సిద్దిపేట వంట రుచి చార్‌ దామ్‌లో.. | Siddipet Local Cooking In Char Dham For Pilgrims Telangana | Sakshi
Sakshi News home page

సిద్దిపేట వంట రుచి చార్‌ దామ్‌లో..

Published Mon, May 16 2022 12:49 PM | Last Updated on Mon, May 16 2022 3:13 PM

Siddipet Local Cooking In Char Dham For Pilgrims Telangana - Sakshi

సాక్షి,సిద్దిపేట జోన్‌: ప్రపంచంలో అత్యంత పేరుగాంచిన తీర్థయాత్ర కేదార్‌నాథ్‌. ద్వాదశ జ్యోతిర్లింగాలలో చిట్ట చివరిది కేదార్‌నాథ్‌. హిమాలయాల్లో అత్యంత భయానక, సాహసోపేత యాత్రగా పేరొందిన కేదార్‌నాథ్‌ యాత్రికులకు అమృతం లాంటి దక్షిణాది రుచులను ఉచితంగా అందిస్తూ సేవాభావంతో పనిచేస్తున్న సమితి సిద్దిపేట ప్రాంతానికి చెందింది కావడం విశేషం.

గతంలో అమర్‌నాథ్‌ యాత్రికులకు భోజన వసతి కల్పించిన స్పూర్తితో నేడు కేదార్‌నాథ్‌ యాత్రికులకు దక్షిణాది వంటకాలను అందుబాటులో తీసుకొచ్చారు. దేశ చరిత్రలోనే కేదార్‌నాథ్‌లో తొలి లంగర్‌ ఏర్పాటు చేసి, నిత్యం వేలాది మంది యాత్రికులకు ఉచితంగా భోజనం అందిస్తూ అందరి మన్నలను పొందుతోంది కేదార్‌నాథ్‌ అన్నదాన సేవా సమితి. సిద్దిపేట ప్రాంత వాసులతో ఏర్పాటై ఎన్నో రాష్ట్రాల సరిహద్దులు దాటి అందిస్తున్న సేవలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.   

సరిగ్గా 11 ఏళ్ల క్రితం అమర్‌నాథ్‌ యాత్రికులకు లంగర్‌ ఏర్పాటు చేసి అక్కడ దక్షిణాది యాత్రికులకు భోజనం అందించి అమర్‌నాథ్‌ సేవా సమితి దేశ వ్యాప్తంగా అందరి మన్నలను పొందింది. ఇదే స్పూర్తితో సిద్దిపేటకు చెందిన చీకోటి మధుసూదన్, ఐత రత్నాకర్‌ అధ్యక్ష కార్యదర్శులుగా కేదార్‌నాథ్‌ అన్నదాన సేవా సమితి ఏర్పాటైంది. 2019లో తొలిసారిగా కేదార్‌నాథ్‌ యాత్రికుల కోసం సొన్‌ ప్రయాగ్‌ బేస్‌ క్యాంపు వద్ద తొలి లంగర్‌ ఏర్పాటు చేశారు. ఎంతో సహోసోపేతంగా సాగే కేదార్‌నాథ్‌ యాత్రకు వచ్చే యాత్రికులలో 70 శాతం దక్షిణాది వారే.

వారికి అక్కడ సరైన భోజన వసతి లేక 2019 వరకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తినడానికి సరైన తిండి లేక యాత్రికులు పడుతున్న ఇబ్బందులు గుర్తించి తొలిసారిగా కేదార్‌నాథ్‌ యాత్రికుల కోసం లంగర్‌ ఏర్పాటు చేశారు. మే 4 తేదీ నుంచి జూన్‌ 15 వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. పది రోజులుగా సిద్దిపేటకు చెందిన కేదార్‌నాథ్‌ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో దక్షిణాది యాత్రికులకు భోజనాలు అందిస్తున్నారు. ఉదయం 7  నుంచి రాత్రి 11 గంటల వరకు లంగర్‌లో సేవలు అందుబాటులో ఉంటాయి. అక్కడ భోజనాలతోపాటు వసతి, హెల్ప్‌ సెంటర్‌ కూడా సేవా సమితి ఏర్పాటు చేసింది. 

దక్షిణాది రుచులు 
కేదార్‌నాథ్‌ యాత్రకు అత్యధికంగా దక్షిణాది ప్రాంత వాసులు వస్తుంటారు. వారికి ఉత్తరాఖండ్‌ రుచులు నచ్చవు. రోజుల కొద్ది యాత్రలో ఉండే యాత్రికులకు మన వంటకాలు కొంత ఊరట అందిస్తున్నాయి. ఉదయం టీ, అల్పాహారంగా ఇడ్లీ, చపాతి, వడ, ఉప్మా, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం సిద్దిపేట ప్రేమ్‌పూరీ, పానీపూరి, కట్లీస్, రాత్రి భోజనం ఉచితంగా అందిస్తున్నారు. నిత్యం మూడు నుంచి నాలుగు వేల మంది యాత్రికులకు అన్నదాన సేవా సమితి భోజనాలు అందిస్తూ సేవలందిస్తోంది.  సిద్దిపేట ప్రాంతంలో విరాళాలు సేకరించి అవసరమైన సామగ్రి, పరికరాలను ముందుగానే లంగర్‌కు సరఫరా చేశారు. 

అన్నదానం మహాదానం 
అమర్‌నాథ్, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌ యాత్రలకు వెళ్లే వారికి అక్కడ సరైన భోజన వసతి ఉండదు. పదేళ్ల క్రితం సిద్దిపేట తొలిసారిగా అమర్‌నాథ్‌ అన్నదాన సేవా సమితి పేరిట యాత్రికులకు భోజనాలు అందించాం. అదే స్పూర్తితో ఇప్పుడు తొలిసారిగా కేదార్‌నాథ్‌ యాత్రికులకు లంగర్‌ ఏర్పాటు చేశాం. అన్నదానం మహాదానం. నిత్యం వేలాది మంది యాత్రికులకు దక్షిణాది రుచులతో కూడిన వంటకాలు అందిస్తున్నాం.       
 – చికోటిమధుసూదన్, అధ్యక్షుడు, అన్నదాన సేవా సమితి

దక్షిణాది రుచులు కరువు 
హిమాలయాల్లో కేదార్‌నాథ్‌ యాత్రలు చేసే వారిలో 70 శాతం దక్షిణాది వారే ఉంటారు. వారికి ఉత్తారాది వంట రుచులు నచ్చవు. మన వంటలు అందుబాటులోకి తెచ్చి ఉచితంగా అందించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొట్ట మొదటి లంగర్‌ సిద్దిపేట ప్రాంత సేవా సమితి ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. నిత్యం భోజనాలు అందిస్తున్నాం. యాత్రికులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
 – రత్నాకర్, కార్యదర్శి, అన్నదాన సేవా సమితి

చదవండి: ఒక్కటైన ప్రేమజంట.. దీని వెనక పెద్ద కథే నడిచింది!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement