విలపిస్తున్న కుటుంబ సభ్యులు
సాక్షి,వర్గల్(సిద్దిపేట): ‘పాడె’ కట్టె కాలనాగైంది. అంత్యక్రియల కలప కోసం వచ్చిన వ్యక్తిని విద్యుత్‌షాక్ రూపంలో కాటేసింది. పాడె కట్టేందుకు అవసరమైన వెదురు చెట్టును కొడుతుండగా అది విద్యుత్‌లైన్‌కు తాకడంతో ఈ దుర్ఘటన సంభవించింది. మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.... మజీద్‌పల్లికి చెందిన ఎంపీటీసీ మాజీ సభ్యుడు లింగ లక్ష్మినర్సయ్య అనారోగ్యంతో మృతిచెందాడు.
బుధవారం అతడి అంత్యక్రియల కోసం పాడె కట్టేందుకు అవసరమైన వెదురు కట్టెలు తెచ్చేందుకు గ్రామశివారులోని విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రాంతానికి గాలం స్వామి(38), పాలేటి ధర్మరాజు, చిగురుఎత్తు రాజు వెళ్లారు. అక్కడ వెదురు చెట్టును స్వామి గొడ్డలితో కొడుతుండగా అది పక్కనే ఉన్న విద్యుత్ లైన్ వైర్లను తాకింది. దీంతో అతను తీవ్ర విద్యుత్ షాక్‌కు గురై అపస్మారక స్థితిలో పడిపోయాడు. పక్కనే ఉన్న మిగతా ఇద్దరు అప్రమత్తమై దూరంగా జరిగి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వారు వెంటనే తెలిసిన వారికి సమాచారం చేరవేసి స్వామిని గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
పేద కుటుంబంలో పెను విషాదం
గాలం స్వామి మృత్యువాత పడిన సమాచారంతో కుటుంబసభ్యులు బోరుమని విలపించారు. మృతుడికి భార్య లక్ష్మి, 18 సంవత్సరాలలోపు ఏసుమణి, సంధ్య, కార్తీక్ పిల్లలు ఉన్నారు. తండ్రి సత్తయ్య కూడా వీరి వద్దనే ఉంటున్నాడు. పెద్దగా ఆస్తిపాస్తులు లేని ఆ కుటుంబం స్వామి సంపాదనపైనే ఆధారపడి జీవిస్తోంది. పెద్ద దిక్కును కోల్పోయి ఆ కుటుంబం పెనువిషాదంలో మునిగిపోయింది. ఆస్పత్రి వద్ద వారి రోదనలు ఆపడం ఎవరి తరం కాలేదు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: పెళ్లి కావడం లేదని బాధ.. ఉదయం తలుపు బద్దలు కొట్టి చూస్తే..
Comments
Please login to add a commentAdd a comment