సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వచ్చే నెల ఆరంభం నుంచి విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. నైరుతి రుతు పవనాలు ముఖం చాటేయడంతో ఈ సీజన్‌లో కొద్దిరోజులుగా కానరాని వర్షాలు నాలుగైదు రోజుల్లో తిరిగి ప్రారంభమవుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఆగస్టు నెలలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. నైరుతి రుతుపవనాల సీజను ఆరంభమైన జూన్‌లో మోస్తరుగా, జూలైలో విస్తారంగా వానలు కురిశాయి.
⛈️ ఆగస్టులో వర్షాల జాడ లేదు. ఈనెల ఆరంభం నుంచే రుతుపవన ద్రోణి (మాన్సూన్ ట్రఫ్) హిమాలయాల వైపు వెళ్లిపోయింది. వారం పది రోజుల తర్వాత తిరిగి ఇది దక్షిణాది వైపు రావడం సహజంగా జరిగే ప్రక్రియ. హిమాలయాల నుంచి కదిలి మధ్యప్రదేశ్‌పై కొన్నాళ్లు స్థిరంగా ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురవడానికి దోహదపడుతుంది. ఆ మధ్య సమయంలోనే కొద్దిరోజుల పాటు బ్రేక్ మాన్సూన్ (వర్షాలకు విరామం) ఏర్పడి వానలకు అడ్డుకట్ట వేస్తుంది.
⛈️ అయితే ఈసారి అందుకు భిన్నంగా మూడు వారాలకు పైగా హిమాలయాల వద్దే రుతుపవన ద్రోణి తిష్ట వేసింది. ఫలితంగా హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కుంభవృష్టి కురిపించి వరదలకు కారణమైంది. రుతు పవన ద్రోణి దక్షిణాది వైపు కదలకపోవడంతో నైరుతి రుతుపవనాలు బలహీనమైపోయి ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆగస్టు నెలలో అప్పుడప్పుడు అక్కడక్కడ కొద్దిపాటి వర్షాలు కురిశాయి తప్ప సాధారణ వర్షాలు లేవు.
⛈️ ఈ ద్రోణి వచ్చే నెల ఒకటో తేదీ వరకు హిమాలయాల వద్దే కొనసాగి, ఆ తర్వాత దక్షిణాదికి మారుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజాగా వెల్లడించింది. ఆ ప్రక్రియ మొదలైన నాలుగైదు రోజులకు రాష్ట్రంలో వర్షాలు మళ్లీ మొదలవుతాయని వాతావరణ శాఖ రిటైర్డ్ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు.
⛈️ రుతుపవన ద్రోణి ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడి సెప్టెంబర్ మొదటి వారం నుంచి వానలు సమృద్ధిగా కురిసేందుకు ఆస్కారం ఉంటుందని తెలిపారు. సెప్టెంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌లో సాధారణం లేదా అంతకు మించి ఒకింత ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని ఐఎండీ కూడా అంచనా వేసింది.
జాడలేని అల్పపీడనాలు..
అరేబియా సముద్రం, బంగాళాఖాతం శాఖల నుంచి వేర్వేరుగా పయనించే రుతుపవనాల ప్రభావంతో అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడి, వర్షాలు కురుస్తాయి. కానీ ఈ సీజన్‌లో ఇప్పటిదాకా చెప్పుకోదగిన స్థాయిలో అల్పపీడనాలు ఏర్పడలేదు. ఈ ఏడాది ‘నైరుతి’ సీజను ఆరంభమైన కొన్నాళ్లకు రుతుపవనాలు చైనా, జపాన్ వైపు వెళ్లిపోయాయి. రుతుపవన ద్రోణి దిగువకు (దక్షిణం వైపునకు) రాకపోవడం, ఎల్‌నినో ప్రభావం వెరసి ఆగస్టులో దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులేర్పడ్డాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment