దేశంలోని 20కిపైగా రాష్ట్రాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. అలాగే చలి తీవ్రత కూడా మరింతగా పెరిగింది. జమ్మూకశ్మీర్, లడఖ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్, మేఘాలయ మణిపూర్ సహా 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో దట్టమైన పొగమంచు వ్యాపించింది. ఈ సీజన్‌లో ఢిల్లీలో సోమవారం అత్యంత చలి వాతావరణం ఏర్పడింది. కనిష్ట ఉష్ణోగ్రత 5.3 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది.
దట్టమైన పొగమంచు కారణంగా దేశవ్యాప్తంగా రైలు, విమాన సర్వీసులు దెబ్బతిన్నాయి. ఒక్క ఢిల్లీలోనే పొగమంచు కారణంగా 80 రైళ్ల రాకపోకల వేళలు దెబ్బతిన్నాయి. బెంగళూరు-నిజాముద్దీన్, భువనేశ్వర్-న్యూఢిల్లీ రాజధాని, కాన్పూర్-న్యూఢిల్లీ శ్రమశక్తి, ప్రయాగ్‌రాజ్-న్యూఢిల్లీ ఎక్స్‌ప్రెస్, అమృత్‌సర్-ముంబై ఎక్స్‌ప్రెస్ తదితర రైళ్లు గంట నుంచి ఆరు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
మరోవైపు విమానాల రాకపోకలపై కూడా పొగమంచు ప్రభావం కనిపిస్తోంది. టేకాఫ్ లాండింగ్‌లలో 15 నుంచి 30 నిమిషాలు ఆలస్యం జరుగుతోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా జమ్మూ పర్యటన కూడా ప్రతికూల వాతావరణం కారణంగా రద్దయ్యింది.
ఇదిలా ఉంటే ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లలో మంగళవారం వర్షం కురిసే అవకాశం ఉందని న్యూఢిల్లీలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. జనవరి 14 ఉదయం వరకు ఢిల్లీలో తేలికపాటి నుంచి మోస్తరు పొగమంచు ఉండే అవకాశం ఉంది. అయితే జనవరి 11 నాటికి గరిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీలకు, కనిష్ట ఉష్ణోగ్రత ఎనిమిది డిగ్రీలకు పెరగవచ్చు. ఆ తర్వాత కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది. జనవరి 14 నాటికి రెండు డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment