changing
-
పార్టీలు మారుతున్న అభ్యర్థులు.. ఎంపీలను మార్చేస్తున్న ఓటర్లు!
దేశంలో లోక్‌సభ ఎన్నికలు ఏడు విడతల్లో జరుగుతున్నాయి. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ, శిరోమణి అకాలీదళ్, కాంగ్రెస్‌లు 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ తొమ్మిది స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఈసారి అన్ని రాజకీయ పార్టీలు విడివిడిగా ఎన్నికల్లో పోటీకి దిగడంతో పోరు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా పంజాబ్‌లోని హోషియార్పూర్ స్థానంలో పోటీపై ఎక్కడాలేని ఆసక్తి నెలకొంది. ఇక్కడ కూడా అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలిపాయి.హోషియార్పూర్ సిట్టింగ్ ఎంపీ సోమ్‌ప్రకాష్ భార్య అనితా ప్రకాష్‌ను భారతీయ జనతా పార్టీ ఎన్నికల పోరులో నిలిపింది. కాంగ్రెస్‌ను వీడి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన డాక్టర్ రాజ్‌కుమార్ చబ్బేవాల్‌ను ఆ పార్టీ రంగంలోకి దింపింది. శిరోమణి అకాలీదళ్ మాజీ మంత్రి సోహన్ సింగ్ తాండల్‌ను, కాంగ్రెస్ పార్టీ యామినీ గోమర్‌ను తమ అభ్యర్థులుగా నిలబెట్టాయి.ఈ లోక్‌సభ నియోజకవర్గంలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గత ఏడు ఎన్నికల్లో హోషియార్పూర్ ఓటర్లు ప్రతీసారి ఎంపీని మారుస్తూనే ఉన్నారు. ఒక్క కమల్ చౌదరి మాత్రమే నాలుగుసార్లు ఇక్కడి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న నలుగురు అభ్యర్థులు కూడా కొత్తవారే కావడం విశేషం.గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన డాక్టర్ చబ్బెవాల్ ఈసారి ఆప్ నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. 2014లో ఇదే స్థానంలో ఆప్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన యామినీ గోమర్‌ను ఈసారి కాంగ్రెస్ తన అభ్యర్థిగా నిలబెట్టింది. గత లోక్‌సభ ఎన్నికల్లో హోషియార్పూర్ స్థానంలో బీజేపీకి చెందిన సోమ్‌ప్రకాష్ 48,530 ఓట్ల తేడాతో డాక్టర్ చబ్బెవాల్పై విజయం సాధించారు. సోమ్‌ప్రకాష్ ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం అతని భార్య అనితా సోమ్‌ప్రకాష్ బీజేపీ నుండి ఎన్నికల బరిలోకి దిగారు. హోషియార్‌పూర్‌లో అభ్యర్థులు పార్టీలను మార్చేస్తున్నట్లుగానే.. ఓటర్లు కూడా ప్రతీ ఎన్నికల్లోనూ ఎంపీలను మార్చేస్తుండటం విశేషం. -
జీవితాన్ని మార్చేసే కొన్ని మానసిక వాస్తవాలు..!
మనసు ఒక మిస్టరీ. దాని గురించి తెలిసింది గోరంతైతే, తెలియంది కొండంత. తెలుసుకోవాలనే ప్రయత్నం చేసేవారు రవ్వంత. అందువల్లనే కొందరు ఆందోళనతో తల్లడిల్లి పోతుంటే, మరికొందరు మనోవేదనతో పోరాడుతుంటారు. కొందరు ఉన్నదాంట్లో సంతోషంగా జీవిస్తుంటే, మరికొందరు లేనిదానికోసం ఆరాటపడుతూ నిత్యం బాధపడుతుంటారు. ఒకే రకమైన పరిస్థితులున్నా కొందరు అవకాశాలను అందిపుచ్చుకుని విజయం సాధిస్తే, మరికొందరు అవకాశాలు లేవంటూ తిట్టుకుంటూ పరాజితులుగా మిగిలిపోతారు. అన్నీ మనసు చేసే మాయే. అందుకే మీరు ఏర్పరచుకునే ఆలోచనలు, నమ్మకాల నుంచి మీ చర్యలు.. ఎంపికల వరకు జీవితం గురించిన కొన్ని మానసిక వాస్తవాలను, చిట్కాలను ఈ వారం తెలుసుకుందాం. ఇవి జీవితం గురించి మీ అవగాహననే మార్చేయగలవు. బాల్యంలో మీ తల్లితో మీ సంబంధం జీవితకాల ప్రభావాన్ని చూపుతుంది. ఇతరులతో సాన్నిహిత్యం మొదలుకొని సవాళ్లను, ఒత్తిడిని మీరు ఎలా ఎదుర్కొంటారనే వరకు ప్రతి అంశాన్నీ ప్రభావితం చేస్తుంది. పిల్లలు పుట్టినప్పటి నుంచి యాసను గుర్తించగలరని, అర్థం చేసుకోగలరని నిరూపితమైంది. ఐదు నెలల వయస్సులో పిల్లలు తమ తల్లి యాసను వింటారు, ఇష్టపడతారు, స్వీకరిస్తారు. యుక్తవయస్సు ప్రారంభంలో జరిగే సంఘటనలు సంవత్సరాలుగా మీతో ఉంటాయి. కొన్ని మార్పులకు కారణమైన సంఘటనలను గుర్తుకు తెచ్చుకోవడానికి మీ మెదడు ఇష్టపడుతుంది, గుర్తు చేసుకుంటుంది. మీరు నేర్చుకున్నదానితో సంతృప్తిపడే వారైనప్పటికీ, మీ అన్కాన్షస్ మైండ్ జీవితాంతం కొత్త సమాచారం కోసం అన్వేషిస్తూనే ఉంటుంది. మీ మెదడులోని మిమ్మల్ని కొత్త సమాచారాన్ని కోరుకునేలా చేస్తూనే ఉంటుంది. కొత్త భాషలు నేర్చుకుంటే మీ నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. ఒకే భాషకు పరిమితం కాకుండా రెండు భాషలు నేర్చుకునేవారు హేతుబద్ధమైన, తక్కువ భావోద్వేగ నిర్ణయాలు తీసుకుంటారని షికాగో విశ్వవిద్యాలయ అధ్యయనంలో వెల్లడైంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అనే మాట మీరు వినే ఉంటారు. అది నిజం కూడా. ఎవరినైనా మొదటిసారి కలసినప్పుడు మీకు ఏర్పడిన అభిప్రాయం మనసులో అలా ఉండిపోతుంది. మళ్లీ కొన్నేళ్ల తర్వాత కలసినా.. ఆ మొదటి అభిప్రాయం ఆధారంగానే సంభాషణ ఉంటుంది. అందువల్ల ఎవరినైనా మొదటిసారి కలసేటప్పుడు బెస్ట్ ఇంప్రెషన్ ఇవ్వడానికి ప్రయత్నించాలి. మీరు జీవితాన్ని ఎంత ఆనందిస్తున్నారనే దానిపై కృతజ్ఞత ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. సంతోషానికి కృతజ్ఞతతో ఉండటం చాలా కీలకమైన అంశం. మీరు రోజూ కృతజ్ఞత వ్యక్తీకరించినప్పుడు, మీ మొత్తం భావోద్వేగ స్థితి, జీవన నాణ్యత పెరుగుతాయి. డోపమైన్, సెరటోనిన్ లాంటి హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. మీ ఆయుష్షు పెరుగుతుంది. అందుకే రోజూ గ్రాటిట్యూడ్ జర్నల్ రాయాలి. మీరు ఎక్కువ కాలం జీవించాలనుకుంటే, మరింత మందికి సహాయం చేయండి. డిప్రెషన్ ప్రభావాన్ని తగ్గించడానికి ఇది ఒక ప్రభావవంతమైన మార్గం. స్వచ్ఛందసేవ వల్ల మరణాల రేటును 22శాతం తగ్గించే అవకాశం ఉందని ఒక అధ్యయనంలో తేలింది. అందుకే అవకాశమున్నప్పుడల్లా స్వచ్ఛంద సేవ చేయాలి. జీవితంలో ఆనందం అనేది డబ్బు వల్లనో, పేరు ప్రఖ్యాతుల వల్లనో రాదు. మీరు చేసే పనిలో సూపర్ ఫోకస్ ఉన్నప్పుడు వస్తుంది. దీన్నే ఫ్లో స్టేట్ లేదా ప్రవాహ స్థితి అంటారు. అందుకే మీకు బాగా నచ్చిన పని చేయాలి.. ఎక్కువ ఆనందంగా జీవించాలి. ప్లాసిబో ఎఫెక్ట్ గురించి మీరు వినే ఉంటారు. అంటే నిజమైన ట్యాబ్లెట్లా కనిపించే పిండి ట్యాబ్లెట్లు ఇచ్చినా అదే రకమైన ఫలితాలు రావడం. ఇది మందుల విషయంలోనే కాదు, జీవితంలో అనేక అంశాల్లో జరుగుతుందని సైకాలజిస్టులు వెల్లడించారు. రోజూ జిమ్ వీడియోలు చూడటం కూడా ఒత్తిళ్లను నివారించడానికి సహాయపడుతుందట. అలాగని వాటితో శాశ్వత పరిష్కారం దొరకదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. సంతృప్తి (gratification)ని ఆలస్యం చేయగలిగితే మీకు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని అధ్యయనాలు వెల్లడించాయి. అంటే దీర్ఘకాలిక ప్రయోజనం కోసం తక్షణ ఆనందాన్ని నిరోధించాలి. అది లక్ష్యాన్ని సాధించడానికి కావాల్సిన ప్రేరణను అందిస్తుంది. లాభం పొందే శక్తి కంటే నష్ట భయం చాలా ముఖ్యమట. అంటే లాభం పొందాలనే కోరికకంటే, నష్టపోతామేమోననే భయమే మనల్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుందని అధ్యయనాలు వెల్లడించాయి. -సైకాలజిస్ట్ విశేష్ psy.vishesh@gmail.com ఇవి చదవండి: ఇచట డిజిటల్ ఆమ్లెట్ డిజిటల్ పరోటా వేయబడును -
ఇక టీఎస్ కాదు.. టీజీ.. తెలంగాణలో వాహనాల నంబర్ ప్లేట్లు మార్పు!
సాక్షి, హైదరాబాద్: వాహనాల నంబర్ ప్లేట్లు మార్చే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు అన్ని నంబర్ ప్లేట్లకు ముందు టీఎస్ ఉండగా దాన్ని టీజీగా మార్చనునట్లు తెలిసింది. రేపటి కేబినెట్ భేటీలో టీఎస్‌కు బదులు టీజీగా మారుస్తూ మంత్రి వర్గం ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. కాగా, రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం సచివాలయంలో జరగనుంది. కేబినెట్ భేటీలో ప్రధానంగా రెండు గ్యారంటీల అమలుకు సంబంధించి చర్చించనున్నట్లు సమాచారం. రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరాకు సంబంధించి కూలంకషంగా చర్చించి, అమలు చేసే తేదీని కూడా నిర్ణయించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ప్రజాపాలన దరఖాస్తులకు సంబంధించి నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ రెండింటితో పాటు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి వ్యయం ఎంత అవుతుంది.? ఎంతమందికి లబ్ధి చేకూరుతుందన్న అంశాలపై నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించిన సంగతి తెలిసిందే. కాగా 4వ తేదీన జరిగే సమావేశంలో ఏ రెండింటిని అమలు చేయాలనే దానిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అలాగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఎప్పటి నుంచి, ఎప్పటివరకు నిర్వహించాలో కూడా నిర్ణయిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఈ మేరకు కేబినెట్ భేటీలో ఆమోదం తీసుకునే అవకాశాలున్నాయి. ఈనెల 8న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై ఆరు రోజులు జరిగే అవకాశం ఉందని, 9న బడ్జెట్ ప్రవేశపెట్టవచ్చని తెలుస్తోంది. -
వివాదంలో ఏఆర్ రెహ్మాన్
కోల్‌కతా: ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహా్మన్ వివాదంలో చిక్కుకున్నారు. ప్రఖ్యాత బెంగాలీ కవి కాజీ నజ్రుల్ ఇస్లాం రచించిన ప్రఖ్యాత స్వాతంత్య్రోద్యమ గీతం ‘కరార్ ఓయ్ లౌహో కొపట్’ను తాజాగా విడుదలైన బాలీవుడ్ సినిమా పిప్పాలో వాడుకున్నారాయన. దాని ట్యూన్ మార్చడం ద్వారా తమతో పాటు అసంఖ్యాకులైన అభిమానుల మనోభావాలను రెహా్మన్ దెబ్బ తీశారంటూ నజ్రుల్ కుటుంబసభ్యులు శనివారం దుయ్యబట్టారు. ‘‘రెహా్మన్ కోరిన మీదట ఆ గీతాన్ని వాడుకునేందుకు అనుమతించాం. కానీ దాని ట్యూన్, లయ పూర్తిగా మార్చేయడం చూసి షాకయ్యాం’’ అంటూ నజ్రుల్ మనవడు, మనవరాలు తదితరులు మండిపడ్డారు. ‘‘ఈ వక్రీకరణను అనుమతించేది లేదు. తక్షణం ఆ గీతాన్ని సినిమా నుంచి తొలగించాలి. పబ్లిక్ డొమైన్లో కూడా అందుబాటులో లేకుండా చర్యలు తీసుకోవాలి’’ అని వారు డిమాండ్ చేశారు. ట్యూన్ మార్పును నిరసిస్తూ బెంగాలీ గాయకులు, కళాకారులతో కలిసి నిరసనకు దిగుతామని ప్రకటించారు. బెంగాలీలు కూడా దీనిపై భగ్గుమంటున్నారు. రెహా్మన్ వంటి సంగీత దర్శకుడి నుంచి ఇది ఊహించలేదంటూ బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ తదితరులు విమర్శించారు. రెహా్మన్ తీరుపై ఇంటర్నెట్లో కూడా విమర్శల వర్షం కురుస్తోంది. స్వాతంత్య్రోద్యమ కాలంలో నజ్రుల్ ఇస్లాం గీతాలు, పద్యాలు బెంగాల్లోనే దేశమంతటా మారుమోగాయి. టాగూర్ గీతాల తర్వాత అత్యంత ప్రసిద్ధి పొందాయి. -
AP: వచ్చే నెల వర్షాలే వర్షాలు!
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వచ్చే నెల ఆరంభం నుంచి విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. నైరుతి రుతు పవనాలు ముఖం చాటేయడంతో ఈ సీజన్లో కొద్దిరోజులుగా కానరాని వర్షాలు నాలుగైదు రోజుల్లో తిరిగి ప్రారంభమవుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఆగస్టు నెలలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. నైరుతి రుతుపవనాల సీజను ఆరంభమైన జూన్‌లో మోస్తరుగా, జూలైలో విస్తారంగా వానలు కురిశాయి. ⛈️ ఆగస్టులో వర్షాల జాడ లేదు. ఈనెల ఆరంభం నుంచే రుతుపవన ద్రోణి (మాన్సూన్ ట్రఫ్) హిమాలయాల వైపు వెళ్లిపోయింది. వారం పది రోజుల తర్వాత తిరిగి ఇది దక్షిణాది వైపు రావడం సహజంగా జరిగే ప్రక్రియ. హిమాలయాల నుంచి కదిలి మధ్యప్రదేశ్‌పై కొన్నాళ్లు స్థిరంగా ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురవడానికి దోహదపడుతుంది. ఆ మధ్య సమయంలోనే కొద్దిరోజుల పాటు బ్రేక్ మాన్సూన్ (వర్షాలకు విరామం) ఏర్పడి వానలకు అడ్డుకట్ట వేస్తుంది. ⛈️ అయితే ఈసారి అందుకు భిన్నంగా మూడు వారాలకు పైగా హిమాలయాల వద్దే రుతుపవన ద్రోణి తిష్ట వేసింది. ఫలితంగా హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కుంభవృష్టి కురిపించి వరదలకు కారణమైంది. రుతు పవన ద్రోణి దక్షిణాది వైపు కదలకపోవడంతో నైరుతి రుతుపవనాలు బలహీనమైపోయి ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆగస్టు నెలలో అప్పుడప్పుడు అక్కడక్కడ కొద్దిపాటి వర్షాలు కురిశాయి తప్ప సాధారణ వర్షాలు లేవు. ⛈️ ఈ ద్రోణి వచ్చే నెల ఒకటో తేదీ వరకు హిమాలయాల వద్దే కొనసాగి, ఆ తర్వాత దక్షిణాదికి మారుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజాగా వెల్లడించింది. ఆ ప్రక్రియ మొదలైన నాలుగైదు రోజులకు రాష్ట్రంలో వర్షాలు మళ్లీ మొదలవుతాయని వాతావరణ శాఖ రిటైర్డ్ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. ⛈️ రుతుపవన ద్రోణి ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడి సెప్టెంబర్ మొదటి వారం నుంచి వానలు సమృద్ధిగా కురిసేందుకు ఆస్కారం ఉంటుందని తెలిపారు. సెప్టెంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌లో సాధారణం లేదా అంతకు మించి ఒకింత ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని ఐఎండీ కూడా అంచనా వేసింది. జాడలేని అల్పపీడనాలు.. అరేబియా సముద్రం, బంగాళాఖాతం శాఖల నుంచి వేర్వేరుగా పయనించే రుతుపవనాల ప్రభావంతో అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడి, వర్షాలు కురుస్తాయి. కానీ ఈ సీజన్లో ఇప్పటిదాకా చెప్పుకోదగిన స్థాయిలో అల్పపీడనాలు ఏర్పడలేదు. ఈ ఏడాది ‘నైరుతి’ సీజను ఆరంభమైన కొన్నాళ్లకు రుతుపవనాలు చైనా, జపాన్ వైపు వెళ్లిపోయాయి. రుతుపవన ద్రోణి దిగువకు (దక్షిణం వైపునకు) రాకపోవడం, ఎల్‌నినో ప్రభావం వెరసి ఆగస్టులో దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులేర్పడ్డాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. -
జగ్గారెడ్డి కాంగ్రెస్‌లో ఉండొద్దా?
సాక్షి, హైదరాబాద్: తాను పార్టీ మారుతున్నట్టు ఏ డాదిన్నరగా కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి మండిపడ్డారు. తాను బీఆర్ఎస్లోకి వెళ్తున్నానంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అబద్ధమన్నారు. తనకు రాజకీయ శీల పరీక్షలు అవసరం లేదని.. తన రాజకీయ ప్రయాణం రాహుల్గాందీతోనే కొనసాగుతుందని స్పష్టం చేశారు. శనివారం అసెంబ్లీ మీడియా హాల్లో జగ్గారెడ్డి మీడి యాతో మాట్లాడారు. ‘నేను పార్టీ మారుతున్నానని ప్రచారం చేయడం కొందరికి ఆనందం కలిగిస్తోంది. జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండొద్దా? నా వ్యక్తిత్వంపై ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు? సోషల్ మీడియాలో ప్రచారానికి ఎవరు, ఎన్ని డబ్బులు ఇస్తున్నారు? నేను కన్నెర్ర చేస్తే ఈ దుష్ప్రచారం చేస్తున్న వారు ఉంటారా?’అని పేర్కొన్నారు. దుష్ప్రచారం టీడీపీ కల్చర్ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే నడిరోడ్డుపై బట్టలు విప్పి నిలబెడతానని జగ్గారెడ్డి హె చ్చరించారు. సోషల్ మీడియాలో దుష్ప్రచా రం చేయడం తెలుగుదే శం పార్టీ సంస్కృతి అ ని, అక్కడి నుంచే ఇది కాంగ్రెస్‌లోకి వచ్చిదని వ్యాఖ్యానించారు. పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమం, సమావేశంలో పాల్గొంటున్నానని.. అయినా అబద్ధపు ప్రచారం చేస్తుండటం బాధ కలిగిస్తుందన్నారు. ఇప్పటికైనా ఆ మూర్ఖులు, దద్దమ్మలు తప్పుడు ప్రచారం మానేయాలన్నారు. రాహుల్‌ను సంగారెడ్డికి రమ్మంటా.. సంగారెడ్డి మీదుగా రాహుల్‌గాంధీ భారత్‌జోడో యాత్ర వెళితే సంతోషపడ్డానని, ఆర్థిక ఇబ్బందులు న్నా యాత్రను విజయవంతం చేశానని జగ్గారెడ్డి చెప్పారు. తెలంగాణలో కేసీఆర్‌పై తిరగబడిన మొదటి నాయకుడిని తానేనని.. 2018 ఎన్నికల సమయంలో తనపై కేసులు పెట్టి, జైలుకు పంపారని, అయినా కొట్లాడి గెలిచానని వివరించారు. ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు తనకు రాహుల్‌గాంధీ 20నిమిషాల పాటు ప్రత్యేకంగా సమయం ఇచ్చారని, పార్టీ విషయాలన్నింటినీ ఆయనకు వివరించానని, దీనికి త్వరలో ఫలితం ఉంటుందని జగ్గారెడ్డి చెప్పారు. రాహుల్‌తో సంగారెడ్డిలో త్వరలోనే ఓ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. -
'పార్టీ మారడం లేదు.. ఇలాంటి పుకార్లలో టీడీపీ దిట్ట..'
హైదరాబాద్: తాను పార్టీ మారడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా తాను పార్టీ మారతానని వస్తున్న పుకార్లలో వాస్తవం లేదని చెప్పారు. ఏడాదిగా ఈ దుష్ప్రచారం జరుగుతోందని అన్నారు. ఇంత శాడిజం ఎంటో తనకు అర్థం కావట్లేదని అన్నారు. బీఆర్ఎస్తో కొట్లాడి గెలిచానని చెప్పారు. తాను పార్టీ మారతానని సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేస్తున్నారని చెప్పారు. సోషల్ మీడియా కల్చర్ టీడీపీ నుంచి పొలిటికల్ ఎంట్రీ అయిందని పేర్కొన్నారు. దీన్ని వాడటంలో టీడీపీ దిట్ట అని ఆరోపించారు. టీడీపీ కల్చర్ కాంగ్రెస్‌ను భ్రష్టు పట్టించిందని అన్నారు. ఇదీ చదవండి: Bholakpur Scrap Godown Blast: బోలక్‌పూర్‌లో పేలుడు.. -
మాది దిగువ వీధి కాదు..ఇందిరా నగర్
‘కీజ తెరు’ అనంటే తమిళంలో ‘దిగువ వీధి’ అని అర్థం. ప్రతి ఊరిలో దిగువ వీధి ఉంటుంది. దిగువ వీధిలో ఎవరుంటారో ఊరి వారికి తెలుసు. దళితులు. వారు నివసించే ప్రాంతాన్ని ఆ విధంగా గుర్తిస్తారు. ‘ఇలా పేరులో వివక్షను తొలగించండి’ అని తమ వాడ పేరును మార్చడానికి సంవత్సరం పాటు పోరాడింది అనసూయ అనే అమ్మాయి. దిగువ వీధికి బదులుగా వారి వీధి మొన్నటి జూలై 1న ‘ఇందిరా నగర్’ అయ్యింది. వివక్ష గుర్తులను చెరిపే పోరాటం కొనసాగిస్తానని అంటోంది అనసూయ. తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ పదవి స్వీకరించాక 2022 అక్టోబర్‌లో గ్రేటర్ చెన్నై అంతటా కులాలను సూచించే వీధుల పేర్లను, భవంతుల పేర్లను తొలగించవలసిందిగా ఆదేశించాడు. దేశంలో అన్నిచోట్ల ఉన్నట్టే తమిళనాడులో కూడా ఊళ్లలోని కొన్ని వీధులను కులాల పేర్లతో పిలవడం వాడుకలో ఉంది. సామాజిక స్పృహ పెరిగాక ఈ ధోరణి తగ్గినా చైతన్యం ఎంతో అవసరం ఉంది. ముఖ్యంగా దళితుల విషయంలో. వీరికి ఆలయాల ప్రవేశంలోగాని, ఊరి కట్టుబాట్లలో ప్రాధాన్యం ఇవ్వడంలోగాని వివక్ష పాటిస్తున్నారనే ఎన్నో వార్తలు తమిళనాడు నుంచి వింటూ ఉన్నాం. ఈ నేపథ్యంలో అనసూయ శరవణ ముత్తు అనే 28 ఏళ్ల సివిల్ ఇంజినీర్ తన ఊరిలోని తన వాడకు మర్యాదకరమైన పేరు సాధించడంలో విజయం పొందింది. ఆది ద్రావిడార్ తెరు తమిళనాడులోని అరియలూర్ జిల్లాలో ఆనందవాడి అనే చిన్న పల్లె ఉంది. ఆ పల్లెలో 1994లో దళితులకు పట్టాలిచ్చారు. 2000 సంవత్సరానికి 100 కుటుంబాలు అక్కడ ఇళ్లు కట్టుకుని తమ పేటకు ‘ఇందిరా నగర్’ అని పేరు పెట్టుకున్నారు. అయితే వారు పెట్టుకునే పేరు వారు పెట్టుకోగా ఊరు వారిని తాను ‘ఎలా గుర్తించాలనుకుంటున్నదో’ అలా గుర్తించి ఆ పేటను ‘ఆది ద్రావిడార్ తెరు’, ‘పార తెరు’, ‘ఆది ద్రావిడార్ తెరు’, ‘కీజ తెరు’, ‘దళిత కాలనీ’... ఇలా పిలవడం మొదలెట్టింది. ఇవన్నీ కూడా దళితులు నివసించే ప్రాంతాన్ని సూచించేవే. ‘నా చిన్నప్పుడు స్కూల్లో మా పేట పేరు చెప్పిన వెంటనే నేనెవరో పోల్చుకునేవారు. అప్పుడు నేను ఏమీ చేయలేకపోయాను’ అని ఇదే ప్రాంతం, సామాజిక వర్గం నుంచి చదువుకుని సివిల్ ఇంజనీర్ అయిన అనసూయ శరవణముత్తు అంది. ‘నేను కాలేజీ పూర్తి చేసి ఉద్యోగం కోసం వెళ్లిపోయాను. 2022లో తిరిగి వస్తే ఇంకా కులాన్ని సూచించే పేరుతోటే నా పేటను పిలుస్తున్నారు. ఇది ఎంతమాత్రం కుదరదు అని నిశ్చయించుకున్నాను’ అంది అనసూయ. అందరితో పోరాడి... ఇందిరా నగర్ అనే పేరును రెవిన్యూ వారు ఏ మాత్రం పట్టించుకోకుండా ‘దిగువ వీధి’ అనే పేరుతోనే వీరి పేటను రికార్డుల్లో నమోదు చేసుకున్నారు. అలాగే రేషన్ కార్డుల్లో, ఆధార్ కార్డుల్లో, ఓటర్ కార్డుల్లో, చివరకు పాస్‌పోర్టుల్లో కూడా ఇందిరా నగర్ అని తప్ప రకరకాల వివక్ష పేర్లతో ఇక్కడ నివసిస్తున్న దళితుల గుర్తింపు కార్డులు నమోదై ఉన్నాయి. దాంతో అనసూయ 2022 ఆగస్టు నుంచి పోరాటం మొదలెట్టింది. ‘మొదట కలెక్టర్ చుట్టూ తిరిగాను. తిప్పించుకుని తిప్పించుకుని అక్టోబర్ నాటికి అఫీషియల్‌గా రికార్డుల్లో మార్చారు. కాని అసలు సమస్య పంచాయతీతో వచ్చింది. ఆనందవాడి పంచాయతీ మా పేటను దిగువ వీధి అని పిలవకూడదనే తీర్మానం చేయడానికి ఏమాత్రం ముందుకు రాలేదు. నేను పోరాడితే ఫిబ్రవరిలో తీర్మానం చేశారు. ఆ తర్వాత పంచాయితీ పెద్దలొచ్చి మా పేట ముందు బోర్డు పెట్టే కార్యక్రమంలో పాల్గొనమని ఎన్నిసార్లు తిరిగినా రాలేదు. దాని కోసం మళ్లీ పోరాడాల్సి వచ్చింది. చివరకు మొన్న జూలై 1న పంచాయతీ పెద్దలంతా వచ్చి బోర్డును నిలబెట్టి వెళ్లారు’ అని తెలిపింది అనసూయ. వివక్షాపూరితం వెనుకబడ్డ, దళిత వర్గాలను సులువుగా గుర్తించేందుకు ఎప్పటి నుంచో వారు నివసించే ప్రాంతాలకు వివక్షాపూరితమైన పేర్లు పెట్టే ఆనవాయితీ ఉందని ఈ ఉదంతం విన్నాక అనసూయను అభినందిస్తూ విల్లుపురం ఎంపీ రవికుమార్ అన్నారు. ‘నువ్వు ఎక్కడుంటావు అనే ప్రశ్నతో ఎదుటివారి కులం ఏమిటో ప్రాంతాన్ని బట్టి అర్థమవుతుంది. దీంతో వివక్ష మొదలవుతుంది. ఇలాంటి వివక్షాపూరితమైన పేర్లను రాష్ట్రమంతా తొలగించాలి’ అని రవికుమార్ అన్నారు. అనసూయలాంటి అమ్మాయిలు పూనుకుంటే అదెంత సేపు? -
మారుతున్న ఆర్థిక పరిస్థితులను గమనించాలి
ముంబై: మారుతున్న స్థూల ఆర్థిక పరిస్థితులను గమనిస్తూ, సరైన సమయంలో సరైన చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ బ్యాంకులను కోరారు. అప్పుడే తమ బ్యాలన్స్ షీట్లపై అంతర్జాతీయ పరిణామాల ప్రభావాన్ని పరిమితం చేసుకోవచ్చన్నారు. కరోనా సంభవించినప్పటి నుంచి కల్లోల సమయంలో బ్యాంకులు కీలక పాత్ర పోషించినట్టు అంగీకరించారు. సవాళ్లు ఉన్నప్పటికీ భారత బ్యాంకింగ్ రంగం బలంగా ఉందంటూ, ఎన్నో అంశాల్లో మెరుగుపడుతున్నట్టు చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల ఎండీ, సీఈవోలతో గవర్నర్ సమీక్ష నిర్వహించారు. డిపాజిట్లలో వృద్ధి నిదానంగా ఉండడం, రుణాల వృద్ధి, ఆస్తుల నాణ్యత, ఐటీ సదుపాయాలపై పెట్టుబడులు, నూతన టెక్నాలజీ సొల్యూషన్లను అందిపుచ్చుకోవడం, డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ల నిర్వహణ తదితర అంశాలు చర్చకు వచ్చాయి. ఆర్బీఐ డేటా ప్రకారం సెప్టెంబర్ క్వార్టర్లో బ్యాంకుల డిపాజిట్లలో 9.6 శాతం వృద్ధి నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 10.2 శాతంతో పోలిస్తే తగ్గింది. కానీ, ఇదే కాలంలో రుణాల్లో వృద్ధి 6.5 శాతం నుంచి 17.9 శాతానికి పెరగడం గమనార్హం. -
జాబిల్లి..రంగులు వెదజల్లి
ఈనెల 31న చందమామ పెద్ద పరిమాణంలో.. నీలం, ఎరుపు రంగుల్లో కనిపించనున్నాడు! 150 ఏళ్ల తర్వాత సంభవిస్తున్న ఈ అరుదైన సంఘటన నిజంగానే ఓ భ్రమ.. నిజానికి జాబిల్లి సైజు.. రంగు వీసమెత్తు కూడా మారదు. అయినా సైజు పెరిగినట్లు ఎందుకు కనిపిస్తాడు? రక్తం చిమ్ముతున్నట్లు ఎందుకు భయపెడతాడు? నీలాల జాబిలి ఎందుకైంది? కొన్ని ప్రాంతాల్లోని అరుదైన ధూళి కణాల కారణంగా పున్నమి నాటి చంద్రుడు నీలంగా కనిపిస్తాడు. దీంతో అక్కడి వారు బ్లూమూన్ అని పేరు పెట్టుకున్నారు. ఇదే ప్రపంచం మొత్తం వాడుకలోకి వచ్చింది. ఈ బ్లూమూన్కు రెండు నిర్వచనాలు ఉన్నాయి. ఒక్కో రుతువులోని 4 పున్నమి రాత్రుల్లో మూడోదాన్ని బ్లూమూన్ అంటారని ఒక నిర్వచనం చెబితే.. ఒక నెలలోనే వచ్చే రెండో పున్నమిని బ్లూమూన్ అంటారని ఇంకో నిర్వచనం చెబుతోంది. ఈ నెల 31న కనిపించే జాబిలి రెండో నిర్వచనానికి సరిపోతుంది. సూపర్ ఎలా? భూమి చుట్టూ జాబిల్లి తిరుగుతూ ఉంటుందని మనకు తెలిసిందే. చంద్రుడు గుండ్రంగా కాకుండా గజిబిజిగా (ఆప్సిడల్ ప్రెసెషన్లో) తిరుగుతాడు. దీంతో కొన్నిసార్లు చంద్రుడు భూమికి కొంత దగ్గరగా వస్తాడు. ఇలాంటి సమయాల్లో అంటే పౌర్ణమి రోజున సూర్యుడికి చంద్రుడు అభిముఖంగా వస్తాడు. దీంతో జాబిల్లి పరిమాణం పెరిగినట్లు అనిపిస్తుంది. ఏదైనా పున్నమి రోజున భూమికి అతి దగ్గరగా వస్తే దాన్ని ‘సూపర్ మూన్’ అంటారు. ఎరుపు రంగు ఏమిటి? సంపూర్ణ చంద్రగ్రహణం రోజున చందమామ అరుణవర్ణంలో వెలుగులు వెదజల్లుతుంది. దీన్నే ఇంగ్లిష్‌లో బ్లడ్‌మూన్ అంటారు. సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు భూమి నీడ మొత్తం జాబిల్లిపై పడుతూ ఉంటుంది. అదే సమయంలో భూమి వెనుక వైపు నుంచి ప్రసారమయ్యే సూర్యుడి కాంతి కొంత జాబిల్లిపై పడుతుంది. ఈ క్రమంలో అది ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. ఫలితంగా ఎక్కువ తరంగ దైర్ఘ్యమున్న ఎరుపు కాంతి జాబిల్లిని చేరుతుంది. దీంతో బ్లడ్‌మూన్ ఆవిష్కృతమవుతుంది. సూర్యుడు ఉదయిస్తున్న.. అస్తమిస్తున్న వేళల్లో కొంత సమయం ఎరుపు రంగు కనిపిస్తుందే.. అలా అన్నమాట! ఎక్కడ చూడొచ్చు ? సూపర్ బ్లూ, బ్లడ్ మూన్ ప్రపంచం మొత్తమ్మీద చూసే అవకాశాలు తక్కువే. అలాస్కాతోపాటు ఉత్తర అమెరికా, హవాయిలోని కొన్ని ప్రాంతాల్లో సూర్యోదయానికి ముందు భారీసైజున్న ఎర్రటి జాబిల్లిని చూడొచ్చు. ఆసియాతో పాటు మధ్యప్రాచ్య దేశాలు, రష్యా తూర్పు ప్రాంతం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో రాత్రి సమయంలో చూడొచ్చు. భారత్‌లో సాయంత్రం 4.21 గంటల సమయంలో పాక్షికంగా, 6.21 గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణ సమయంలో చూడొచ్చని కోజికోడ్‌లోని రీజనల్ సైన్స్ సెంటర్ టెక్నికల్ ఆఫీసర్ జయంత్ గంగూలీ తెలిపారు. దాదాపు గంటపాటు ఎర్రటి జాబిల్లిని చూడొచ్చని చెప్పారు. -
వెలుగులు ఇక నిరంతరం
పాడైన ఎల్ఈడీ బల్పుల మార్పునకు ప్రత్యేక కేంద్రాలు మండల కేంద్రం సెక్షన్ ఆఫీస్‌లో కౌంటర్ పెట్టిన ఏపీఈపీడీసీఎల్ లబ్ధిదారులకు ఉపసమనం జిల్లాలో 22.58 లక్షల ఎల్ఈడీ బల్బుల పంపిణీ మూడేళ్ల వరకు గ్యారెంటీ... పాడైతే ఎన్నిసార్లయినా మార్చుకునే వెలుసుబాటు ఆధార్, విద్యుత్ బిల్లు తీసుకెళితే చాలు.. పాడైన ఎల్ఈడీ బల్బులను ఇచ్చి కొత్తవి తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు లబ్ధిదారులు పాడైన బల్బులను మార్చుకోవాలంటే నియోజకవర్గ కేంద్రానికి వస్తున్నారు. అది కూడా కొద్ది రోజులు మాత్రమే ఈసేవలు అందించారు. దీని వల్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడుతుండడంతో శనివారం నుంచి ఆయా మండల కేంద్రాల్లో మార్చుకునే విధంగా విద్యుత్ అధికారులు చర్యలు చేపట్టారు. మండల కేంద్రంలోని సెక్షన్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. పని వేళల్లో ఎప్పుడైనా లబ్ధిదారులు పాడైన బల్బులను అక్కడ ఇచ్చి కొత్తవి తీసుకొవచ్చు. ఇందుకు పాత బల్బుతోపాటు లబ్ధిదారులు తమ ఆధార్ కార్డు, విద్యుత్ బిల్లు తీసుకురావాల్సి ఉంటుందని రాజమహేంద్రవరం డీఈ శ్యాంంబాబు తెలిపారు. - సాక్షి, రాజమహేంద్రవరం రేషన్‌కార్డు ప్రాతిపదికగా బల్బుల పంపిణీ గృహ అవసరాలకు సాధారణ బల్బులు వాడడం వల్ల విద్యుత్ వినియోగం పెరుగుతోంది. విద్యుత్ వాడకంలో మిగులు సాధించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన పథకం ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఎనర్జీ ఎఫిషిఎన్సీ సర్వీస్ లిమిటెడ్(ఈఈఎస్ఎల్), విద్యుత్ పంపిణీ సంస్థల భాగస్వామ్యంతో ఎల్ఈడీ బల్బులను పింపిణీ చేసింది. రేషన్ కార్డు ప్రాతిపదికగా ప్రతి లబ్ధిదారుడుకి రూ.300 విలువైన ఎల్ఈడీ బల్బులను రూ.10 చొప్పున ఏపీఈపీడీసీఎల్ రెండు బల్బులు పంపిణీ చేసింది. జిల్లాలో 24 లక్షల 40 వేల బల్బులు పంపిణీ చేయాలన్న లక్ష్యంతో 2015 నవంబర్ 17న పింపిణీ కార్యక్రమం ప్రారంభించింది. ఇప్పటి వరకు 11,28,732 లబ్ధిదారులకు 22,57,283(93 శాతం) బల్బులును విద్యుత్ అధికారులు పంపిణీ చేశారు. పాడైతే కొత్త బల్బు మూడేళ్ల గ్యారెంటీతో ఏపీఈపీడీసీఎల్ అధికారులు ప్రతి గ్రామంలో బల్బులను పంపిణీ చేశారు. పగిలిపోవడం కాకుండా పాడైతే ఎప్పడైనా మార్చుకునే వెలుసుబాటు కల్పించారు. అయితే ఇప్పటి వరకు లబ్ధిదారులు బల్బులను మార్చుకునేందుకు నియోజకవర్గ కేంద్రానికి రావాల్సిన పరిస్థితి ఉండడంతో ఇబ్బందులు పడతున్నారు. ఈ నేపథ్యంలో మరింత ఉన్నతంగా సేవలు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ప్రతి మండల కేంద్రంలోని సెక్షన్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. లబ్ధిదారుడు పాడైన తమ ఎల్ఈడీ బల్బులను ఇక్కడ మార్చుకోవచ్చు. ఇప్పటి వరకు నియోజకవర్గ కేంద్రాల్లో 37,659 బల్బులను పాడైన వాటి స్థానంలో మార్పు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక మండల కేంద్రాల్లో మార్పిడి కేంద్రాలు పెట్టడం వల్ల వినియోగదారులకు దూరాబారం నుంచి ఉపసమనం కలుగనుంది. త్వరలో టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు పాడైన ఎల్ఈడీ బల్బులను మార్చుకునేందుకు ఈఈఎస్ఎల్ సంస్థతో మండల కేంద్రంలోని సెక్షన్ కార్యాలయం వద్ద కౌంటర్లు పెట్టిస్తున్నాం. ఇప్పటి వరకు పలు డివిజన్లలో ఈ ప్రక్రియ ముగిసింది. లబ్ధిదారులు సమాచారం తెలుసుకునేందుకు త్వరలో టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయబోతున్నాం. పాడైన బల్బుతోపాటు ఆధార్, విద్యుత్‌బిల్లు తీసుకువచ్చి కొత్త బల్బు తీసుకెళ్లవచ్చు. - ఎస్ఎన్ ప్రసాద్, సూపరింటెండెంట్ ఇంజనీర్, ఏపీఈపీడీసీఎల్ -
ఆర్బీఐ ఇలా చేస్తోందట!
-
ఆర్బీఐ ఇలా చేస్తోందట!
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దుపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తన దాడిని ఎక్కుపెట్టారు. నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ప్రధాని పై వరుస విమర్శలు కురిపిస్తున్న రాహుల్ మంగళవారం ట్విట్టర్ అందుకున్నారు. అయితే ఈ సారి మోదీ, ఆర్ బీఐకి చర్యలపై తన ట్వీట్టర్ లోవిమర్శలు గుప్పించారు. అటు మోదీపై, ఇటు ఆర్బీఐపై విసుర్లు విసురుతూ ట్వీట్ చేశారు. ప్రధాని తన దుస్తులు మార్చినట్టుగా ఆర్బీఐ ఇష్టం వచ్చినట్టుగా నిబంధనలు మార్చుతోందన్నారు. పీఎం దుస్తులు మార్చుకున్నంత లేలిగ్గా ఆర్బీఐ నిమిష నిమిషానికో నిబంధన మార్చుకుంటూ పోతోందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు తన ట్వీట్లో ఆర్బీఐ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన వివిధ విధానాలపై వచ్చిన ఓ ఆర్టికల్‌ను లింక్ చేశారు. పలు ర్యాలీల్లో ప్రసంగించేందుకు రోజంతా దుస్తులు మారుస్తూ పోయే మోదీలాగే రిజర్వ్ బ్యాంక్ కూడా నిబంధనలను మార్చుతూ పోతోందని చురకలంటించారు. మరోవైపు తాజా ప్రభుత్వం తాజా నోటిఫికేషన్ పై మాజీ ఆర్థికమంత్రి చిదంబరం కూడా ట్వీట్ చేశారు. ప్రభుత్వం ముందే వాగ్దానం చేసినట్టుగా డిసెంబర్ 30 వరకు ప్రజలు రద్దయిన నోట్లను ఎందుకు డిపాజిట్ చేసుకోకూడదని ప్రశ్నించారు. డిసెంబర్ 17 నాటి ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ లో రూ. 5వేలకు పైన డిపాజిట్లపై ఆంక్షలను ఆయన తప్పు బట్టారు. బడాబాబులు, అక్రమార్కులు పాత నోట్లను రద్దు చేసుకున్నారనీ, కేవలం పేద మధ్యతరగతి ప్రజలే ఇబ్బందులు పడుతున్నారంటూ వరుస ట్వీట్లలో విమర్శించారు. కాగా గత వారం పార్లమెంటులో ప్రధానిని కలిసి రైతుల రుణాలు మాఫీ చేయాల్సిందిగా కోరిన రాహుల్...బహిరంగ సభల్లోనూ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, రైతులు, పేదల కడగండ్లను మోదీ పట్టించుకోవడం లేదంటూ నిప్పులు చెరుగుతున్న సంగతి తెలిసిందే. (2/4) RBI makes new rule on deposit, FM contradicts. Who should citizen believe? Neither has credibility — P. Chidambaram (@PChidambaram_IN) December 20, 2016 (4/4) Old notes usable until Dec 15. Why can't we deposit remaining notes until Dec 30 as notified? — P. Chidambaram (@PChidambaram_IN) December 20, 2016 RBI is changing rules like the PM changes his clotheshttps://t.co/UNmJB9etFb — Office of RG (@OfficeOfRG) December 20, 2016 -
రైతులను భిక్షగాళ్లుగా మారుస్తున్న ప్రభుత్వం
తిప్పర్తి : ఫాంహౌస్‌కే పరిమితమైన సీఎం కేసీఆర్ రుణమాఫీ చేయకుండా రైతులను భిక్షగాళ్లుగా మారుస్తున్నారని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. రైతు రుణమాఫీకి సంబంధించి రూ. 8 వేల కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ చేస్తామని, దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని, డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని అబద్ధాల మాటలు చెప్పి గద్దెనెక్కిన ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎర్రబెల్లికే పరిమితం కాగా రుణమాఫీని నాలుగు విడతలుగా చేస్తామని మళ్లీ ఇప్పుడు 8 విడతల్లో చేస్తామని మాట మారుస్తోందన్నారు. -
టాటా మెటార్స్ను భయపెడుతున్న 'జికా'
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న 'జికా' వైరస్ ఇపుడు వాహనాల తయారీ సంస్థను కూడా వణికిస్తోంది. గర్భిణుల పాలిట శాపంగా పరిణమించిన ఈ వైరస్ ఇపుడు టాటా మోటార్స్ ను భయపెడుతోంది. అందుకే ఆ సంస్థ ఆలోచనలో పడింది. ఈడిస్ ఈజిప్టీ జాతికి చెందిన దోమల కారణంగా వేగంగా వ్యాప్తి చెందే ఈ వైరస్ వల్ల టాటా మోటార్స్‌కు ఏమి నష్టం అనుకుంటున్నారా... అదేనండి.. 'జికా' అనే పేరులోనే ఉంది భయమంతా.. జికా పేరుతో ఒక కొత్త కారును లాంచ్ చేసేందుకు సంస్థ ప్లాన్ చేసింది. చిన్న కార్ల సెగ్మెంట్ లో జికా ద్వారా వినియోగదారులును ఆకర్షించాలని పెద్ద ఎత్తున ప్రణాళికలు రచించింది. త్వరలోనే జరగబోయే ఎక్స్ పో లో ఈ జికాను ప్రదర్శనకు పెట్టాలని యోచిస్తోంది. ఇంతలో శిశువుల పాలిట ప్రాణ సంకటంగా మారిని జికా పేరును ఈ కొత్త వాహనానికి పెట్టడం అంత శుభం కాదని సంస్థ భావిస్తోంది. ఈ ప్రమాదకర వైరస్ పేరుకు దగ్గరగా వున్న జికా పేరును తమ కొత్త వాహనానికి పెట్టడం అంత శ్రేయస్కరం కాదనే ఆలోచనలో పడింది. అందుకే కొత్త పేరును పరిశీలిస్తున్న విషయాన్ని స్వయంగా ఆ సంస్థ మంగళవారం ప్రకటించింది. మొత్తం పరిస్థితిని పరిశీలిస్తున్నామని.. ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సంస్థ ప్రతినిధి మినారి షా ముంబై లో తెలిపారు. ఈ మధ్య కాలంలో జికా పేరుతో టాటా మోటార్స్ జిప్పీ కారును బాగా ప్రచారంలోకి తెచ్చిన విషయం తెలిసిందే. బార్సిలోనా ఫుట్ బాల్ స్టార్ ఆటగాడు లియోనిల్ మెస్సీ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. కాగా ప్రపంచాన్ని వణికిస్తున్న జికా వైరస్ గర్భిణుల నుంచి పిల్లలకు సోకి ఆందోళన కలిగిస్తోందని ప్రపంచ ఆరోగ్యసంస్థ ఇటీవల స్పష్టం చేసింది. జికా వైరస్‌పై కొలంబియా హెల్త్ ఇనిస్టిట్యూట్ జరిపిన పరిశీలనలో దాదాపు 2000 మంది కొలంబియన్ గర్భిణులకు జికా సోకినట్లు ధ్రువీకరణ అయింది. ఈ వైరస్‌తో సంభవించే మైక్రో సెఫలీ అనే వ్యాధి.. పుట్టబోయే పిల్లల మెదడు ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. తల చిన్నదిగా పిల్లలు పుడతారు. జికా వైరస్‌ను నివారించడానికి ఎలాంటి మెడిసిన్ లేదని..గర్భిణులు అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది.