fack
-
నకిలీ మందుల సమాచారం ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: ప్రజారోగ్యానికి పెను ముప్పుగా మారిన నకిలీ డ్రగ్స్ పై సమాచారం ఇవ్వాలని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్(డీసీఏ) డైరెక్టర్ జనరల్ వీబీ కమలాసన్‌రెడ్డి కోరారు. ప్రజాదరణ పొందిన ప్రముఖ కంపెనీల బ్రాండ్లను పోలి ఉండేలా కొన్ని మోసపూరిత కంపెనీలు నకిలీ మందులను తయారుచేసి మార్కెట్లో విక్రయిస్తున్నట్టు తెలిపారు. ఇందుకు గత కొద్ది రోజులలో డీసీఏ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన దాడుల్లో గుర్తించిన మందులే ఉదాహరణగా ఆయన శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నకిలీ మందులు వ్యాధిని నయం చేయడంలో విఫలం కావడమే కాకుండా కాలక్రమేణా, రోగికి వినాశకరమైన పరిణామాలను సృష్టిస్తాయని తెలిపారు. అనుమానం వచ్చినా ఫోన్ చేయండి నకిలీ మందులను గుర్తించినా, నకిలీ అనే అనుమానం వచ్చినా స్థానిక డ్రగ్స్ ఇన్స్పెక్టర్ లేదా అసిస్టెంట్ డైరెక్టర్, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కు తెలియజేయాలని సూచించారు. వివరాల కోసం డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణ వెబ్సైట్ https:// dca.telangana.gov.in లో ‘కీ కాంటాక్ట్స్’ విభాగంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. డీసీఏ టోల్ ఫ్రీ నంబర్ 18005996969లో అన్ని పని దినాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.00 వరకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. మెడికల్ షాపు ల్లో డ్రగ్స్ ఇన్స్పెక్టర్ (పేరు, సంప్రదించాల్సిన నంబర్, చిరునామా) వివరాలు, డీసీఏ టోల్ ఫ్రీ నంబర్‌తో కూడిన ‘పోస్టర్’ని ప్రదర్శిస్తున్నట్టు తెలిపారు. -
Fact Check: ‘సోలార్’పై వక్రించిన ఈనాడు కథ
సాక్షి, అమరావతి: కడప అల్ట్రా మెగా సోలార్ పార్క్ వద్ద సోలార్ పవర్ ప్రాజెక్టులకు టెండర్లు పిలిచి, వాటిని కంపెనీలకు అప్పజెప్పింది కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ). అదీ టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు హయాంలోనే జరిగింది. ఒప్పందాలూ అప్పుడే జరిగాయి. ఆ ప్రాజెక్టులు పొందిన సంస్థల్లో అదానీ లేదు. 250 మెగావాట్ల ప్రాజెక్టు పొందిన ఓ సంస్థను అదానీ సంస్థ గతంలో ఎప్పుడో టేకోవర్ చేసింది. అయినా రామోజీరావు వక్రబుద్ధితో సీఎం జగన్ ప్రభుత్వంపై బురద చల్లుతూ ‘అదానీ అయితే ఓకే‘ శీర్షికన శనివారం ఈనాడులో తప్పుడు కథనం అచ్చేశారు. నాలుగేళ్లుగా ప్రాజెక్టులు అమలు కాకపోవడానికి కోర్టుల్లో వ్యాజ్యాలు వేసిన కంపెనీలే కారణమైనా సీఎం జగన్ సర్కారే కారణమంటూ మరో బండ వేసే ప్రయత్నం చేశారు. నిజానికి డిస్కంలు కోరిన వెంటనే ప్రాజెక్టులు త్వరగా ప్రారంభించేలా వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కోర్టు వ్యాజ్యాల నుంచి అందరూ తప్పుకునేలా కృషి చేసి, ప్రాజెక్టులను శంకుస్థాపన వరకు తెచ్చింది. వీటన్నింటినీ విస్మరించి.. కనీస ఆలోచన, జ్ఞానం లేకుండా అసత్యాలతో, ప్రజలను పూర్తిగా తప్పుదారి పట్టించేలా కథనాన్ని అచ్చేసింది ఈనాడు. ఈ ప్రాజెక్టులు, వాటి వ్యవహారాలపై అసలు వాస్తవాలను ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏపీఎస్పీసీఎల్) ఎండీ, సీఈవో డాక్టర్ ఎం.కమలాకర్‌బాబు వెల్లడించారు. ఇది ఏ ఒక్కరి లబ్ధి కోసమో చేసింది కాదని స్పష్టం చేశారు. సోలార్ ప్రాజెక్టుల కోసం మైలవరం వద్ద 3 వేల ఎకరాలకు పైగా భూమిని సిద్ధంగా ఉంచినప్పటికీ, సోలార్ పవర్ డెవలపర్ (ఎస్పీడీ)లు కాలయాపన చేశారని, ఈ వాస్తవాలను దాచి ప్రభుత్వంపై బురదజల్లేందుకు ఈనాడు కట్టుకథలు అల్లడంలో అర్ధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆయన తెలిపిన వాస్తవాలివీ.. ఈ ప్రాజెక్టుల ‘కథ’ ఇదీ.. చంద్రబాబు ప్రభుత్వం హయాంలో కడప అల్ట్రా మెగా సోలార్ పార్క్ వద్ద ఒక్కోటీ 250 మెగావాట్ల సామర్ధ్యం గల మూడు సోలార్ ప్రాజెక్టులకు టెండర్లను సెకీ 2018 జూలై 6నే పూర్తి చేసింది. వీటిలో ఎస్బీ ఎనర్జీ సెవెన్ లిమిటెడ్ 250 మెగావాట్ల ప్రాజెక్టు ఒక దానిని దక్కించుకుంది. ప్రాజెక్టు విలువ దాదాపు రూ. 1,250 కోట్లు. మిగతా రెండు ప్రాజెక్టులను మరో రెండు కంపెనీలు పొందాయి. ఆ తరువాత ఎస్బీ ఎనర్జీ సెవెన్ సంస్థను అదానీ సంస్థ టేకోవర్ చేసింది. డిస్కంలతో ఒప్పందాలు కూడా 2018 జూలై 27నే పూర్తి చేశారు. టారిఫ్‌ను అనుమతించాలని 2019 ఫిబ్రవరిలో విద్యుత్ నియంత్రణ మండలిని డిస్కంలు కోరాయి. సెకీ, ఎస్పీడీలు, ఎస్‌పీడీలకు ఏపీఎస్పీసీఎల్కు మధ్య ఒప్పందాలు 2019 మార్చికి పూర్తయ్యాయి. అంటే ఇదంతా చంద్రబాబు సీఎంగా ఉండగానే జరిగాయి. ఆ తర్వాత చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేసేలోగానే ఎస్పీడీలు వివిధ రకాల కారణాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. అంటే ఈ నాలుగేళ్ల కాలయాపన ఎస్‌పీడీలదే గానీ ప్రభుత్వంది కాదన్నది సుస్పష్టం. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నింటినీ పరిష్కరించి, ప్రాజెక్టులు అమలయ్యేందుకు చర్యలు చేపట్టింది. బాబు తప్పిదాన్ని మోయక తప్పదు చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన ఈ టెండర్లు, ఒప్పందాలను ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం అనుసరించక తప్పదు. లేదంటే రాష్ట్ర ఖజానా నుంచి పెద్ద మొత్తంలో ఆ సంస్థలకు డబ్బు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. 750 మెగావాట్ల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులకు వన్ టైమ్ డెవలప్మెంట్ చార్జీలు, లాండ్ లీజు చార్జీల కింద 2018–19 ఆర్థిక సంవత్సరంలోనే టెండర్ దక్కించుకున్న సంస్థలు రూ.309.39 కట్టేశాయి. ఈ మొత్తంలో డెవలప్మెంట్ చార్జీల కింద మెగావాట్‌కు రూ.41.2 లక్షలను ఒక్కో సంస్థ చెల్లించింది. లాండ్ లీజ్ చార్జీలుగా మెగావాట్‌కు మరో రూ.5 వేలు చెల్లించాయి. ఇవిగాక యాన్యువల్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ చార్జీల కింద మెగావాట్‌కు రూ.3.2 లక్షలు కట్టాయి. లోకల్ ఏరియా డెవలప్మెంట్ చార్జీగా మెగావాట్‌కు రూ.1 లక్ష ఇచ్చేందుకు ఒప్పుకున్నాయి. వాటితో సబ్ స్టేషన్లు, లైన్ల నిర్మాణం, స్థానిక ప్రాంతాల అభివృద్ధి జరిగింది. పైగా, కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టులకు గ్రాంట్ కింద రూ. 54 కోట్లను ఏపీఎస్పీసీఎల్కు ఇచ్చింది. ఇప్పుడు ప్రాజెక్టులను కంపెనీలకు అప్పగించి ప్రారంభించకపోతే ఈ మొత్తం డబ్బును వడ్డీతో సహా తిరిగివ్వాలి. అదీగాక ఏపీఈఆర్సీ ఆమోదంతో కుదుర్చుకున్న పీపీఏలన్నింటినీ ప్రభుత్వం కొనసాగించాలి్సందే. అందువల్ల ఇప్పుడు వీటిని కాదనడానికి లేదు. పైగా, మొత్తం 750 మెగావాట్లలో ఎస్బీ ఎనర్జీ సెవెన్ లిమిటెడ్‌కు వచ్చింది 250 మెగావాట్ల ప్రాజెక్టు. అంటే ఆ సంస్థను టేకోవర్ చేసిన అదానీ సంస్థకు ఈ ప్రాజెక్టులో ఉన్నది మూడో వంతు మాత్రమే. ఇందులో అదానీకి కొత్తగా జరిగే లబ్ధి ఏమీ లేదు. నష్టం జరిగిందనడంలో అర్థం లేదు గత నాలుగేళ్లలో సోలార్ ధరలు ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. ప్రతి ప్రాజెక్టుకి నిర్దిష్ట పరిస్థితులు ఉంటాయి. వీటిని పరిగణనలోకి తీసుకుని మాత్రమే ధరను నిర్ణయించాలి. నష్టం జరిగిందని చెప్పడంలో అర్ధం లేదు. సోలార్ ప్రాజెక్టుల వల్ల మైలవరం ప్రాంతం అభివృద్ధితో పాటు సంప్రదాయేతర విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. బహిరంగ మార్కెట్లో యూనిట్ రూ.6 నుంచి రూ.12కు కొనే బదులు గ్రీన్ పవర్‌ను యూనిట్ రూ.2.70కి కొనడం వల్ల డిస్కంలకు ఆర్ధిక ప్రయోజనం కలుగుతుంది. జగన్ ప్రభుత్వంలో అంతా పారదర్శకంగానే.. వైఎస్ జగన్ ప్రభుత్వం రాగానే ప్రతి పనినీ, ప్రతి ప్రాజెక్టునూ పారదర్శకంగా, అవినీతి రహతంగా, ప్రజలకు మేలు చేకూరే విధంగానే చేపడుతోంది. అందుకోసం న్యాయ సమీక్ష, రివర్స్ టెండరింగ్ పద్ధతులు ప్రవేశపెట్టింది. ఇవి దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి. ఏ ప్రాజెక్టు కోసమైనా అర్హత ఉన్న ఎవరైనా టెండర్ ద్వారా పోటీ పడవచ్చు. ఆ టెండర్లను న్యాయ సమీక్షకు పంపి, క్లియరెన్స్ వస్తేనే కేటాయిస్తున్నారు. అంత పారదర్శకంగా టెండర్ ప్రక్రియ నిర్వహిస్తుంటే, ఒక కంపెనీకి లబ్ధి చేకూరుస్తున్నారంటూ ఈనాడు చేస్తున్న ఆరోపణలు సత్యదూరమే. ఎక్కువ ధరకు కొన్నదే బాబు ప్రభుత్వం.. ఆదా చేస్తున్నది జగన్ సర్కారు వాస్తవానికి ప్రైవేటు విద్యుత్ కంపెనీలకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చేందుకు ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు) చేసుకున్నదే చంద్రబాబు ప్రభుత్వం. ఈ విషయంలో చంద్రబాబుకు పెద్ద చరిత్రే ఉంది. బాబు ప్రభుత్వ హయాంలో చేసుకున్న పీపీఏల ధరలకు, ఇప్పుడు ప్రభుత్వం సెకీతో కుదుర్చుకున్న ఒప్పందంలోని ధరలకు పొంతన లేదు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సగటు ధరకన్నా ఎక్కువకు కొనుగోలు ఒప్పందాలు జరిగాయి. అప్పట్లో సౌర విద్యుత్ యూనిట్ రూ.3.54 ఉంటే రూ.8.90 వెచ్చించారు. దాదాపు 7 వేల మెగా వాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల విద్యుత్ సంస్థలపై ఏటా అదనంగా రూ.3,500 కోట్లు భారం పడుతోంది. వచ్చే 25 ఏళ్ళ వరకు ఈ భారాన్ని విద్యుత్ సంస్థలు భరించాలి. దీనినే అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో తప్పుపట్టారు. అలాంటి తప్పు మళ్లీ జరగకుండా సెకీ నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను ప్రస్తుతం సగటు ధర యూనిట్‌కు రూ.5.10గా ఉన్నప్పటికీ, యూనిట్ రూ.2.49కే ప్రభుత్వం సేకరిస్తోంది. దీంతో ఏటా దాదాపు రూ. 3,750 కోట్లను ఆదా చేయనుంది. చంద్రబాబు హయాంలో ఎంత ఎక్కువ ధరకు ఒప్పందాలు చేసుకున్నా పట్టని రామోజీ, ఇప్పుడు అతి తక్కువకు విద్యుత్ కొంటుంటే నేరమన్నట్లుగా రాస్తున్నారు. పైగా, ఈ విద్యుత్‌ను పూర్తిగా వ్యవసాయం కోసం రైతులకు ఉచితంగా అందించనుంది. అలా ఇవ్వాలనుకోవడం తప్పంటారా? అన్నదాతలకు సాగు కోసం నీరు ఇవ్వద్దంటారా? మీ తప్పుడు రాతల పరమార్ధం అదేగా రామోజీ.! -
జగ్గారెడ్డి కాంగ్రెస్‌లో ఉండొద్దా?
సాక్షి, హైదరాబాద్: తాను పార్టీ మారుతున్నట్టు ఏ డాదిన్నరగా కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి మండిపడ్డారు. తాను బీఆర్ఎస్లోకి వెళ్తున్నానంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అబద్ధమన్నారు. తనకు రాజకీయ శీల పరీక్షలు అవసరం లేదని.. తన రాజకీయ ప్రయాణం రాహుల్గాందీతోనే కొనసాగుతుందని స్పష్టం చేశారు. శనివారం అసెంబ్లీ మీడియా హాల్లో జగ్గారెడ్డి మీడి యాతో మాట్లాడారు. ‘నేను పార్టీ మారుతున్నానని ప్రచారం చేయడం కొందరికి ఆనందం కలిగిస్తోంది. జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండొద్దా? నా వ్యక్తిత్వంపై ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు? సోషల్ మీడియాలో ప్రచారానికి ఎవరు, ఎన్ని డబ్బులు ఇస్తున్నారు? నేను కన్నెర్ర చేస్తే ఈ దుష్ప్రచారం చేస్తున్న వారు ఉంటారా?’అని పేర్కొన్నారు. దుష్ప్రచారం టీడీపీ కల్చర్ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే నడిరోడ్డుపై బట్టలు విప్పి నిలబెడతానని జగ్గారెడ్డి హె చ్చరించారు. సోషల్ మీడియాలో దుష్ప్రచా రం చేయడం తెలుగుదే శం పార్టీ సంస్కృతి అ ని, అక్కడి నుంచే ఇది కాంగ్రెస్‌లోకి వచ్చిదని వ్యాఖ్యానించారు. పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమం, సమావేశంలో పాల్గొంటున్నానని.. అయినా అబద్ధపు ప్రచారం చేస్తుండటం బాధ కలిగిస్తుందన్నారు. ఇప్పటికైనా ఆ మూర్ఖులు, దద్దమ్మలు తప్పుడు ప్రచారం మానేయాలన్నారు. రాహుల్‌ను సంగారెడ్డికి రమ్మంటా.. సంగారెడ్డి మీదుగా రాహుల్‌గాంధీ భారత్‌జోడో యాత్ర వెళితే సంతోషపడ్డానని, ఆర్థిక ఇబ్బందులు న్నా యాత్రను విజయవంతం చేశానని జగ్గారెడ్డి చెప్పారు. తెలంగాణలో కేసీఆర్‌పై తిరగబడిన మొదటి నాయకుడిని తానేనని.. 2018 ఎన్నికల సమయంలో తనపై కేసులు పెట్టి, జైలుకు పంపారని, అయినా కొట్లాడి గెలిచానని వివరించారు. ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు తనకు రాహుల్‌గాంధీ 20నిమిషాల పాటు ప్రత్యేకంగా సమయం ఇచ్చారని, పార్టీ విషయాలన్నింటినీ ఆయనకు వివరించానని, దీనికి త్వరలో ఫలితం ఉంటుందని జగ్గారెడ్డి చెప్పారు. రాహుల్‌తో సంగారెడ్డిలో త్వరలోనే ఓ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. -
నకిలీ పాస్ పుస్తకాలు ఇస్తే పీడీయాక్ట్
సాక్షి, యాదాద్రి : నకిలీ పాస్‌పుస్తకాలు, నకిలీ రిజిస్ట్రేషన్లు చేస్తే పీడీయాక్ట్ నమోదు చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి మహమూద్ అలీ హెచ్చరించారు. శుక్రవారం రాత్రి భువనగిరి మండలం హన్మాపురంలో జరిగిన రైతుబంధు పథకం సభలో ఆయన వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద రైతు కావడం వల్లే రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని పేర్కొన్నారు. ఆంధ్రాపరిపాలన అంతా అంధేరి పాలనగా సాగిందన్నారు. మన ముఖ్యమంత్రి రైతుల సంక్షేమానికి బడ్జెట్లో రూ. 12వేల కోట్లు కేటాయించారన్నారు. రైతుబంధు పథకం ద్వారా 58 లక్షల మంది రైతులకు చెక్కులు ఇస్తున్నామన్నారు. భూరికార్డుల ప్రక్షాళనను రెవెన్యూ సిబ్బంది 95 శాతం పూర్తి చేశారని అభినందించారు.100శాతం భూ వివాదాలు లేకుండా రికార్డుల ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి పోచా రం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రైతులకు నీళ్లు, కరెంటు, పెట్టుబడి సాయం, పంటకు మద్దతు ధర ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రైతు సమన్వయ సమితి వేదికలకు రూ. 300ల కోట్లు కేటాయించామన్నారు. రూ.12 లక్షలతో ఒక మోడల్ రైతు వేదిక నిర్మిస్తామన్నారు. తెలంగాణ దేశంలోనే మోడల్రాష్ట్రంగా ఎదుగుతుందన్నారు. రైతు కష్టాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి వారి సమస్యలను తీరుస్తుంటే కాంగ్రెస్ వాళ్లు ఆగమాగం అవుతున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 18 లక్షల ఆయకట్టు స్థిరీకరణ, 20లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు కల్పించబోతున్నామన్నారు. ఇంతవరకు పాలించిన ప్రధానులు, ముఖ్యమంత్రులు రైతుల కష్టాలను పట్టించుకోలేదని విమర్శించారు. లక్షల అప్పులు రైతులకు మిగిల్చారని ఆరోపించారు. హన్మాపురం గ్రామంలో 555 రైతులకు రూ. 45.18.085 లక్షలను రైతు బంధు ద్వారా ఇస్తున్నామన్నారు. రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుకేందర్‌రెడ్డి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా వ్యవసాయ రంగానికి దశదిశను చూపించే రైతుబంధు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టారన్నారు. 58 లక్షల మంది రైతులకు మొదటి విడతలో రూ.5,700ల కోట్లు, రెండవ విడతలో నవంబర్ 18న రూ. 5,700ల కోట్లు పెట్టుబడి సాయం అందిస్తున్నామన్నారు. రైతుల బీమాకోసం రూ. 500ల కోట్లు సీఎం కేటాయించారన్నారు. సభకు అధ్యక్షత వహించిన భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ రైతుబంధు కార్యక్రమం పండుగ వాతావరణంలో జరుగుతుందన్నారు. రైతు బంధు చెక్కులు తీసుకున్న రైతుల కళ్లల్లో ఆనందం కనిపిస్తుందన్నారు. తనకు వచ్చే రైతు బంధు చెక్కుల మొత్తాన్ని రైతు సమన్వయ సమితికి ఇచ్చేస్తానన్నారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివేది, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథి, భూరికార్డుల ప్రక్షాళన రాష్ట్ర అధికారి వాకాటి కరుణ, కలెక్టర్ అనితారామచంద్రన్, రాచకొండ సీపీ మహేష్ భగవత్, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ కొలుపుల అమరేందర్‌తోపాటు గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ జడల అమరేందర్, గ్రామ సర్పంచ్ వెంకటేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పగలేమో డాక్టర్.. రాత్రేమో...
రైల్వేకోడూరు అర్బన్ : సమాజంలో ఎంతో పవిత్రమైన వైద్యవృత్తిలో ఉంటూ.. ఎర్రచందనం స్మగ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్న మాజీ జెడ్పీటీసీ సభ్యుడు, ఆర్ఎంపీ డాక్టర్ కాల్వ నాగేశ్వర్రావుతో పాటు మరి కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. రాజంపేట డీఎస్పీ లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో సీఐ సాయినాథ్ పర్యవేక్షణలో ఎస్ఐలు వెంకటేశ్వర్లు, భక్తవత్సలంలు తమ సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఎంతోకాలంగా గుట్టుచప్పుడు కాకుండా డాక్టర్ ముసుగులో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న కాల్వ నాగేశ్వర్రావు, ప్రొటెక్షన్ వాచర్లు సుధాకర్, పరశురాం, శ్రీనులను కోడూరు మండలం కుక్కలదొడ్డికి చెందిన అంకయ్య, చిత్తూరు జిల్లా మామండూరుకు చెందిన గురవయ్యలను అరెస్ట్ చేసి 9,28,000 రూపాయలు విలువచేసే 15 ఎర్ర చందనం దుంగలు, ఒక కారు, 2 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ కోడూరు, చిట్వేలి, ఓబులవారిపల్లి అటవీ ప్రాంతాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతోందనే సమాచారంతో మూడు బృందాలుగా దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడులలో స్మగ్లర్లు రాళ్లు, గొడ్డళ్లతో దాడి చేశారన్నారు. వారిలో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మిగిలిన వారికోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. విచారణలో వీరు తమిళనాడు, కర్ణాటక, రాష్ట్రాలకు చెందిన కొంతమంది స్మగ్లర్లతో ఒప్పందం కుదుర్చుకుని కూలీలను తీసుకువచ్చి వారిని అడవుల్లోకి తరలించి దుంగలు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. పాత నేరస్తుడితో సంబంధాలు స్మగ్లింగ్ చేస్తున్న ఆర్ఎంపీ డాక్టర్ కాల్వ నాగేశ్వర్రావుకు పలు ఎర్రచందనం కేసులలో నిందితుడిగా ఉంటూ పరా రీలో ఉన్న స్మగ్లర్ భీమాతో సంబంధాలు ఉన్న విషయం పోలీసుల విచారణలో తెలిసినట్లు సమాచారం. స్మగ్లర్ భీమాపై సుమారు 9 కేసులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఈ ప్రాంతానికి వస్తే అరెస్ట్ చేస్తారేమోనని డాక్టర్ ద్వారా పనులు చక్కబెడుతున్నట్లు తెలిసింది. -
ఆ...ప్రాంతాలే టార్గెట్
ఆదోని టౌన్ : రద్దీ ప్రాంతాలే టార్గెట్‌గా దొంగనోట్ల ముఠా రెచ్చిపోయింది. పెట్రోల్ బంకులు, మార్కెట్‌యార్డు, బ్యాంకులు, మద్యం షాపులు, బార్లు.. ఇలా దేన్నీ వదలలేదు. దాదాపు 8 నెలల పాటు నకిలీ నోట్లను చలామణి చేసిందంటే వారి దందా ఏస్థాయిలో అర్థం చేసుకోవచ్చు. నకిలీ నోట్లపై ఫిర్యాదు రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ముఠా ఆటకట్టించారు. శుక్రవారం డీఎస్పీ అంకినీడు ప్రసాద్ తన చాంబర్లో వివరాలు వెల్లడించారు. ముఠా గుట్టు రట్టయిందిలా.. పట్టణంలో కొన్ని నెలలుగా నకిలీ నోట్లు చలామణి జరుగుతున్నట్లు పోలీసులు సమాచారం అందడంతో నిఘా పెట్టారు. ఈక్రమంలో గురువారం పట్టణంలోని సత్య భారత్ పెట్రోల్ బంకులో గుర్తు తెలియని వ్యక్తి రూ.రెండు వంద నోట్లు(నకిలీ) ఇచ్చి 2 లీటర్ల పెట్రోల్ పోయించుకొని చిల్లర తీసుకెళ్లాడు. నకిలీవని తేలడంతో బంకు మేనేజర్ అమీర్ షమీర్ ఖాన్ త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సీఐ చంద్రశేఖర్, టూటౌన్ సీఐ వాసుకృష్ణ, ఎస్ఐ రామ్‌నాయక్, స్పెషల్ పార్టీ ఏఎస్ఐ ఆనంద్, సిబ్బంది రంగంలోకి దిగారు. ఈకమ్రంలో శుక్రవారం ఉదయం ఎమ్మిగనూరు రోడ్డు సర్కిల్లోని చిల్లీ డాబా దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆదోని మండలం 104 బసాపురం గ్రామానికి చెందిన కమ్మ కిష్టప్పను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అతడిని తమదైన శైలిలో విచారించడంతో నకిలీనోట్లు చలామణి చేస్తున్నట్లు అంగీకరించాడు. ఈ సందర్భంగా అతడి నుంచి రూ.25 వేల నకిలీ వంద నోట్లు, బైక్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అతడిచ్చిన సమాచారం మేరకు పత్తికొండ బస్టాండ్ సమీపంలో సోడాషాపు నిర్వహిస్తున్న సత్యనారాయణను అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ.1.47 లక్షల నకిలీ వంద నోట్లు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఒకటికి మూడు నోట్లు నెల్లూరు జిల్లా కావలి చెందిన ఓ వ్యక్తి వద్ద ఒక ఒరిజినల్ నోటుకు మూడు నకిలీ నోట్ల చొప్పున తెచ్చుకున్నట్లు నిందితులు అంగీకరించారు. ఆదోని, కౌతాళం, మంత్రాలయం, పత్తికొండ, ఆలూరు, ఎమ్మిగనూరు తదితర ప్రాంతాలలో వాటిని చలామణి చేశారు. కర్ణాటకలోని చిత్రదుర్గ నుంచి కూడా నకిలీ నోట్లు సరఫరా అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దొంగనోట్ల చలామణికి సంబంధించి సూత్రధారుల కోసం గాలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన స్పెషల్ పార్టీ ఏఎస్ఐ ఆనంద్, కానిస్టేబుళ్లు శాంతరాజు, ఎలిసా, రంగ, క్రిష్ణకు నగదు రివార్డు ప్రదానం చేశారు. సీఐలు చంద్రశేఖర్, వాసుకృష్ణకు అవార్డుల కోసం జిల్లా ఎస్పీకి సిఫారసు చేయనున్నట్లు డీఎస్పీ చెప్పారు. -
కల్తీ శెనగ పిండి మిల్లుపై పోలీసుల దాడి
పహాడీ షరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధి శ్రీరామకాలనీ పారిశ్రామిక వాడలో కల్తీ శెనగ పిండి తయారు చేస్తున్న మిల్లుపై ఎస్వోటీ పోలీసులు బుధవారం ఉదయం దాడి చేశారు. ఈ దాడిలో సుమారు రూ.6 లక్షల విలువైన 110బస్తాల రాందేవ్ బ్రాండ్ శెనగపిండి, 276 బస్తాల శెనగపప్పు, 9వేల ఖాళీ కవర్లతోపాటు మిల్లును సీజ్ చేశారు. సూరజ్మల్, దుర్గయ్య, చౌహాన్ రాహుల్ అనే వారిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు.