ఈనెల 31న చందమామ పెద్ద పరిమాణంలో..
నీలం, ఎరుపు రంగుల్లో కనిపించనున్నాడు!
150 ఏళ్ల తర్వాత సంభవిస్తున్న ఈ అరుదైన
సంఘటన నిజంగానే ఓ భ్రమ..
నిజానికి జాబిల్లి సైజు.. రంగు వీసమెత్తు కూడా మారదు.
అయినా సైజు పెరిగినట్లు ఎందుకు కనిపిస్తాడు?
రక్తం చిమ్ముతున్నట్లు ఎందుకు భయపెడతాడు?
నీలాల జాబిలి ఎందుకైంది?
కొన్ని ప్రాంతాల్లోని అరుదైన ధూళి కణాల కారణంగా పున్నమి నాటి చంద్రుడు నీలంగా కనిపిస్తాడు. దీంతో అక్కడి వారు బ్లూమూన్ అని పేరు పెట్టుకున్నారు. ఇదే ప్రపంచం మొత్తం వాడుకలోకి వచ్చింది. ఈ బ్లూమూన్‌కు రెండు నిర్వచనాలు ఉన్నాయి. ఒక్కో రుతువులోని 4 పున్నమి రాత్రుల్లో మూడోదాన్ని బ్లూమూన్ అంటారని ఒక నిర్వచనం చెబితే.. ఒక నెలలోనే వచ్చే రెండో పున్నమిని బ్లూమూన్ అంటారని ఇంకో నిర్వచనం చెబుతోంది. ఈ నెల 31న కనిపించే జాబిలి రెండో నిర్వచనానికి సరిపోతుంది.
సూపర్ ఎలా?
భూమి చుట్టూ జాబిల్లి తిరుగుతూ ఉంటుందని మనకు తెలిసిందే. చంద్రుడు గుండ్రంగా కాకుండా గజిబిజిగా (ఆప్సిడల్ ప్రెసెషన్‌లో) తిరుగుతాడు. దీంతో కొన్నిసార్లు చంద్రుడు భూమికి కొంత దగ్గరగా వస్తాడు. ఇలాంటి సమయాల్లో అంటే పౌర్ణమి రోజున సూర్యుడికి చంద్రుడు అభిముఖంగా వస్తాడు. దీంతో జాబిల్లి పరిమాణం పెరిగినట్లు అనిపిస్తుంది. ఏదైనా పున్నమి రోజున భూమికి అతి దగ్గరగా వస్తే దాన్ని ‘సూపర్ మూన్’ అంటారు.
ఎరుపు రంగు ఏమిటి?
సంపూర్ణ చంద్రగ్రహణం రోజున చందమామ అరుణవర్ణంలో వెలుగులు వెదజల్లుతుంది. దీన్నే ఇంగ్లిష్‌లో బ్లడ్‌మూన్ అంటారు. సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు భూమి నీడ మొత్తం జాబిల్లిపై పడుతూ ఉంటుంది. అదే సమయంలో భూమి వెనుక వైపు నుంచి ప్రసారమయ్యే సూర్యుడి కాంతి కొంత జాబిల్లిపై పడుతుంది. ఈ క్రమంలో అది ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. ఫలితంగా ఎక్కువ తరంగ దైర్ఘ్యమున్న ఎరుపు కాంతి జాబిల్లిని చేరుతుంది. దీంతో బ్లడ్‌మూన్ ఆవిష్కృతమవుతుంది. సూర్యుడు ఉదయిస్తున్న.. అస్తమిస్తున్న వేళల్లో కొంత సమయం ఎరుపు రంగు కనిపిస్తుందే.. అలా అన్నమాట!
ఎక్కడ చూడొచ్చు ?
సూపర్ బ్లూ, బ్లడ్ మూన్ ప్రపంచం మొత్తమ్మీద చూసే అవకాశాలు తక్కువే. అలాస్కాతోపాటు ఉత్తర అమెరికా, హవాయిలోని కొన్ని ప్రాంతాల్లో సూర్యోదయానికి ముందు భారీసైజున్న ఎర్రటి జాబిల్లిని చూడొచ్చు. ఆసియాతో పాటు మధ్యప్రాచ్య దేశాలు, రష్యా తూర్పు ప్రాంతం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో రాత్రి సమయంలో చూడొచ్చు. భారత్‌లో సాయంత్రం 4.21 గంటల సమయంలో పాక్షికంగా, 6.21 గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణ సమయంలో చూడొచ్చని కోజికోడ్‌లోని రీజనల్ సైన్స్ సెంటర్ టెక్నికల్ ఆఫీసర్ జయంత్ గంగూలీ తెలిపారు. దాదాపు గంటపాటు ఎర్రటి జాబిల్లిని చూడొచ్చని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment