![AR Rahman rendition of Bengali poet Nazrul Islam patriotic song draws flak - Sakshi](/styles/webp/s3/article_images/2023/11/12/ar-rajastan.jpg.webp?itok=bdgTEYd3)
కోల్‌కతా: ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహా్మన్ వివాదంలో చిక్కుకున్నారు. ప్రఖ్యాత బెంగాలీ కవి కాజీ నజ్రుల్ ఇస్లాం రచించిన ప్రఖ్యాత స్వాతంత్య్రోద్యమ గీతం ‘కరార్ ఓయ్ లౌహో కొపట్’ను తాజాగా విడుదలైన బాలీవుడ్ సినిమా పిప్పాలో వాడుకున్నారాయన. దాని ట్యూన్ మార్చడం ద్వారా తమతో పాటు అసంఖ్యాకులైన అభిమానుల మనోభావాలను రెహా్మన్ దెబ్బ తీశారంటూ నజ్రుల్ కుటుంబసభ్యులు శనివారం దుయ్యబట్టారు. ‘‘రెహా్మన్ కోరిన మీదట ఆ గీతాన్ని వాడుకునేందుకు అనుమతించాం. కానీ దాని ట్యూన్, లయ పూర్తిగా మార్చేయడం చూసి షాకయ్యాం’’ అంటూ నజ్రుల్ మనవడు, మనవరాలు తదితరులు మండిపడ్డారు.
‘‘ఈ వక్రీకరణను అనుమతించేది లేదు. తక్షణం ఆ గీతాన్ని సినిమా నుంచి తొలగించాలి. పబ్లిక్ డొమైన్‌లో కూడా అందుబాటులో లేకుండా చర్యలు తీసుకోవాలి’’ అని వారు డిమాండ్ చేశారు. ట్యూన్ మార్పును నిరసిస్తూ బెంగాలీ గాయకులు, కళాకారులతో కలిసి నిరసనకు దిగుతామని ప్రకటించారు. బెంగాలీలు కూడా దీనిపై భగ్గుమంటున్నారు. రెహా్మన్ వంటి సంగీత దర్శకుడి నుంచి ఇది ఊహించలేదంటూ బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ తదితరులు విమర్శించారు. రెహా్మన్ తీరుపై ఇంటర్నెట్లో కూడా విమర్శల వర్షం కురుస్తోంది. స్వాతంత్య్రోద్యమ కాలంలో నజ్రుల్ ఇస్లాం గీతాలు, పద్యాలు బెంగాల్లోనే దేశమంతటా మారుమోగాయి. టాగూర్ గీతాల తర్వాత అత్యంత ప్రసిద్ధి పొందాయి.
Comments
Please login to add a commentAdd a comment