
సాక్షి, ఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో మంచు తుపానులో చిక్కుకున్న శ్రీకాకుళం జిల్లా వాసులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. శ్రీకాకుళం, విశాఖ జిల్లాలకు చెందిన 66 మంది చార్‌ధామ్ యాత్రికులు మంగళవారం బద్రీనాథ్‌లో చిక్కుకుపోయారు. ఉదయం 7 గంటలకు బద్రీనాథ్ చేరుకోగా, ఎడతెరిపిలేని మంచు వర్షం కురిసిందని, దీంతో కొండ పైనే చిక్కుకుపోయామని యాత్రికుల బృందం తెలిపింది. చిమ్మచీకటిలో తాము మగ్గిపోయామని బాధిత యాత్రికులు తెలిపారు. తాము ప్రయాణించే బస్సు సైతం మంచులో కూరుకుపోయిందని పేర్కొన్నారు. మొత్తం 104 మంది యాత్రికులు ఏప్రిల్ 26న ఛార్‌ధామ్ యాత్రకు బయలుదేరి వెళ్లారు.
చిక్కుకున్న జడ్పీ బృందం
ఉత్తరాఖండ్ వెళ్లిన మరో 39 మందితో కూడిన జడ్పీటీసీలు, అధికారుల బృందం కూడా ఉత్తరాఖండ్‌లో చిక్కుకుపోయింది. శ్రీకాకుళం జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి నేతృత్వంలో వీరంతా ఉపాధి హామీ పనుల పరిశీలన నిమిత్తం వెళ్లారు. మంచు వర్షం కారణంగా వీరంతా సీతాపురంలో చిక్కకుపోయారు. వీరంతా ఈ నెల 3న బయల్దేరి వెళ్లారు. మంచు తుపాను వర్షం నుంచి బయటపడి, సీతాపురంలో సురక్షితంగా ఉన్నామని ధనలక్ష్మి పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ భవన్ అడిషనల్ కమిషనర్ అర్జా శ్రీకాంత్ ఎప్పటికప్పుడు సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment