మహాభారత స్వర్గారోహణ పర్వంలో.. యుధిష్ఠిరుడు(ధర్మరాజు) వెంట మేరు పర్వతం శిఖరాగ్రానికి చేరుకుంటుంది ఓ శునకం. అయితే ఇంద్రుడు మాత్రం శునకం అపవిత్రమైందని దాని ప్రవేశానికి అడ్డుపడతాడు. విశ్వాసానికి మారుపేరు.. పైగా ఎలాంటి లాభాపేలేకుండా నిస్వార్థంతో తన వెంట నడిచిన శునకానికి అనుమతి ఇవ్వాలంటూ ధర్మరాజు వేడుకుంటాడు. ఆపై ఆ శునకం యమధర్మరాజు పెట్టిన పరీక్షగా తేలడం.. చివరకు ధర్మమే నెగ్గుతుందని చెప్పడంతో ఆ ఘట్టం ముగుస్తుంది. ఇప్పుడు ఈ సందర్భం ఇప్పుడు ఎందుకు అంటారా?..
కేధార్‌నాథ్ యాత్రలో ఓ ఘటన ఇప్పుడు ఇంటర్నెట్ దృష్టిని ఆకట్టుకుంటోంది. అదే సమయంలో అభ్యంతరాలు.. ప్రతి విమర్శలు దారి తీసింది అది. నవాబ్ అనే ఓ శునకం.. తన ఓనర్‌తో కలిసి కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రంలో కలియ దిరగడమే ఇందుకు ప్రధాన కారణం. నోయిడాకు చెందిన వికాస్ త్యాగి(33) అనే వ్యక్తి.. ఎక్కడికి వెళ్లినా తన పెంపుడు కుక్క నవాబ్ వెంటపెట్టుకెళ్లడం అలవాటు. ఈ క్రమంలో చార్‌ధామ్ యాత్రకు వెళ్లిన వికాస్ కూడా నవాబ్‌ను తీసుకెళ్లాడు.
కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రం నంది విగ్రహం దగ్గర దాని పాదాలను ఉంచి, నుదుట కుంకుమ కూడా పెట్టాడు. ఈ వీడియో కాస్త ఇన్‌స్టాగ్రామ్, ఇతర ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అయ్యింది. అయితే బద్రీనాథ్-కేదార్‌నాథ్ టెంపుల్ కమిటీ మాత్రం ఈ వీడియోపై మరోలా రియాక్ట్ అయ్యింది.
సదరు భక్తుడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బుధవారం ఒక ఫిర్యాదు చేసింది. ఆ విజువల్స్ మతపరమైన మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ వాదించింది. అంతేకాదు ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు అయ్యింది. అయితే వికాస్ మాత్రం తన చర్యను సమర్థించుకుంటున్నాడు. గత నాలుగేళ్లలో నవాబ్ తనతో పాటు దేశంలో ఎన్నో గుడులు తిరిగాడని, అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయని, కానీ, ఇప్పుడు ఈ డ్రామాలు ఎందుకని ప్రశ్నిస్తున్నాడు. ఈ కుక్క కూడా దేవుడి సృష్టిలో భాగమనే అంటున్నాడు.
20 కిలోమీటర్ల ట్రెక్కింగ్ తర్వాత ఆయాలనికి చేరుకున్నాం. దారి పొడువునా ఎంతో మంది భక్తులు.. నవాబ్‌ను దగ్గరికి తీసుకున్నారు. దానితో ఫొటోలు తీసుకున్నారు. ఆ భక్తగణానికి లేని అభ్యంతరం.. కమిటీ వాళ్లకే వచ్చిందా? అని ప్రశ్నిస్తున్నాడు వికాస్. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో వికాస్‌కే విపరీతమైన మద్దతు లభిస్తోంది. స్వర్గారోహణలో యుధిష్ఠిరుడు వికాస్ అయితే.. వెంట వెళ్లిన శునకం నవాబ్ అని పోలుస్తున్నారు. కడకు ధర్మమే నెగ్గుతుందని కామెంట్లు చేస్తున్నారు చాలామంది.
Comments
Please login to add a commentAdd a comment