
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో చలి మరింతగా పెరిగింది. దట్టమైన పొగమంచు కూడా కమ్ముకుంటోంది. జమ్మూ కాశ్మీర్ నుండి బీహార్, పంజాబ్ వరకు, హర్యానా నుండి తూర్పు ఉత్తరప్రదేశ్ వరకు చలి తీవ్రత మరింతగా పెరిగింది.
హిమాచల్‌లోని కుకుమ్‌సేరిలో ఉష్ణోగ్రతలు మైనస్ 7.5 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. పహల్గామ్‌లో మైనస్ 6.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పర్వతప్రాంతాల్లో కురుస్తున్న హిమపాతం కారణంగా, దేశ రాజధాని, దాని పరిసర ప్రాంతాలలో మంగళవారం రోజంతా చలిగాలులు కొనసాగాయి. ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 8.3 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. ఇది సాధారణం కంటే ఒక డిగ్రీ ఎక్కువ. ఉత్తర భారతదేశంలో పొగమంచు ట్రాఫిక్‌కు ఇబ్బందికరంగా మారింది.
జనవరి 5 నుంచి 11వ తేదీ వరకూ రాత్రి ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ (ఐఎండీ) డాక్టర్ మృత్యుంజయ్ మహపాత్ర తెలిపారు. దీని ప్రభావంతో మధ్య భారతదేశంలో చలిగాలుల పరిస్థితి తీవ్రంగా మారవచ్చు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని ఉత్తర భాగం, ఉత్తరప్రదేశ్‌లోని దక్షిణ భాగంలో పగటి ఉష్ణోగ్రతలు కూడా దిగజారే అవకాశాలున్నాయి.
ఎత్తయిన పర్వత శిఖరాలపై మంచు కురుస్తుండటంతో కాశ్మీర్ లోయ తీవ్రమైన చలిలో చిక్కుకుంది. జమ్మూ కాశ్మీర్‌లో పొగమంచు కారణంగా రైలు, విమాన సర్వీసులు దెబ్బతింటున్నాయి. శ్రీనగర్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం జనవరి 4, 5 తేదీలలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలతో పాటు మంచు కురిసే అవకాశం ఉంది. జనవరి 8న కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉండనున్నాయి.