సాక్షి, హైదరాబాద్: తాను పార్టీ మారుతున్నట్టు ఏ డాదిన్నరగా కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి మండిపడ్డారు. తాను బీఆర్‌ఎస్‌లోకి వెళ్తున్నానంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అబద్ధమన్నారు. తనకు రాజకీయ శీల పరీక్షలు అవసరం లేదని.. తన రాజకీయ ప్రయాణం రాహుల్‌గాందీతోనే కొనసాగుతుందని స్పష్టం చేశారు.
శనివారం అసెంబ్లీ మీడియా హాల్‌లో జగ్గారెడ్డి మీడి యాతో మాట్లాడారు. ‘నేను పార్టీ మారుతున్నానని ప్రచారం చేయడం కొందరికి ఆనందం కలిగిస్తోంది. జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండొద్దా? నా వ్యక్తిత్వంపై ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు? సోషల్ మీడియాలో ప్రచారానికి ఎవరు, ఎన్ని డబ్బులు ఇస్తున్నారు? నేను కన్నెర్ర చేస్తే ఈ దుష్ప్రచారం చేస్తున్న వారు ఉంటారా?’అని పేర్కొన్నారు.
దుష్ప్రచారం టీడీపీ కల్చర్
ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే నడిరోడ్డుపై బట్టలు విప్పి నిలబెడతానని జగ్గారెడ్డి హె చ్చరించారు. సోషల్ మీడియాలో దుష్ప్రచా రం చేయడం తెలుగుదే శం పార్టీ సంస్కృతి అ ని, అక్కడి నుంచే ఇది కాంగ్రెస్‌లోకి వచ్చిదని వ్యాఖ్యానించారు. పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమం, సమావేశంలో పాల్గొంటున్నానని.. అయినా అబద్ధపు ప్రచారం చేస్తుండటం బాధ కలిగిస్తుందన్నారు. ఇప్పటికైనా ఆ మూర్ఖులు, దద్దమ్మలు తప్పుడు ప్రచారం మానేయాలన్నారు.
రాహుల్‌ను సంగారెడ్డికి రమ్మంటా..
సంగారెడ్డి మీదుగా రాహుల్‌గాంధీ భారత్‌జోడో యాత్ర వెళితే సంతోషపడ్డానని, ఆర్థిక ఇబ్బందులు న్నా యాత్రను విజయవంతం చేశానని జగ్గారెడ్డి చెప్పారు. తెలంగాణలో కేసీఆర్‌పై తిరగబడిన మొదటి నాయకుడిని తానేనని.. 2018 ఎన్నికల సమయంలో తనపై కేసులు పెట్టి, జైలుకు పంపారని, అయినా కొట్లాడి గెలిచానని వివరించారు.
ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు తనకు రాహుల్‌గాంధీ 20నిమిషాల పాటు ప్రత్యేకంగా సమయం ఇచ్చారని, పార్టీ విషయాలన్నింటినీ ఆయనకు వివరించానని, దీనికి త్వరలో ఫలితం ఉంటుందని జగ్గారెడ్డి చెప్పారు. రాహుల్‌తో సంగారెడ్డిలో త్వరలోనే ఓ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment