ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మరికొద్ది గంటల్లో చార్‌ధామ్ యాత్ర ప్రారంభం కానున్న నేపధ్యంలో ఈ వర్షాలు స్థానికులను, భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నారు. చార్‌ధామ్ యాత్ర మే 10 నుండి ప్రారంభంకానుంది. ఈ యాత్ర చేసేందుకు లక్షలాది మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. కొందరు భక్తులు ఇప్పటికే ఉత్తరాఖండ్ చేరుకున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు చోట్ల భారీ వర్షాలకు తోడు వడగళ్ల వానలు కురుస్తున్నాయి. అల్మోరా-సోమేశ్వర్ ప్రాంతంలో పిడుగులు పడుతున్నాయి. అల్మోరా-కౌసాని హైవేపై కొండచరియలు విరిగిపడటంతో గత 12 గంటలుగా ఈ రహదారిని మూసివేశారు. మారుతున్న వాతావరణం కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.
ఉత్తరాఖండ్‌లోని అల్మోరాతో పాటు, బాగేశ్వర్‌లో ఆకాశం మేఘావృతమైంది. ఉత్తరకాశీలోని పురోలాలో భారీ వడగళ్ల వాన కురిసింది. భారీ వర్షాల కారణంగా పలుచోట్ల వరద ముప్పు ఏర్పడింది. మే 13 వరకు ఉత్తరాఖండ్‌లోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ అంచనా వేసింది. ఇటువంటి వర్షాల సమయంలో ట్రెక్కింగ్ చేయవద్దని టూరిస్టులకు వాతావరణశాఖ తెలిపింది. తాజాగా ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి రుతుపవన విపత్తుల నివారణ, చార్‌ధామ్ యాత్ర నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment