Psychological Facts
-
బిగ్‌బాస్: సీత, సోనియా అలా ప్రవర్తించడానికి కారణమిదే!
బిగ్‌బాస్ రియాలిటీ షోలో పాల్గొనే వారి ప్రవర్తన కేవలం వినోదం మాత్రమే కాదు, ఒక సైకలాజికల్ ప్రయోగం కూడా! పరిచయం లేని వ్యక్తులను పరిమిత వనరులు, నిరంతర నిఘానేత్రాల మధ్య జైలు లాంటి ప్రదేశంలో ఉంచినప్పుడు వారి ప్రవర్తన ఎలా మారుతుందనేది తెలుసుకునే అవకాశం. అందుకు 1979లో హెన్రీ టాజ్ఫెల్ (Henri Tajfel) అనే మనస్తత్వవేత్త ప్రతిపాదించిన సామాజిక గుర్తింపు సిద్ధాంతం (Social Identity Theory) ఉపయోగపడుతుంది.ఏమిటీ సిద్ధాంతం?సామాజిక గుర్తింపు సిద్ధాంతం ప్రకారం వ్యక్తులకు గ్రూపులతో ఐడెంటిఫై చేసుకుంటారు. తర్వాత ఇన్-గ్రూప్, అవుట్-గ్రూప్ గా విభజిస్తారు. ఆ తర్వాత ఇన్-గ్రూప్ పక్షపాతం (in-group favoritism), అవుట్-గ్రూప్ వ్యతిరేకత (out-group discrimination) ఏర్పడతాయి. కులం, మతం, ప్రాంతం, భాషల ప్రాతిపదికగా ఇలాంటి గ్రూప్ లు ఏర్పడటం, అవుట్-గ్రూప్ సభ్యులపై అకారణ ద్వేషం ప్రదర్శించడం మనం చూస్తూనే ఉన్నాం కదా.రోజూ పోటీనేఇక బిగ్ బాస్ హౌస్ సంగతి సరేసరి. అక్కడ రోజూ పోటీనే. ఆ పోటీలో నిలబడాలంటే, ఎలిమినేట్ కాకుండా హౌస్‌లో ఉండాలంటే స్నేహితులను (ఇన్-గ్రూప్), వారి మద్దతును కూడగట్టుకోవాలి. ఈ క్రమంలో సభ్యుల మధ్య ఏర్పడే అనుబంధాలు వారి ప్రవర్తన, అభిప్రాయాలు, విభేదాలను ప్రభావితం చేస్తాయి.వర్గీకరణ తప్పదు సామాజిక గుర్తింపు సిద్ధాంతంలోని మొదటి దశ వర్గీకరణ. అంటే వ్యక్తులు తమను, ఇతరులను గ్రూపులుగా విభజిస్తారు. బిగ్ బాస్ లో క్లాన్ల ఏర్పాటు ఇందుకు ఉదాహరణ. కానీ నిఖిల్.. సోనియా పట్ల పక్షపాతం చూపుతున్నాడని బేబక్క ఆరోపించి, అతని క్లాన్ నుండి బయటకు వచ్చింది. ఇది ‘మేము వర్సెస్ వారు’ అనే పరిస్థితికి ఉదాహరణ.ఇన్-గ్రూప్ పట్ల విధేయతఇన్-గ్రూప్ ఏర్పడ్డాక ఆ గ్రూపుతో మమేకమవుతారు. ఈ గుర్తింపు విధేయతగా వ్యక్తమవుతుంది. ఇన్-గ్రూప్ సభ్యుడిని సమర్థించడం లేదా తప్పుని కప్పిపుచ్చడం చేస్తారు. రాజకీయ పార్టీల కార్యకర్తల్లో ఈ ఇన్-గ్రూప్ విధేయతను గమనించవచ్చు. తమ నాయకుడు ఏం చేసినా సమర్థిస్తుంటారు.తప్పులు జరిగినా..బిగ్ బాస్ హౌస్ లో జరిగే గొడవల్లో ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకోవడం, తమ గ్రూప్ పట్ల విధేయత చూపడం, తమ గ్రూప్ లో తప్పులు జరిగినా సమర్థించడం, అవుట్-గ్రూప్ ను వ్యతిరేకించడం చూడవచ్చు. సీత, సోనియాల ప్రవర్తనలో ఇది స్పష్టంగా కనిపించింది.వనరుల కొరతతో పోటీ... వనరులు పరిమితంగా ఉన్నప్పుడు లేదా కొరత ఉన్నప్పుడు గ్రూపులు పోటీతత్వాన్ని ప్రదర్శిస్తాయి. బిగ్ బాస్ హౌస్ లో రేషన్ కోసం పోటీ పడుతున్నప్పుడు ఇది స్పష్టంగా కనిపిస్తుంది. నిఖిల్ టీమ్ రేషన్ కోల్పోయినప్పుడు, పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారి తీసింది. ఇలాంటి సందర్భాల్లో ఇన్-గ్రూప్, అవుట్-గ్రూప్ విభేదాలు మునుపటి కంటే మరింత వేగంగా పెరుగుతాయి. నామినేషన్ల సమయంలో సీత-సోనియా మధ్య వాదన ఇందుకు ఉదాహరణ.సమూహ ఆధిపత్యం కోసం పోరాటంఇన్-గ్రూప్ పక్షపాతానికి మరొక కీలక అంశం సమూహ గౌరవం (ingroup esteem). అంటే తమ గ్రూప్ గౌరవాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. నిఖిల్ డామినేట్ చేస్తున్నాడంటూ ప్రేరణ నామినేట్ చేయడం ఇందుకు ఉదాహరణ. ఇది సమూహాలకు మధ్య గౌరవం, సమూహ ఆధిపత్యం కోసం చేసే పోరాటాలను ప్రతిబింబిస్తుంది.ఈ ఇన్-గ్రూప్, అవుట్-గ్రూప్ పోరాటాలు ప్రేక్షకులను బాగా ప్రభావితం చేస్తాయి. ప్రేక్షకులు కూడా తమకు ఇష్టమైన సభ్యులను తమ ఇన్-గ్రూప్‌గా, నచ్చని సభ్యులను అవుట్-గ్రూప్‌గా పరిగణిస్తారు. ఇది ఓటింగ్ ను ప్రభావితం చేస్తుంది.ఎవరు ఎలిమినేషన్? ఇన్-గ్రూప్ సభ్యులు తమ సభ్యులను రక్షించడానికి పోరాడుతారు, అవుట్-గ్రూప్ సభ్యులపై విమర్శలు చేయడం లేదా వారి తప్పులను హైలైట్ చేయడం ద్వారా వారిని ఎలిమినేట్ చేయడానికి నామినేట్ చేస్తారు. బెబక్క ఎలిమినేషన్ అలాగే జరిగిందని గుర్తించాలి. అలాగే విష్ణుప్రియ తమ గ్రూపు సభ్యుల పట్ల ఒక రకంగా, ఆపోజిట్ గ్రూప్ సభ్యుల పట్ల మరో రకంగా ప్రవర్తించడం కూడా గమనించవచ్చు.హౌస్ లోని సభ్యుల ప్రవర్తన, మాటలు, టాస్కుల్లో చూపించే పోటీతత్వం... ఇవన్నీ ఓటింగ్ ను ప్రభావితం చేస్తాయి. ఇన్-గ్రూప్ లో పాజిటివ్ ఇమేజ్ ను నిలబెట్టుకోలేని వ్యక్తులు ఎలిమినేషన్ కు గురయ్యే అవకాశం ఉంది.ఉదాహరణకు సీత తరచూ వాదనలకు దిగడం వల్ల ఆమెను చాలామంది హౌస్మేట్లు కూడా విమర్శించారు. అలాగే ప్రేరణ కూడా అగ్రెసివ్ నెస్ చూపించింది. దీన్ని ప్రేక్షకులు అంగీకరించకపోవచ్చు. అందువల్ల వీరిద్దరిలో ఒకరు త్వరలో ఎలిమినేట్ అయ్యే ప్రమాదం ఉంది. - సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066www.psyvisesh.com -
Psychological Facts: 'తెలివైనవారి' పది అలవాట్లు ఏంటో మీకు తెలుసా!
ఇంటెలిజెంట్, బ్రిలియంట్, జీనియస్.. ఇలాంటి తెలివైన వ్యక్తులు ఎవరితోనూ మాట్లాడకుండా, గాలిలోకి చూస్తూ, తమలో తామే ఆలోచించుకుంటూ.. తమ తెలివితేటల గురించి అహంకారంతో ఉంటారని అందరూ అనుకుంటారు. కానీ అందుకు భిన్నంగా వారి గురించి అధ్యయనాలు.. దేని గురించైనా వారు తమకు తక్కువగా తెలుసని అనుకుంటారని, వినయపూర్వకంగా ఉంటారని తెలియజేస్తున్నాయి. అలాగే వారి తెలివితేటలు రోజువారీ ప్రవర్తనల్లో, అలవాట్లలో స్పష్టంగా కనిపిస్తాయని సైకాలజిస్టులు చెప్తున్నారు. వాటిని అర్థంచేసుకుని, ఆచరిస్తే.. తెలివితేటలను మనందరమూ పూర్తిస్థాయిలో వినియోగించుకోవచ్చు. ఆ పది అలవాట్లేమిటో తెలుసుకుందాం. 1. తమ తెలివితేటల గురించి మాట్లాడరు.. అత్యంత తెలివైన వ్యక్తులు తమ స్మార్ట్‌నెస్ గురించి గొప్పలు చెప్పుకోరు. వారి మనస్సులో రోజువారీ విషయాల కంటే చాలా ముఖ్యమైన విషయాల మీదే మథనం జరుగుతూ ఉంటుంది. తమ ఆలోచనాపరిధిని విస్తరించుకోవడానికి, కొత్త విషయాలను నేర్చుకోవడానికి సమయాన్ని వెచ్చిస్తారు. 2. విశ్లేషణాత్మక దృష్టితో చూస్తారు.. తెలివైన వ్యక్తులు పరిశీలన, ప్రయోగాల ద్వారా నేర్చుకుంటారు. ఇతరులు కనుగొన్న విషయాలను విశ్లేషణాత్మక దృష్టితో చూస్తారు. మరింత ప్రయోజనరమైన ఫలితాల కోసం కృషిచేస్తారు. 3. పరిష్కారంలో ముందుంటారు.. తెలివైనవారు సవాళ్లను ఎదుర్కోవడంలో , సమస్యలు పరిష్కరించడంలో ముందుంటారు. ఆలోచించడం, నిరాశను అధిగమించడం ద్వారా పట్టుదల, ఆత్మవిశ్వాసం, విమర్శనాత్మక ఆలోచనా ధోరణిని పెంపొందించుకుంటారు. 4. ఎల్లప్పుడూ జ్ఞానాన్ని కోరుకుంటారు.. ‘మీకు ఎంత ఎక్కువ తెలిస్తే.. తెలియనిది ఇంకా అంత ఉందని గ్రహిస్తారు’ అని ప్రఖ్యాత తత్త్వవేత్త అరిస్టాటిల్ చెప్పాడు. తెలివైనవారు ఈ విషయాన్ని తప్పకుండా ఆచరిస్తారు. తమకు ఎంత తెలిసినా తెలియాల్సింది, నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని అర్థం చేసుకుంటారు. 5. డాట్స్‌ని ఎలా కనెక్ట్ చేయాలో వారికి తెలుసు! తెలివైనవారికి వివరాలు తెలుసుకోవడంతో పాటు వాటిని జూమ్ అవుట్ చేసి చూడగల సామర్థ్యం ఉంటుంది. వాటి మధ్య బంధాలను, సంబంధాలను కనెక్ట్ చేయడం తెలుసు. అంటే ఒక అంశానికి సంబంధించి ఎవరూ చూడని లార్జర్ పిక్చర్‌ను వారు చూడగలరు. తెలివైనవారు ప్రపంచాన్ని నలుపు–తెలుపులుగా, మంచి–చెడులుగా చూడరు. ఓపెన్ మైండ్‌తో ఉంటారు. విభిన్న తత్వాలు, ఆలోచనలను అర్థం చేసుకుంటారు. 6. చాలా ప్రశ్నలు అడుగుతారు.. తెలివైనవారు అన్నిటికీ సమాధానాలు కలిగి ఉండరు. సహజమైన ఉత్సుకతతో వారి మనసులో లెక్కలేనన్ని ప్రశ్నలుంటాయి. ఆలోచింపజేసే ప్రశ్నలను అడగడం ద్వారా, విస్తృతమైన చర్చకు దారి తీస్తారు. లోతైన దృక్కోణం నుంచి∙విషయాలను అన్వేషిస్తారు. అవగాహనను విస్తరించుకుంటారు. ఎందుకంటే వారికి తమ పరిమితులు తెలుసు. అందుకే ఎంత పెద్దవారైనా చిన్నపిల్లల నుంచి నేర్చుకోవడానికి కూడా సంకోచించరు. 7. చిన్న చిన్న వివరాలపైనా శ్రద్ధపెడ్తారు.. తెలివైన వ్యక్తులు కాంక్రీట్, అబ్స్ట్రాక్ట్ థింకింగ్ రెండింటినీ ఉపయోగించడంలో నైపుణ్యం కలిగి ఉంటారు. ఏదైనా ఎలా పనిచేస్తుందో అర్థంచేసుకోవడంతో పాటు, ఎందుకు పని చేస్తుందో కూడా అర్థంచేసుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు. మోడల్స్‌ను విశ్లేషించడం ద్వారా, తరచుగా పట్టించుకోని చిన్న చిన్న వివరాలపైనా శ్రద్ధచూపుతూ ఆలోచనాశక్తిని పెంచుకుంటారు. 8. లోతుగా అధ్యయనం చేస్తారు.. తెలివైనవారికి ఓ ప్రత్యేకమైన అలవాటు ఉంటుంది. ఎవరికీ అర్థంకాని విషయాలను అర్థంచేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. సంక్లిష్టమైన విషయాలను లోతుగా అధ్యయనం చేసి, సహేతుకమైన వివరణలను కనుగొనడంపై దృష్టి పెడతారు. 9. ఇతరుల పనుల గురించి ఆలోచించరు.. తెలివైనవారు తమ పని, చదువు పట్ల అమితమైన ధ్యాస కలిగి ఉంటారు. అందువల్ల ఇతరులు చెప్పేది వినడానికి సమయం లేదా శక్తిని కేటాయించరు. వారికున్న అధిక ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వల్ల ఇతరుల చర్యలు, ప్రవర్తనల నుంచి సులువుగా తమ దృష్టిని మళ్లించుకుంటారు. 10. చేసేముందు ఆలోచిస్తారు.. తెలివైన వ్యక్తులు ఏదైనా పనిచేసే ముందు సమస్యల గురించి క్షుణ్ణంగా ఆలోచిస్తారు. పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకున్నామని వారికి స్పష్టత రావాలి. వారి మనస్సాక్షికి తెలియాలి. అప్పుడే పనిచేయడం మొదలుపెడతారు. ప్రఖ్యాత తత్వవేత్త లావోత్సు ‘ప్రకృతి తొందరపడదు, అన్నీ జరుగుతాయి’ అని చెప్పినట్లు∙తెలివైన వ్యక్తులు తమ ప్రయత్నాల విషయంలో తొందరపడరు, తొందరపెట్టరు. — సైకాలజిస్ట్ విశేష్ ఇవి చదవండి: ఈ కొరియన్ ఖవ్వాలీ విన్నారో.. వహ్వా వహ్వా..! అనక తప్పదు! -
జీవితాన్ని మార్చేసే కొన్ని మానసిక వాస్తవాలు..!
మనసు ఒక మిస్టరీ. దాని గురించి తెలిసింది గోరంతైతే, తెలియంది కొండంత. తెలుసుకోవాలనే ప్రయత్నం చేసేవారు రవ్వంత. అందువల్లనే కొందరు ఆందోళనతో తల్లడిల్లి పోతుంటే, మరికొందరు మనోవేదనతో పోరాడుతుంటారు. కొందరు ఉన్నదాంట్లో సంతోషంగా జీవిస్తుంటే, మరికొందరు లేనిదానికోసం ఆరాటపడుతూ నిత్యం బాధపడుతుంటారు. ఒకే రకమైన పరిస్థితులున్నా కొందరు అవకాశాలను అందిపుచ్చుకుని విజయం సాధిస్తే, మరికొందరు అవకాశాలు లేవంటూ తిట్టుకుంటూ పరాజితులుగా మిగిలిపోతారు. అన్నీ మనసు చేసే మాయే. అందుకే మీరు ఏర్పరచుకునే ఆలోచనలు, నమ్మకాల నుంచి మీ చర్యలు.. ఎంపికల వరకు జీవితం గురించిన కొన్ని మానసిక వాస్తవాలను, చిట్కాలను ఈ వారం తెలుసుకుందాం. ఇవి జీవితం గురించి మీ అవగాహననే మార్చేయగలవు. బాల్యంలో మీ తల్లితో మీ సంబంధం జీవితకాల ప్రభావాన్ని చూపుతుంది. ఇతరులతో సాన్నిహిత్యం మొదలుకొని సవాళ్లను, ఒత్తిడిని మీరు ఎలా ఎదుర్కొంటారనే వరకు ప్రతి అంశాన్నీ ప్రభావితం చేస్తుంది. పిల్లలు పుట్టినప్పటి నుంచి యాసను గుర్తించగలరని, అర్థం చేసుకోగలరని నిరూపితమైంది. ఐదు నెలల వయస్సులో పిల్లలు తమ తల్లి యాసను వింటారు, ఇష్టపడతారు, స్వీకరిస్తారు. యుక్తవయస్సు ప్రారంభంలో జరిగే సంఘటనలు సంవత్సరాలుగా మీతో ఉంటాయి. కొన్ని మార్పులకు కారణమైన సంఘటనలను గుర్తుకు తెచ్చుకోవడానికి మీ మెదడు ఇష్టపడుతుంది, గుర్తు చేసుకుంటుంది. మీరు నేర్చుకున్నదానితో సంతృప్తిపడే వారైనప్పటికీ, మీ అన్కాన్షస్ మైండ్ జీవితాంతం కొత్త సమాచారం కోసం అన్వేషిస్తూనే ఉంటుంది. మీ మెదడులోని మిమ్మల్ని కొత్త సమాచారాన్ని కోరుకునేలా చేస్తూనే ఉంటుంది. కొత్త భాషలు నేర్చుకుంటే మీ నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. ఒకే భాషకు పరిమితం కాకుండా రెండు భాషలు నేర్చుకునేవారు హేతుబద్ధమైన, తక్కువ భావోద్వేగ నిర్ణయాలు తీసుకుంటారని షికాగో విశ్వవిద్యాలయ అధ్యయనంలో వెల్లడైంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అనే మాట మీరు వినే ఉంటారు. అది నిజం కూడా. ఎవరినైనా మొదటిసారి కలసినప్పుడు మీకు ఏర్పడిన అభిప్రాయం మనసులో అలా ఉండిపోతుంది. మళ్లీ కొన్నేళ్ల తర్వాత కలసినా.. ఆ మొదటి అభిప్రాయం ఆధారంగానే సంభాషణ ఉంటుంది. అందువల్ల ఎవరినైనా మొదటిసారి కలసేటప్పుడు బెస్ట్ ఇంప్రెషన్ ఇవ్వడానికి ప్రయత్నించాలి. మీరు జీవితాన్ని ఎంత ఆనందిస్తున్నారనే దానిపై కృతజ్ఞత ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. సంతోషానికి కృతజ్ఞతతో ఉండటం చాలా కీలకమైన అంశం. మీరు రోజూ కృతజ్ఞత వ్యక్తీకరించినప్పుడు, మీ మొత్తం భావోద్వేగ స్థితి, జీవన నాణ్యత పెరుగుతాయి. డోపమైన్, సెరటోనిన్ లాంటి హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. మీ ఆయుష్షు పెరుగుతుంది. అందుకే రోజూ గ్రాటిట్యూడ్ జర్నల్ రాయాలి. మీరు ఎక్కువ కాలం జీవించాలనుకుంటే, మరింత మందికి సహాయం చేయండి. డిప్రెషన్ ప్రభావాన్ని తగ్గించడానికి ఇది ఒక ప్రభావవంతమైన మార్గం. స్వచ్ఛందసేవ వల్ల మరణాల రేటును 22శాతం తగ్గించే అవకాశం ఉందని ఒక అధ్యయనంలో తేలింది. అందుకే అవకాశమున్నప్పుడల్లా స్వచ్ఛంద సేవ చేయాలి. జీవితంలో ఆనందం అనేది డబ్బు వల్లనో, పేరు ప్రఖ్యాతుల వల్లనో రాదు. మీరు చేసే పనిలో సూపర్ ఫోకస్ ఉన్నప్పుడు వస్తుంది. దీన్నే ఫ్లో స్టేట్ లేదా ప్రవాహ స్థితి అంటారు. అందుకే మీకు బాగా నచ్చిన పని చేయాలి.. ఎక్కువ ఆనందంగా జీవించాలి. ప్లాసిబో ఎఫెక్ట్ గురించి మీరు వినే ఉంటారు. అంటే నిజమైన ట్యాబ్లెట్లా కనిపించే పిండి ట్యాబ్లెట్లు ఇచ్చినా అదే రకమైన ఫలితాలు రావడం. ఇది మందుల విషయంలోనే కాదు, జీవితంలో అనేక అంశాల్లో జరుగుతుందని సైకాలజిస్టులు వెల్లడించారు. రోజూ జిమ్ వీడియోలు చూడటం కూడా ఒత్తిళ్లను నివారించడానికి సహాయపడుతుందట. అలాగని వాటితో శాశ్వత పరిష్కారం దొరకదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. సంతృప్తి (gratification)ని ఆలస్యం చేయగలిగితే మీకు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని అధ్యయనాలు వెల్లడించాయి. అంటే దీర్ఘకాలిక ప్రయోజనం కోసం తక్షణ ఆనందాన్ని నిరోధించాలి. అది లక్ష్యాన్ని సాధించడానికి కావాల్సిన ప్రేరణను అందిస్తుంది. లాభం పొందే శక్తి కంటే నష్ట భయం చాలా ముఖ్యమట. అంటే లాభం పొందాలనే కోరికకంటే, నష్టపోతామేమోననే భయమే మనల్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుందని అధ్యయనాలు వెల్లడించాయి. -సైకాలజిస్ట్ విశేష్ psy.vishesh@gmail.com ఇవి చదవండి: ఇచట డిజిటల్ ఆమ్లెట్ డిజిటల్ పరోటా వేయబడును