డెహ్రాడూన్: దేవభూమి ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్ర కొనసాగుతోంది. తాజాగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం నాలుగు ధామ్‌ల మూసివేత తేదీలను ప్రకటించింది. ఉత్తరాఖండ్ టూరిజం మంత్రి సత్పాల్ మహరాజ్ తెలిపిన వివరాల ప్రకారం నవంబర్‌లో చార్‌ధామ్ తలుపులు మూసివేయనున్నారు.
సత్పాల్ మహరాజ్ మీడియాతో మాట్లాడుతూ నవంబర్ ఒకటిన గంగోత్రి ధామ్ తలుపులు మూసేస్తామని, యమునోత్రి ధామ్, కేదార్‌నాథ్ ధామ్ తలుపులు నవంబర్ మూడున మూసివేయనున్నామన్నారు. అలాగే తుంగనాథ్ ధామ్ తలుపులు నవంబర్ నాలుగున మూసివేయనున్నామని, నవంబర్ 17న బద్రీనాథ్ ధామ్ తలుపులు మూసివేయనున్నామన్నారు. ఈ నాలుగు ధామాలను సందర్శించాలనుకునే భక్తులు ఈ తేదీలలోపునే రావాలని సత్పాల్ మహరాజ్ కోరారు.
ఈ ఏడాది మే 10 నుంచి చార్‌ధామ్ యాత్ర ప్రారంభమైంది. అయితే ఇటీవల కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లకు వెళ్లే మార్గాల్లో వర్షం విధ్వంసం సృష్టించింది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. చార్‌ధామ్ యాత్ర ప్రతి సంవత్సరం ఏప్రిల్-మేలో ప్రారంభమవుతుంది. ఇది అక్టోబర్-నవంబర్ వరకు కొనసాగుతుంది. చార్‌ధామ్ యాత్రకు వెళ్లాలంటే బయోమెట్రిక్ నమోదు తప్పనిసరి.
ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు చార్‌ధామ్ దర్శనానికి 37 లక్షల 91 వేల 205 మంది యాత్రికులు రాగా, గత ఏడాది 56.13 లక్షల మంది యాత్రికులు దర్శనానికి వచ్చారు. ఈ సంఖ్య 2022లో 46.29 లక్షలు కాగా 2019లో 34.77 లక్షలు. 2020, 2021లలో కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా చార్‌ధామ్ యాత్ర అంతంత మాత్రంగానే సాగింది.
ఇది కూడా చదవండి: పుష్కర కాలానికి పూచే నీలకురంజి పుష్పం..!
Comments
Please login to add a commentAdd a comment