కొలిక్కి వచ్చిన నైసర్గిక స్వరూపం
36 అంశాలు కీలకం
30 మండలాలతో జిల్లా ఏర్పాటుకు నిర్ణయం
‘కొమరెల్లి మల్లన్న’ సిద్దిపేటలోకే..
సమాచార సేకరణలో యంత్రాంగం బిజీబిజీ
సిద్దిపేట జిల్లా ఏర్పాటుకు కసరత్తు ముమ్మరం చేస్తున్నారు. జిల్లాకు సంబంధించిన వివరాల సేకరణలో పలు శాఖల అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లాల విభజన కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అధ్యక్షతన కమిటీ నియమించిన సంగతి తెలిసిందే. మొత్తం ఆరు విభాగాల్లో 36 అంశాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ)కు పంపనున్నారు.
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సిద్దిపేట జిల్లా దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలతో పాటు పక్కనున్న వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచి కొంత భాగాన్ని కలుపనున్నారు. పూర్తి నియోజకవర్గాలతో సంబంధం లేకుండా సిద్దిపేట పట్టణ ప్రాంతానికి సుమారు 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలను సిద్దిపేట జిల్లా పరిధిలోకి తీసుకువచ్చే విధంగా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. మొత్తం 30 మండలాలతో జిల్లాను ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పూర్తి నియోజకవర్గం, మానకొండూర్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట, బెజ్జంకి, ఉస్నాబాద్ మండలాలు, వరంగల్ జిల్లా జనగామ నియోజకవర్గంలోని చేర్యాల , బచ్చన్నపేట, నర్మెట మండలాలతో పాటు మెదక్ నియోజకవర్గంలోని రామాయంపేట మండలాన్ని కలిపే విధంగా ప్రణాళిక రూపొందించారు.
ఇదే జరిగితే వరంగల్ జిల్లాలోని ప్రఖ్యాత కొమురవెల్లి మల్లన్న పుణ్య క్షేత్రం సిద్దిపేట జిల్లాలోకే వస్తుంది. మెదక్ జిల్లాను కూడా చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినప్పటికి అది ఇప్పట్లో సాధ్యయేటట్లు కనిపించడం లేదు. ఇదిలా ఉండగా.. గత నెల 26 నాటికే జిల్లా సమాచారం పంపాల్సి ఉన్నా సమాచార సేకరణలో ప్రభుత్వ శాఖలు జాప్యం చేస్తున్నాయి. ఇప్పటివరకు కేవలం 12 శాఖలకు సంబంధించిన సమాచారమే వచ్చిందని, కీలక శాఖల సమాచారం రాలేదని తెలుస్తోంది. వారం రోజుల్లో నివేదికను సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారం, పది రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం అడిగిన విధంగా సమాచారాన్ని పంపేందుకు
అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు.
ఆరు విభాగాలుగా సమాచార సేకరణ ...
ఒకటో విభాగం: రెవెన్యూ డివిజన్లు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీటీ సీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌ల వివరాలు... జిల్లాలో ఉన్న ఇళ్లు, గ్రామీణ, పట్టణ జనాభా ఎంత? లింగ నిష్పత్తి, అక్షరాస్యత వివరాలు, కార్మికుల సంఖ్య.
రెండో విభాగం: వివిధ ప్రాంతాల చారిత్రక అనుబంధం, భౌగోళిక, సహజ వనరులు, అటవీ సంపద వివరాలు, సాగుకు యోగ్యం కాని భూమి, వ్యవసాయేతర అవసరాల్లో ఉన్న భూమి వివరాలు
మూడో విభాగం: జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, డైట్ కళాశాలలు, సంక్షేమ హాస్టళ్లు, బీఈడీ, ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, పాలిటెక్నిక్, ఫార్మా, మెడికల్ కళాశాలల వివరాలు, జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు, వన్యప్రాణి సంరక్షణ, చారిత్రక ప్రాముఖ్యత.
నాలుగో విభాగం: పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, జౌళి మిల్లులు, లెదర్, చెక్కబొమ్మలు, పేపర్ పరిశ్రమలు, మీడియా ప్రచురణ కేంద్రాలు, పెట్రో ఉత్పత్తులు, రసాయన, ఔషధ పరిశ్రమలు, రబ్బర్, ప్లాస్టిక్, మెటల్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్, మోటార్ వెహికిల్స్, వేర్‌హౌజింగ్, ఫర్నీచర్ పరిశ్రమలు.
ఐదో విభాగం: విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ లెక్కలు, రోడ్ల వివరాలు, జాతీయ రహదారులు, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ రోడ్లు, రైల్వే స్టేషన్లు, ఎన్ని కిలోమీటర్ల లైన్ ఉంది, ఆర్టీసీ డిపోలు, వాటి ఆర్థిక స్తోమత, పోస్టాఫీసులు, టెలిఫోన్ ఎక్స్ఛేంజ్‌లు, పబ్లిక్ టెలిఫోన్లు, టెలిఫోన్ కనెక్షన్లు, జిల్లాలో ఆస్తిపన్ను రాబడి వివరాలు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయ వివరాలు, నిత్యావసరాల పన్నులు, ఎక్సైజ్, వాణిజ్య శాఖల పన్నులు, మోటారు వాహనాల పన్నులు, బ్యాంకులు, డిపాజిట్లు, కార్మిక, ఉపాధి వివరాలు, వ్యవసాయ భూముల పంపిణీ, బలహీనవర్గాలకు ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం, మంచినీటి సరఫరా పథకాలు, రేషన్‌షాపులు, పెట్రోలు బంకులు, వ్యక్తిగత మరుగుదొడ్లు, గ్యాస్‌ఏజెన్సీలు, రైస్‌మిల్లులు, కిరోసిన్ డీలర్లు, స్వయంసహాయక సంఘాల పనితీరు, ఉపాధి హామీ అమలు, మున్సిపాలిటీలు, జడ్పీ, మండల పరిషత్, గ్రామ పంచాయతీల ఆదాయ, వ్యయాలు, రైతు బజార్లు, వ్యవసాయ మార్కెట్లు, గోడౌన్‌లు, పోలీసు సిబ్బంది, స్టేషన్లు, జైళ్లు, ఖైదీలు, నేరాల సంఖ్య.
ఆరో విభాగం: సరిహద్దులతో కూడిన మ్యాపు తయారీ.
సిద్దిపేట సిద్ధం!
Published Mon, Nov 23 2015 11:28 PM | Last Updated on Sun, Sep 3 2017 12:54 PM
Advertisement