పందాలను ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం అనుసరించక తప్పదు. లేదంటే రాష్ట్ర ఖజానా నుంచి పెద్ద మొత్తంలో ఆ సంస్థలకు డబ్బు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. 750 మెగావాట్ల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులకు వన్‌ టైమ్‌ డెవలప్‌మెంట్‌ చార్జీలు, లాండ్‌ లీజు చార్జీల కింద 2018–19 ఆర్థిక సంవత్సరంలోనే టెండర్‌ దక్కించుకున్న సంస్థలు రూ.309.39 కట్టేశాయి.

ఈ మొత్తంలో డెవలప్‌మెంట్‌ చార్జీల కింద మెగావాట్‌కు రూ.41.2 లక్షలను ఒక్కో సంస్థ చెల్లించింది. లాండ్‌ లీజ్‌ చార్జీలుగా మెగావాట్‌కు మరో రూ.5 వేలు చెల్లించాయి. ఇవిగాక యాన్యువల్‌ ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ చార్జీల కింద మెగావాట్‌కు రూ.3.2 లక్షలు కట్టాయి. లోకల్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ చార్జీగా మెగావాట్‌కు రూ.1 లక్ష ఇచ్చేందుకు ఒప్పుకున్నాయి. వాటితో సబ్‌ స్టేషన్లు, లైన్ల నిర్మాణం, స్థానిక ప్రాంతాల అభివృద్ధి జరిగింది. పైగా, కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టులకు గ్రాంట్‌ కింద రూ. 54 కోట్లను ఏపీఎస్పీసీఎల్‌కు ఇచ్చింది.

ఇప్పుడు ప్రాజెక్టులను కంపెనీలకు అప్పగించి ప్రారంభించకపోతే ఈ మొత్తం డబ్బును వడ్డీతో సహా తిరిగివ్వాలి.  అదీగాక ఏపీఈఆర్‌సీ ఆమోదంతో కుదుర్చుకున్న పీపీఏలన్నింటినీ ప్రభుత్వం కొనసాగించాలి్సందే. అందువల్ల ఇప్పుడు వీటిని కాదనడానికి లేదు. పైగా, మొత్తం 750 మెగావాట్లలో ఎస్బీ ఎనర్జీ సెవెన్‌ లిమిటెడ్‌కు వచ్చింది 250 మెగావాట్ల ప్రాజెక్టు. అంటే ఆ సంస్థను టేకోవర్‌ చేసిన అదానీ సంస్థకు ఈ ప్రాజెక్టులో ఉన్నది మూడో వంతు మాత్రమే. ఇందులో అదానీకి కొత్తగా జరిగే లబ్ధి ఏమీ లేదు.

నష్టం జరిగిందనడంలో అర్థం లేదు
గత నాలుగేళ్లలో సోలార్‌ ధరలు ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. ప్రతి ప్రాజెక్టుకి నిర్దిష్ట పరిస్థితులు ఉంటాయి. వీటిని పరిగణనలోకి తీసుకుని మాత్రమే ధరను నిర్ణయించాలి. నష్టం జరిగిందని చెప్పడంలో అర్ధం లేదు. సోలార్‌ ప్రాజెక్టుల వల్ల మైలవరం ప్రాంతం అభివృద్ధితో పాటు సంప్రదాయేతర విద్యుత్‌ అందుబాటులోకి వస్తుంది. కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. బహిరంగ మార్కెట్‌లో యూనిట్‌ రూ.6 నుంచి రూ.12కు కొనే బదులు గ్రీన్‌ పవర్‌ను యూనిట్‌ రూ.2.70కి కొనడం వల్ల డిస్కంలకు ఆర్ధిక ప్రయోజనం కలుగుతుంది.

జగన్‌ ప్రభుత్వంలో అంతా పారదర్శకంగానే..
వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రాగానే ప్రతి పనినీ, ప్రతి ప్రాజెక్టునూ పారదర్శకంగా, అవినీతి రహతంగా, ప్రజలకు మేలు చేకూరే విధంగానే చేపడుతోంది. అందుకోసం న్యాయ సమీక్ష, రివర్స్‌ టెండరింగ్‌ పద్ధతులు ప్రవేశపెట్టింది. ఇవి దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి. ఏ ప్రాజెక్టు కోసమైనా అర్హత ఉన్న ఎవరైనా టెండర్‌ ద్వారా పోటీ పడవచ్చు. ఆ టెండర్లను న్యాయ సమీక్షకు పంపి, క్లియరెన్స్‌ వస్తేనే కేటాయిస్తున్నారు. అంత పారదర్శకంగా టెండర్‌ ప్రక్రియ నిర్వహిస్తుంటే, ఒక కంపెనీకి లబ్ధి చేకూరుస్తున్నారంటూ ఈనాడు చేస్తున్న ఆరోపణలు సత్యదూరమే. 

ఎక్కువ ధరకు కొన్నదే బాబు ప్రభుత్వం.. ఆదా చేస్తున్నది జగన్‌ సర్కారు
వాస్తవానికి ప్రైవేటు విద్యుత్‌ కంపెనీలకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చేందుకు ఎక్కువ ధరకు విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు) చేసుకున్నదే చంద్రబాబు ప్రభుత్వం. ఈ విషయంలో చంద్రబాబుకు పెద్ద చరిత్రే ఉంది. బాబు ప్రభుత్వ హయాంలో చేసుకున్న పీపీఏల ధరలకు, ఇప్పుడు ప్రభుత్వం సెకీతో కుదుర్చుకున్న ఒప్పందంలోని ధరలకు పొంతన లేదు.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సగటు ధరకన్నా ఎక్కువకు కొనుగోలు ఒప్పందాలు జరిగాయి. అప్పట్లో సౌర విద్యుత్‌ యూనిట్‌ రూ.3.54 ఉంటే  రూ.8.90 వెచ్చించారు. దాదాపు 7 వేల మెగా వాట్ల విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల వల్ల విద్యుత్‌  సంస్థలపై ఏటా అదనంగా రూ.3,500 కోట్లు భారం పడుతోంది. వచ్చే 25 ఏళ్ళ వరకు ఈ భారాన్ని  విద్యుత్‌  సంస్థలు భరించాలి. దీనినే అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం వైఎస్‌ జగన్‌ అసెంబ్లీలో  తప్పుపట్టారు. అలాంటి తప్పు మళ్లీ జరగకుండా సెకీ నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను ప్రస్తుతం సగటు ధర యూనిట్‌కు రూ.5.10గా ఉన్నప్పటికీ, యూనిట్‌ రూ.2.49కే ప్రభుత్వం సేకరిస్తోంది.

దీంతో ఏటా దాదాపు రూ. 3,750 కోట్లను ఆదా చేయనుంది. చంద్రబాబు హయాంలో ఎంత ఎక్కువ ధరకు ఒప్పందాలు చేసుకున్నా పట్టని రామోజీ, ఇప్పుడు అతి తక్కువకు విద్యుత్‌ కొంటుంటే నేరమన్నట్లుగా రాస్తున్నారు. పైగా, ఈ విద్యుత్‌ను పూర్తిగా వ్యవసాయం కోసం రైతులకు ఉచితంగా అందించనుంది. అలా ఇవ్వాలనుకోవడం తప్పంటారా?  అన్నదాతలకు సాగు కోసం నీరు ఇవ్వద్దంటారా? మీ తప్పుడు రాతల పరమార్ధం అదేగా రామోజీ.!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement