Char Dham Yatra
-
చార్ధామ్ యాత్ర.. ముగింపు తేదీలివే
డెహ్రాడూన్: దేవభూమి ఉత్తరాఖండ్‌లో చార్ధామ్ యాత్ర కొనసాగుతోంది. తాజాగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం నాలుగు ధామ్‌ల మూసివేత తేదీలను ప్రకటించింది. ఉత్తరాఖండ్ టూరిజం మంత్రి సత్పాల్ మహరాజ్ తెలిపిన వివరాల ప్రకారం నవంబర్‌లో చార్ధామ్ తలుపులు మూసివేయనున్నారు.సత్పాల్ మహరాజ్ మీడియాతో మాట్లాడుతూ నవంబర్ ఒకటిన గంగోత్రి ధామ్ తలుపులు మూసేస్తామని, యమునోత్రి ధామ్, కేదార్నాథ్ ధామ్ తలుపులు నవంబర్ మూడున మూసివేయనున్నామన్నారు. అలాగే తుంగనాథ్ ధామ్ తలుపులు నవంబర్ నాలుగున మూసివేయనున్నామని, నవంబర్ 17న బద్రీనాథ్ ధామ్ తలుపులు మూసివేయనున్నామన్నారు. ఈ నాలుగు ధామాలను సందర్శించాలనుకునే భక్తులు ఈ తేదీలలోపునే రావాలని సత్పాల్ మహరాజ్ కోరారు.ఈ ఏడాది మే 10 నుంచి చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది. అయితే ఇటీవల కేదార్నాథ్, బద్రీనాథ్‌లకు వెళ్లే మార్గాల్లో వర్షం విధ్వంసం సృష్టించింది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. చార్ధామ్ యాత్ర ప్రతి సంవత్సరం ఏప్రిల్-మేలో ప్రారంభమవుతుంది. ఇది అక్టోబర్-నవంబర్ వరకు కొనసాగుతుంది. చార్ధామ్ యాత్రకు వెళ్లాలంటే బయోమెట్రిక్ నమోదు తప్పనిసరి.ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు చార్ధామ్ దర్శనానికి 37 లక్షల 91 వేల 205 మంది యాత్రికులు రాగా, గత ఏడాది 56.13 లక్షల మంది యాత్రికులు దర్శనానికి వచ్చారు. ఈ సంఖ్య 2022లో 46.29 లక్షలు కాగా 2019లో 34.77 లక్షలు. 2020, 2021లలో కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా చార్ధామ్ యాత్ర అంతంత మాత్రంగానే సాగింది. ఇది కూడా చదవండి: పుష్కర కాలానికి పూచే నీలకురంజి పుష్పం..! -
చార్ధామ్ యాత్రలో సరికొత్త రికార్డులు
డెహ్రాడూన్: ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో కొనసాగుతున్న చార్ధామ్ యాత్ర సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. మే 10న ఈ యాత్ర ప్రారంభం కాగా, గడచిన 50 రోజుల్లో 30 లక్షల మంది చార్‌ధామ్‌ను సందర్శించుకున్నారు. గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్ ఆలయాలను మే 10న తెరిచారు. మే 12న బద్రీనాథ్ తలుపులు తెరిచారు.గత ఏడాది ఏప్రిల్ 22న చార్ధామ్ యాత్ర ప్రారంభం కాగా 2023, జూన్ 30 నాటికి 30 లక్షల మంది నాలుగు ధామాలను దర్శించుకున్నారు. అయితే ఈసారి 50 రోజుల వ్యవధిలోనే 30 లక్షల మంది చార్‌ధామ్‌ను దర్శించుకున్నారు. చార్ధామ్లలో ఇప్పటివరకూ అత్యధిక సంఖ్యలో భక్తులు కేదార్‌నాథ్‌ను దర్శించుకున్నారు. 10 లక్షల ఆరు వేలమంది కేదార్‌నాథ్‌ను దర్శించుకున్నారు. బద్రీనాథ్‌ను ఎనిమిది లక్షల 20వేల మంది దర్శించుకున్నారు.గంగోత్రిని ఇప్పటివరకూ నాలుగు లక్షల 98వేల మంది దర్శించుకున్నారు. అలాగే యమునోత్రిని నాలుగు లక్షల 70 వేల మంది సందర్శించుకున్నారు. 2023లో చార్‌ధామ్‌ను 56 లక్షల మంది భక్తులు సందర్శించుకున్నారు. ఈసారి ఆ రికార్డులు దాటవచ్చనే అంచనాలున్నాయి. -
చార్ధామ్ యాత్ర: 15 రోజుల్లో రూ. 200 కోట్ల వ్యాపారం
చార్ధామ్ యాత్రకు తరలివస్తున్న భక్తులు గత సీజన్‌తో పోలిస్తే అధికంగా ఉన్నారు. దీంతో హోటళ్లు, దాబాలు, ట్రావెల్స్‌కు సంబంధించిన వ్యాపారులు గడచిన 15 రోజుల్లో మంచి వ్యాపారం సాగించారు. ఇప్పటి వరకు చార్ధామ్ యాత్ర కారణంగా రూ.200 కోట్లకు పైగా టర్నోవర్ జరిగినట్లు అంచనా. భక్తుల సంఖ్య ఇప్పటికే 10 లక్షలు దాటిందని సమాచారం.డైరెక్టర్ జనరల్ ఇన్ఫర్మేషన్ బన్షీధర్ తివారీ మీడియాతో మాట్లాడుతూ ఈసారి చార్ధామ్ యాత్రకు రికార్డు స్థాయిలో యాత్రికులు తరలివస్తున్నారు. దీంతో ధామ్‌లలో ఒత్తిడి పెరిగినా వ్యాపారులకు మంచి లాభాలు వచ్చాయన్నారు. చార్ధామ్ హోటల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ పూరి తెలిపిన వివరాల ప్రకారం గంగోత్రి వ్యాలీలో 400, యమునోత్రి వ్యాలీలో 300 హోటళ్లు, హోమ్ స్టేలు, ధర్మశాలలు ఉన్నాయి. శ్రీనగర్ నుంచి బద్రీనాథ్, రుద్రప్రయాగ్ నుంచి కేదార్నాథ్ మధ్య 850 హోటళ్లు, హోమ్ స్టేలు, ధర్మశాలలు ఉన్నాయి.గత ఏడాది ఏప్రిల్ 22న సీజన్ ప్రారంభమైనప్పుడు మొదట్లో తక్కువ మంది యాత్రికులు వచ్చారు. అయితే ఈసారి సీజన్ ఆలస్యంగా ప్రారంభమవడంతో రద్దీ మూడు రెట్లు ఎక్కువగా ఉంది. చార్‌ధామ్‌లో గత 15 రోజుల్లో హోటళ్లు, దాబాలు, హోమ్‌స్టేల ద్వారా దాదాపు రూ.80 కోట్లు, దుకాణదారుల నుంచి రూ.20 కోట్లు, గైడ్ల ద్వారా రూ.30 కోట్లు, ప్రయాణాల ద్వారా రూ.40 కోట్లు, రూ.30 కోట్ల ఆదాయం వచ్చినట్లు అంచనా. కాగా చార్‌ధామ్‌లో యాత్ర నిర్వహణ కోసం ప్రభుత్వం కొత్తగా ఇద్దరు యాత్రా మేజిస్ట్రేట్లను నియమించింది. ఈ మేజిస్ట్రేట్లు మే 26 నుంచి జూన్ 6 వరకు విధులు నిర్వహించనున్నారు. -
చార్‌ధామ్‌లో భక్తుల నిలువు దోపిడీ
ఉత్తరాఖండ్‌లో చార్ధామ్ యాత్ర కొనసాగుతోంది. రోజూ వేల సంఖ్యలో భక్తులు యాత్రలో పాల్గొంటున్నారు. తాజాగా సోషల్ మీడియాలో కేదార్నాథ్ యాత్రలో వ్యాపారుల నిలువు దోపిడీకి సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. మరోవైపు కేదార్నాథ్ మార్గంలో ట్రాఫిక్ జామ్ పెద్ద సమస్యగా పరిణమించింది.వైరల్ అయిన ఆ వీడియోలో ఓ వ్యక్తి కేదార్‌నాథ్‌లోని ఆహార పదార్థాల ధరలను తెలియజేశాడు. సాధారణంగా పర్వత ప్రాంతాల్లో వివిధ వస్తువులు, ఆహార పదార్థాల ధరలు అధికంగానే ఉంటాయి. అయితే చార్ధామ్ యాత్ర సందర్భంగా ఆహార పదార్థాల ధరలను అమాంతం పెంచేయడం భక్తులకు భారంగా మారింది. సాధారణ రోజులలో రూ. 10కి దొరికే టీ రూ. 30కి, రూ. 20కి లభించే వాటర్ బాటిల్ రూ. 100కు విక్రయిస్తున్నారు. అలాగే కాఫీ ధరను రూ. 50కి పెంచేశారు. శీతల పానీయాల ధరలను కూడా విపరీతంగా పెంచారు. ఇతర ఆహార పదార్థాల ధరలను కూడా రెట్టింపు చేశారు.ఈ వీడియోలో వ్యాపారులను వివిధ వస్తువుల ధరలను అడిగిన ఆ వ్యక్తి వాటి ధరలు ఎందుకు పెరిగాయో కూడా తెలిపాడు. ఆయా వస్తువులను కింది నుంచి పైకి తీసుకువచ్చేందుకు రవాణా ఖర్చులు అధికమవుతున్నాయని తెలిపాడు. అయితే వైష్ణోదేవి యాత్రలో ఇంత భారీ ఖర్చులు ఉండవని కూడా పేర్కొన్నాడు. -
Badrinath Temple Photos: జీవితంలో ఒక్కసారైనా వెళ్లాల్సిన ఆధ్యాత్మిక యాత్ర (ఫొటోలు)
-
మరికొద్ది గంటల్లో చార్ధామ్ యాత్ర.. ఇంతలోనే భారీ వర్షాలు!
ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మరికొద్ది గంటల్లో చార్ధామ్ యాత్ర ప్రారంభం కానున్న నేపధ్యంలో ఈ వర్షాలు స్థానికులను, భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నారు. చార్ధామ్ యాత్ర మే 10 నుండి ప్రారంభంకానుంది. ఈ యాత్ర చేసేందుకు లక్షలాది మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. కొందరు భక్తులు ఇప్పటికే ఉత్తరాఖండ్ చేరుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు చోట్ల భారీ వర్షాలకు తోడు వడగళ్ల వానలు కురుస్తున్నాయి. అల్మోరా-సోమేశ్వర్ ప్రాంతంలో పిడుగులు పడుతున్నాయి. అల్మోరా-కౌసాని హైవేపై కొండచరియలు విరిగిపడటంతో గత 12 గంటలుగా ఈ రహదారిని మూసివేశారు. మారుతున్న వాతావరణం కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.ఉత్తరాఖండ్‌లోని అల్మోరాతో పాటు, బాగేశ్వర్‌లో ఆకాశం మేఘావృతమైంది. ఉత్తరకాశీలోని పురోలాలో భారీ వడగళ్ల వాన కురిసింది. భారీ వర్షాల కారణంగా పలుచోట్ల వరద ముప్పు ఏర్పడింది. మే 13 వరకు ఉత్తరాఖండ్‌లోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ అంచనా వేసింది. ఇటువంటి వర్షాల సమయంలో ట్రెక్కింగ్ చేయవద్దని టూరిస్టులకు వాతావరణశాఖ తెలిపింది. తాజాగా ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి రుతుపవన విపత్తుల నివారణ, చార్ధామ్ యాత్ర నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. -
సొంత వాహనంలో చార్ధామ్ యాత్ర.. విధివిధానాలివే!
మే 10 నుంచి చార్ధామ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపధ్యంలో యాత్రసాగించే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం పలు ఏర్పాట్లు చేస్తోంది. రవాణా శాఖ కూడా ప్రయాణికులకు పలు మార్గదర్శకాలు జారీచేసింది. వీటి ప్రకారం గ్రీన్ కార్డ్ లేని వాహనాలను యాత్రా మార్గంలో అనుమతించరు. అలాగే వాహనాల్లో సంగీతాన్ని ప్లే చేయడంపై నిషేధం విధించారు. దీంతో పాటు వాహనాల్లో ప్రథమ చికిత్స బాక్సు తప్పనిసరి చేశారు.తేలికపాటి వాహనాలకు గ్రీన్‌కార్డు రుసుముగా రూ.400, భారీ వాహనాలకు రూ.600గా నిర్ణయించారు. చార్ధామ్ యాత్రకు సంబంధించి గురువారం మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అన్ని శాఖల సన్నాహాలను ఉన్నతాధికారులు పరిశీలించనున్నారు. ఏప్రిల్ 10 నుంచి చార్ధామ్ యాత్రకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నాలుగు ధామ్‌లలో హెలికాప్టర్ సర్వీస్ కోసం బుకింగ్ కూడా కొనసాగుతోంది.ఈ ఏడాది చార్ధామ్ యాత్రపై భక్తుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. ఇప్పటి వరకు 16.37 లక్షల మంది ప్రయాణికులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. హోటళ్లను కూడా ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. ఈ పరిస్థితులను చూస్తుంటే ఈసారి చార్ధామ్ యాత్ర గత రికార్డులను బద్దలు కొడుతుందని రాష్ట్ర పర్యాటక, దేవాదాయ శాఖ మంత్రి సత్పాల్ మహరాజ్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని నాలుగు ధామ్‌లను దర్శించుకునేందుకు గత ఏడాది 56.31 లక్షల మంది భక్తులు వచ్చారని తెలిపారు. -
పెల్లుబికిన భక్తి ప్రవాహం.. చార్ధామ్ యాత్రలో భక్తుల రద్దీ!
హిందువులు చార్ధామ్ యాత్రను ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తారు. తమ జీవితంలో ఒక్కసారైనా చార్ధామ్ యాత్ర చేయాలనుకుంటారు. ప్రతి సంవత్సరం చార్ధామ్ యాత్రకు భక్తులు తరలివస్తుంటారు. చార్ధామ్ యాత్ర అంటే కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రిలను చుట్టిరావడం. ఈ చార్ధామ్ యాత్రతో పాటు ఇతర ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు కూడా 2023లో భక్తుల తాకిడి ఎదురయ్యింది. 2023లో ఏ ధామాన్ని సందర్శించడానికి ఎంత మంది భక్తులు వచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం. మీడియా దగ్గరున్న సమాచారం ప్రకారం ఈ సంవత్సరం 50 లక్షల మందికి పైగా భక్తులు చార్ధామ్ యాత్రచేశారు. 2021లో సుమారు 5 లక్షల 18 వేల మంది భక్తులు చార్ ధామ్ యాత్ర చేశారు. 2022లో ఈ సంఖ్య 46 లక్షల 27 వేలు దాటింది. 2023లో అక్టోబర్ 16 నాటికి ఈ సంఖ్య 50 లక్షలు దాటడం విశేషం. కేదార్నాథ్ ధామ్ ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ ధామ్ 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా పరిగణిస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడికి చేరుకోవడానికి హెలికాప్టర్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. 2023 లో 19 లక్షల 61 వేల మందికి పైగా భక్తులు కేదార్నాథ్ ధామ్‌కు తీర్థయాత్ర చేశారు. 2023లో కేదార్నాథ్ తలుపులు ఏప్రిల్ 25న తెరుచుకున్నాయి. ఈ యాత్ర నవంబర్ 15న ముగిసింది. బద్రీనాథ్ ధామ్ విష్ణు భక్తులు బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించడాన్ని ఒక వరంగా భావిస్తారు. ఈ సంవత్సరం బద్రీనాథ్ యాత్ర ఏప్రిల్ 27న ప్రారంభమై, నవంబర్ 15న ముగిసింది. ఈ ఏడాది బద్రీనాథ్‌కు వచ్చిన 18 లక్షల 34 వేల మందికి పైగా భక్తులు బద్రీ విశాల్ స్వామిని దర్శించుకున్నారు. గంగోత్రి ఈ ఏడాది 9 లక్షల 5 వేల మందికి పైగా భక్తులు గంగోత్రి యాత్రను పూర్తి చేసుకున్నారు. 2023లో గంగోత్రి యాత్ర ఏప్రిల్ 22 నుండి ప్రారంభమై, నవంబర్ 14న ముగిసింది. ప్రతి సంవత్సరం గంగోత్రి యాత్ర ప్రారంభం కాగానే గంగమ్మ దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు ఇక్కడికు తరలి వస్తుంటారు. యమునోత్రి ఈ ఏడాది యమునోత్రిని 7 లక్షల 35 వేల మందికి పైగా భక్తులు సందర్శించారు. యమునోత్రి యాత్ర 2023, ఏప్రిల్ 22న న ప్రారంభమై నవంబర్ 15న ముగిసింది. యమునోత్రిని యమునా దేవి నివాసంగా చెబుతారు. ఇక్కడ యమునా దేవి ఆలయం కూడా ఉంది. అమర్నాథ్ చార్ధామ్తో పాటు ఇతర యాత్రా స్థలాల విషయానికి వస్తే 2023లో దాదాపు 4 లక్షల 40 వేల మంది భక్తులు అమర్నాథ్ను దర్శించుకున్నారు. ఈ సంవత్సరం అమర్నాథ్ యాత్ర జూలై ఒకటి నుండి ప్రారంభమై ఆగస్టు 31న ముగిసింది. అమర్నాథ్ ప్రయాణం ఎంతో కష్టతరమైనప్పటికీ భక్తులు ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో ఇక్కడికి తరలివస్తుంటారు హేమకుండ్ సాహిబ్ యాత్ర హేమకుండ్ సాహిబ్ సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ సంవత్సరం హేమకుండ్ సాహిబ్ యాత్ర మే 20 నుంచి నుండి అక్టోబర్ 11 వరకు కొనసాగింది. ప్రతి సంవత్సరం హేమకుండ్ సాహిబ్ యాత్రకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. 2023లో దాదాపు 2 లక్షల మంది హేమకుండ్ సాహిబ్‌ను సందర్శించుకున్నారు. ఇది కూడా చదవండి: అలరిస్తున్న ఉల్లి, ఇసుకల శాంతాక్లాజ్ శిల్పం! -
తెరుచుకున్న కేదార్నాథ్ ఆలయ ద్వారాలు
-
చార్ధామ్ యాత్ర ప్రారంభం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తరకాశీ జిల్లాలోని గంగోత్రి, యమునోత్రి ఆలయాలు ఆరు నెలల అనంతరం తిరిగి తెరుచుకోవడంతో చార్ధామ్ యాత్ర మొదలైంది. గంగోత్రి ఆలయ తలుపులను శనివారం మధ్యాహ్నం 12.35 గంటలకు, యమునోత్రి గుడిని 12.41 గంటలకు ఆలయ కమిటీ సభ్యులు తెరిచారు. ఈ సందర్భంగా గంగోత్రి ఆలయంలో, యమునా దేవత శీతాకాల నివాసమైన ఖర్సాలీలో కూడా ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి పూజలు చేశారు. అనంతరం యమునా దేవిని అందంగా అలంకరించిన పల్లకీలో ఊరేగింపుగా యమునోత్రికి తీసుకువచ్చారు. చార్ధామ్ యాత్రకు ఇప్పటికే 16 లక్షల మంది యాత్రికులు పేర్లను నమోదు చేసుకున్నారు. ఈనెల 25న కేదార్నాథ్, 27న బదరీనాథ్ ఆలయాలు తిరిగి తెరుచుకోనున్నాయి. హిమాలయాల్లోని ఈ నాలుగు పుణ్యక్షేత్రాల్లో రోజువారీ భక్తుల సందర్శనపై పరిమితం విధించాలన్న ప్రతిపాదనను విరమించుకున్నట్లు సీఎం ధామి ప్రకటించారు. -
లోయలో పడ్డ బస్సు, 22 మంది మృతి.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ఆదివారం సాయంత్రం ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. గంగోత్రి-యమునోత్రి జాతీయ రహదారిపై వెళ్తున్న చార్ధామ్ యాత్రికుల బస్సు దమ్టా వద్ద లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 22 యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ఉన్నట్టుగా తెలిసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన చార్ధామ్ యాత్రికులు యమునోత్రి వెళ్తుండగా బస్సు ప్రమాదానికి గురైంది. చదవండి👉🏻 వివాదాస్పద వ్యాఖ్యలు.. నూపుర్ శర్మను సస్పెండ్ చేసిన బీజేపీ ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. The Prime Minister has announced an ex-gratia of Rs. 2 lakh each from PMNRF for the next of kin of those who lost their lives in the accident in Uttarakhand. The injured would be given Rs. 50,000 each. — PMO India (@PMOIndia) June 5, 2022 -
చార్ధామ్ యాత్ర: భక్తులకు వార్నింగ్.. 2013ను గుర్తు తెచ్చుకోండి
హిందువులు అత్యంత పవిత్రంగా భావించే చార్ధామ్ యాత్రకు భారీ సంఖ్యలో భక్తులు తరలివెళ్లారు. ఈ యాత్రను భారతీయలు ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు. ఈ యాత్ర కోసం భక్తులు ఎంతో ఖర్చు చేసి అక్కడి వెళ్తుంటారు. ఆ ప్రాంతానికి అంతటి ప్రాముఖ్యత ఉంది. కానీ, భక్తులు ఇవ్వన్నీ మరచి.. అక్కడి వాతావరణాన్ని, చుట్టుపక్కల ప్రాంతాలను కలుషితం చేస్తున్నారు. ఈ ఏడాది చార్ధామ్ యాత్రకు వెళ్లిన భక్తుల్లో కొందరు అక్కడి నియమాలను ఏమాత్రం పాటించడం లేదు. ప్లాస్టిట్స్ బాటిల్స్, ప్లాస్టిక్ బ్యాగులు, చెత్తా చెదారం అన్నీ అక్కడే పడేసి వచ్చేస్తున్నారని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడి ప్రాంతాన్ని చెత్త కుండీలా మార్చేశారు. ఈ విషయాన్ని జాతీయ మీడియా సంస్థలు గుర్తించి ఫొటోలను షేర్ చేశాయి. ఈ క్రమంలో యాత్రికుల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపాయి. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ప్లాస్టిక్ కారణంగా పవిత్ర పుణ్యక్షేత్రం, అక్కడి వాతావరణం విపరీతంగా దెబ్బతిని పోతోందని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చార్ధామ్ లాంటి సున్నిత ప్రాంతాల్లో ప్లాస్టిక్ కారణంగా లేనిపోని సమస్యలు తెచ్చుకోవద్దని పర్యావరణవేత్తలు హితవు పలుకుతున్నారు. అది జీవావరణానికే పెద్ద ప్రమాదమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉత్తరాఖండ్‌లో 2013 నాటి ఉపద్రవాన్ని ఒక్కసారి అందరూ గుర్తుకు తెచ్చుకోవాలని హెచ్చరిస్తున్నారు. దేవుడిని కేవలం గర్భగుడిలోనే చూడటం కాదు.. ప్రకృతిలోనూ దైవత్వాన్ని చూడాలని కోరుతున్నారు. Uttarakhand | Heaps of plastic waste & garbage pile up on the stretch leading to Kedarnath as devotees throng for Char Dham Yatra pic.twitter.com/l6th87mxD9 — ANI UP/Uttarakhand (@ANINewsUP) May 22, 2022 ఇది కూడా చదవండి: యమునోత్రిలో కూలిన రహదారి భద్రత గోడ.. నిలిచిపోయిన 10 వేల మంది యాత్రికులు.. -
నవాబ్ చేసిన తప్పేంటి? ఎందుకీ డ్రామా?
మహాభారత స్వర్గారోహణ పర్వంలో.. యుధిష్ఠిరుడు(ధర్మరాజు) వెంట మేరు పర్వతం శిఖరాగ్రానికి చేరుకుంటుంది ఓ శునకం. అయితే ఇంద్రుడు మాత్రం శునకం అపవిత్రమైందని దాని ప్రవేశానికి అడ్డుపడతాడు. విశ్వాసానికి మారుపేరు.. పైగా ఎలాంటి లాభాపేలేకుండా నిస్వార్థంతో తన వెంట నడిచిన శునకానికి అనుమతి ఇవ్వాలంటూ ధర్మరాజు వేడుకుంటాడు. ఆపై ఆ శునకం యమధర్మరాజు పెట్టిన పరీక్షగా తేలడం.. చివరకు ధర్మమే నెగ్గుతుందని చెప్పడంతో ఆ ఘట్టం ముగుస్తుంది. ఇప్పుడు ఈ సందర్భం ఇప్పుడు ఎందుకు అంటారా?.. కేధార్నాథ్ యాత్రలో ఓ ఘటన ఇప్పుడు ఇంటర్నెట్ దృష్టిని ఆకట్టుకుంటోంది. అదే సమయంలో అభ్యంతరాలు.. ప్రతి విమర్శలు దారి తీసింది అది. నవాబ్ అనే ఓ శునకం.. తన ఓనర్‌తో కలిసి కేదార్నాథ్ పుణ్యక్షేత్రంలో కలియ దిరగడమే ఇందుకు ప్రధాన కారణం. నోయిడాకు చెందిన వికాస్ త్యాగి(33) అనే వ్యక్తి.. ఎక్కడికి వెళ్లినా తన పెంపుడు కుక్క నవాబ్ వెంటపెట్టుకెళ్లడం అలవాటు. ఈ క్రమంలో చార్ధామ్ యాత్రకు వెళ్లిన వికాస్ కూడా నవాబ్‌ను తీసుకెళ్లాడు. View this post on Instagram A post shared by Nawab Tyagi Huskyindia0 (@huskyindia0) కేదార్నాథ్ పుణ్యక్షేత్రం నంది విగ్రహం దగ్గర దాని పాదాలను ఉంచి, నుదుట కుంకుమ కూడా పెట్టాడు. ఈ వీడియో కాస్త ఇన్స్టాగ్రామ్, ఇతర ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అయ్యింది. అయితే బద్రీనాథ్-కేదార్నాథ్ టెంపుల్ కమిటీ మాత్రం ఈ వీడియోపై మరోలా రియాక్ట్ అయ్యింది. సదరు భక్తుడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బుధవారం ఒక ఫిర్యాదు చేసింది. ఆ విజువల్స్ మతపరమైన మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ వాదించింది. అంతేకాదు ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయ్యింది. అయితే వికాస్ మాత్రం తన చర్యను సమర్థించుకుంటున్నాడు. గత నాలుగేళ్లలో నవాబ్ తనతో పాటు దేశంలో ఎన్నో గుడులు తిరిగాడని, అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయని, కానీ, ఇప్పుడు ఈ డ్రామాలు ఎందుకని ప్రశ్నిస్తున్నాడు. ఈ కుక్క కూడా దేవుడి సృష్టిలో భాగమనే అంటున్నాడు. View this post on Instagram A post shared by Nawab Tyagi Huskyindia0 (@huskyindia0) 20 కిలోమీటర్ల ట్రెక్కింగ్ తర్వాత ఆయాలనికి చేరుకున్నాం. దారి పొడువునా ఎంతో మంది భక్తులు.. నవాబ్‌ను దగ్గరికి తీసుకున్నారు. దానితో ఫొటోలు తీసుకున్నారు. ఆ భక్తగణానికి లేని అభ్యంతరం.. కమిటీ వాళ్లకే వచ్చిందా? అని ప్రశ్నిస్తున్నాడు వికాస్. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో వికాస్‌కే విపరీతమైన మద్దతు లభిస్తోంది. స్వర్గారోహణలో యుధిష్ఠిరుడు వికాస్ అయితే.. వెంట వెళ్లిన శునకం నవాబ్ అని పోలుస్తున్నారు. కడకు ధర్మమే నెగ్గుతుందని కామెంట్లు చేస్తున్నారు చాలామంది. చదవండి: అయ్యా ఎమ్మెల్యే సారూ అదేం పని.. వీడియో -
4 క్షేత్రాలు.. 40 కష్టాలు
చార్ధామ్ యాత్రలో భాగంగా యమునోత్రి, గంగోత్రి, కేదార్ నాథ్, బద్రీనాథ్ దర్శనాల కోసం భక్తులు పోటెత్తుతున్నారు. కరోనా కారణంగా రెండేళ్ల పాటు దర్శనాలు రద్దు కావడంతో ఇప్పుడు పుణ్య క్షేత్రాలను దర్శించుకుంటున్నారు. కొండదారుల్లో అత్యంత క్లిషమైన ప్రయాణం సాగించడమే కాకుండా మంచు, చలి, ప్రకృతి పరంగా అవరోధాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. మధ్యాహ్నం పూట కేవలం 5 డిగ్రీల ఉష్ఞొగ్రత, రాత్రిపూట మైనస్ డిగ్రీల ఉష్ఞొగ్రతలు నమోదు కావడంతో భక్తులకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. గత రెండు రోజులుగా 39 భక్తులు మృతి చెందడమే ఇందుకు ఉదాహరణ. ఈ పుణ్యక్షేత్రాల ప్రయాణంలో వసతి సౌకర్యాలు లేకపోతే ఆ కష్టాలు మరింత ఎక్కువ అవుతున్నాయి. సముద్ర మట్టానికి 3 కిలోమీటర్ల కంటే ఎత్తున క్షేత్రాలు ఉండటంతో తక్కువ స్థాయిలో ఆక్సిజన్ లభ్యమవుతుంది. దాంతో గతంలో కోవిడ్ వచ్చిన భక్తులు ఆకస్మికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ యాత్రలకు రోజూ 20వేల మంది పైగా భక్తులు వస్తుండటంతో ఏర్పాట్లకు క్లిష్టంగా మారింది. కొండలపై సౌకర్యం ఉన్నది కేవలం 5వేల మందికే కావడంతో భారీ సంఖ్యలో వస్తున్న భక్తులకు ఏర్పాట్లు చేయలేమంటున్నారు అధికారులు. అత్యంత క్లిషమైన ప్రయాణం కేదార్నాథ్ ఈ యాత్రల్లో కేదార్నాథ్ అత్యంత క్లిషమైంది. గౌరీఖుండ్ నుంచి కేదార్ నాథ్‌కు 18 కి.మీ ట్రెక్కింగ్ సౌకర్యం ఉన్నా, ట్రెక్కింగ్ సమయంలో హైబీపీ, గుండెపోటు సమస్యలు వస్తున్నాయి. పరిస్థితి తీవ్రం కావడంతో 132 మంది డాక్టర్లను ఉత్తరాఖాండ్ ప్రభుత్వం రంగంలోకి దించింది. అదే సమయంలో ముందస్తు ఏర్పాట్లు లేనిదే చార్ధామ్ యాత్రకు రావద్దని ప్రభుత్వం అంటోంది. సరిపడా అందుబాటులో లేని రవాణా సౌకర్యాలతో పాటు, హరిద్వార్-రుషికేష్ మధ్య వాహనాలు భారీగా నిలిచిపోవడం అధికార యంత్రాంగానికి సవాల్‌గా మారింది. రుద్ర ప్రయాగ నుంచి అన్ని రూట్లలో విపరీతమైన ట్రాఫిక్ జామ్ అవుతూ ఉండటంతో అధికారులకు తలనొప్పిగా మారింది. -
సిద్దిపేట వంట రుచి చార్ దామ్‌లో..
సాక్షి,సిద్దిపేట జోన్: ప్రపంచంలో అత్యంత పేరుగాంచిన తీర్థయాత్ర కేదార్నాథ్. ద్వాదశ జ్యోతిర్లింగాలలో చిట్ట చివరిది కేదార్నాథ్. హిమాలయాల్లో అత్యంత భయానక, సాహసోపేత యాత్రగా పేరొందిన కేదార్నాథ్ యాత్రికులకు అమృతం లాంటి దక్షిణాది రుచులను ఉచితంగా అందిస్తూ సేవాభావంతో పనిచేస్తున్న సమితి సిద్దిపేట ప్రాంతానికి చెందింది కావడం విశేషం. గతంలో అమర్నాథ్ యాత్రికులకు భోజన వసతి కల్పించిన స్పూర్తితో నేడు కేదార్నాథ్ యాత్రికులకు దక్షిణాది వంటకాలను అందుబాటులో తీసుకొచ్చారు. దేశ చరిత్రలోనే కేదార్‌నాథ్‌లో తొలి లంగర్ ఏర్పాటు చేసి, నిత్యం వేలాది మంది యాత్రికులకు ఉచితంగా భోజనం అందిస్తూ అందరి మన్నలను పొందుతోంది కేదార్నాథ్ అన్నదాన సేవా సమితి. సిద్దిపేట ప్రాంత వాసులతో ఏర్పాటై ఎన్నో రాష్ట్రాల సరిహద్దులు దాటి అందిస్తున్న సేవలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సరిగ్గా 11 ఏళ్ల క్రితం అమర్నాథ్ యాత్రికులకు లంగర్ ఏర్పాటు చేసి అక్కడ దక్షిణాది యాత్రికులకు భోజనం అందించి అమర్నాథ్ సేవా సమితి దేశ వ్యాప్తంగా అందరి మన్నలను పొందింది. ఇదే స్పూర్తితో సిద్దిపేటకు చెందిన చీకోటి మధుసూదన్, ఐత రత్నాకర్ అధ్యక్ష కార్యదర్శులుగా కేదార్నాథ్ అన్నదాన సేవా సమితి ఏర్పాటైంది. 2019లో తొలిసారిగా కేదార్నాథ్ యాత్రికుల కోసం సొన్ ప్రయాగ్ బేస్ క్యాంపు వద్ద తొలి లంగర్ ఏర్పాటు చేశారు. ఎంతో సహోసోపేతంగా సాగే కేదార్నాథ్ యాత్రకు వచ్చే యాత్రికులలో 70 శాతం దక్షిణాది వారే. వారికి అక్కడ సరైన భోజన వసతి లేక 2019 వరకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తినడానికి సరైన తిండి లేక యాత్రికులు పడుతున్న ఇబ్బందులు గుర్తించి తొలిసారిగా కేదార్నాథ్ యాత్రికుల కోసం లంగర్ ఏర్పాటు చేశారు. మే 4 తేదీ నుంచి జూన్ 15 వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. పది రోజులుగా సిద్దిపేటకు చెందిన కేదార్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో దక్షిణాది యాత్రికులకు భోజనాలు అందిస్తున్నారు. ఉదయం 7 నుంచి రాత్రి 11 గంటల వరకు లంగర్లో సేవలు అందుబాటులో ఉంటాయి. అక్కడ భోజనాలతోపాటు వసతి, హెల్ప్ సెంటర్ కూడా సేవా సమితి ఏర్పాటు చేసింది. దక్షిణాది రుచులు కేదార్నాథ్ యాత్రకు అత్యధికంగా దక్షిణాది ప్రాంత వాసులు వస్తుంటారు. వారికి ఉత్తరాఖండ్ రుచులు నచ్చవు. రోజుల కొద్ది యాత్రలో ఉండే యాత్రికులకు మన వంటకాలు కొంత ఊరట అందిస్తున్నాయి. ఉదయం టీ, అల్పాహారంగా ఇడ్లీ, చపాతి, వడ, ఉప్మా, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం సిద్దిపేట ప్రేమ్‌పూరీ, పానీపూరి, కట్లీస్, రాత్రి భోజనం ఉచితంగా అందిస్తున్నారు. నిత్యం మూడు నుంచి నాలుగు వేల మంది యాత్రికులకు అన్నదాన సేవా సమితి భోజనాలు అందిస్తూ సేవలందిస్తోంది. సిద్దిపేట ప్రాంతంలో విరాళాలు సేకరించి అవసరమైన సామగ్రి, పరికరాలను ముందుగానే లంగర్‌కు సరఫరా చేశారు. అన్నదానం మహాదానం అమర్నాథ్, కేదార్నాథ్, బద్రీనాథ్ యాత్రలకు వెళ్లే వారికి అక్కడ సరైన భోజన వసతి ఉండదు. పదేళ్ల క్రితం సిద్దిపేట తొలిసారిగా అమర్నాథ్ అన్నదాన సేవా సమితి పేరిట యాత్రికులకు భోజనాలు అందించాం. అదే స్పూర్తితో ఇప్పుడు తొలిసారిగా కేదార్నాథ్ యాత్రికులకు లంగర్ ఏర్పాటు చేశాం. అన్నదానం మహాదానం. నిత్యం వేలాది మంది యాత్రికులకు దక్షిణాది రుచులతో కూడిన వంటకాలు అందిస్తున్నాం. – చికోటిమధుసూదన్, అధ్యక్షుడు, అన్నదాన సేవా సమితి దక్షిణాది రుచులు కరువు హిమాలయాల్లో కేదార్నాథ్ యాత్రలు చేసే వారిలో 70 శాతం దక్షిణాది వారే ఉంటారు. వారికి ఉత్తారాది వంట రుచులు నచ్చవు. మన వంటలు అందుబాటులోకి తెచ్చి ఉచితంగా అందించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొట్ట మొదటి లంగర్ సిద్దిపేట ప్రాంత సేవా సమితి ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. నిత్యం భోజనాలు అందిస్తున్నాం. యాత్రికులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. – రత్నాకర్, కార్యదర్శి, అన్నదాన సేవా సమితి చదవండి: ఒక్కటైన ప్రేమజంట.. దీని వెనక పెద్ద కథే నడిచింది! -
చార్ధామ్ దేవస్థానం బోర్డు రద్దు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో రెండేళ్ల క్రితం నుంచి విధులు నిర్వర్తిస్తున్న చార్ధామ్ దేవస్థానం బోర్డును రద్దుచేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చార్ధామ్ దేవస్థానం బోర్డు చట్టాన్ని ఉపసంహరిం చుకుంటున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మంగళవారం ప్రకటించారు. ఈ నిర్ణయంపై పూజారులు హర్షం వ్యక్తంచేశారు. మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ హయాంలో 2019లో ఈ బోర్డును ఏర్పాటుచేశారు. ప్రఖ్యాత ఆలయాలు కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రిసహా 51 ప్రముఖ ఆలయాల పాలనా వ్యవహారాలను ఈ బోర్డు చూసుకుంటోంది. అయితే తమ సంప్రదాయ హక్కులను ఈ బోర్డు ఉల్లంఘిస్తోందని, పూజారులు మొదట్నుంచీ బోర్డు ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో తాజాగా మనోహర్ కంత్ ధ్యాని నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీ ఈ సమస్యలపై అధ్యయనం చేసి నివేదికను సీఎం పుష్కర్ ధామికి ఆదివారం అందజేసింది. అన్ని సమస్యలను పరిగణనలోకి తీసుకుని, కమిటీ సిఫార్సుల మేరకు బోర్డును రద్దు చేస్తున్నట్లు సీఎం మంగళవారం చెప్పారు. ప్రభుత్వంపై ఒత్తిడి కారణంగానే ఇది సాధ్యమైందని పూజారులు సంతోషం వ్యక్తంచేశారు. ‘సాగు చట్టాల రద్దు తరహాలోనే ఈ సారీ బీజేపీ సర్కార్ దురహంకారం ఓడిపోయింది. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇది ముమ్మాటికీ పూజారుల విజయం’ అని ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ వ్యాఖ్యానించారు. -
చార్ ధామ్ యాత్ర: ప్రత్యేక పూజలు నిర్వహించిన సమంత
-
చార్ ధామ్ యాత్ర: ప్రత్యేక పూజలు నిర్వహించిన సామ్
Samantha Char Dham Yatra: సమంత చార్ధామ్ యాత్ర ముగిసింది. నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత బాగా కుంగిపోయిందని ఆమె సన్నిహితులు తెలిపారు. దీంతో ఆ బాధలోంచి బయటపడేందుకు ఇలా తీర్థయాత్రలకు వెళ్లినట్లు సమాచారం. విడాకుల ప్రకటనకు కొద్ది రోజుల ముందు కూడా సామ్ తిరుపతి, శ్రీకాశహస్తి దైవ దర్శనాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. చదవండి: సమంత పోస్టుకు కామెంట్ చేసిన వెంకటేశ్ కూతురు ఇక యమునోత్రి నుంచి మొదలైన చార్ధామ్ యాత్ర గంగోత్రి మీదుగా కేదార్నాథ్, బద్రీనాథ్ వరకు సాగింది. అక్కడి ఎన్నో విశేషాలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అక్కడ స్నేహితురాలు, ప్రముఖ డిజైనర్ శిల్పారెడ్డితో కలిసి సమంత ప్రత్యేక పూజలు నిర్వహించింది. అనంతరం గంగా ఆరతిలో పాలుపంచుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక చార్ ధామ్ యాత్ర అద్భుతంగా సాగిందని సామ్ పేర్కొంది. చదవండి: కృష్ణంరాజు పెద్ద మనసు.. పనిమనిషికి ఖరీదైన బహుమతి డబ్బుల కోసం ఇలాంటి పనులు చేస్తావా? హీరోయిన్‌పై ట్రోలింగ్ -
ముగిసిన సమంత చార్ ధామ్ యాత్ర..ఫోటోలు వైరల్
-
నేను అనుకున్నది నిజమైంది.. నా కల నెరవేరింది: సమంత
Samantha Char Dham Yatra: స్నేహితురాలితో కలిసి చార్ధామ్ యాత్రకు వెళ్లిన సమంత ట్రిప్ ముగిసింది. యమునోత్రి నుంచి మొదలైన యాత్ర గంగోత్రి మీదుగా కేదార్నాథ్, బద్రీనాథ్ వరకు సాగింది. 1968నాటి మహేశ్ యోగి ఆశ్రమానికి సైతం వెళ్లిన సమంత అక్కడి విశేషాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చదవండి: బెస్ట్‌ఫ్రెండ్‌తో కలిసి సమంత తీర్థయాత్రలు..ఫోటోలు వైరల్ ఇక చార్ధామ్ యాత్ర గురించి సమంత ఓ పోస్టును షేర్ చేస్తూ.. 'మహాభారతాన్ని చదివినప్పటి నుంచి ఈ భూమ్మీద స్వర్గదామమైన హిమాలయాలను సందర్శించాలని అనుకున్నాను. ఇప్పుడు నా కల నిజమైంది. నేను ఏది అయితే ఆశించానో అది జరిగింది. నా హృదయంలో హిమాలయాలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది' అని తెలిపింది. సామ్ పోస్టుకు వెంకటేశ్ కూతురు ఆశ్రిత సైతం స్పందించింది. బాలీవుడ్ నటి కంగనా కూడా వావ్ అంటూ కామెంట్ చేసింది. కాగా నాగ చైతన్యతో విడాకుల అనంతరం తీవ్ర మనోవేదనలో ఉన్న సమంత మానసిక ప్రశాంతత కోసం తీర్థయాత్రలను సందర్శిస్తున్నట్లు సమాచారం. గతాన్ని మర్చిపోయి త్వరలోనే బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో కెరీర్‌పై దృష్టి పెట్టాలని ప్లాన్ చేస్తుంది. సమా్ నటించిన శాకుంతలం, కాతువాకుల రెండు కాధల్ సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. చదవండి: యూట్యూబ్ ఛానల్స్‌పై సమంత కేసు.. తీర్పు వాయిదా 'నాట్యం' ఫేమ్ సంధ్యారాజు బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
చార్ధామ్ యాత్రకు కోర్టు బ్రేక్
సాక్షి, న్యూఢిల్లీ: జూలై 1వ తేదీ నుంచి ఉత్తరాఖండ్‌లోని మూడు జిల్లాల ప్రజల కోసం చార్ధామ్ యాత్రను పాక్షికంగా తెరవాలన్న రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయంపై ఉత్తరాఖండ్ హైకోర్టు స్టే విధించింది. కోవిడ్ మహమ్మారి మధ్య యాత్ర నిర్వహించడం వల్ల కలిగే నష్టాలకు సంబంధించి న్యాయవాదులు దుష్యంత్ మైనాలి, సచి్చదానంద్ దబ్రాల్, అను పంత్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సోమవారం ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ అలోక్ కుమార్ వర్మలతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాశ్, ఇతర ఉన్నతాధికారులు కోర్టులో హాజరయ్యారు. విచారణ సందర్భంగా కోవిడ్ మహమ్మారి మధ్య యాత్రికులు, పర్యాటకుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తపరిచారు. అంతేగాక దేవాలయాలలో లైవ్ స్ట్రీమింగ్ చేయడం, ఆచారాలు, సంప్రదాయాలకు విరుద్ధమని రాష్ట్ర ప్రభుత్వం చేసిన వాదన, అర్చకుల భావోద్వేగాలపై సానుభూతితో చేసినట్లుగా ప్రభుత్వ వాదన ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. కాగా చార్ధామ్ యాత్ర కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపీ) ను తిరస్కరిస్తూ, అవి కుంభమేళా సందర్భంగా జారీ చేసిన మార్గదర్శకాల నకలు కాపీ మాత్రమేనని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ ఎస్ఓపీలో హరిద్వార్ జిల్లాలో పోలీసుల మోహరింపు ప్రస్తావించారని, ఇది యాత్ర విషయంలో ప్రభుత్వం ఏమేరకు సీరియస్‌గా ఉందో చూపిస్తోందని కోర్టు తెలిపింది. చార్ధామ్ యాత్ర కుంభ్‌మేళా మాదిరిగా మరో ‘కోవిడ్ సూపర్ స్ప్రెడర్’గా మారకుండా ఉండేందుకు యాత్రను నిలిపివేయాలని కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అయితే దేవాలయాలతో ప్రజలకు ఉన్న మనోభావాలను పరిగణనలోకి తీసుకుని, ప్రస్తుతం గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ధామాల్లో కొనసాగుతున్న కార్యక్రమాలను ప్రజలు వీక్షించేలా ప్రత్యక్ష ప్రసార ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. ‘శాస్తాలు రాసినప్పుడు ముఖ్యమైన ఘటనలను ప్రసారం చేసేందుకు టెలివిజన్ వంటి సాంకేతిక పరిజ్ఞానం లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ వాదనను తప్పుబడుతూ కోర్టు వ్యాఖ్యానించింది. కేవలం కొంతమంది భావాలను పట్టించుకోకుండా, డెల్టా ప్లస్ వేరియంట్ నుంచి ప్రతి ఒక్కరినీ రక్షించడం చాలా ముఖ్యమని కోర్టు అభిప్రాయపడింది. గత సంవత్సరం కరోనా మొదటి వేవ్ సమయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం జూలై 1 నుంచి చార్ధామ్ యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈసారి కూడా, కరోనా రెండవ వేవ్ వేగం కాస్త మందగించడంతో చమోలి, రుద్రప్రయాగ్, ఉత్తర కాశీ జిల్లాల నివాసితుల కోసం పరిమితంగా చార్ధామ్ యాత్రను ప్రారంభించేందుకు ఈనెల 25న రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. చదవండి: Auli Bugyal: మంచు తివాచీ.. రెండు కళ్లు చాలవు! Vitamin C: తక్కువైతే తంటా.. ఎక్కువైతే మంట! -
తెరుచుకున్న కేదార్నాథ్ ఆలయం
డెహ్రడూన్ : ఆరు నెలల పాటు మంచుతో కప్పబడిన కేథర్నాథ్ ఆలయం బుధవారం ఉదయం 6:10 గంటలకు తిరిగి తెరుచుకుంది. ఏటా ఆలయాన్ని సందర్శించేందుకు లక్షలాది మంది భక్తజన సందోహం తరలివస్తారు. కానీ కరోనా కారణంగా ఈ సంవత్సరం భక్తులెవరినీ అనుమతించలేదు. తాత్కాలిక ఆలయం దర్శనం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆలయ ప్రధాన పూజారి సహా అతికొద్దిమంది సమక్షంలో ఉదయం విగ్రహాన్ని ఆలయానికి తీసుకువచ్చారు. ( ‘కేదార్‌నాథ్‌తో నాకు ప్రత్యేక అనుబంధం’ ) చార్ధామ్ యాత్రలో అతి ముఖ్యమైన డోలి యాత్రలో నిజానకి భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. కానీ ఈసారి ఆ సందడి లేదు. చార్ధామ్ యాత్రలో యమునోత్రి ఆలయంతో ప్రారంభించి వరుసగా గంగోత్రి, కేదార్నాథ్, బద్రినాథ్ ఆలయాలను దర్శించేందుకు ప్రతి సంవత్సరం దేశ, విదేశాల నుంచి లక్షల మంది భక్తులు యాత్రలో పాల్గొంటారు. కానీ ఈసారి భక్త జన కోలాహాలం లేకుండానే తంతు పూర్తిచేశారు ఆలయ అర్చకులు. ఐదుగురు పండితులు కేథర్నాథ్ ఆలయానికి పంచముఖీ స్వామిని పల్లకిలో తీసుకువచ్చారు. Uttarakhand: Portals of the Kedarnath temple were opened at 6:10 am today. 'Darshan' for the devotees is not allowed at the temple as of now. https://t.co/v4Cj8RQja9 pic.twitter.com/jn5vUBN42N — ANI (@ANI) April 29, 2020 అత్యంత మంచుతో నిండిన ప్రాంతం అయినప్పటికీ పండితులు చెప్పులు లేకుండానే యాత్ర కొనసాగించారు. సాధారణంగా హిందూ పంచాగం ప్రకారం తీర్థయాత్రలు తేదీలు ఫిబ్రవరిలో శివరాత్రి సందర్భంగా నిర్ణయిస్తారు. కానీ ఈ సంత్సరం కరోనా కట్టడి నేపథ్యంలో అన్ని తీర్థయాత్రలను రద్దు చేస్తూ నిర్ణయించారు. కొన్ని ప్రముఖ ఆలయాలకు అనుమతి ఉన్నా భక్తులను దర్శనానికి అనుమతించరు. -
కేధార్నాథ్కు పోటెత్తిన భక్తులు
ఉత్తరాఖండ్: ఆరు నెలల అనంతరం కేధార్నాథ్ ఆలయం గురువారం తెరుచుకుంది. దీంతో భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి దర్శనం కోసం తరలి వచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇప్పటికే ఉత్తరాఖండ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మరోవైపు రేపటి నుంచి బద్రీనాథ్ ఆలయ దర్శనం ప్రారంభం కానుంది. కాగా చార్ధామ్ యాత్రలో భాగంగా భక్తులు యమునోత్రి ఆలయంతో ప్రారంభించి వరుసగా గంగోత్రి, కేదార్నాథ్, బద్రినాథ్ ఆలయాలను దర్శిస్తారు. ప్రతి సంవత్సరం దేశ వ్యాప్తంగా లక్షల మంది భక్తులు యాత్రలో పాల్గొంటారు. భారీ హిమపాతం కారణంగా ఈ నాలుగు ఆలయాలను అక్టోబర్–నవంబర్ మాసాల్లో మూసివేసి మళ్లీ ఏప్రిల్– మే నెలల్లో తిరిగి తెరుస్తారు. ఇక అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం గంగోత్రి, యమునోత్రి ఆలయాలను తెరిచి ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు గంగ, యమునా దేవతల విగ్రహాలను ముకాభా, కర్సాలీ నుంచి తీసుకొచ్చి పునఃప్రతిష్టించారు. ఈ సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. -
చార్ ధాం యాత్ర : శ్రీకాకుళం వాసులు సురక్షితం
సాక్షి, ఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో మంచు తుపానులో చిక్కుకున్న శ్రీకాకుళం జిల్లా వాసులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. శ్రీకాకుళం, విశాఖ జిల్లాలకు చెందిన 66 మంది చార్ధామ్ యాత్రికులు మంగళవారం బద్రీనాథ్‌లో చిక్కుకుపోయారు. ఉదయం 7 గంటలకు బద్రీనాథ్ చేరుకోగా, ఎడతెరిపిలేని మంచు వర్షం కురిసిందని, దీంతో కొండ పైనే చిక్కుకుపోయామని యాత్రికుల బృందం తెలిపింది. చిమ్మచీకటిలో తాము మగ్గిపోయామని బాధిత యాత్రికులు తెలిపారు. తాము ప్రయాణించే బస్సు సైతం మంచులో కూరుకుపోయిందని పేర్కొన్నారు. మొత్తం 104 మంది యాత్రికులు ఏప్రిల్ 26న ఛార్‌ధామ్ యాత్రకు బయలుదేరి వెళ్లారు. చిక్కుకున్న జడ్పీ బృందం ఉత్తరాఖండ్ వెళ్లిన మరో 39 మందితో కూడిన జడ్పీటీసీలు, అధికారుల బృందం కూడా ఉత్తరాఖండ్‌లో చిక్కుకుపోయింది. శ్రీకాకుళం జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి నేతృత్వంలో వీరంతా ఉపాధి హామీ పనుల పరిశీలన నిమిత్తం వెళ్లారు. మంచు వర్షం కారణంగా వీరంతా సీతాపురంలో చిక్కకుపోయారు. వీరంతా ఈ నెల 3న బయల్దేరి వెళ్లారు. మంచు తుపాను వర్షం నుంచి బయటపడి, సీతాపురంలో సురక్షితంగా ఉన్నామని ధనలక్ష్మి పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ భవన్ అడిషనల్ కమిషనర్ అర్జా శ్రీకాంత్ ఎప్పటికప్పుడు సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించారు. -
చార్ధామ్ యాత్ర
జీవిత కాలంలో ఒక్కసారైనా వెళ్లితీరాలని కోరుకునే యాత్ర. వెళ్లే మార్గం సంక్లిష్టమైనదైనా ప్రకృతి సోయగాలలో ప్రశాంతతను పొందాలని ఆకాంక్షించే యాత్ర. హిమాలయ పర్వత శ్రేణులలో వెలసిన ఆరాధ్య దైవాలను దర్శించి, తరించాలని తపించే యాత్ర. అదే, అతిపవిత్రమైన చార్ ధామ్ యాత్ర. గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ ఈ నాలుగు పుణ్యక్షేత్రాలను ఒకేసారి సందర్శించుకొని రావటాన్ని ‘చార్ధామ్ యాత్ర’ అంటారు. సంవత్సరంలో ఆరు నెలల పాటు దేవతలు పూజిస్తారని పేరొందిన ఈ నాలుగు ఆలయాలను మిగిలిన ఆరు నెలల కాలంలో మానవులు సందర్శించుకోవచ్చు. ఎంతో మహిమాన్వితమైన ఈ ఆలయాల ద్వారాలు ప్రతి సంవత్సరం మే మొదటి వారంలో తెరుస్తారు. తిరిగి నవంబర్‌లో దీపావళి పర్వదినం తర్వాత మూసివేస్తారు. ఈ నాలుగు ఆలయాలూ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే ఉన్నాయి. గంగానది, యమునా నది జన్మస్థలాలను గంగోత్రి, యుమునోత్రి అంటారు. అలాగే బద్రీనాథ్‌లో శ్రీ మహావిష్ణువు, కేదార్‌నాథ్‌లో శివుడు స్వయంభువుగా వెలిసినట్టు పురాణాలు చెబుతున్నాయి. యమునోత్రి చార్ధామ్ యాత్రలో మొదటగా దర్శించుకునే ధామం (క్షేత్రం) యమునోత్రి. యమునానది జన్మస్థలంలోనే యమునాదేవి ఆలయం ఉంది. యమునానది ప్రాశస్త్యం గురించి ఒక్కో పురాణం ఒక్కో కథను వివరిస్తున్నాయి. ప్రముఖంగా చెప్పుకునేది – సూర్యదేవుడి అర్ధాంగి ఛాయాదేవి. వీరికి యముడు, యమున సంతానం. ఛాయాదేవికి కూతురైన యమున మీద ఒకానొక సమయంలో ఆగ్రహం కలిగి భూలోకంలో పడి ఉండమని శపించిందట. దాంతో యమున భూలోకంలో నదిగా అవతరించిందట. గంగోత్రి చార్ధామ్ యాత్రలో సులువుగా చేరుకోగలిగే ప్రాంతం గంగోత్రి. ఈ నది జన్మస్థలం ఉత్తరాఖండ్‌లోని ఉత్సర కాశీ జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం. సముద్రమట్టానికి 3,750 మీటర్ల ఎత్తులో హిమాలయ పర్వత శ్రేణులలో ఉంది. నదులన్నింటిలో గంగానది పరమపవిత్రమైనదిగా పూజలందుకుంటోంది. గోముఖం నుండి గంగోత్రి చేరే వరకు ఈ ప్రవాహంలోని నీటికి ఎక్కడా మానవ స్పర్శ అంటదు. అందువల్లే తమిళనాడు రామేశ్వరంలోని లింగేశ్వరస్వామికి నిత్యాభిషేకం గంగోత్రి నీటితోనే చేస్తారు. కేదార్నాథ్ అత్యున్నతమైన ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిది కేదార్నాథ్. వైశాఖమాసంలో అంటే ఏప్రిల్ ఆఖరి వారం లేదా మే నెల మొదటి వారంలో తెరుస్తారు. తిరిగి అక్టోబరు నెల ఆఖరి వారం లేదా నవంబరు మొదటి వారంలో మూసివేస్తారు. నరనారాయణులు కేదారనాథుని అనుమతి తీసుకొని, బదరీనాథ్‌లో తపస్సు చేశారని స్థలపురాణం చెప్తోంది. బద్రీనాథ్ జగద్గురు ఆదిశంకరుల వారు నెలకొల్పిన ఈ క్షేత్రంలో అన్ని తీర్థాలలోని సమస్త దేవతలూ నివసిస్తారనీ నమ్మకం. ఈ ఆలయంలో వైశాఖం నుండి కార్తీక మాసం వరకు మానవులు, మార్గశిరం నుండి చైత్రమాసం చివరి వరకు నారద మహర్షి స్వామికి పూజలు చేస్తారని కథనాలు. గర్భాలయంలో ఉత్సవమూర్తితో పాటు స్వామి ఎడమవైపున నరనారాయణులు శ్రీదేవి– భూదేవి, నారదుడు, ఉద్ధవుడు... కుడివైపున కుబేరుడు, గరుత్మంతుడు కొలువుదీరి ఉన్నారు. పితరులకు ఇక్కడ పిండ ప్రదానం చేస్తే వారికి మోక్షం సిద్ధిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. చార్ధామ్, అమర్నాథ్ యాత్రలో RVటూర్స్ – ట్రావెల్స్ తెలుగు రాష్ట్రాలలోనే పేరెన్నికగన్న RVటూర్స్ – ట్రావెల్స్ గత 15 ఏళ్లుగా కొన్ని వేలమందికి యాత్ర దర్శనాలను అందిస్తూ అనతి కాలంలోనే తెలుగువారి ఆత్మీయ ట్రావెల్స్‌గా పేరొందింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రత్యేక ప్యాకేజీలతో సకల సదుపాయాలతో అనుభవజ్ఞులైన టూర్ మేనేజర్లతో అద్భుతమైన చార్ధామ్, అమరనాథ్ యాత్రల దర్శన భాగ్యాన్ని కల్పిస్తోంది. చార్ధామ్ యాత్ర ఏప్రిల్ చివరి వారం, మే నెలలో ఉండగా అమర్నాథ్ యాత్ర జూన్ 14, జూన్ 30, జులై 5, 2017 తేదీలలో చేయవచ్చు. అనేక పవిత్ర పుణ్యక్షేత్రాలను దర్శింపజేసే తెలుగు వారి ఆత్మీయ ట్రావెల్స్ RV టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా మీరూ ఈ యాత్రలను చేయవచ్చు. మరింత సమాచారం కోసం RVటూర్స్ – ట్రావెల్స్ వారిని సంప్రదించగలరు.