ప్రకృతి తప్పా, ప్రభుత్వాల తప్పా?
న్యూఢిల్లీ: కేరళకు ముందుగానే తాకిన నైరుతి రుతుపవనాలు మరో రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాలను కూడా విస్తరిస్తాయి. ఈసారి సాధారణ వర్షపాతం పడుతుందని కేంద్ర వాతావరణ శాఖ చల్లటి కబురును మోసుకొచ్చింది. గత మూడేళ్లుగా సాధారణ వర్షపాతం కూడా పడని కారణంగా కరువుతో అల్లాడిపోతున్న దేశంలోని మెజారిటీ ప్రాంతాలకు ఇది చల్లటి కబురే.
దేశంలో వ్యవసాయం 80 శాతం ఈ నైరుతి రుతుపవనాలపైనే ఆధారపడి ఉంది. ప్రధాన వృత్తయిన వ్యవసాయంపైనే దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఆధారపడి ఉంది. జాతీయ స్థూల ఉత్పత్తిలో వ్యవసాయోత్పత్తులు 18 శాతం ఆక్రమిస్తుందన్న విషయం తెల్సిందే. తాగునీటి అవసరాల రీత్యా దక్షణ భారత దేశానికి వేసవిలో వర్షాలు పడడం కూడా అవసరమే. ఈసారి వేసవిలో పెద్దగా వర్షాలు పడలేదు. దక్షిణాదిలో నదులు, కాల్వలు, చెరువులు ఎక్కువగా ఎండిపోయాయి. దేశంలో సాధారణ వర్షపాతం కన్నా ఎక్కువ వర్షాలు కురిసిన సందర్భాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఆ నీటి వనరులను సంరక్షించుకునేందుకు చాలినన్ని ప్రాజెక్టులు లేకపోవడం వల్ల ఆ నీరంతా వధాగా సముద్రాల్లో కలుస్తూ వచ్చాయి.
నేడు తమిళనాడు 140 ఏళ్లలో ఎన్నడూ లేనంత తీవ్ర కరవు పరిస్థితులను ఎదుర్కొంటోంది. 2015, డిసెంబర్ నెలలోనే చెన్నైలో అసాధారణ వర్షాలు పడి వరదలొచ్చాయి. క్యాచ్‌మెంట్ ఏరియా కూడా నీట మునిగింది. ఆ నీటిని సంరక్షించుకునే అవకాశం లేకపోవడంతో 60 శాతం నీరు వధాగా సముద్రంలో కలిసింది. అంత వర్షంపాతం పడిన ఏడాదిలోనే మంచినీటి కోసం తమిళనాడు అల్లాడే పరిస్థితి వచ్చిందంటే ప్రభుత్వాల తప్పా? ప్రకతి తప్పా? తమిళనాడుతో పాటు కేరళ, కర్ణాటక రాష్ట్రాలు కూడా నేడు గొంతు తడుపుకునేందుకు గుక్కెడు నీళ్లులేక అల్లాడు తున్నాయంటే ఎవరి తప్పు?భారత దేశంలో రుతుపవనాలు విఫలం అవడానికి పర్యావరణ పరిస్థితులు క్షీణించడమే ఏకైక కారణమని ప్రధాని నరేంద్ర మోదీ 2016లో చెప్పారు.
అది నిజమే, రుతుపవనాలు సవ్యంగా వచ్చి వర్షాలు వస్తే వాటిని ఒడిసి పట్టుకునేందుకు సరిపడా ప్రాజెక్టులు దేశంలో లేవన్న విషయం ఆయన ప్రభుత్వానికి తెలియదా? నీటి ప్రాజెక్టుల అంశం రాష్ట్రాల పరిధిలోనిదు కావచ్చు, జాతీయ నదులపై జాతీయ ప్రాజెక్టులను చేపట్టవచ్చుగదా! వాజపేయి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు రూపుదిద్దుకున్న నదుల అనుసంధానం ప్రణాళిక నేడేమయింది, గంగలో కలిసిందా?