సురక్షిత ప్రాంతాలకు 10 వేల మంది తరలింపు
రుద్రప్రయాగ్/సిమ్లా: ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో చిక్కుకుపోయిన తీర్థయాత్రికుల కోసం మూడు రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 10,500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కేదార్‌నాథ్, భింబలి, గౌరీకుండ్‌ల్లో చిక్కుకుపోయిన మరో 1,500 మందిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. వారంతా సురక్షితంగానే ఉన్నారని స్పష్టం చేసింది.
యాత్రికులను తరలించేందుకు వైమానిక దళం చినూక్, ఎంఐ–17 హెలికాప్టర్లను శుక్రవారం రంగంలోకి దించింది. పర్వత మార్గంలో కుండపోతగా కురిసిన వర్షాల కారణంగా పలువురు గల్లంతైనట్లు వస్తున్న వార్తలను అధికారులు ఖండించారు. శుక్రవారం లించోలిలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని యూపీలోని సహరాన్‌పూర్‌కు చెందిన శుభమ్ కశ్యప్‌గా గుర్తించారు. భారీ వర్షాల కారణంగా గౌరీకుండ్–కేదార్‌నాధ్ ట్రెక్కింగ్ మార్గంలో 25 మీటర్ల మేర రహదారి కొట్టుకుపోయింది. అడ్డంకులను తొలగించి, రహదారిని పునరుద్ధరించే వరకు వేచి ఉండాలని రుద్రప్రయాగ్ యంత్రాంగం యాత్రికులను కోరింది.
హిమాచల్‌లో ఆ 45 మంది కోసం గాలింపు
హిమాచల్ ప్రదేశ్‌లోని కులు, సిమ్లా, మండి జిల్లాల్లో వరద బీభత్సంలో గల్లంతైన 45 మంది కోసం గాలింపు కొనసాగుతోంది. మండి జిల్లా రాజ్‌బన్ గ్రామంలో రాతి కింద చిక్కుకున్న వ్యక్తిని గుర్తించారు. కులు జిల్లా సమెజ్ గ్రామంలో గల్లంతైన పోయిన 30 మంది కోసం డ్రోన్ల సాయంతో గాలిస్తున్నారన్నారు. శ్రీఖండ్ మహాదేవ్ ఆలయంలో చిక్కిన 300 మంది, మలానాలో చిక్కుకున్న 25 మంది పర్యాటకులు క్షేమంగా ఉన్నారని అధికారులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment