మనసు ఒక మిస్టరీ. దాని గురించి తెలిసింది గోరంతైతే, తెలియంది కొండంత. తెలుసుకోవాలనే ప్రయత్నం చేసేవారు రవ్వంత. అందువల్లనే కొందరు ఆందోళనతో తల్లడిల్లి పోతుంటే, మరికొందరు మనోవేదనతో పోరాడుతుంటారు. కొందరు ఉన్నదాంట్లో సంతోషంగా జీవిస్తుంటే, మరికొందరు లేనిదానికోసం ఆరాటపడుతూ నిత్యం బాధపడుతుంటారు. ఒకే రకమైన పరిస్థితులున్నా కొందరు అవకాశాలను అందిపుచ్చుకుని విజయం సాధిస్తే, మరికొందరు అవకాశాలు లేవంటూ తిట్టుకుంటూ పరాజితులుగా మిగిలిపోతారు. అన్నీ మనసు చేసే మాయే. అందుకే మీరు ఏర్పరచుకునే ఆలోచనలు, నమ్మకాల నుంచి మీ చర్యలు.. ఎంపికల వరకు జీవితం గురించిన కొన్ని మానసిక వాస్తవాలను, చిట్కాలను ఈ వారం తెలుసుకుందాం. ఇవి జీవితం గురించి మీ అవగాహననే మార్చేయగలవు.
- బాల్యంలో మీ తల్లితో మీ సంబంధం జీవితకాల ప్రభావాన్ని చూపుతుంది. ఇతరులతో సాన్నిహిత్యం మొదలుకొని సవాళ్లను, ఒత్తిడిని మీరు ఎలా ఎదుర్కొంటారనే వరకు ప్రతి అంశాన్నీ ప్రభావితం చేస్తుంది.
- పిల్లలు పుట్టినప్పటి నుంచి యాసను గుర్తించగలరని, అర్థం చేసుకోగలరని నిరూపితమైంది. ఐదు నెలల వయస్సులో పిల్లలు తమ తల్లి యాసను వింటారు, ఇష్టపడతారు, స్వీకరిస్తారు.
- యుక్తవయస్సు ప్రారంభంలో జరిగే సంఘటనలు సంవత్సరాలుగా మీతో ఉంటాయి. కొన్ని మార్పులకు కారణమైన సంఘటనలను గుర్తుకు తెచ్చుకోవడానికి మీ మెదడు ఇష్టపడుతుంది, గుర్తు చేసుకుంటుంది.
- మీరు నేర్చుకున్నదానితో సంతృప్తిపడే వారైనప్పటికీ, మీ అన్‌కాన్షస్ మైండ్ జీవితాంతం కొత్త సమాచారం కోసం అన్వేషిస్తూనే ఉంటుంది. మీ మెదడులోని మిమ్మల్ని కొత్త సమాచారాన్ని కోరుకునేలా చేస్తూనే ఉంటుంది.
- కొత్త భాషలు నేర్చుకుంటే మీ నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. ఒకే భాషకు పరిమితం కాకుండా రెండు భాషలు నేర్చుకునేవారు హేతుబద్ధమైన, తక్కువ భావోద్వేగ నిర్ణయాలు తీసుకుంటారని షికాగో విశ్వవిద్యాలయ అధ్యయనంలో వెల్లడైంది.
- ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అనే మాట మీరు వినే ఉంటారు. అది నిజం కూడా. ఎవరినైనా మొదటిసారి కలసినప్పుడు మీకు ఏర్పడిన అభిప్రాయం మనసులో అలా ఉండిపోతుంది. మళ్లీ కొన్నేళ్ల తర్వాత కలసినా.. ఆ మొదటి అభిప్రాయం ఆధారంగానే సంభాషణ ఉంటుంది. అందువల్ల ఎవరినైనా మొదటిసారి కలసేటప్పుడు బెస్ట్ ఇంప్రెషన్ ఇవ్వడానికి ప్రయత్నించాలి.
- మీరు జీవితాన్ని ఎంత ఆనందిస్తున్నారనే దానిపై కృతజ్ఞత ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. సంతోషానికి కృతజ్ఞతతో ఉండటం చాలా కీలకమైన అంశం. మీరు రోజూ కృతజ్ఞత వ్యక్తీకరించినప్పుడు, మీ మొత్తం భావోద్వేగ స్థితి, జీవన నాణ్యత పెరుగుతాయి. డోపమైన్, సెరటోనిన్ లాంటి హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. మీ ఆయుష్షు పెరుగుతుంది. అందుకే రోజూ గ్రాటిట్యూడ్ జర్నల్ రాయాలి.
- మీరు ఎక్కువ కాలం జీవించాలనుకుంటే, మరింత మందికి సహాయం చేయండి. డిప్రెషన్ ప్రభావాన్ని తగ్గించడానికి ఇది ఒక ప్రభావవంతమైన మార్గం. స్వచ్ఛందసేవ వల్ల మరణాల రేటును 22శాతం తగ్గించే అవకాశం ఉందని ఒక అధ్యయనంలో తేలింది. అందుకే అవకాశమున్నప్పుడల్లా స్వచ్ఛంద సేవ చేయాలి.
- జీవితంలో ఆనందం అనేది డబ్బు వల్లనో, పేరు ప్రఖ్యాతుల వల్లనో రాదు. మీరు చేసే పనిలో సూపర్ ఫోకస్ ఉన్నప్పుడు వస్తుంది. దీన్నే ఫ్లో స్టేట్ లేదా ప్రవాహ స్థితి అంటారు. అందుకే మీకు బాగా నచ్చిన పని చేయాలి.. ఎక్కువ ఆనందంగా జీవించాలి.
- ప్లాసిబో ఎఫెక్ట్ గురించి మీరు వినే ఉంటారు. అంటే నిజమైన ట్యాబ్లెట్‌లా కనిపించే పిండి ట్యాబ్లెట్లు ఇచ్చినా అదే రకమైన ఫలితాలు రావడం. ఇది మందుల విషయంలోనే కాదు, జీవితంలో అనేక అంశాల్లో జరుగుతుందని సైకాలజిస్టులు వెల్లడించారు. రోజూ జిమ్ వీడియోలు చూడటం కూడా ఒత్తిళ్లను నివారించడానికి సహాయపడుతుందట. అలాగని వాటితో శాశ్వత పరిష్కారం దొరకదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
- సంతృప్తి (gratification)ని ఆలస్యం చేయగలిగితే మీకు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని అధ్యయనాలు వెల్లడించాయి. అంటే దీర్ఘకాలిక ప్రయోజనం కోసం తక్షణ ఆనందాన్ని నిరోధించాలి. అది లక్ష్యాన్ని సాధించడానికి కావాల్సిన ప్రేరణను అందిస్తుంది.
- లాభం పొందే శక్తి కంటే నష్ట భయం చాలా ముఖ్యమట. అంటే లాభం పొందాలనే కోరికకంటే, నష్టపోతామేమోననే భయమే మనల్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుందని అధ్యయనాలు వెల్లడించాయి.
-సైకాలజిస్ట్ విశేష్
psy.vishesh@gmail.com
Comments
Please login to add a commentAdd a comment