సిద్దిపేటలో ఎయిర్‌పోర్టు : కేసీఆర్‌ | CM KCR Visits Siddipet With Harish Rao | Sakshi
Sakshi News home page

సిద్దిపేటలో ఎయిర్‌పోర్టు : కేసీఆర్‌

Published Fri, Dec 11 2020 4:10 AM | Last Updated on Fri, Dec 11 2020 9:40 AM

CM KCR Visits Siddipet With Harish Rao - Sakshi

సాక్షి, మెదక్‌ : ‘సిద్దిపేట పట్టణం అన్ని వ్యాపార, వాణిజ్య కేంద్రాలకు కేంద్ర బిందువు.. ఇది డైనమిక్‌ ప్లేస్‌.. హైదరాబాద్‌కు సమాన స్థాయిలో అభివృద్ధి చెందుతోంది. త్వరలో రైలు సౌకర్యం కూడా వస్తుంది. ఇక ఒక్కటే మిగిలింది.. ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టు ఏర్పాటు చేస్తాం. ఈ కల కూడా నెరవేరుస్తా’ అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. జిల్లాలో గురువారం ఆయన చేపట్టిన పర్యటన బిజీబిజీగా సాగింది. ఆర్థిక మంత్రి హరీశ్‌రావుతో కలసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రెండు శంకుస్థాపనలు, 5 ప్రారంభోత్సవాలతో పాటు ఒక పరిశీలన చేపట్టారు. చివరగా బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. మంత్రి హరీశ్‌రావు కోరినవి మం జూరు చేస్తూనే.. అడగనివి కూడా ఇస్తూ వరాల జల్లు కురిపించారు. రాజధానితో పాటు సిద్దిపేటలో పట్టణీకరణ వేగంగా జరుగుతోందని.. ఈ నియోజకవర్గంలో అవినీతికి తావు లేదని.. అధికారులు, నాయకులు, శ్రేణులు అందరూ కలిసి సిద్దిపేటను బాగా అభివృద్ధి చేశారని.. ఇండియాకే రోల్‌మోడల్‌గా నిలుస్తోందని కితాబి చ్చారు. సిద్దిపేట మరింత అభివృద్ధి చెందేందుకు ఎల్లప్పుడూ సహకారం అందిస్తానన్నారు.

కరెంట్, నీళ్ల కష్టాలు తొలగినయ్‌..
తెలంగాణకు కరెంటు, నీళ్ల కష్టాలు తీరాయని సీఎం పేర్కొన్నారు. రంగ నాయక్‌ సాగర్‌లో నీళ్లు చూస్తుంటే ఒళ్లు పులకిస్తోందన్నారు. స్వచ్ఛ, హరిత సిద్దిపేటను చూస్తుంటే సంతో షంగా ఉందన్నారు. కోటి అందాల కోమటిచెరువు వంతెనపై నడుచు కుంటూ పరిశీలించానని.. అద్భు తంగా ఉందన్నారు. కోమటిచెరువు, నెక్లెస్‌రోడ్‌తో జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందని చెప్పారు. హైదరాబాద్‌లోని గేటెడ్‌ కమ్యూనిటీ తరహాలో నర్సాపూర్‌లో నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇళ్లు తలమానికంగా నిలిచాయన్నారు. ఐటీ టవర్‌ శంకుస్థాపన చేసినా.. పూర్తయేందుకు çఏడాది పడుతుందని చెప్పారు. ప్రస్తుతం కొనసాగుతున్న కలెక్టరేట్‌లో తాత్కాలిక ఐటీ టవర్‌ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి, కలెక్టర్‌ను ఆదేశించారు. కంపెనీ వాళ్లు తొలిదశలో 900 మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పడం శుభ పరిణామమన్నారు. కాగా, సిద్దిపేటకు మరో రింగ్‌రోడ్డు రానుంది. ఇర్కోడ్‌ క్రాస్‌ రోడ్డు నుంచి పొన్నాల క్రాస్‌ రోడ్డు వరకు 64 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. ఈ నిర్మాణంతో హుస్నాబాద్, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, మెదక్‌ జిల్లాలకు వెళ్లే వారికి దూరం తగ్గుతుంది. సీఎం వెంట మంత్రులు హరీశ్‌రావుతో పాటు ఈటల రాజేందర్, నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు సంతోష్‌కుమార్, ప్రభాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. 


సీఎం వరాల జల్లు..

  1. బహిరంగ సభ ప్రారంభంలో జిల్లా అభివృ ద్ధికి అవసరమైన కొన్ని అంశాలను సీఎం కేసీఆర్‌ దృష్టికి మంత్రి హరీశ్‌రావు తేగా. వెంటనే కేసీఆర్‌ వరాల జల్లు కురిపించారు.
  2. మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌కు అనుసంధా నంగా సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, మిరుదొడ్డి మండలాల పరిధిలోని 18 గ్రామాల్లో సాగు నీటి కోసం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ఏర్పాటుకు రూ.80 కోట్లు విడుదల చేస్తామని కేసీఆర్‌ చెప్పారు. శుక్రవారం జీవో జారీ చేస్తామని వెల్లడించారు.
  3. సిద్దిపేట నుంచి కరీంనగర్‌ జిల్లా ఇల్లంతకుంటకు వెళ్లే రహదారిని ఫోర్‌ లేన్‌ రోడ్డుగా మారుస్తామన్నారు. ఈ ప్రక్రియ చేపట్టాలని.. అక్కడే ఉన్న మంత్రి ప్రశాంత్‌రెడ్డికి సూచించారు.
  4. నర్సాపూర్‌లో నిర్మించిన డబుల్‌ బెడ్రూం నిర్మాణాలకు సంబంధించి అదనంగా మరో వెయ్యి ఇళ్లు మంజూరు చేయాలని హరీశ్‌రావు కోరగా.. సీఎం వెంటనే మంజూరు చేశారు. ఊ    రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌ను అంతర్జాతీయ టూరిస్ట్‌ స్పాట్‌గా చేసేందుకు తక్షణం రూ.100 కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. ఈ బాధ్యత హరీశ్‌రావుదేనని పేర్కొన్నారు.
  5.  కోమటి చెరువు, రింగ్‌ రోడ్డు సుందరీకరణకు మరో రూ.25 కోట్లు కేటాయిస్తామని తెలిపారు.
  6.  గజ్వేల్‌లో కవులు, కళాకారులు, చిత్రకారులకు నిర్మించినట్లు సిద్దిపేటలోనూ ఆడిటోరియం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. రూ.50 కోట్లు కేటాయిస్తామని.. రెండు వేల మంది సీటింగ్‌తో ఏర్పాటు చేసేలా స్థలం సేకరించాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
  7. సిద్దిపేటలో త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మరో ఇంటిగ్రేటెడ్‌ వెజ్, నాన్‌వెజిటేబుల్‌ మార్కె ట్‌ ఏర్పాటు చేయాలన్నారు. కాగా, సీఎం కేసీఆర్‌ ఉదయం ఎర్రవల్లి నుంచి సిద్దిపేట కు వచ్చారు. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన పర్యటన సాయంత్రం 4.30 గంటలకు ముగిసింది. సుమారు 5 గంటలపాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.


బిజీబిజీగా పర్యటన..

  1.  కొండపాక మండలంలోని దుద్దెడ శివారు లో రూ.45 కోట్లతో మూడు ఎకరాల విస్తీర్ణంలో ఐదంతస్తుల ఐటీ టవర్‌ నిర్మాణా నికి సీఎం శంకుస్థాపన చేశారు. తొలిరోజే నాలుగు ఐటీ కంపెనీలు (జోలాన్‌ టెక్నాలజీ, విసాన్‌టెక్, ఎంబ్రోడ్స్‌ టెక్నాలజీ, సెట్విన్‌) రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నాయి. ఐటీ విస్తరణతో జిల్లాలో తొలిదశలో సుమారు రెండు వేల మందికి ఉపాధి లభించనుంది. 
  2.  సిద్దిపేటలో నిర్మించిన టీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు.
  3. జిల్లాలో రూ.22 లక్షల వ్యయంతో సిద్దిపేట రూరల్‌ మండలంలోని మిట్టపల్లి క్లస్టర్‌లో నిర్మించిన తొలి రైతువేదికను సీఎం ప్రారంభించారు.
  4.  పట్టణ పరిధిలో రూ.715 కోట్ల వ్యయంతో 2,99,852 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన మెడికల్‌ కాలేజీని సీఎం ప్రారంభించారు. రూ.225 కోట్ల వ్యయంతో నిర్మించనున్న వెయ్యి పడకల ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
  5. నర్సాపూర్‌లో గేటెడ్‌ కమ్యూనిటీ తరహాలో 45 ఎకరాల విస్తీర్ణంలో జీ ప్లస్‌ 2 పద్ధతిన మొత్తం 2,460 ఇళ్లు నిర్మించారు. ఇందులో మొదటి విడతగా 1,341 లబ్ధిదారులకు అందజేయనున్నారు. సీఎం సమక్షంలో 144 మంది గృహప్రవేశాలు చేశారు. సీఎం 9వ బ్లాక్‌లోని మూడో ఇంటిలో స్వాతి– దేవేందర్‌ దంపతులు, మహ్మద్‌ సద్దాం, రాజ్‌కౌర్, యాక భాగ్యతో కలసి సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఫంక్షన్‌హాల్, సమీకృత మార్కెట్‌ను ప్రారంభించారు.
  6.  పట్టణాన్ని స్వచ్ఛ సిద్దిపేటగా మార్చేందుకు రూ.278.50 కోట్ల వ్యయంతో నిర్మించిన అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థను సీఎం ప్రారంభించారు.
  7. 3.50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన రంగనాయక సాగర్‌ రిజర్వాయర్‌ మధ్య పల్లగుట్ట ద్వీపంలో నిర్మించిన నీటిపారుదల శాఖ అతిథి గృహాన్ని సీఎం ప్రారంభించారు. పట్టణంలోని కోమటి చెరువులో జరిగిన సుందరీకరణ పనులను సీఎం పరిశీలించారు. నెక్లెస్‌ రోడ్‌ వెంట కాలినడకన తిరుగుతూ పరిశీలించారు. 

సీఎం పాటను నిజం చేశా
సిద్దిపేటజోన్‌: ‘కోటి అందాలతో కోమటి చెరువు ముస్తాబు అవుతోందని సీఎం కేసీఆర్‌ స్వయంగా పాట రాశారు. ఆ పాటను, సీఎం మాటను నేడు నిజం చేశాం. కేసీఆర్‌ ఆశీస్సులతో మామూలు చెరువును సుందరీకరణ చేసి పర్యాటక కేంద్రంగా మార్చాం’అని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. గురువారం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ.. సిద్దిపేట కోమటి చెరువుపై కేసీఆర్‌ ఎక్కువగా కాలక్షేపం చేసేవారని, చెరువు గట్టున కూర్చొని పాటలు రాసేవారని గుర్తు చేశారు. కోమటి చెరువును అభివృద్ధి చేయాలనే కోరిక సీఎంకు బలంగా ఉండేదని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిషన్‌ కాకతీయ ద్వారా చెరువుల పూడికతో కోమటి చెరువు సుందరీకరణకు అడుగు పడిందన్నారు. కేసీఆర్‌ ఆశీస్సులతో కోమటి చెరువు మినీ ట్యాంక్‌ బండ్‌గా రూపుదిద్దుకుందని పేర్కొన్నారు. జిల్లా ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు జిల్లాలో దాదాపు రూ.వెయ్యి కోట్ల విలువైన పనులను ప్రారంభించామని వెల్లడించారు. సిద్దిపేట జిల్లాకు మెడికల్‌ కాలేజీ మంజూరు చేసినందుకు, వెయ్యి పడకల ఆస్పత్రికి చొరవ చూపినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. 

ప్రజలు ఎప్పుడూ మీ సేవలు మరువరు.. 
‘మీసేవలు ఎప్పటికీ మరువం. సిద్దిపేట బిడ్డగా మీరు చూపిన చొరవ అనిర్వచనీయం. మీ ఆశీర్వాదంతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకున్నాం. సిద్దిపేట ప్రజలు మీ సేవలను ఎప్పటికీ మరువరు’అని హరీశ్‌రావు సీఎంతో అన్నారు. ఒకప్పుడు ప్రభుత్వం ఇచ్చే ఇళ్లు మురికి వాడలుగా ఉండేవాని, నేడు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, కొండాపూర్‌ తరహాలో గేటెడ్‌ కమ్యూనిటీ మాదిరిగా ఇళ్ల నిర్మాణం చేయడం చాలా సంతోషమని పేర్కొన్నారు. సొంత ఇల్లు నిర్మించుకున్నంత శ్రద్ధతో పేదలకు ఇచ్చే ఇళ్ల నిర్మాణంలోనూ పని చేస్తున్నామని చెప్పారు. నర్సాపూర్‌ డబుల్‌ బెడ్రూం నిర్మాణాల కోసం 400 సార్లు పరిశీలన చేసి ఉండొచ్చని, నిర్మాణాల విషయంలో కలెక్టర్‌తో పాటు ప్రతి ఒక్కరూ సమష్టిగా పని చేశారని అభినందించారు. స్వచ్ఛ సిద్దిపేటలో భాగంగా యూజీడీని అమలు చేస్తున్నామని, కేసీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకొని సిద్దిపేటలో హరితహారం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, సీఎం ప్రసంగం అనంతరం మంత్రి హరీశ్‌రావు.. సీఎం కేసీఆర్‌కు పాదాభివందనం చేశారు. ఈ సందర్భంగా మంత్రిని పైకి లేపి సీఎం ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.  

ఆణిముత్యం  మన హరీశ్‌
సిద్దిపేటజోన్‌: ‘పిల్లోడు హరీశ్‌ చాలా హుషారు. మంచి ఆణిముత్యం లాంటి నాయ కుడిని మీకు అప్పగించిన.. ఇయాళ ఆ పిల్లోడు కూడా అద్భుతమైన సిద్దిపేటను తయారు చేశాడు. నా పేరు నిలబెట్టిండు. నా గుండెల నిండా సంతోషం ఉంది. హరీశ్‌ కూడా చాలా హుషారుగా ఉన్నాడు. మంచి పనులు జరిగి నాయి. రిబ్బెన్లు కట్‌ చేసి పోతే చాలు అని హైదరాబాద్‌లో అన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఇస్తావా అంటూ మీ ముందు అడుగుతుండు. దొడ్లకు వచ్చిన గోద పెండ పెట్టదా అన్నట్లు అడిగినవి ఇస్తా, అడ గనివీ ఇస్తా. సిద్దిపేట అంటే తెలంగాణ ఉద్య మ పురిటిగడ్డ.. ఇది గట్టిపేట’అని సీఎం కేసీ ఆర్‌ వ్యాఖ్యానించారు. గురువారం జిల్లా పర్యటనలో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన సభలో ఆద్యంతం ఆర్థిక మంత్రి హరీశ్‌రావును సీఎం తన పొగడ్తలతో ముంచెత్తారు. ‘సిద్దిపేట, కరీంనగర్‌ నుంచి ఉద్యమ సమయంలో పోటీ చేసి రెండింట గెలిచా. అప్పుడు ఢిల్లీ వెళ్లాల్సి రావడంతో íసిద్దిపేటలో రాజీనామ చేశా. అప్పుడే హరీశ్‌రావును మీకు అప్పగించిన.. నాటి నుంచి నేటి వరకు హరీశ్‌ మీ అభిమానంతో మంచిగా పనులు చేస్తుం డు. మంచి నాయకుడుంటే అంతా మంచే జరుగుతుంది. ఒక గొప్ప అద్భుత పట్టణంగా తీర్చిదిద్దడంలో హరీశ్‌రావు కృషి ఫలించింది’అని కేసీఆర్‌ పేర్కొన్నారు.  

సీఎం ఏమన్నారంటే..

ఎన్ని నడకలు నడిచినమో..
నాకు సిద్దిపేట అంటే బలహీనత. ప్రాణం. ఇక్కడ నేను నిలబడ్డ జాగ నుంచి మొదలుపెడితే రంగనాయకసాగర్‌ ప్రాజెక్ట్‌ మధ్య గుట్టకు రాధాకృష్ణశర్మ, రసమయి బాలకృష్ణ, రాజనర్సు ఎన్ని నడకలు నడిచినమో. ఆ గుట్ట మీద నీళ్ల ట్యాంక్‌ కట్టడానికి కారెంట నడుచుకుంట,మోటారు సైకిళ్ల మీద తిరిగినం.

మిషన్‌ భగీరథ ఘనత సిద్దిపేటదే
ఒకప్పుడు సిద్దిపేటలో నీళ్లకు అరిగోస పడేటోళ్లు. గోస చూడలేక గుట్ట మీద నుంచి నేను రవాణా మంత్రిగా ఉన్నప్పుడే నీళ్ల కోసం తపన పడ్డా. అదే ఇప్పుడు రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచింది. అప్పటి నీటి పథకమే నేటి మిషన్‌ భగీరథ. ఇదంతా సిద్దిపేట గొప్పతనం. మీ అందరి దీవెనతో ఇయ్యాళ మిషన్‌ భగీరథను దేశ వ్యాప్తంగా మెచ్చుకుంటున్నారు. అందుకు మీరే స్ఫూర్తి. కేంద్రమే మెచ్చుకుంది. రాష్ట్రంలో 98.31 శాతం ఇళ్లకు నీటి కనెక్షన్లు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణే. 

కన్నీరు... పులకింత
రంగనాయక్‌సాగర్‌లో ఇయ్యాళ నేను అన్నం తింటుంటే ఒక సైడ్‌ కళ్లెంట నీరు వస్తోంది. మరో వైపు ఒళ్లు పులకరించింది. ఒకప్పుడు తోర్నాల, పొన్నాలలో బావిలు తవ్వి ట్యాంకర్ల తోటి సిద్దిపేటకు నీరు తెచ్చుకున్నం. ఇయ్యాల కాళేశ్వరుడు, రంగనాయకుడి దయతో పుష్కలంగా నీళ్లు వచ్చినయి. 

అద్భుతమైన సిద్దిపేట
సిద్దిపేట పేరులోనే బలం ఉంది.. ఇది మామూలు పేట కాదు.. సిద్ది పొందిన పేట. తెలంగాణను సిద్ధింపజేసిన గడ్డ. సిద్దిపేట లేకపోతే కేసీఆర్‌ లేడు. కేసీఆర్‌ లేకపోతే తెలంగాణ లేదు. సిద్దిపేట అంటే ఒట్టిది కాదు. కవులు, కళాకారులు, మేధావులు ఎందరో గొప్ప చిత్రకారులను అందించిన సాంస్కృతిక, సాహిత్య తోట. మంత్రి హరీశ్, కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి, అందరు అధికారులు, ప్రజాప్రతినిధులు కలసి చేయడం వల్లే ఇది సాధ్యమైంది.

జిల్లాల పునర్విభజనకూ స్ఫూర్తి
అప్పట్లో నేను ఎమ్మెల్యేగా ఓడిపోయాను. ఎన్టీఆర్‌ సీఎం అయ్యారు. అప్పట్లో సిద్దిపేట గుండా కరీంనగర్‌కు పోతున్నట్లు తెలిసింది. పాత బస్టాండ్‌ వద్ద ఎన్టీఆర్‌ను కలిసి సిద్దిపేట జిల్లా చేయాలని మ్యాప్‌తో కూడిన వినతిపత్రం ఇచ్చి దండం పెట్టినా. ఫలితం లేదు. మీరిచ్చిన దీవెనలతో తెలంగాణను సాధించా. అదే స్ఫూర్తితో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో 33 జిల్లాలుగా పునర్విభజన చేశాం. అన్నింటా అభివృద్ధి పరుగులు పెడుతోంది.     – సాక్షి, మెదక్‌  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement