దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. దీనిలో భాగంగానే.. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ లో బాలాజీ ఆలయ నిర్మాణం చేపట్టనున్నారు.
ఇప్పటికే ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆలయం కోసం స్థలాన్ని కేటాయించింది.. నిర్మాణానికి సంబందించిన టెండర్ల ప్రక్రియ పూర్తైందని టీటీడీ జేఈఓ పోల భాస్కర్ మీడియాకు తెలిపారు. డిజైన్లు, ఆలయ ప్లాన్లు సిద్దంగా ఉన్నాయని.. అతి త్వరలో నిర్మాణ పనులు మొదలు పెట్టనున్నట్లు వివరించారు. రెండేళ్లలో ఆలయ నిర్మాణం పూర్తయ్యేలా ప్రణాళికలు రచించినట్లు తెలిపారు.
ఇప్పటికే హర్యాణా రాష్ట్రంలోని కురుక్షేత్రలో నిర్మితమైతున్న బాలాజీ ఆలయం మరో ఆరునెల్లో సిద్దమైతుందని తెలిపారు. టీటీడీ నిర్మించ తలపెట్టిన ఆలయానికి 5 నుంచి 10 ఎకరాల స్థలం కేటాయించాల్సిందిగా.. దేశంలోని అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు టీటీడీ లేఖ రాసినట్లు వివరించారు. తమ విజ్ఞప్తికి మహరాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని అన్నారు. కాగా ఇప్పటికే ఢిల్లీ, చెన్నైల్లో టీటీడీ ఆలయాలు నిర్మించిన సంగతి తెలిసిందే.
ఢిల్లీలో శ్రీవెంకటేశ్వర వైభవోత్సవం
మరో వైపు ఈనెల 31 నుంచి నవంబర్ 8 వరకూ న్యూ ఢిల్లీ లోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో 'శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవం' నిర్వహించనున్నారు. ఢిల్లీ లో తొలి సారి వెంకటేశ్వర వైభవోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వహాకులు దీపావెంకట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు.