సొంత వాహనంలో చార్‌ధామ్‌ యాత్ర.. విధివిధానాలివే! | Sakshi
Sakshi News home page

సొంత వాహనంలో చార్‌ధామ్‌ యాత్ర.. విధివిధానాలివే!

Published Wed, May 1 2024 10:09 AM

Char Dham Yatra 2024 Advisory for Vehicle

మే 10 నుంచి చార్‌ధామ్‌ యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపధ్యంలో యాత్రసాగించే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం పలు ఏర్పాట్లు చేస్తోంది. రవాణా శాఖ కూడా ప్రయాణికులకు పలు మార్గదర్శకాలు జారీచేసింది. వీటి ప్రకారం గ్రీన్ కార్డ్ లేని వాహనాలను యాత్రా మార్గంలో అనుమతించరు. అలాగే వాహనాల్లో సంగీతాన్ని ప్లే చేయడంపై నిషేధం విధించారు. దీంతో పాటు వాహనాల్లో ప్రథమ చికిత్స  బాక్సు తప్పనిసరి చేశారు.

తేలికపాటి వాహనాలకు గ్రీన్‌కార్డు రుసుముగా రూ.400,  భారీ వాహనాలకు రూ.600గా నిర్ణయించారు. చార్‌ధామ్‌ యాత్రకు సంబంధించి గురువారం మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అన్ని శాఖల సన్నాహాలను  ఉన్నతాధికారులు పరిశీలించనున్నారు. ఏప్రిల్‌ 10 నుంచి చార్ధామ్ యాత్రకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నాలుగు ధామ్‌లలో హెలికాప్టర్ సర్వీస్ కోసం బుకింగ్ కూడా కొనసాగుతోంది.

ఈ ఏడాది చార్‌ధామ్‌ యాత్రపై భక్తుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. ఇప్పటి వరకు 16.37 లక్షల మంది ప్రయాణికులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. హోటళ్లను కూడా ముందుగానే బుక్‌ చేసుకుంటున్నారు. ఈ పరిస్థితులను చూస్తుంటే ఈసారి చార్‌ధామ్ యాత్ర గత రికార్డులను బద్దలు కొడుతుందని రాష్ట్ర పర్యాటక, దేవాదాయ శాఖ మంత్రి సత్పాల్ మహరాజ్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని నాలుగు ధామ్‌లను దర్శించుకునేందుకు గత ఏడాది 56.31 లక్షల మంది భక్తులు వచ్చారని తెలిపారు. 

Advertisement
 
Advertisement