Psychological Facts: 'తెలివైనవారి' పది అలవాట్లు ఏంటో మీకు తెలుసా! | Psychological Facts: Intelligence People Follow These Top Ten Rules | Sakshi
Sakshi News home page

Psychological Facts: 'తెలివైనవారి' పది అలవాట్లు ఏంటో మీకు తెలుసా!

Published Sun, Apr 14 2024 9:32 AM | Last Updated on Sun, Apr 14 2024 9:32 AM

Psychological Facts: Intelligence People Follow These Top Ten Rules - Sakshi

ఇంటెలిజెంట్, బ్రిలియంట్, జీనియస్‌.. ఇలాంటి తెలివైన వ్యక్తులు ఎవరితోనూ మాట్లాడకుండా, గాలిలోకి చూస్తూ, తమలో తామే ఆలోచించుకుంటూ.. తమ తెలివితేటల గురించి అహంకారంతో ఉంటారని అందరూ అనుకుంటారు. కానీ అందుకు భిన్నంగా వారి గురించి అధ్యయనాలు.. దేని గురించైనా వారు తమకు తక్కువగా తెలుసని అనుకుంటారని, వినయపూర్వకంగా ఉంటారని తెలియజేస్తున్నాయి. అలాగే వారి తెలివితేటలు రోజువారీ ప్రవర్తనల్లో, అలవాట్లలో స్పష్టంగా కనిపిస్తాయని సైకాలజిస్టులు చెప్తున్నారు. వాటిని అర్థంచేసుకుని, ఆచరిస్తే.. తెలివితేటలను మనందరమూ పూర్తిస్థాయిలో వినియోగించుకోవచ్చు. ఆ పది అలవాట్లేమిటో తెలుసుకుందాం.

1. తమ తెలివితేటల గురించి మాట్లాడరు..
అత్యంత తెలివైన వ్యక్తులు తమ స్మార్ట్‌నెస్‌ గురించి గొప్పలు చెప్పుకోరు. వారి మనస్సులో రోజువారీ విషయాల కంటే చాలా ముఖ్యమైన విషయాల మీదే మథనం జరుగుతూ ఉంటుంది. తమ ఆలోచనాపరిధిని విస్తరించుకోవడానికి, కొత్త విషయాలను నేర్చుకోవడానికి సమయాన్ని వెచ్చిస్తారు.

2. విశ్లేషణాత్మక దృష్టితో చూస్తారు..
తెలివైన వ్యక్తులు పరిశీలన, ప్రయోగాల ద్వారా నేర్చుకుంటారు. ఇతరులు కనుగొన్న విషయాలను విశ్లేషణాత్మక దృష్టితో చూస్తారు. మరింత ప్రయోజనరమైన ఫలితాల కోసం కృషిచేస్తారు.

3. పరిష్కారంలో ముందుంటారు..
తెలివైనవారు సవాళ్లను ఎదుర్కోవడంలో , సమస్యలు పరిష్కరించడంలో ముందుంటారు.
ఆలోచించడం, నిరాశను అధిగమించడం ద్వారా పట్టుదల, ఆత్మవిశ్వాసం, విమర్శనాత్మక ఆలోచనా ధోరణిని పెంపొందించుకుంటారు.

4. ఎల్లప్పుడూ జ్ఞానాన్ని కోరుకుంటారు..
‘మీకు ఎంత ఎక్కువ తెలిస్తే.. తెలియనిది ఇంకా అంత ఉందని గ్రహిస్తారు’ అని ప్రఖ్యాత తత్త్వవేత్త అరిస్టాటిల్‌ చెప్పాడు. తెలివైనవారు ఈ విషయాన్ని తప్పకుండా ఆచరిస్తారు. తమకు ఎంత తెలిసినా తెలియాల్సింది, నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని అర్థం చేసుకుంటారు.

5. డాట్స్‌ని ఎలా కనెక్ట్‌ చేయాలో వారికి తెలుసు!
తెలివైనవారికి వివరాలు తెలుసుకోవడంతో పాటు వాటిని జూమ్‌ అవుట్‌ చేసి చూడగల సామర్థ్యం ఉంటుంది. వాటి మధ్య బంధాలను, సంబంధాలను కనెక్ట్‌ చేయడం తెలుసు. అంటే ఒక అంశానికి సంబంధించి ఎవరూ చూడని లార్జర్‌ పిక్చర్‌ను వారు చూడగలరు. తెలివైనవారు ప్రపంచాన్ని నలుపు–తెలుపులుగా, మంచి–చెడులుగా చూడరు. ఓపెన్‌ మైండ్‌తో ఉంటారు. విభిన్న తత్వాలు, ఆలోచనలను అర్థం చేసుకుంటారు.

6. చాలా ప్రశ్నలు అడుగుతారు..
తెలివైనవారు అన్నిటికీ సమాధానాలు కలిగి ఉండరు. సహజమైన ఉత్సుకతతో వారి మనసులో లెక్కలేనన్ని ప్రశ్నలుంటాయి. ఆలోచింపజేసే ప్రశ్నలను అడగడం ద్వారా, విస్తృతమైన చర్చకు దారి తీస్తారు. లోతైన దృక్కోణం నుంచి∙విషయాలను అన్వేషిస్తారు. అవగాహనను విస్తరించుకుంటారు. ఎందుకంటే వారికి తమ పరిమితులు తెలుసు. అందుకే ఎంత పెద్దవారైనా చిన్నపిల్లల నుంచి నేర్చుకోవడానికి కూడా సంకోచించరు.

7. చిన్న చిన్న వివరాలపైనా శ్రద్ధపెడ్తారు..
తెలివైన వ్యక్తులు కాంక్రీట్, అబ్‌స్ట్రాక్ట్‌ థింకింగ్‌ రెండింటినీ ఉపయోగించడంలో నైపుణ్యం కలిగి ఉంటారు. ఏదైనా ఎలా పనిచేస్తుందో అర్థంచేసుకోవడంతో పాటు, ఎందుకు పని చేస్తుందో కూడా అర్థంచేసుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు. మోడల్స్‌ను విశ్లేషించడం ద్వారా, తరచుగా పట్టించుకోని చిన్న చిన్న వివరాలపైనా శ్రద్ధచూపుతూ ఆలోచనాశక్తిని పెంచుకుంటారు.

8. లోతుగా అధ్యయనం చేస్తారు..
తెలివైనవారికి ఓ ప్రత్యేకమైన అలవాటు ఉంటుంది. ఎవరికీ అర్థంకాని విషయాలను అర్థంచేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. సంక్లిష్టమైన విషయాలను లోతుగా అధ్యయనం చేసి, సహేతుకమైన వివరణలను కనుగొనడంపై దృష్టి పెడతారు.

9. ఇతరుల పనుల గురించి ఆలోచించరు..
తెలివైనవారు తమ పని, చదువు పట్ల అమితమైన ధ్యాస కలిగి ఉంటారు. అందువల్ల ఇతరులు చెప్పేది వినడానికి సమయం లేదా శక్తిని కేటాయించరు. వారికున్న అధిక ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ వల్ల ఇతరుల చర్యలు, ప్రవర్తనల నుంచి సులువుగా తమ దృష్టిని మళ్లించుకుంటారు.

  • 10. చేసేముందు ఆలోచిస్తారు..
    తెలివైన వ్యక్తులు ఏదైనా పనిచేసే ముందు సమస్యల గురించి క్షుణ్ణంగా ఆలోచిస్తారు. పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకున్నామని వారికి స్పష్టత రావాలి. వారి మనస్సాక్షికి తెలియాలి. అప్పుడే పనిచేయడం మొదలుపెడతారు. ప్రఖ్యాత తత్వవేత్త లావోత్సు ‘ప్రకృతి తొందరపడదు, అన్నీ జరుగుతాయి’ అని చెప్పినట్లు∙తెలివైన వ్యక్తులు తమ ప్రయత్నాల విషయంలో తొందరపడరు, తొందరపెట్టరు.

    — సైకాలజిస్ట్‌ విశేష్‌

ఇవి చదవండి: ఈ కొరియన్‌ ఖవ్వాలీ విన్నారో.. వహ్వా వహ్వా..! అనక తప్పదు!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement