డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో రెండేళ్ల క్రితం నుంచి విధులు నిర్వర్తిస్తున్న చార్‌ధామ్ దేవస్థానం బోర్డును రద్దుచేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చార్‌ధామ్ దేవస్థానం బోర్డు చట్టాన్ని ఉపసంహరిం చుకుంటున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మంగళవారం ప్రకటించారు. ఈ నిర్ణయంపై పూజారులు హర్షం వ్యక్తంచేశారు. మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ హయాంలో 2019లో ఈ బోర్డును ఏర్పాటుచేశారు.
ప్రఖ్యాత ఆలయాలు కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రిసహా 51 ప్రముఖ ఆలయాల పాలనా వ్యవహారాలను ఈ బోర్డు చూసుకుంటోంది. అయితే తమ సంప్రదాయ హక్కులను ఈ బోర్డు ఉల్లంఘిస్తోందని, పూజారులు మొదట్నుంచీ బోర్డు ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో తాజాగా మనోహర్ కంత్ ధ్యాని నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీ ఈ సమస్యలపై అధ్యయనం చేసి నివేదికను సీఎం పుష్కర్ ధామికి ఆదివారం అందజేసింది.
అన్ని సమస్యలను పరిగణనలోకి తీసుకుని, కమిటీ సిఫార్సుల మేరకు బోర్డును రద్దు చేస్తున్నట్లు సీఎం మంగళవారం చెప్పారు. ప్రభుత్వంపై ఒత్తిడి కారణంగానే ఇది సాధ్యమైందని పూజారులు సంతోషం వ్యక్తంచేశారు. ‘సాగు చట్టాల రద్దు తరహాలోనే ఈ సారీ బీజేపీ సర్కార్ దురహంకారం ఓడిపోయింది. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇది ముమ్మాటికీ పూజారుల విజయం’ అని ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ వ్యాఖ్యానించారు.
చార్‌ధామ్ దేవస్థానం బోర్డు రద్దు
Published Wed, Dec 1 2021 4:57 AM | Last Updated on Wed, Dec 1 2021 7:02 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment