టాటా మెటార్స్ను భయపెడుతున్న 'జికా'
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న 'జికా' వైరస్ ఇపుడు వాహనాల తయారీ సంస్థను కూడా వణికిస్తోంది. గర్భిణుల పాలిట శాపంగా పరిణమించిన ఈ వైరస్ ఇపుడు టాటా మోటార్స్ ను భయపెడుతోంది. అందుకే ఆ సంస్థ ఆలోచనలో పడింది. ఈడిస్ ఈజిప్టీ జాతికి చెందిన దోమల కారణంగా వేగంగా వ్యాప్తి చెందే ఈ వైరస్ వల్ల టాటా మోటార్స్కు ఏమి నష్టం అనుకుంటున్నారా... అదేనండి.. 'జికా' అనే పేరులోనే ఉంది భయమంతా.. జికా పేరుతో ఒక కొత్త కారును లాంచ్ చేసేందుకు సంస్థ ప్లాన్ చేసింది. చిన్న కార్ల సెగ్మెంట్ లో జికా ద్వారా వినియోగదారులును ఆకర్షించాలని పెద్ద ఎత్తున ప్రణాళికలు రచించింది.
త్వరలోనే జరగబోయే ఎక్స్ పో లో ఈ జికాను ప్రదర్శనకు పెట్టాలని యోచిస్తోంది. ఇంతలో శిశువుల పాలిట ప్రాణ సంకటంగా మారిని జికా పేరును ఈ కొత్త వాహనానికి పెట్టడం అంత శుభం కాదని సంస్థ భావిస్తోంది. ఈ ప్రమాదకర వైరస్ పేరుకు దగ్గరగా వున్న జికా పేరును తమ కొత్త వాహనానికి పెట్టడం అంత శ్రేయస్కరం కాదనే ఆలోచనలో పడింది. అందుకే కొత్త పేరును పరిశీలిస్తున్న విషయాన్ని స్వయంగా ఆ సంస్థ మంగళవారం ప్రకటించింది. మొత్తం పరిస్థితిని పరిశీలిస్తున్నామని.. ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సంస్థ ప్రతినిధి మినారి షా ముంబై లో తెలిపారు. ఈ మధ్య కాలంలో జికా పేరుతో టాటా మోటార్స్ జిప్పీ కారును బాగా ప్రచారంలోకి తెచ్చిన విషయం తెలిసిందే. బార్సిలోనా ఫుట్ బాల్ స్టార్ ఆటగాడు లియోనిల్ మెస్సీ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు.
కాగా ప్రపంచాన్ని వణికిస్తున్న జికా వైరస్ గర్భిణుల నుంచి పిల్లలకు సోకి ఆందోళన కలిగిస్తోందని ప్రపంచ ఆరోగ్యసంస్థ ఇటీవల స్పష్టం చేసింది. జికా వైరస్‌పై కొలంబియా హెల్త్ ఇనిస్టిట్యూట్ జరిపిన పరిశీలనలో దాదాపు 2000 మంది కొలంబియన్ గర్భిణులకు జికా సోకినట్లు ధ్రువీకరణ అయింది. ఈ వైరస్‌తో సంభవించే మైక్రో సెఫలీ అనే వ్యాధి.. పుట్టబోయే పిల్లల మెదడు ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. తల చిన్నదిగా పిల్లలు పుడతారు. జికా వైరస్‌ను నివారించడానికి ఎలాంటి మెడిసిన్ లేదని..గర్భిణులు అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించింది.