పార్టీలు మారుతున్న అభ్యర్థులు.. ఎంపీలను మార్చేస్తున్న ఓటర్లు! | Sakshi
Sakshi News home page

పార్టీలు మారుతున్న అభ్యర్థులు.. ఎంపీలను మార్చేస్తున్న ఓటర్లు!

Published Wed, May 8 2024 1:45 PM

People of Hoshiarpur Have Been Changing MP

దేశంలో లోక్‌సభ ఎన్నికలు ఏడు విడతల్లో జరుగుతున్నాయి. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ, శిరోమణి అకాలీదళ్, కాంగ్రెస్‌లు 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ తొమ్మిది స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఈసారి అన్ని రాజకీయ పార్టీలు విడివిడిగా ఎన్నికల్లో పోటీకి దిగడంతో పోరు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా  పంజాబ్‌లోని హోషియార్‌పూర్ స్థానంలో పోటీపై ఎక్కడాలేని ఆసక్తి నెలకొంది. ఇక్కడ కూడా అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను  ఎన్నికల బరిలో నిలిపాయి.

హోషియార్‌పూర్‌ సిట్టింగ్ ఎంపీ సోమ్‌ప్రకాష్ భార్య అనితా ప్రకాష్‌ను భారతీయ జనతా పార్టీ ఎన్నికల పోరులో నిలిపింది. కాంగ్రెస్‌ను వీడి ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరిన డాక్టర్ రాజ్‌కుమార్ చబ్బేవాల్‌ను ఆ పార్టీ రంగంలోకి దింపింది. శిరోమణి అకాలీదళ్‌ మాజీ మంత్రి సోహన్‌ సింగ్‌ తాండల్‌ను, కాంగ్రెస్‌ పార్టీ యామినీ గోమర్‌ను తమ అభ్యర్థులుగా నిలబెట్టాయి.

ఈ లోక్‌సభ నియోజకవర్గంలో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే గ‌త ఏడు ఎన్నిక‌ల్లో హోషియార్‌పూర్ ఓటర్లు ప్ర‌తీసారి ఎంపీని మారుస్తూనే ఉన్నారు. ఒక్క కమల్ చౌదరి మాత్రమే నాలుగుసార్లు ఇక్కడి నుంచి ఎంపీగా  ఎన్నికయ్యారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న నలుగురు అభ్యర్థులు కూడా కొత్తవారే కావడం విశేషం.

గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన డాక్టర్ చబ్బెవాల్ ఈసారి ఆప్ నుంచి  ఎన్నికల బరిలోకి దిగారు. 2014లో ఇదే స్థానంలో ఆప్‌ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన యామినీ గోమర్‌ను ఈసారి కాంగ్రెస్‌ తన అభ్యర్థిగా నిలబెట్టింది. గత లోక్‌సభ ఎన్నికల్లో హోషియార్‌పూర్ స్థానంలో బీజేపీకి చెందిన సోమ్‌ప్రకాష్ 48,530 ఓట్ల తేడాతో డాక్టర్ చబ్బెవాల్‌పై విజయం సాధించారు. సోమ్‌ప్రకాష్ ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం అతని భార్య అనితా సోమ్‌ప్రకాష్ బీజేపీ నుండి ఎన్నికల బరిలోకి దిగారు. హోషియార్‌పూర్‌లో అభ్యర్థులు పార్టీలను మార్చేస్తున్నట్లుగానే.. ఓటర్లు కూడా ప్రతీ ఎన్నికల్లోనూ ఎంపీలను మార్చేస్తుండటం విశేషం. 

Advertisement
 
Advertisement
 
Advertisement