sidipet
-
సిద్దిపేట వంట రుచి చార్ దామ్‌లో..
సాక్షి,సిద్దిపేట జోన్: ప్రపంచంలో అత్యంత పేరుగాంచిన తీర్థయాత్ర కేదార్నాథ్. ద్వాదశ జ్యోతిర్లింగాలలో చిట్ట చివరిది కేదార్నాథ్. హిమాలయాల్లో అత్యంత భయానక, సాహసోపేత యాత్రగా పేరొందిన కేదార్నాథ్ యాత్రికులకు అమృతం లాంటి దక్షిణాది రుచులను ఉచితంగా అందిస్తూ సేవాభావంతో పనిచేస్తున్న సమితి సిద్దిపేట ప్రాంతానికి చెందింది కావడం విశేషం. గతంలో అమర్నాథ్ యాత్రికులకు భోజన వసతి కల్పించిన స్పూర్తితో నేడు కేదార్నాథ్ యాత్రికులకు దక్షిణాది వంటకాలను అందుబాటులో తీసుకొచ్చారు. దేశ చరిత్రలోనే కేదార్‌నాథ్‌లో తొలి లంగర్ ఏర్పాటు చేసి, నిత్యం వేలాది మంది యాత్రికులకు ఉచితంగా భోజనం అందిస్తూ అందరి మన్నలను పొందుతోంది కేదార్నాథ్ అన్నదాన సేవా సమితి. సిద్దిపేట ప్రాంత వాసులతో ఏర్పాటై ఎన్నో రాష్ట్రాల సరిహద్దులు దాటి అందిస్తున్న సేవలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సరిగ్గా 11 ఏళ్ల క్రితం అమర్నాథ్ యాత్రికులకు లంగర్ ఏర్పాటు చేసి అక్కడ దక్షిణాది యాత్రికులకు భోజనం అందించి అమర్నాథ్ సేవా సమితి దేశ వ్యాప్తంగా అందరి మన్నలను పొందింది. ఇదే స్పూర్తితో సిద్దిపేటకు చెందిన చీకోటి మధుసూదన్, ఐత రత్నాకర్ అధ్యక్ష కార్యదర్శులుగా కేదార్నాథ్ అన్నదాన సేవా సమితి ఏర్పాటైంది. 2019లో తొలిసారిగా కేదార్నాథ్ యాత్రికుల కోసం సొన్ ప్రయాగ్ బేస్ క్యాంపు వద్ద తొలి లంగర్ ఏర్పాటు చేశారు. ఎంతో సహోసోపేతంగా సాగే కేదార్నాథ్ యాత్రకు వచ్చే యాత్రికులలో 70 శాతం దక్షిణాది వారే. వారికి అక్కడ సరైన భోజన వసతి లేక 2019 వరకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తినడానికి సరైన తిండి లేక యాత్రికులు పడుతున్న ఇబ్బందులు గుర్తించి తొలిసారిగా కేదార్నాథ్ యాత్రికుల కోసం లంగర్ ఏర్పాటు చేశారు. మే 4 తేదీ నుంచి జూన్ 15 వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. పది రోజులుగా సిద్దిపేటకు చెందిన కేదార్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో దక్షిణాది యాత్రికులకు భోజనాలు అందిస్తున్నారు. ఉదయం 7 నుంచి రాత్రి 11 గంటల వరకు లంగర్లో సేవలు అందుబాటులో ఉంటాయి. అక్కడ భోజనాలతోపాటు వసతి, హెల్ప్ సెంటర్ కూడా సేవా సమితి ఏర్పాటు చేసింది. దక్షిణాది రుచులు కేదార్నాథ్ యాత్రకు అత్యధికంగా దక్షిణాది ప్రాంత వాసులు వస్తుంటారు. వారికి ఉత్తరాఖండ్ రుచులు నచ్చవు. రోజుల కొద్ది యాత్రలో ఉండే యాత్రికులకు మన వంటకాలు కొంత ఊరట అందిస్తున్నాయి. ఉదయం టీ, అల్పాహారంగా ఇడ్లీ, చపాతి, వడ, ఉప్మా, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం సిద్దిపేట ప్రేమ్‌పూరీ, పానీపూరి, కట్లీస్, రాత్రి భోజనం ఉచితంగా అందిస్తున్నారు. నిత్యం మూడు నుంచి నాలుగు వేల మంది యాత్రికులకు అన్నదాన సేవా సమితి భోజనాలు అందిస్తూ సేవలందిస్తోంది. సిద్దిపేట ప్రాంతంలో విరాళాలు సేకరించి అవసరమైన సామగ్రి, పరికరాలను ముందుగానే లంగర్‌కు సరఫరా చేశారు. అన్నదానం మహాదానం అమర్నాథ్, కేదార్నాథ్, బద్రీనాథ్ యాత్రలకు వెళ్లే వారికి అక్కడ సరైన భోజన వసతి ఉండదు. పదేళ్ల క్రితం సిద్దిపేట తొలిసారిగా అమర్నాథ్ అన్నదాన సేవా సమితి పేరిట యాత్రికులకు భోజనాలు అందించాం. అదే స్పూర్తితో ఇప్పుడు తొలిసారిగా కేదార్నాథ్ యాత్రికులకు లంగర్ ఏర్పాటు చేశాం. అన్నదానం మహాదానం. నిత్యం వేలాది మంది యాత్రికులకు దక్షిణాది రుచులతో కూడిన వంటకాలు అందిస్తున్నాం. – చికోటిమధుసూదన్, అధ్యక్షుడు, అన్నదాన సేవా సమితి దక్షిణాది రుచులు కరువు హిమాలయాల్లో కేదార్నాథ్ యాత్రలు చేసే వారిలో 70 శాతం దక్షిణాది వారే ఉంటారు. వారికి ఉత్తారాది వంట రుచులు నచ్చవు. మన వంటలు అందుబాటులోకి తెచ్చి ఉచితంగా అందించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొట్ట మొదటి లంగర్ సిద్దిపేట ప్రాంత సేవా సమితి ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. నిత్యం భోజనాలు అందిస్తున్నాం. యాత్రికులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. – రత్నాకర్, కార్యదర్శి, అన్నదాన సేవా సమితి చదవండి: ఒక్కటైన ప్రేమజంట.. దీని వెనక పెద్ద కథే నడిచింది! -
జార్ఖండ్ టు సిద్దిపేట.. నాలుగేళ్ల తర్వాత ఏడడుగుల బంధం కలిసింది
సాక్షి,సిద్దిపేటజోన్(హైదరాబాద్): అగ్ని సాక్షిగా ఏడు అడుగులతో ఒక్కటయ్యారు. ఏం జరిగిందో తెలియదు ఆ భార్య.. భర్తకు దూరమైంది. రాష్ట్ర సరిహద్దులు దాటింది. ఊరుకాని ఊరు, భాష రాని ప్రాంతానికి చేరుకుంది. నాలుగు ఏళ్లుగా రోడ్లవెంట ఐదేళ్ల కూతురును పట్టుకొని అనాథగా తిరిగింది. పోలీసుల జోక్యంతో సఖి కేంద్రానికి చేరుకుంది. అభాగ్యురాలి వివరాలు సేకరించి రెస్క్యూ టీం ఎట్టకేలకు భర్త చెంతకు చేర్చి ఆమెను కథ సుఖాంతం చేశారు. వివరాలకు వెళ్తే.. జార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్పూర్ పరిధిలోని మాన్పిట్ ప్రాంతానికి చెందిన కుదిరామ్, పన్సారీ దంపతులు. వీరికి క్రిష్(12), నిర్మల్(7), రియా(5) ముగ్గురు పిల్లలు. నాలుగేళ్ల క్రితం పన్సారీ కూతురు రియాతో బయటకు వచ్చి తప్పిపోయింది. అప్పట్లోనే ఆమె భర్త కుదిరామ్ అక్కడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. కానీ ఆమె ఆచూకీ లభించలేదు. కాగా ఈ నెల 23వ తేదీన ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుపై తల్లీకూతురు తిరుగుతూ పోలీసులకు కనిపించారు. పోలీసులు ఆమె వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసినా సరైన సమాధానం రాలేదు. దీంతో సంరక్షణ నిమిత్తం సిద్దిపేట సఖి కేంద్రానికి తరలించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఆమె ఆరోగ్య స్థితిగతుల కోసం వైద్య పరీక్షలు నిర్వహించి కేంద్రంలోనే వసతి కల్పించారు. విషయం తెలుసుకున్న పోలీస్ కమిషనర్ శ్వేత ఆమెను స్వస్థలానికి పంపించేలా ఏర్పాట్లు చేయాలని మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సైదాను ఆదేశించారు. ఆమె ద్వారా కుటుంబ సభ్యుల వివరాలు సేకరించగా.. వారు జార్ఖండ్ ప్రాంతానికి చెందిన వారమని, తప్పిపోయి వచ్చామని తెలిపింది. వెంటనే సఖి కేంద్రం ఇన్చార్జి ప్రతిమ ఈ విషయాన్ని సీపీ శ్వేత దృష్టికి తీసుకెళ్లారు. ఆమె జార్ఖండ్‌లోని అక్కడి సఖి అధికారులకు ఫొటోలు, వివరాలు పంపించారు. తర్వాత అక్కడి అధికారుల ప్రయత్నాలు ఫలించాయి పన్సారీ భర్త కుదిరామ్ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఇక్కడకు రాలేకపోయాడు. దీంతో స్థానిక సఖి నిర్వాహకులు, పోలీసులు ప్రత్యేక వాహనం ద్వారా తల్లీకూతురును జార్ఖండ్‌లోని గోవిందపూర్ పోలీస్ స్టేషన్లో బుధవారం కుదిరామ్‌కు అప్పగించారు. భార్య, కూతురును క్షేమంగా అప్పగించినందుకు సిద్దిపేట జిల్లా పోలీసులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఽ చదవండి: ఎండలే కాదు ధరలు మండుతున్నాయ్.. కొనలేం.. తినలేం -
‘పాడె’ కట్టె అతనికి మృత్యువుగా మారింది
సాక్షి,వర్గల్(సిద్దిపేట): ‘పాడె’ కట్టె కాలనాగైంది. అంత్యక్రియల కలప కోసం వచ్చిన వ్యక్తిని విద్యుత్‌షాక్ రూపంలో కాటేసింది. పాడె కట్టేందుకు అవసరమైన వెదురు చెట్టును కొడుతుండగా అది విద్యుత్‌లైన్‌కు తాకడంతో ఈ దుర్ఘటన సంభవించింది. మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.... మజీద్‌పల్లికి చెందిన ఎంపీటీసీ మాజీ సభ్యుడు లింగ లక్ష్మినర్సయ్య అనారోగ్యంతో మృతిచెందాడు. బుధవారం అతడి అంత్యక్రియల కోసం పాడె కట్టేందుకు అవసరమైన వెదురు కట్టెలు తెచ్చేందుకు గ్రామశివారులోని విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రాంతానికి గాలం స్వామి(38), పాలేటి ధర్మరాజు, చిగురుఎత్తు రాజు వెళ్లారు. అక్కడ వెదురు చెట్టును స్వామి గొడ్డలితో కొడుతుండగా అది పక్కనే ఉన్న విద్యుత్ లైన్ వైర్లను తాకింది. దీంతో అతను తీవ్ర విద్యుత్ షాక్‌కు గురై అపస్మారక స్థితిలో పడిపోయాడు. పక్కనే ఉన్న మిగతా ఇద్దరు అప్రమత్తమై దూరంగా జరిగి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వారు వెంటనే తెలిసిన వారికి సమాచారం చేరవేసి స్వామిని గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పేద కుటుంబంలో పెను విషాదం గాలం స్వామి మృత్యువాత పడిన సమాచారంతో కుటుంబసభ్యులు బోరుమని విలపించారు. మృతుడికి భార్య లక్ష్మి, 18 సంవత్సరాలలోపు ఏసుమణి, సంధ్య, కార్తీక్ పిల్లలు ఉన్నారు. తండ్రి సత్తయ్య కూడా వీరి వద్దనే ఉంటున్నాడు. పెద్దగా ఆస్తిపాస్తులు లేని ఆ కుటుంబం స్వామి సంపాదనపైనే ఆధారపడి జీవిస్తోంది. పెద్ద దిక్కును కోల్పోయి ఆ కుటుంబం పెనువిషాదంలో మునిగిపోయింది. ఆస్పత్రి వద్ద వారి రోదనలు ఆపడం ఎవరి తరం కాలేదు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పెళ్లి కావడం లేదని బాధ.. ఉదయం తలుపు బద్దలు కొట్టి చూస్తే.. -
మంత్రి హరీష్‌రావుకు తప్పిన ప్రమాదం
సాక్షి, సిద్ధిపేట: మంత్రి హరీష్‌రావుకు తృటిలో ప్రమాదం తప్పింది. అడవి పంది అడ్డురావడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. సిద్ధిపేట నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగింది. హరీష్‌రావు కాన్వాయిలో ముందు వెళ్తున్న కారుకు అడవి పంది అడ్డు వచ్చింది. ముందున్న కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో హరీష్‌రావు పైలెట్ కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ముందు కారులోని వ్యక్తికి స్వల్ప గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు. హరీష్‌రావు మరో కారులో హైదరాబాద్‌కు వెళ్లారు. హరీష్‌రావు వాహనం ముందు భాగం ధ్వంసమైంది. కొండపాక మండలం బందారం దర్గా కమాన్ సమీపంలో ప్రమాదం జరిగింది. -
సిద్దిపేటలో ఎయిర్‌పోర్టు : కేసీఆర్
సాక్షి, మెదక్ : ‘సిద్దిపేట పట్టణం అన్ని వ్యాపార, వాణిజ్య కేంద్రాలకు కేంద్ర బిందువు.. ఇది డైనమిక్ ప్లేస్.. హైదరాబాద్‌కు సమాన స్థాయిలో అభివృద్ధి చెందుతోంది. త్వరలో రైలు సౌకర్యం కూడా వస్తుంది. ఇక ఒక్కటే మిగిలింది.. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఏర్పాటు చేస్తాం. ఈ కల కూడా నెరవేరుస్తా’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. జిల్లాలో గురువారం ఆయన చేపట్టిన పర్యటన బిజీబిజీగా సాగింది. ఆర్థిక మంత్రి హరీశ్‌రావుతో కలసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రెండు శంకుస్థాపనలు, 5 ప్రారంభోత్సవాలతో పాటు ఒక పరిశీలన చేపట్టారు. చివరగా బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. మంత్రి హరీశ్‌రావు కోరినవి మం జూరు చేస్తూనే.. అడగనివి కూడా ఇస్తూ వరాల జల్లు కురిపించారు. రాజధానితో పాటు సిద్దిపేటలో పట్టణీకరణ వేగంగా జరుగుతోందని.. ఈ నియోజకవర్గంలో అవినీతికి తావు లేదని.. అధికారులు, నాయకులు, శ్రేణులు అందరూ కలిసి సిద్దిపేటను బాగా అభివృద్ధి చేశారని.. ఇండియాకే రోల్‌మోడల్‌గా నిలుస్తోందని కితాబి చ్చారు. సిద్దిపేట మరింత అభివృద్ధి చెందేందుకు ఎల్లప్పుడూ సహకారం అందిస్తానన్నారు. కరెంట్, నీళ్ల కష్టాలు తొలగినయ్.. తెలంగాణకు కరెంటు, నీళ్ల కష్టాలు తీరాయని సీఎం పేర్కొన్నారు. రంగ నాయక్ సాగర్‌లో నీళ్లు చూస్తుంటే ఒళ్లు పులకిస్తోందన్నారు. స్వచ్ఛ, హరిత సిద్దిపేటను చూస్తుంటే సంతో షంగా ఉందన్నారు. కోటి అందాల కోమటిచెరువు వంతెనపై నడుచు కుంటూ పరిశీలించానని.. అద్భు తంగా ఉందన్నారు. కోమటిచెరువు, నెక్లెస్‌రోడ్‌తో జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందని చెప్పారు. హైదరాబాద్‌లోని గేటెడ్ కమ్యూనిటీ తరహాలో నర్సాపూర్‌లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లు తలమానికంగా నిలిచాయన్నారు. ఐటీ టవర్ శంకుస్థాపన చేసినా.. పూర్తయేందుకు çఏడాది పడుతుందని చెప్పారు. ప్రస్తుతం కొనసాగుతున్న కలెక్టరేట్లో తాత్కాలిక ఐటీ టవర్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి, కలెక్టర్‌ను ఆదేశించారు. కంపెనీ వాళ్లు తొలిదశలో 900 మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పడం శుభ పరిణామమన్నారు. కాగా, సిద్దిపేటకు మరో రింగ్‌రోడ్డు రానుంది. ఇర్కోడ్ క్రాస్ రోడ్డు నుంచి పొన్నాల క్రాస్ రోడ్డు వరకు 64 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. ఈ నిర్మాణంతో హుస్నాబాద్, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, మెదక్ జిల్లాలకు వెళ్లే వారికి దూరం తగ్గుతుంది. సీఎం వెంట మంత్రులు హరీశ్‌రావుతో పాటు ఈటల రాజేందర్, నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు సంతోష్‌కుమార్, ప్రభాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. సీఎం వరాల జల్లు.. బహిరంగ సభ ప్రారంభంలో జిల్లా అభివృ ద్ధికి అవసరమైన కొన్ని అంశాలను సీఎం కేసీఆర్ దృష్టికి మంత్రి హరీశ్‌రావు తేగా. వెంటనే కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్‌కు అనుసంధా నంగా సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, మిరుదొడ్డి మండలాల పరిధిలోని 18 గ్రామాల్లో సాగు నీటి కోసం లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటుకు రూ.80 కోట్లు విడుదల చేస్తామని కేసీఆర్ చెప్పారు. శుక్రవారం జీవో జారీ చేస్తామని వెల్లడించారు. సిద్దిపేట నుంచి కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంటకు వెళ్లే రహదారిని ఫోర్ లేన్ రోడ్డుగా మారుస్తామన్నారు. ఈ ప్రక్రియ చేపట్టాలని.. అక్కడే ఉన్న మంత్రి ప్రశాంత్‌రెడ్డికి సూచించారు. నర్సాపూర్‌లో నిర్మించిన డబుల్ బెడ్రూం నిర్మాణాలకు సంబంధించి అదనంగా మరో వెయ్యి ఇళ్లు మంజూరు చేయాలని హరీశ్‌రావు కోరగా.. సీఎం వెంటనే మంజూరు చేశారు. ఊ రంగనాయకసాగర్ రిజర్వాయర్‌ను అంతర్జాతీయ టూరిస్ట్ స్పాట్‌గా చేసేందుకు తక్షణం రూ.100 కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. ఈ బాధ్యత హరీశ్‌రావుదేనని పేర్కొన్నారు. కోమటి చెరువు, రింగ్ రోడ్డు సుందరీకరణకు మరో రూ.25 కోట్లు కేటాయిస్తామని తెలిపారు. గజ్వేల్‌లో కవులు, కళాకారులు, చిత్రకారులకు నిర్మించినట్లు సిద్దిపేటలోనూ ఆడిటోరియం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. రూ.50 కోట్లు కేటాయిస్తామని.. రెండు వేల మంది సీటింగ్‌తో ఏర్పాటు చేసేలా స్థలం సేకరించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. సిద్దిపేటలో త్రీటౌన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మరో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజిటేబుల్ మార్కె ట్ ఏర్పాటు చేయాలన్నారు. కాగా, సీఎం కేసీఆర్ ఉదయం ఎర్రవల్లి నుంచి సిద్దిపేట కు వచ్చారు. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన పర్యటన సాయంత్రం 4.30 గంటలకు ముగిసింది. సుమారు 5 గంటలపాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బిజీబిజీగా పర్యటన.. కొండపాక మండలంలోని దుద్దెడ శివారు లో రూ.45 కోట్లతో మూడు ఎకరాల విస్తీర్ణంలో ఐదంతస్తుల ఐటీ టవర్ నిర్మాణా నికి సీఎం శంకుస్థాపన చేశారు. తొలిరోజే నాలుగు ఐటీ కంపెనీలు (జోలాన్ టెక్నాలజీ, విసాన్టెక్, ఎంబ్రోడ్స్ టెక్నాలజీ, సెట్విన్) రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నాయి. ఐటీ విస్తరణతో జిల్లాలో తొలిదశలో సుమారు రెండు వేల మందికి ఉపాధి లభించనుంది. సిద్దిపేటలో నిర్మించిన టీఆర్ఎస్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. జిల్లాలో రూ.22 లక్షల వ్యయంతో సిద్దిపేట రూరల్ మండలంలోని మిట్టపల్లి క్లస్టర్లో నిర్మించిన తొలి రైతువేదికను సీఎం ప్రారంభించారు. పట్టణ పరిధిలో రూ.715 కోట్ల వ్యయంతో 2,99,852 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన మెడికల్ కాలేజీని సీఎం ప్రారంభించారు. రూ.225 కోట్ల వ్యయంతో నిర్మించనున్న వెయ్యి పడకల ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నర్సాపూర్‌లో గేటెడ్ కమ్యూనిటీ తరహాలో 45 ఎకరాల విస్తీర్ణంలో జీ ప్లస్ 2 పద్ధతిన మొత్తం 2,460 ఇళ్లు నిర్మించారు. ఇందులో మొదటి విడతగా 1,341 లబ్ధిదారులకు అందజేయనున్నారు. సీఎం సమక్షంలో 144 మంది గృహప్రవేశాలు చేశారు. సీఎం 9వ బ్లాక్‌లోని మూడో ఇంటిలో స్వాతి– దేవేందర్ దంపతులు, మహ్మద్ సద్దాం, రాజ్కౌర్, యాక భాగ్యతో కలసి సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఫంక్షన్‌హాల్, సమీకృత మార్కెట్‌ను ప్రారంభించారు. పట్టణాన్ని స్వచ్ఛ సిద్దిపేటగా మార్చేందుకు రూ.278.50 కోట్ల వ్యయంతో నిర్మించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను సీఎం ప్రారంభించారు. 3.50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన రంగనాయక సాగర్ రిజర్వాయర్ మధ్య పల్లగుట్ట ద్వీపంలో నిర్మించిన నీటిపారుదల శాఖ అతిథి గృహాన్ని సీఎం ప్రారంభించారు. పట్టణంలోని కోమటి చెరువులో జరిగిన సుందరీకరణ పనులను సీఎం పరిశీలించారు. నెక్లెస్ రోడ్ వెంట కాలినడకన తిరుగుతూ పరిశీలించారు. సీఎం పాటను నిజం చేశా సిద్దిపేటజోన్: ‘కోటి అందాలతో కోమటి చెరువు ముస్తాబు అవుతోందని సీఎం కేసీఆర్ స్వయంగా పాట రాశారు. ఆ పాటను, సీఎం మాటను నేడు నిజం చేశాం. కేసీఆర్ ఆశీస్సులతో మామూలు చెరువును సుందరీకరణ చేసి పర్యాటక కేంద్రంగా మార్చాం’అని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. గురువారం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ.. సిద్దిపేట కోమటి చెరువుపై కేసీఆర్ ఎక్కువగా కాలక్షేపం చేసేవారని, చెరువు గట్టున కూర్చొని పాటలు రాసేవారని గుర్తు చేశారు. కోమటి చెరువును అభివృద్ధి చేయాలనే కోరిక సీఎంకు బలంగా ఉండేదని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడికతో కోమటి చెరువు సుందరీకరణకు అడుగు పడిందన్నారు. కేసీఆర్ ఆశీస్సులతో కోమటి చెరువు మినీ ట్యాంక్ బండ్‌గా రూపుదిద్దుకుందని పేర్కొన్నారు. జిల్లా ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు జిల్లాలో దాదాపు రూ.వెయ్యి కోట్ల విలువైన పనులను ప్రారంభించామని వెల్లడించారు. సిద్దిపేట జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేసినందుకు, వెయ్యి పడకల ఆస్పత్రికి చొరవ చూపినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు ఎప్పుడూ మీ సేవలు మరువరు.. ‘మీసేవలు ఎప్పటికీ మరువం. సిద్దిపేట బిడ్డగా మీరు చూపిన చొరవ అనిర్వచనీయం. మీ ఆశీర్వాదంతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకున్నాం. సిద్దిపేట ప్రజలు మీ సేవలను ఎప్పటికీ మరువరు’అని హరీశ్‌రావు సీఎంతో అన్నారు. ఒకప్పుడు ప్రభుత్వం ఇచ్చే ఇళ్లు మురికి వాడలుగా ఉండేవాని, నేడు టీఆర్ఎస్ ప్రభుత్వం.. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, కొండాపూర్ తరహాలో గేటెడ్ కమ్యూనిటీ మాదిరిగా ఇళ్ల నిర్మాణం చేయడం చాలా సంతోషమని పేర్కొన్నారు. సొంత ఇల్లు నిర్మించుకున్నంత శ్రద్ధతో పేదలకు ఇచ్చే ఇళ్ల నిర్మాణంలోనూ పని చేస్తున్నామని చెప్పారు. నర్సాపూర్ డబుల్ బెడ్రూం నిర్మాణాల కోసం 400 సార్లు పరిశీలన చేసి ఉండొచ్చని, నిర్మాణాల విషయంలో కలెక్టర్‌తో పాటు ప్రతి ఒక్కరూ సమష్టిగా పని చేశారని అభినందించారు. స్వచ్ఛ సిద్దిపేటలో భాగంగా యూజీడీని అమలు చేస్తున్నామని, కేసీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకొని సిద్దిపేటలో హరితహారం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, సీఎం ప్రసంగం అనంతరం మంత్రి హరీశ్‌రావు.. సీఎం కేసీఆర్‌కు పాదాభివందనం చేశారు. ఈ సందర్భంగా మంత్రిని పైకి లేపి సీఎం ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఆణిముత్యం మన హరీశ్ సిద్దిపేటజోన్: ‘పిల్లోడు హరీశ్ చాలా హుషారు. మంచి ఆణిముత్యం లాంటి నాయ కుడిని మీకు అప్పగించిన.. ఇయాళ ఆ పిల్లోడు కూడా అద్భుతమైన సిద్దిపేటను తయారు చేశాడు. నా పేరు నిలబెట్టిండు. నా గుండెల నిండా సంతోషం ఉంది. హరీశ్ కూడా చాలా హుషారుగా ఉన్నాడు. మంచి పనులు జరిగి నాయి. రిబ్బెన్లు కట్ చేసి పోతే చాలు అని హైదరాబాద్‌లో అన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఇస్తావా అంటూ మీ ముందు అడుగుతుండు. దొడ్లకు వచ్చిన గోద పెండ పెట్టదా అన్నట్లు అడిగినవి ఇస్తా, అడ గనివీ ఇస్తా. సిద్దిపేట అంటే తెలంగాణ ఉద్య మ పురిటిగడ్డ.. ఇది గట్టిపేట’అని సీఎం కేసీ ఆర్ వ్యాఖ్యానించారు. గురువారం జిల్లా పర్యటనలో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన సభలో ఆద్యంతం ఆర్థిక మంత్రి హరీశ్‌రావును సీఎం తన పొగడ్తలతో ముంచెత్తారు. ‘సిద్దిపేట, కరీంనగర్ నుంచి ఉద్యమ సమయంలో పోటీ చేసి రెండింట గెలిచా. అప్పుడు ఢిల్లీ వెళ్లాల్సి రావడంతో íసిద్దిపేటలో రాజీనామ చేశా. అప్పుడే హరీశ్‌రావును మీకు అప్పగించిన.. నాటి నుంచి నేటి వరకు హరీశ్ మీ అభిమానంతో మంచిగా పనులు చేస్తుం డు. మంచి నాయకుడుంటే అంతా మంచే జరుగుతుంది. ఒక గొప్ప అద్భుత పట్టణంగా తీర్చిదిద్దడంలో హరీశ్‌రావు కృషి ఫలించింది’అని కేసీఆర్ పేర్కొన్నారు. సీఎం ఏమన్నారంటే.. ఎన్ని నడకలు నడిచినమో.. నాకు సిద్దిపేట అంటే బలహీనత. ప్రాణం. ఇక్కడ నేను నిలబడ్డ జాగ నుంచి మొదలుపెడితే రంగనాయకసాగర్ ప్రాజెక్ట్ మధ్య గుట్టకు రాధాకృష్ణశర్మ, రసమయి బాలకృష్ణ, రాజనర్సు ఎన్ని నడకలు నడిచినమో. ఆ గుట్ట మీద నీళ్ల ట్యాంక్ కట్టడానికి కారెంట నడుచుకుంట,మోటారు సైకిళ్ల మీద తిరిగినం. మిషన్ భగీరథ ఘనత సిద్దిపేటదే ఒకప్పుడు సిద్దిపేటలో నీళ్లకు అరిగోస పడేటోళ్లు. గోస చూడలేక గుట్ట మీద నుంచి నేను రవాణా మంత్రిగా ఉన్నప్పుడే నీళ్ల కోసం తపన పడ్డా. అదే ఇప్పుడు రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచింది. అప్పటి నీటి పథకమే నేటి మిషన్ భగీరథ. ఇదంతా సిద్దిపేట గొప్పతనం. మీ అందరి దీవెనతో ఇయ్యాళ మిషన్ భగీరథను దేశ వ్యాప్తంగా మెచ్చుకుంటున్నారు. అందుకు మీరే స్ఫూర్తి. కేంద్రమే మెచ్చుకుంది. రాష్ట్రంలో 98.31 శాతం ఇళ్లకు నీటి కనెక్షన్లు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణే. కన్నీరు... పులకింత రంగనాయక్‌సాగర్‌లో ఇయ్యాళ నేను అన్నం తింటుంటే ఒక సైడ్ కళ్లెంట నీరు వస్తోంది. మరో వైపు ఒళ్లు పులకరించింది. ఒకప్పుడు తోర్నాల, పొన్నాలలో బావిలు తవ్వి ట్యాంకర్ల తోటి సిద్దిపేటకు నీరు తెచ్చుకున్నం. ఇయ్యాల కాళేశ్వరుడు, రంగనాయకుడి దయతో పుష్కలంగా నీళ్లు వచ్చినయి. అద్భుతమైన సిద్దిపేట సిద్దిపేట పేరులోనే బలం ఉంది.. ఇది మామూలు పేట కాదు.. సిద్ది పొందిన పేట. తెలంగాణను సిద్ధింపజేసిన గడ్డ. సిద్దిపేట లేకపోతే కేసీఆర్ లేడు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు. సిద్దిపేట అంటే ఒట్టిది కాదు. కవులు, కళాకారులు, మేధావులు ఎందరో గొప్ప చిత్రకారులను అందించిన సాంస్కృతిక, సాహిత్య తోట. మంత్రి హరీశ్, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, అందరు అధికారులు, ప్రజాప్రతినిధులు కలసి చేయడం వల్లే ఇది సాధ్యమైంది. జిల్లాల పునర్విభజనకూ స్ఫూర్తి అప్పట్లో నేను ఎమ్మెల్యేగా ఓడిపోయాను. ఎన్టీఆర్ సీఎం అయ్యారు. అప్పట్లో సిద్దిపేట గుండా కరీంనగర్‌కు పోతున్నట్లు తెలిసింది. పాత బస్టాండ్ వద్ద ఎన్టీఆర్‌ను కలిసి సిద్దిపేట జిల్లా చేయాలని మ్యాప్‌తో కూడిన వినతిపత్రం ఇచ్చి దండం పెట్టినా. ఫలితం లేదు. మీరిచ్చిన దీవెనలతో తెలంగాణను సాధించా. అదే స్ఫూర్తితో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో 33 జిల్లాలుగా పునర్విభజన చేశాం. అన్నింటా అభివృద్ధి పరుగులు పెడుతోంది. – సాక్షి, మెదక్ -
అన్ని జెడ్పీటీసీ స్థానాలు టీఆర్ఎస్ పార్టీవే..
దుబ్బాకటౌన్: ప్రాదేశిక ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో గురువారం ఆయన ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిలతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. మంచి పేరు ప్రజల్లో గుర్తింపు ఉన్న వారికే టికెట్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. టికెట్లు రాని కార్యకర్తలు నిరుత్సాహం చెందొద్దని పార్టీకోసం సేవ చేసిన వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు. వారికి నామినేట్ పదవుల్లో అవకాశం కల్పిస్తామన్నారు. ఎన్నికలేవైనా ప్రజలు కారు గుర్తుకు ఓట్లు వేస్తారన్నారు. త్వరలో జరుగబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలు పూర్తిగా ఏకపక్షంగానే జరుగుతాయన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లా పరిషత్ చైర్మన్లు టీఆర్ఎస్ ఖాతాలోకే వస్తాయన్నారు. ఎంపీటీసీలు కూడ అదే స్థాయిలో టీఆర్ఎస్ గెలుస్తుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కూడా పునరావృతం అవుతాయన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో 16 ఎంపీ సీట్లు గెలిచి మే 23 తర్వాత కేంద్రంలో ఏర్పడబోయే కేంద్ర ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తుందన్నారు. అలాగే మెదక్ ఎంపీగా కొత్త ప్రభాకర్‌రెడ్డి రికార్డు స్థాయి మెజార్టీతో గెలువబోతున్నాడన్నారు. నాలుగు నుంచి 5 లక్షలకు పైగా మెజార్టీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
సిద్దిపేట సిద్ధం!
కొలిక్కి వచ్చిన నైసర్గిక స్వరూపం 36 అంశాలు కీలకం 30 మండలాలతో జిల్లా ఏర్పాటుకు నిర్ణయం ‘కొమరెల్లి మల్లన్న’ సిద్దిపేటలోకే.. సమాచార సేకరణలో యంత్రాంగం బిజీబిజీ సిద్దిపేట జిల్లా ఏర్పాటుకు కసరత్తు ముమ్మరం చేస్తున్నారు. జిల్లాకు సంబంధించిన వివరాల సేకరణలో పలు శాఖల అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లాల విభజన కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అధ్యక్షతన కమిటీ నియమించిన సంగతి తెలిసిందే. మొత్తం ఆరు విభాగాల్లో 36 అంశాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ)కు పంపనున్నారు. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సిద్దిపేట జిల్లా దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలతో పాటు పక్కనున్న వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచి కొంత భాగాన్ని కలుపనున్నారు. పూర్తి నియోజకవర్గాలతో సంబంధం లేకుండా సిద్దిపేట పట్టణ ప్రాంతానికి సుమారు 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలను సిద్దిపేట జిల్లా పరిధిలోకి తీసుకువచ్చే విధంగా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. మొత్తం 30 మండలాలతో జిల్లాను ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పూర్తి నియోజకవర్గం, మానకొండూర్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట, బెజ్జంకి, ఉస్నాబాద్ మండలాలు, వరంగల్ జిల్లా జనగామ నియోజకవర్గంలోని చేర్యాల , బచ్చన్నపేట, నర్మెట మండలాలతో పాటు మెదక్ నియోజకవర్గంలోని రామాయంపేట మండలాన్ని కలిపే విధంగా ప్రణాళిక రూపొందించారు. ఇదే జరిగితే వరంగల్ జిల్లాలోని ప్రఖ్యాత కొమురవెల్లి మల్లన్న పుణ్య క్షేత్రం సిద్దిపేట జిల్లాలోకే వస్తుంది. మెదక్ జిల్లాను కూడా చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినప్పటికి అది ఇప్పట్లో సాధ్యయేటట్లు కనిపించడం లేదు. ఇదిలా ఉండగా.. గత నెల 26 నాటికే జిల్లా సమాచారం పంపాల్సి ఉన్నా సమాచార సేకరణలో ప్రభుత్వ శాఖలు జాప్యం చేస్తున్నాయి. ఇప్పటివరకు కేవలం 12 శాఖలకు సంబంధించిన సమాచారమే వచ్చిందని, కీలక శాఖల సమాచారం రాలేదని తెలుస్తోంది. వారం రోజుల్లో నివేదికను సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారం, పది రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం అడిగిన విధంగా సమాచారాన్ని పంపేందుకు అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఆరు విభాగాలుగా సమాచార సేకరణ ... ఒకటో విభాగం: రెవెన్యూ డివిజన్లు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీటీ సీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ల వివరాలు... జిల్లాలో ఉన్న ఇళ్లు, గ్రామీణ, పట్టణ జనాభా ఎంత? లింగ నిష్పత్తి, అక్షరాస్యత వివరాలు, కార్మికుల సంఖ్య. రెండో విభాగం: వివిధ ప్రాంతాల చారిత్రక అనుబంధం, భౌగోళిక, సహజ వనరులు, అటవీ సంపద వివరాలు, సాగుకు యోగ్యం కాని భూమి, వ్యవసాయేతర అవసరాల్లో ఉన్న భూమి వివరాలు మూడో విభాగం: జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, డైట్ కళాశాలలు, సంక్షేమ హాస్టళ్లు, బీఈడీ, ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, పాలిటెక్నిక్, ఫార్మా, మెడికల్ కళాశాలల వివరాలు, జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు, వన్యప్రాణి సంరక్షణ, చారిత్రక ప్రాముఖ్యత. నాలుగో విభాగం: పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, జౌళి మిల్లులు, లెదర్, చెక్కబొమ్మలు, పేపర్ పరిశ్రమలు, మీడియా ప్రచురణ కేంద్రాలు, పెట్రో ఉత్పత్తులు, రసాయన, ఔషధ పరిశ్రమలు, రబ్బర్, ప్లాస్టిక్, మెటల్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్, మోటార్ వెహికిల్స్, వేర్‌హౌజింగ్, ఫర్నీచర్ పరిశ్రమలు. ఐదో విభాగం: విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ లెక్కలు, రోడ్ల వివరాలు, జాతీయ రహదారులు, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ రోడ్లు, రైల్వే స్టేషన్లు, ఎన్ని కిలోమీటర్ల లైన్ ఉంది, ఆర్టీసీ డిపోలు, వాటి ఆర్థిక స్తోమత, పోస్టాఫీసులు, టెలిఫోన్ ఎక్స్ఛేంజ్లు, పబ్లిక్ టెలిఫోన్లు, టెలిఫోన్ కనెక్షన్లు, జిల్లాలో ఆస్తిపన్ను రాబడి వివరాలు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయ వివరాలు, నిత్యావసరాల పన్నులు, ఎక్సైజ్, వాణిజ్య శాఖల పన్నులు, మోటారు వాహనాల పన్నులు, బ్యాంకులు, డిపాజిట్లు, కార్మిక, ఉపాధి వివరాలు, వ్యవసాయ భూముల పంపిణీ, బలహీనవర్గాలకు ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం, మంచినీటి సరఫరా పథకాలు, రేషన్‌షాపులు, పెట్రోలు బంకులు, వ్యక్తిగత మరుగుదొడ్లు, గ్యాస్ఏజెన్సీలు, రైస్‌మిల్లులు, కిరోసిన్ డీలర్లు, స్వయంసహాయక సంఘాల పనితీరు, ఉపాధి హామీ అమలు, మున్సిపాలిటీలు, జడ్పీ, మండల పరిషత్, గ్రామ పంచాయతీల ఆదాయ, వ్యయాలు, రైతు బజార్లు, వ్యవసాయ మార్కెట్లు, గోడౌన్లు, పోలీసు సిబ్బంది, స్టేషన్లు, జైళ్లు, ఖైదీలు, నేరాల సంఖ్య. ఆరో విభాగం: సరిహద్దులతో కూడిన మ్యాపు తయారీ.