
బిగ్‌బాస్ సైకాలజీ పాఠాలు
బిగ్‌బాస్ రియాలిటీ షోలో పాల్గొనే వారి ప్రవర్తన కేవలం వినోదం మాత్రమే కాదు, ఒక సైకలాజికల్ ప్రయోగం కూడా! పరిచయం లేని వ్యక్తులను పరిమిత వనరులు, నిరంతర నిఘానేత్రాల మధ్య జైలు లాంటి ప్రదేశంలో ఉంచినప్పుడు వారి ప్రవర్తన ఎలా మారుతుందనేది తెలుసుకునే అవకాశం. అందుకు 1979లో హెన్రీ టాజ్‌ఫెల్ (Henri Tajfel) అనే మనస్తత్వవేత్త ప్రతిపాదించిన సామాజిక గుర్తింపు సిద్ధాంతం (Social Identity Theory) ఉపయోగపడుతుంది.
ఏమిటీ సిద్ధాంతం?
సామాజిక గుర్తింపు సిద్ధాంతం ప్రకారం వ్యక్తులకు గ్రూపులతో ఐడెంటిఫై చేసుకుంటారు. తర్వాత ఇన్-గ్రూప్, అవుట్-గ్రూప్ గా విభజిస్తారు. ఆ తర్వాత ఇన్-గ్రూప్ పక్షపాతం (in-group favoritism), అవుట్-గ్రూప్ వ్యతిరేకత (out-group discrimination) ఏర్పడతాయి. కులం, మతం, ప్రాంతం, భాషల ప్రాతిపదికగా ఇలాంటి గ్రూప్ లు ఏర్పడటం, అవుట్-గ్రూప్ సభ్యులపై అకారణ ద్వేషం ప్రదర్శించడం మనం చూస్తూనే ఉన్నాం కదా.
రోజూ పోటీనే
ఇక బిగ్ బాస్ హౌస్ సంగతి సరేసరి. అక్కడ రోజూ పోటీనే. ఆ పోటీలో నిలబడాలంటే, ఎలిమినేట్ కాకుండా హౌస్‌లో ఉండాలంటే స్నేహితులను (ఇన్-గ్రూప్), వారి మద్దతును కూడగట్టుకోవాలి. ఈ క్రమంలో సభ్యుల మధ్య ఏర్పడే అనుబంధాలు వారి ప్రవర్తన, అభిప్రాయాలు, విభేదాలను ప్రభావితం చేస్తాయి.
వర్గీకరణ తప్పదు
సామాజిక గుర్తింపు సిద్ధాంతంలోని మొదటి దశ వర్గీకరణ. అంటే వ్యక్తులు తమను, ఇతరులను గ్రూపులుగా విభజిస్తారు. బిగ్ బాస్ లో క్లాన్‌ల ఏర్పాటు ఇందుకు ఉదాహరణ. కానీ నిఖిల్.. సోనియా పట్ల పక్షపాతం చూపుతున్నాడని బేబక్క ఆరోపించి, అతని క్లాన్ నుండి బయటకు వచ్చింది. ఇది ‘మేము వర్సెస్ వారు’ అనే పరిస్థితికి ఉదాహరణ.
ఇన్-గ్రూప్ పట్ల విధేయత
ఇన్-గ్రూప్ ఏర్పడ్డాక ఆ గ్రూపుతో మమేకమవుతారు. ఈ గుర్తింపు విధేయతగా వ్యక్తమవుతుంది. ఇన్-గ్రూప్ సభ్యుడిని సమర్థించడం లేదా తప్పుని కప్పిపుచ్చడం చేస్తారు. రాజకీయ పార్టీల కార్యకర్తల్లో ఈ ఇన్-గ్రూప్ విధేయతను గమనించవచ్చు. తమ నాయకుడు ఏం చేసినా సమర్థిస్తుంటారు.
తప్పులు జరిగినా..
బిగ్ బాస్ హౌస్ లో జరిగే గొడవల్లో ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకోవడం, తమ గ్రూప్ పట్ల విధేయత చూపడం, తమ గ్రూప్ లో తప్పులు జరిగినా సమర్థించడం, అవుట్-గ్రూప్ ను వ్యతిరేకించడం చూడవచ్చు. సీత, సోనియాల ప్రవర్తనలో ఇది స్పష్టంగా కనిపించింది.
వనరుల కొరతతో పోటీ...
వనరులు పరిమితంగా ఉన్నప్పుడు లేదా కొరత ఉన్నప్పుడు గ్రూపులు పోటీతత్వాన్ని ప్రదర్శిస్తాయి. బిగ్ బాస్ హౌస్ లో రేషన్ కోసం పోటీ పడుతున్నప్పుడు ఇది స్పష్టంగా కనిపిస్తుంది. నిఖిల్ టీమ్ రేషన్ కోల్పోయినప్పుడు, పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారి తీసింది. ఇలాంటి సందర్భాల్లో ఇన్-గ్రూప్, అవుట్-గ్రూప్ విభేదాలు మునుపటి కంటే మరింత వేగంగా పెరుగుతాయి. నామినేషన్ల సమయంలో సీత-సోనియా మధ్య వాదన ఇందుకు ఉదాహరణ.
సమూహ ఆధిపత్యం కోసం పోరాటం
ఇన్-గ్రూప్ పక్షపాతానికి మరొక కీలక అంశం సమూహ గౌరవం (ingroup esteem). అంటే తమ గ్రూప్ గౌరవాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. నిఖిల్ డామినేట్ చేస్తున్నాడంటూ ప్రేరణ నామినేట్ చేయడం ఇందుకు ఉదాహరణ. ఇది సమూహాలకు మధ్య గౌరవం, సమూహ ఆధిపత్యం కోసం చేసే పోరాటాలను ప్రతిబింబిస్తుంది.
ఈ ఇన్-గ్రూప్, అవుట్-గ్రూప్ పోరాటాలు ప్రేక్షకులను బాగా ప్రభావితం చేస్తాయి. ప్రేక్షకులు కూడా తమకు ఇష్టమైన సభ్యులను తమ ఇన్-గ్రూప్‌గా, నచ్చని సభ్యులను అవుట్-గ్రూప్‌గా పరిగణిస్తారు. ఇది ఓటింగ్ ను ప్రభావితం చేస్తుంది.
ఎవరు ఎలిమినేషన్?
ఇన్-గ్రూప్ సభ్యులు తమ సభ్యులను రక్షించడానికి పోరాడుతారు, అవుట్-గ్రూప్ సభ్యులపై విమర్శలు చేయడం లేదా వారి తప్పులను హైలైట్ చేయడం ద్వారా వారిని ఎలిమినేట్ చేయడానికి నామినేట్ చేస్తారు. బెబక్క ఎలిమినేషన్ అలాగే జరిగిందని గుర్తించాలి. అలాగే విష్ణుప్రియ తమ గ్రూపు సభ్యుల పట్ల ఒక రకంగా, ఆపోజిట్ గ్రూప్ సభ్యుల పట్ల మరో రకంగా ప్రవర్తించడం కూడా గమనించవచ్చు.
హౌస్ లోని సభ్యుల ప్రవర్తన, మాటలు, టాస్కుల్లో చూపించే పోటీతత్వం... ఇవన్నీ ఓటింగ్ ను ప్రభావితం చేస్తాయి. ఇన్-గ్రూప్ లో పాజిటివ్ ఇమేజ్ ను నిలబెట్టుకోలేని వ్యక్తులు ఎలిమినేషన్ కు గురయ్యే అవకాశం ఉంది.
ఉదాహరణకు సీత తరచూ వాదనలకు దిగడం వల్ల ఆమెను చాలామంది హౌస్మేట్లు కూడా విమర్శించారు. అలాగే ప్రేరణ కూడా అగ్రెసివ్ నెస్ చూపించింది. దీన్ని ప్రేక్షకులు అంగీకరించకపోవచ్చు. అందువల్ల వీరిద్దరిలో ఒకరు త్వరలో ఎలిమినేట్ అయ్యే ప్రమాదం ఉంది.
- సైకాలజిస్ట్ విశేష్
+91 8019 000066
www.psyvisesh.com