Phycology Expert
-
మెదడును 10 శాతమే ఉపయోగించుకుంటున్నామా?
మన మెదడులో ఎంత శాతం మనం ఉపయోగించుకుంటున్నాం? అంటే మీ సమాధానమేంటి? ఐదు లేదా పది శాతం అనేగా! ఇదే ప్రశ్నను మీ మిత్రులను అడిగి చూడండి. ‘ఐదు లేదా పది శాతం, కచ్చితంగా పదిశాతంకన్నా తక్కువే..’ అనే సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది. మీరే కాదు, కొందరు సైకాలజీ విద్యార్థులు, న్యూరోసైంటిస్టులు కూడా ఒక సర్వేలో అదే సమాధానం చెప్పారు. కొందరు అంతర్జాతీయస్థాయిలో పేరున్న ప్రముఖులు కూడా తమ పుస్తకాల్లో కూడా పది శాతమనే రాశారు. కానీ అది అవాస్తవం, అపోహ మాత్రమే. అపోహ ఎలా మొదలైంది? 1890వ దశకంలో హార్వర్డ్ సైకాలజిస్ట్ విలియం జేమ్స్, బోరిస్ సిడిస్ ఇద్దరూ కలసి పిల్లల పెంపకంపై ప్రయోగాలు చేశారు. విలియం సిడిస్ అనే బాల మేధావిని తయారుచేశారు. ఆ సందర్భంగా విలియం జేమ్స్ మాట్లాడుతూ ‘మనిషి తన మేధాసామర్థ్యం (mind potentiality)లో కొద్ది శాతాన్ని మాత్రమే ఉపయోగించుకుంటున్నాడు’ అని చెప్పారు. ప్రఖ్యాత వ్యక్తిత్వ వికాస నిపుణుడు డేల్ కార్నీ 1936లో రాసిన "How to win friends, influence people"కు అమెరికన్ రచయిత Lowell Thomas ముందుమాట రాశాడు. అందులో ‘మనిషి తన మేధాశక్తి (mind power)లో 10శాతాన్ని మాత్రమే అభివృద్ధి చేసుకోగలడు’ అని చెప్పాడు. అంటే సామర్థ్యం కాస్తా శక్తిగా మారింది. ఆ తర్వాత 1970లో సైకాలజిస్ట్, విద్యావేత్త Georgi Lozanov తన suggestopedia ని ప్రతిపాదిస్తూ ‘మనం మన మేధాశక్తిలో ఐదు నుంచి పది శాతాన్ని మాత్రమే ఉపయోగించుకుంటున్నాం’ అని చెప్పారు. ఆ తర్వాత అనేకమంది తమ పుస్తకాల్లో ఉపన్యాసాల్లో ‘మెదడులో పదిశాతాన్ని మాత్రమే ఉపయోగించుకుంటున్నాం’ అని రాశారు, చెప్పారు. తేడా గమనించండి.. మేధాసామర్థ్యంలో పదిశాతం ఉపయోగించుకోవడానికి, మెదడులో పదిశాతం మాత్రమే ఉపయోగించుకుంటున్నారు అనడానికి.. చాలా తేడా ఉంది. మేధో సామర్థ్యంలో పదిశాతాన్ని ఉపయోగించుకుంటున్నారంటే.. మనిషి తన మేధస్సుతో తాను సాధించగలిగిన దానిలో పదిశాతాన్ని మాత్రమే సాధించగలుగుతున్నాడని అర్థం. అంటే తన మేధస్సును మరింతగా ఉపయోగించుకుంటే మరింత ప్రగతిని సాధించగలడనే కదా. మన మెదడు అన్ని సందర్భాల్లోనూ నూటికి నూరుశాతం పనిచేస్తుంది. ఏ భాగమైనా పనిచేయకపోతే, దానికి సంబంధించిన శరీరభాగం చచ్చుబడి పోతుంది. దాన్నే పక్షవాతం అంటారు. అపోహల నుంచి బయటపడండి.. మీరు చదివింది లేదా మీకు తెలిసింది మాత్రమే నిజమనే నమ్మకం నుంచి బయటపడాలి. గొప్పవారు చెప్పారు కాబట్టి నమ్మాలి, దాన్ని ప్రశ్నించకూడదనే వైఖరి నుంచి బయటకు రావాలి. ఎవరో చెప్పినదాన్ని గుడ్డిగా అంగీకరించవద్దు, అనుసరించవద్దు. ఇలాంటి భ్రమలు, అపోహలు, అసత్యాలు మన చుట్టూ చాలా.. చాలా.. ఉన్నాయి. అవే అపర సత్యాలుగా చలామణీ అవుతున్నాయి. చలామణీ చేస్తున్నారు. అధిక సంఖ్యాకులు అంగీకరించినంత మాత్రాన, అనుసరించినంత మాత్రాన అసత్యం సత్యం కాబోదు. ఎవరో చెప్పారనో, ఎక్కడో రాశారనో దేన్నీ గుడ్డిగా నమ్మవద్దు. కాస్త సమయం వెచ్చించి పరిశీలించాలి, పరీక్షించాలి, ప్రశ్నించాలి. నిజానిజాలేమిటో తెలుసుకోవాలి. మీ మేధా సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి. తప్పు అభిప్రాయానికి ఎందుకొస్తారు? తాము చదివిన పుస్తకాల్లో అలా రాసి ఉండి ఉంటుంది.. ప్రఖ్యాత వ్యక్తులు తమ ఉపన్యాసాల్లో అలా చెప్పి ఉంటారు.. ప్రశ్నలకు సులువుగా సమాధానాలు తెలుసుకోవాలనే కోరిక.. తమకు నచ్చిన సమాధానాలనే ఎంచుకోవడం, గుర్తుంచుకోవడం.. తప్పు సమాచారం మాత్రమే అందుబాటులో ఉండటం.. మీడియా, సినిమాల ద్వారా అందిన సమాచారం.. ఇలా రకరకాల మార్గాల ద్వారా అందిన సమాచారాన్ని, వివిధ కారణాలతో ఏ మాత్రం ప్రశ్నించకుండా, పరీక్షించకుండా అంగీకరించడంతో వివిధ అంశాలపై అపోహలు, తప్పు అభిప్రాయాలు ఏర్పడతాయి. జ్ఞానమెలా వస్తుందంటే.. మనమందరం మనకు అందుబాటులో ఉన్న, లేదా మనం చదివిన పుస్తకాల ఆధారంగా అభిప్రాయాలను ఏర్పరచుకుంటాం. ఒకసారి ఓ అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నాక దాన్ని ఏ మాత్రం పరీక్షించం, అదే సత్యమని విశ్వసిస్తాం. ఆ తర్వాత మనం ఎవరితో మాట్లాడినా అదే విషయాన్ని చెప్తాం. మన విలువలు, విశ్వాసాలు, వైఖరులు, ప్రవర్తనలన్నీ ఇలా ఏర్పడినవే. మన జ్ఞానమంతా ఇలా వచ్చిందే. మనం జ్ఞానం అనుకుంటున్న జ్ఞానం మనకు ఎలా వచ్చిందనే విషయాన్ని వివరించే శాస్త్రాన్నే Epistemology (జ్ఞానమీమాంస) అంటారు. సైకాలజిస్ట్ విశేష్ psy.vishesh@gmail.com ఇవి చదవండి: 'ప్రోగ్రెసివ్ బోన్ లాస్’ ఎందుకు నివారించాలో తెలుసా!? -
జీవితాన్ని మార్చేసే కొన్ని మానసిక వాస్తవాలు..!
మనసు ఒక మిస్టరీ. దాని గురించి తెలిసింది గోరంతైతే, తెలియంది కొండంత. తెలుసుకోవాలనే ప్రయత్నం చేసేవారు రవ్వంత. అందువల్లనే కొందరు ఆందోళనతో తల్లడిల్లి పోతుంటే, మరికొందరు మనోవేదనతో పోరాడుతుంటారు. కొందరు ఉన్నదాంట్లో సంతోషంగా జీవిస్తుంటే, మరికొందరు లేనిదానికోసం ఆరాటపడుతూ నిత్యం బాధపడుతుంటారు. ఒకే రకమైన పరిస్థితులున్నా కొందరు అవకాశాలను అందిపుచ్చుకుని విజయం సాధిస్తే, మరికొందరు అవకాశాలు లేవంటూ తిట్టుకుంటూ పరాజితులుగా మిగిలిపోతారు. అన్నీ మనసు చేసే మాయే. అందుకే మీరు ఏర్పరచుకునే ఆలోచనలు, నమ్మకాల నుంచి మీ చర్యలు.. ఎంపికల వరకు జీవితం గురించిన కొన్ని మానసిక వాస్తవాలను, చిట్కాలను ఈ వారం తెలుసుకుందాం. ఇవి జీవితం గురించి మీ అవగాహననే మార్చేయగలవు. బాల్యంలో మీ తల్లితో మీ సంబంధం జీవితకాల ప్రభావాన్ని చూపుతుంది. ఇతరులతో సాన్నిహిత్యం మొదలుకొని సవాళ్లను, ఒత్తిడిని మీరు ఎలా ఎదుర్కొంటారనే వరకు ప్రతి అంశాన్నీ ప్రభావితం చేస్తుంది. పిల్లలు పుట్టినప్పటి నుంచి యాసను గుర్తించగలరని, అర్థం చేసుకోగలరని నిరూపితమైంది. ఐదు నెలల వయస్సులో పిల్లలు తమ తల్లి యాసను వింటారు, ఇష్టపడతారు, స్వీకరిస్తారు. యుక్తవయస్సు ప్రారంభంలో జరిగే సంఘటనలు సంవత్సరాలుగా మీతో ఉంటాయి. కొన్ని మార్పులకు కారణమైన సంఘటనలను గుర్తుకు తెచ్చుకోవడానికి మీ మెదడు ఇష్టపడుతుంది, గుర్తు చేసుకుంటుంది. మీరు నేర్చుకున్నదానితో సంతృప్తిపడే వారైనప్పటికీ, మీ అన్కాన్షస్ మైండ్ జీవితాంతం కొత్త సమాచారం కోసం అన్వేషిస్తూనే ఉంటుంది. మీ మెదడులోని మిమ్మల్ని కొత్త సమాచారాన్ని కోరుకునేలా చేస్తూనే ఉంటుంది. కొత్త భాషలు నేర్చుకుంటే మీ నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. ఒకే భాషకు పరిమితం కాకుండా రెండు భాషలు నేర్చుకునేవారు హేతుబద్ధమైన, తక్కువ భావోద్వేగ నిర్ణయాలు తీసుకుంటారని షికాగో విశ్వవిద్యాలయ అధ్యయనంలో వెల్లడైంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అనే మాట మీరు వినే ఉంటారు. అది నిజం కూడా. ఎవరినైనా మొదటిసారి కలసినప్పుడు మీకు ఏర్పడిన అభిప్రాయం మనసులో అలా ఉండిపోతుంది. మళ్లీ కొన్నేళ్ల తర్వాత కలసినా.. ఆ మొదటి అభిప్రాయం ఆధారంగానే సంభాషణ ఉంటుంది. అందువల్ల ఎవరినైనా మొదటిసారి కలసేటప్పుడు బెస్ట్ ఇంప్రెషన్ ఇవ్వడానికి ప్రయత్నించాలి. మీరు జీవితాన్ని ఎంత ఆనందిస్తున్నారనే దానిపై కృతజ్ఞత ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. సంతోషానికి కృతజ్ఞతతో ఉండటం చాలా కీలకమైన అంశం. మీరు రోజూ కృతజ్ఞత వ్యక్తీకరించినప్పుడు, మీ మొత్తం భావోద్వేగ స్థితి, జీవన నాణ్యత పెరుగుతాయి. డోపమైన్, సెరటోనిన్ లాంటి హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. మీ ఆయుష్షు పెరుగుతుంది. అందుకే రోజూ గ్రాటిట్యూడ్ జర్నల్ రాయాలి. మీరు ఎక్కువ కాలం జీవించాలనుకుంటే, మరింత మందికి సహాయం చేయండి. డిప్రెషన్ ప్రభావాన్ని తగ్గించడానికి ఇది ఒక ప్రభావవంతమైన మార్గం. స్వచ్ఛందసేవ వల్ల మరణాల రేటును 22శాతం తగ్గించే అవకాశం ఉందని ఒక అధ్యయనంలో తేలింది. అందుకే అవకాశమున్నప్పుడల్లా స్వచ్ఛంద సేవ చేయాలి. జీవితంలో ఆనందం అనేది డబ్బు వల్లనో, పేరు ప్రఖ్యాతుల వల్లనో రాదు. మీరు చేసే పనిలో సూపర్ ఫోకస్ ఉన్నప్పుడు వస్తుంది. దీన్నే ఫ్లో స్టేట్ లేదా ప్రవాహ స్థితి అంటారు. అందుకే మీకు బాగా నచ్చిన పని చేయాలి.. ఎక్కువ ఆనందంగా జీవించాలి. ప్లాసిబో ఎఫెక్ట్ గురించి మీరు వినే ఉంటారు. అంటే నిజమైన ట్యాబ్లెట్లా కనిపించే పిండి ట్యాబ్లెట్లు ఇచ్చినా అదే రకమైన ఫలితాలు రావడం. ఇది మందుల విషయంలోనే కాదు, జీవితంలో అనేక అంశాల్లో జరుగుతుందని సైకాలజిస్టులు వెల్లడించారు. రోజూ జిమ్ వీడియోలు చూడటం కూడా ఒత్తిళ్లను నివారించడానికి సహాయపడుతుందట. అలాగని వాటితో శాశ్వత పరిష్కారం దొరకదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. సంతృప్తి (gratification)ని ఆలస్యం చేయగలిగితే మీకు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని అధ్యయనాలు వెల్లడించాయి. అంటే దీర్ఘకాలిక ప్రయోజనం కోసం తక్షణ ఆనందాన్ని నిరోధించాలి. అది లక్ష్యాన్ని సాధించడానికి కావాల్సిన ప్రేరణను అందిస్తుంది. లాభం పొందే శక్తి కంటే నష్ట భయం చాలా ముఖ్యమట. అంటే లాభం పొందాలనే కోరికకంటే, నష్టపోతామేమోననే భయమే మనల్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుందని అధ్యయనాలు వెల్లడించాయి. -సైకాలజిస్ట్ విశేష్ psy.vishesh@gmail.com ఇవి చదవండి: ఇచట డిజిటల్ ఆమ్లెట్ డిజిటల్ పరోటా వేయబడును -
కార్టూన్ సిరీస్‌లతో జర జాగ్రత్త..! ఎందుకంటే?
ఎనిమిదేళ్ల సారా స్కూల్ నుంచి∙రాగానే హోమ్‌వర్క్ పూర్తిచేసి కార్టూన్లు చూస్తూ కూర్చుంటుంది. చూస్తున్నది కార్టూన్లే కదా అని తల్లిదండ్రులు కూడా అడ్డుచెప్పలేదు. కానీ క్రమేణా సారా ప్రవర్తనలో మార్పు కనిపిస్తోంది. ఏదడిగినా మొహం మీద కొట్టినట్టు సమాధానం ఇస్తోంది. లేదా ఎగతాళి చేస్తోంది. సరిచేయాలని పేరెంట్స్ ఎంత ప్రయత్నించినా అమ్మాయి ప్రవర్తనలో మార్పు రాలేదు. దాంతో ఏం చేయాలో తెలియక తల్లిదండ్రులు కౌన్సెలింగ్‌కు తీసుకువచ్చారు. పిల్లలు దేన్నయినా సరే చూసి, గమనించి నేర్చుకుంటారు. కానీ సారా వాళ్లింట్లో అలా దుడుకుగా సమాధానం చెప్పేవారు ఎవ్వరూ లేరు. అయినా ఆ పాపకు అలాంటి ప్రవర్తన ఎలా అలవాటైందో తెలుసుకోవడానికి తనతో మాట్లాడాను. తాను చూస్తున్న కార్టూన్ సిరీస్‌ల నుంచే అలా మాట్లాడటం నేర్చుకుందని అర్థమైంది. కార్టూన్లన్నీ మంచివేం కావు.. టీవీలో వచ్చే కార్టూన్లన్నీ మంచివేం కావు. కొన్ని చెడ్డవి కూడా ఉంటాయి. అవి పిల్లల మనసులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఉదాహరణకు.. మనకు దయ్యం, భూతం, రాక్షసులు అనే భావనలు ఎప్పుడు పరిచయమయ్యాయి? చిన్నప్పుడు చదివిన చందమామ, బొమ్మరిల్లు, బాలమిత్రలాంటి పుస్తకాల్లోంచే కదా! అలాంటి కథలు చదవడం ద్వారా దయ్యాలు, భూతాలు ఉన్నాయని మనం అనుకున్నట్లే, పిల్లలూ ఈనాటి కార్టూన్ సిరీస్‌లు చూసి సూపర్ మన్లు, సూపర్ పవర్స్‌ని నమ్ముతుంటారు. కొన్ని కార్టూన్లు హింస, చవకబారు హాస్యం లేదా పిల్లలను గందరగోళానికి గురిచేసే పద్ధతుల్లో ఉంటాయి. కార్టూన్లలో చిత్రీకరించే అతిశయోక్తి చర్యలు, పరిస్థితులు పిల్లల్లో అవాస్తవిక అంచనాలను క్రియేట్ చేయొచ్చు. గతంలో శక్తిమాన్ సిరీస్ ప్రసారమైనప్పుడు శక్తిమాన్‌లా దూకి పిల్లలు గాయాలపాలైన విషయం గుర్తుచేసుకోండి. అంతెందుకు మనకు విపరీతంగా నవ్వు తెప్పించే టామ్ అండ్ జెర్రీ సిరీస్‌లో విపరీతమైన హింస దాగి ఉంది. ఎక్కువసేపు కార్టూన్లు చూడటం.. శ్రద్ధ, నిద్రలను దెబ్బతీస్తుంది. వ్యాయామానికి దూరంచేసి శారీరక సమస్యలకు దారి తీస్తుంది. కార్టూన్లు వినోదం మాత్రమే కాదు.. కార్టూన్లు రంగురంగుల విజువల్స్, ఆకట్టుకునే పాటలు, పాత్రలతో పిల్లలను బాగా ఆకర్షిస్తాయి. పిల్లలు కార్టూన్లు చూస్తుంటే తల్లిదండ్రులు కూడా పెద్దగా అడ్డుచెప్పరు. కానీ కార్టూన్లు కేవలం వినోదం మాత్రమే కాదు. అంతకు మించి. వాటి నుంచి పిల్లలు చాలా నేర్చుకుంటారు. అవి వాళ్ల మనస్సులపై చెరగని ముద్ర వేయవచ్చు. అందుకే పిల్లలు ఎలాంటి కార్టూన్లు చూస్తున్నారనే విషయం గమనించడం తప్పనిసరి. ఎడ్యుకేషన్ కార్టూన్లు కొత్త భావనలను పరిచయం చేస్తాయి, ప్రపంచం గురించి ఉత్సుకతను రేకెత్తిస్తాయి. అభిజ్ఞా వికాసానికి (cognitive development) తోడ్పడతాయి. స్నేహం, భయం లేదా నష్టం వంటి భావోద్వేగాలతో పోరాడే పాత్రలు పిల్లలకు వారి స్వంత భావాలను అన్వేషించడానికి దారి చూపిస్తాయి. అలాగే వారి ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌ను పెంచుకోవడానికి దోహదపడతాయి. అనేక కార్టూన్లు దయ, నిజాయితీ, పట్టుదల వంటి ఇతివృత్తాలను నొక్కిచెప్తాయి. పిల్లల నైతిక దిక్సూచిని, సానుకూల సామాజిక ప్రవర్తనను పెంపొందించడానికి ఉపయోగపడతాయి. పేరెంట్స్ చేయాల్సింది.. పిల్లలతో కలసి కార్టూన్లు చూడండి. అవి వారి వయసుకు, మీ కుటుంబ విలువలకు తగినవైతేనే అనుమతించండి. వాటిలో పాత్రల గురించి, అవి అందించిన సందేశాల గురించి మాట్లాడండి. విభిన్న నేపథ్యాల నుంచి పాత్రలతో కూడిన కార్టూన్లను పరిచయం చేయండి. తద్వారా భిన్నాభిప్రాయాలను కలుపుకొని పోవడం అలవాటవుతుంది. ఆడుకోవడం, చదవడం లేదా ఆరుబయట సమయం గడపడం వంటి ఇతర ఆకర్షణీయమైన కార్యకలాపాలతో స్క్రీన్ సమయాన్ని బ్యాలెన్స్ చేయండి. గుర్తుంచుకోండి.. ఓపెన్ కమ్యూనికేషన్, యాక్టివ్ పార్టిసిపేషన్ కీలకం. పిల్లలు చూడకూడని కార్టూన్ సిరీస్‌లు.. ది సింప్సన్స్: ఇది ఎలాంటి హాని చేయని కార్టూన్‌గా కనిపించినప్పటికీ చిన్నపిల్లలకు తగినది కాదు. ఇందులో సంక్లిష్టమైన, క్రూరమైన, అభ్యంతరకరమైన అంశాలుంటాయి. హ్యాపీ ట్రీ ఫ్రెండ్స్: అందంగా కనిపించినప్పటికీ, నిజానికి చాలా హింసాత్మకమైన, కలవరపెట్టే కార్టూన్. ఇది ఏ వయసు పిల్లలకైనా తగినది కాదు. రిక్ అండ్ మోర్టీ: ఈ సిరీస్ ఒక శాస్త్రవేత్త, అతని అమాయక మనవడి చుట్టూ తిరుగుతుంది. దీంట్లో అడల్ట్ జోక్స్, హింస ఉంటాయి. విలువలన్నీ శూన్యమనే భావన నిండి ఉంటుంది. బిగ్ మౌత్: ఇది టీనేజ్ పిల్లల గురించి! అయితే ఆ వయసులో వచ్చే ఇబ్బంది కరమైన, అసౌకర్యమైన అంశాలన్నిటినీ చూపిస్తుంది. ఇది పెద్దలకు ఉల్లాసంగా ఉంటుంది. కానీ టీనేజర్లకు తగినది కాదు. హ్యూమన్ రిసోర్సెస్: ఇందులో హార్మోన్ మాన్స్టర్స్, యాంగ్జయిటీ దోమలు, లవ్ బగ్స్ వంటి ఊహాత్మక జీవులు ఉంటాయి. కొంచెం బోల్డ్‌గా ఉంటుంది. పిల్లలకు అనువైనది కాదు. -సైకాలజిస్ట్ విశేష్ psy.vishesh@gmail.com ఇవి చదవండి: అందమైన జీవితం కోసం ఐన్ స్టీన్ సూత్రాలు