ఎనిమిదేళ్ల సారా స్కూల్ నుంచి∙రాగానే హోమ్‌వర్క్ పూర్తిచేసి కార్టూన్లు చూస్తూ కూర్చుంటుంది. చూస్తున్నది కార్టూన్లే కదా అని తల్లిదండ్రులు కూడా అడ్డుచెప్పలేదు. కానీ క్రమేణా సారా ప్రవర్తనలో మార్పు కనిపిస్తోంది. ఏదడిగినా మొహం మీద కొట్టినట్టు సమాధానం ఇస్తోంది. లేదా ఎగతాళి చేస్తోంది. సరిచేయాలని పేరెంట్స్ ఎంత ప్రయత్నించినా అమ్మాయి ప్రవర్తనలో మార్పు రాలేదు. దాంతో ఏం చేయాలో తెలియక తల్లిదండ్రులు కౌన్సెలింగ్‌కు తీసుకువచ్చారు.
పిల్లలు దేన్నయినా సరే చూసి, గమనించి నేర్చుకుంటారు. కానీ సారా వాళ్లింట్లో అలా దుడుకుగా సమాధానం చెప్పేవారు ఎవ్వరూ లేరు. అయినా ఆ పాపకు అలాంటి ప్రవర్తన ఎలా అలవాటైందో తెలుసుకోవడానికి తనతో మాట్లాడాను. తాను చూస్తున్న కార్టూన్ సిరీస్‌ల నుంచే అలా మాట్లాడటం నేర్చుకుందని అర్థమైంది.
కార్టూన్లన్నీ మంచివేం కావు..
టీవీలో వచ్చే కార్టూన్లన్నీ మంచివేం కావు. కొన్ని చెడ్డవి కూడా ఉంటాయి. అవి పిల్లల మనసులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఉదాహరణకు.. మనకు దయ్యం, భూతం, రాక్షసులు అనే భావనలు ఎప్పుడు పరిచయమయ్యాయి? చిన్నప్పుడు చదివిన చందమామ, బొమ్మరిల్లు, బాలమిత్రలాంటి పుస్తకాల్లోంచే కదా! అలాంటి కథలు చదవడం ద్వారా దయ్యాలు, భూతాలు ఉన్నాయని మనం అనుకున్నట్లే, పిల్లలూ ఈనాటి కార్టూన్ సిరీస్‌లు చూసి సూపర్ మన్‌లు, సూపర్ పవర్స్‌ని నమ్ముతుంటారు.
- కొన్ని కార్టూన్లు హింస, చవకబారు హాస్యం లేదా పిల్లలను గందరగోళానికి గురిచేసే పద్ధతుల్లో ఉంటాయి.
- కార్టూన్లలో చిత్రీకరించే అతిశయోక్తి చర్యలు, పరిస్థితులు పిల్లల్లో అవాస్తవిక అంచనాలను క్రియేట్ చేయొచ్చు. గతంలో శక్తిమాన్ సిరీస్ ప్రసారమైనప్పుడు శక్తిమాన్‌లా దూకి పిల్లలు గాయాలపాలైన విషయం గుర్తుచేసుకోండి.
- అంతెందుకు మనకు విపరీతంగా నవ్వు తెప్పించే టామ్ అండ్ జెర్రీ సిరీస్‌లో విపరీతమైన హింస దాగి ఉంది.
- ఎక్కువసేపు కార్టూన్లు చూడటం.. శ్రద్ధ, నిద్రలను దెబ్బతీస్తుంది. వ్యాయామానికి దూరంచేసి శారీరక సమస్యలకు దారి తీస్తుంది.
కార్టూన్లు వినోదం మాత్రమే కాదు..
కార్టూన్లు రంగురంగుల విజువల్స్, ఆకట్టుకునే పాటలు, పాత్రలతో పిల్లలను బాగా ఆకర్షిస్తాయి. పిల్లలు కార్టూన్లు చూస్తుంటే తల్లిదండ్రులు కూడా పెద్దగా అడ్డుచెప్పరు. కానీ కార్టూన్లు కేవలం వినోదం మాత్రమే కాదు. అంతకు మించి. వాటి నుంచి పిల్లలు చాలా నేర్చుకుంటారు. అవి వాళ్ల మనస్సులపై చెరగని ముద్ర వేయవచ్చు. అందుకే పిల్లలు ఎలాంటి కార్టూన్లు చూస్తున్నారనే విషయం గమనించడం తప్పనిసరి.
- ఎడ్యుకేషన్ కార్టూన్లు కొత్త భావనలను పరిచయం చేస్తాయి, ప్రపంచం గురించి ఉత్సుకతను రేకెత్తిస్తాయి. అభిజ్ఞా వికాసానికి (cognitive development) తోడ్పడతాయి.
- స్నేహం, భయం లేదా నష్టం వంటి భావోద్వేగాలతో పోరాడే పాత్రలు పిల్లలకు వారి స్వంత భావాలను అన్వేషించడానికి దారి చూపిస్తాయి. అలాగే వారి ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌ను పెంచుకోవడానికి దోహదపడతాయి.
- అనేక కార్టూన్లు దయ, నిజాయితీ, పట్టుదల వంటి ఇతివృత్తాలను నొక్కిచెప్తాయి. పిల్లల నైతిక దిక్సూచిని, సానుకూల సామాజిక ప్రవర్తనను పెంపొందించడానికి ఉపయోగపడతాయి.
పేరెంట్స్ చేయాల్సింది..
- పిల్లలతో కలసి కార్టూన్లు చూడండి.
- అవి వారి వయసుకు, మీ కుటుంబ విలువలకు తగినవైతేనే అనుమతించండి.
- వాటిలో పాత్రల గురించి, అవి అందించిన సందేశాల గురించి మాట్లాడండి.
- విభిన్న నేపథ్యాల నుంచి పాత్రలతో కూడిన కార్టూన్లను పరిచయం చేయండి. తద్వారా భిన్నాభిప్రాయాలను కలుపుకొని పోవడం అలవాటవుతుంది.
- ఆడుకోవడం, చదవడం లేదా ఆరుబయట సమయం గడపడం వంటి ఇతర ఆకర్షణీయమైన కార్యకలాపాలతో స్క్రీన్ సమయాన్ని బ్యాలెన్స్ చేయండి.
- గుర్తుంచుకోండి.. ఓపెన్ కమ్యూనికేషన్, యాక్టివ్ పార్టిసిపేషన్ కీలకం.
పిల్లలు చూడకూడని కార్టూన్ సిరీస్‌లు..
- ది సింప్సన్స్: ఇది ఎలాంటి హాని చేయని కార్టూన్‌గా కనిపించినప్పటికీ చిన్నపిల్లలకు తగినది కాదు. ఇందులో సంక్లిష్టమైన, క్రూరమైన, అభ్యంతరకరమైన అంశాలుంటాయి.
- హ్యాపీ ట్రీ ఫ్రెండ్స్: అందంగా కనిపించినప్పటికీ, నిజానికి చాలా హింసాత్మకమైన, కలవరపెట్టే కార్టూన్. ఇది ఏ వయసు పిల్లలకైనా తగినది కాదు.
- రిక్ అండ్ మోర్టీ: ఈ సిరీస్ ఒక శాస్త్రవేత్త, అతని అమాయక మనవడి చుట్టూ తిరుగుతుంది. దీంట్లో అడల్ట్ జోక్స్, హింస ఉంటాయి. విలువలన్నీ శూన్యమనే భావన నిండి ఉంటుంది.
- బిగ్ మౌత్: ఇది టీనేజ్ పిల్లల గురించి! అయితే ఆ వయసులో వచ్చే ఇబ్బంది కరమైన, అసౌకర్యమైన అంశాలన్నిటినీ చూపిస్తుంది. ఇది పెద్దలకు ఉల్లాసంగా ఉంటుంది. కానీ టీనేజర్లకు తగినది కాదు.
- హ్యూమన్ రిసోర్సెస్: ఇందులో హార్మోన్ మాన్‌స్టర్స్, యాంగ్జయిటీ దోమలు, లవ్ బగ్స్ వంటి ఊహాత్మక జీవులు ఉంటాయి. కొంచెం బోల్డ్‌గా ఉంటుంది. పిల్లలకు అనువైనది కాదు.
-సైకాలజిస్ట్ విశేష్
psy.vishesh@gmail.com
Comments
Please login to add a commentAdd a comment