చార్‌ధామ్‌ యాత్రకు కోర్టు బ్రేక్‌  | Uttarakhand HC Ordered A Stay On State Cabinet Decision For Char Dham Yatra | Sakshi
Sakshi News home page

చార్‌ధామ్‌ యాత్రకు కోర్టు బ్రేక్‌ 

Published Tue, Jun 29 2021 7:38 AM | Last Updated on Tue, Jun 29 2021 7:42 AM

Uttarakhand HC Ordered A Stay On State Cabinet  Decision For Char Dham Yatra - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: జూలై 1వ తేదీ నుంచి ఉత్తరాఖండ్‌లోని మూడు జిల్లాల ప్రజల కోసం చార్‌ధామ్‌ యాత్రను పాక్షికంగా తెరవాలన్న రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయంపై ఉత్తరాఖండ్‌ హైకోర్టు స్టే విధించింది. కోవిడ్‌ మహమ్మారి మధ్య యాత్ర నిర్వహించడం వల్ల కలిగే నష్టాలకు సంబంధించి న్యాయవాదులు దుష్యంత్‌ మైనాలి, సచి్చదానంద్‌ దబ్రాల్, అను పంత్‌ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సోమవారం ప్రధాన న్యాయమూర్తి ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ అలోక్‌ కుమార్‌ వర్మలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ విచారించింది. విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాశ్‌, ఇతర ఉన్నతాధికారులు కోర్టులో హాజరయ్యారు. విచారణ సందర్భంగా కోవిడ్‌ మహమ్మారి మధ్య యాత్రికులు, పర్యాటకుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తపరిచారు. అంతేగాక దేవాలయాలలో లైవ్‌ స్ట్రీమింగ్‌ చేయడం, ఆచారాలు, సంప్రదాయాలకు విరుద్ధమని రాష్ట్ర ప్రభుత్వం చేసిన వాదన, అర్చకుల భావోద్వేగాలపై సానుభూతితో చేసినట్లుగా ప్రభుత్వ వాదన ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.

కాగా చార్‌ధామ్‌ యాత్ర కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌ (ఎస్‌ఓపీ) ను తిరస్కరిస్తూ, అవి కుంభమేళా సందర్భంగా జారీ చేసిన మార్గదర్శకాల నకలు కాపీ మాత్రమేనని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ ఎస్‌ఓపీలో హరిద్వార్‌ జిల్లాలో పోలీసుల మోహరింపు ప్రస్తావించారని, ఇది యాత్ర విషయంలో ప్రభుత్వం ఏమేరకు సీరియస్‌గా ఉందో చూపిస్తోందని కోర్టు తెలిపింది. చార్‌ధామ్‌ యాత్ర కుంభ్‌మేళా మాదిరిగా మరో ‘కోవిడ్‌ సూపర్‌ స్ప్రెడర్‌’గా మారకుండా ఉండేందుకు యాత్రను నిలిపివేయాలని కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అయితే దేవాలయాలతో ప్రజలకు ఉన్న మనోభావాలను పరిగణనలోకి తీసుకుని, ప్రస్తుతం గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌ ధామాల్లో కొనసాగుతున్న కార్యక్రమాలను ప్రజలు వీక్షించేలా ప్రత్యక్ష ప్రసార ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.

‘శాస్తాలు రాసినప్పుడు ముఖ్యమైన ఘటనలను ప్రసారం చేసేందుకు టెలివిజన్‌ వంటి సాంకేతిక పరిజ్ఞానం లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ వాదనను తప్పుబడుతూ కోర్టు వ్యాఖ్యానించింది. కేవలం కొంతమంది భావాలను పట్టించుకోకుండా, డెల్టా ప్లస్‌ వేరియంట్‌ నుంచి ప్రతి ఒక్కరినీ రక్షించడం చాలా ముఖ్యమని కోర్టు అభిప్రాయపడింది. గత సంవత్సరం కరోనా మొదటి వేవ్‌ సమయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం జూలై 1 నుంచి చార్‌ధామ్‌ యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈసారి కూడా, కరోనా రెండవ వేవ్‌ వేగం కాస్త మందగించడంతో చమోలి, రుద్రప్రయాగ్, ఉత్తర కాశీ జిల్లాల నివాసితుల కోసం పరిమితంగా చార్‌ధామ్‌ యాత్రను ప్రారంభించేందుకు ఈనెల 25న రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.

చదవండి:
Auli Bugyal: మంచు తివాచీ.. రెండు కళ్లు చాలవు!
Vitamin C: తక్కువైతే తంటా.. ఎక్కువైతే మంట!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement