జార్ఖండ్‌లోని గోవిందపూర్ పోలీస్ స్టేషన్‌లో కుటుంబీకులతో పన్సారీ, రియా
సాక్షి,సిద్దిపేటజోన్(హైదరాబాద్): అగ్ని సాక్షిగా ఏడు అడుగులతో ఒక్కటయ్యారు. ఏం జరిగిందో తెలియదు ఆ భార్య.. భర్తకు దూరమైంది. రాష్ట్ర సరిహద్దులు దాటింది. ఊరుకాని ఊరు, భాష రాని ప్రాంతానికి చేరుకుంది. నాలుగు ఏళ్లుగా రోడ్లవెంట ఐదేళ్ల కూతురును పట్టుకొని అనాథగా తిరిగింది. పోలీసుల జోక్యంతో సఖి కేంద్రానికి చేరుకుంది. అభాగ్యురాలి వివరాలు సేకరించి రెస్క్యూ టీం ఎట్టకేలకు భర్త చెంతకు చేర్చి ఆమెను కథ సుఖాంతం చేశారు. వివరాలకు వెళ్తే.. జార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్‌పూర్ పరిధిలోని మాన్పిట్ ప్రాంతానికి చెందిన కుదిరామ్, పన్సారీ దంపతులు. వీరికి క్రిష్(12), నిర్మల్(7), రియా(5) ముగ్గురు పిల్లలు.
నాలుగేళ్ల క్రితం పన్సారీ కూతురు రియాతో బయటకు వచ్చి తప్పిపోయింది. అప్పట్లోనే ఆమె భర్త కుదిరామ్ అక్కడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. కానీ ఆమె ఆచూకీ లభించలేదు. కాగా ఈ నెల 23వ తేదీన ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుపై తల్లీకూతురు తిరుగుతూ పోలీసులకు కనిపించారు. పోలీసులు ఆమె వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసినా సరైన సమాధానం రాలేదు. దీంతో సంరక్షణ నిమిత్తం సిద్దిపేట సఖి కేంద్రానికి తరలించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఆమె ఆరోగ్య స్థితిగతుల కోసం వైద్య పరీక్షలు నిర్వహించి కేంద్రంలోనే వసతి కల్పించారు.
విషయం తెలుసుకున్న పోలీస్ కమిషనర్ శ్వేత ఆమెను స్వస్థలానికి పంపించేలా ఏర్పాట్లు చేయాలని మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సైదాను ఆదేశించారు. ఆమె ద్వారా కుటుంబ సభ్యుల వివరాలు సేకరించగా.. వారు జార్ఖండ్ ప్రాంతానికి చెందిన వారమని, తప్పిపోయి వచ్చామని తెలిపింది. వెంటనే సఖి కేంద్రం ఇన్‌చార్జి ప్రతిమ ఈ విషయాన్ని సీపీ శ్వేత దృష్టికి తీసుకెళ్లారు. ఆమె జార్ఖండ్‌లోని అక్కడి సఖి అధికారులకు ఫొటోలు, వివరాలు పంపించారు. తర్వాత అక్కడి అధికారుల ప్రయత్నాలు ఫలించాయి పన్సారీ భర్త కుదిరామ్ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఇక్కడకు రాలేకపోయాడు. దీంతో స్థానిక సఖి నిర్వాహకులు, పోలీసులు ప్రత్యేక వాహనం ద్వారా తల్లీకూతురును జార్ఖండ్‌లోని గోవిందపూర్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం కుదిరామ్‌కు అప్పగించారు. భార్య, కూతురును క్షేమంగా అప్పగించినందుకు సిద్దిపేట జిల్లా పోలీసులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఽ
Comments
Please login to add a commentAdd a comment