
ఉత్తరాఖండ్: ఆరు నెలల అనంతరం కేధార్‌నాథ్ ఆలయం గురువారం తెరుచుకుంది. దీంతో భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి దర్శనం కోసం తరలి వచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇప్పటికే ఉత్తరాఖండ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మరోవైపు రేపటి నుంచి బద్రీనాథ్ ఆలయ దర్శనం ప్రారంభం కానుంది.
కాగా చార్‌ధామ్ యాత్రలో భాగంగా భక్తులు యమునోత్రి ఆలయంతో ప్రారంభించి వరుసగా గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రినాథ్ ఆలయాలను దర్శిస్తారు. ప్రతి సంవత్సరం దేశ వ్యాప్తంగా లక్షల మంది భక్తులు యాత్రలో పాల్గొంటారు. భారీ హిమపాతం కారణంగా ఈ నాలుగు ఆలయాలను అక్టోబర్–నవంబర్ మాసాల్లో మూసివేసి మళ్లీ ఏప్రిల్– మే నెలల్లో తిరిగి తెరుస్తారు. ఇక అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం గంగోత్రి, యమునోత్రి ఆలయాలను తెరిచి ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు గంగ, యమునా దేవతల విగ్రహాలను ముకాభా, కర్సాలీ నుంచి తీసుకొచ్చి పునఃప్రతిష్టించారు. ఈ సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment