సాక్షి, అమరావతి : సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసే ముసుగులో చంద్రబాబునాయుడు ప్రభుత్వ ఖజానాను అడ్డగోలుగా దోచేశారు. ఐదేళ్లలో రూ.68,293.94 కోట్లు ఖర్చుచేసినా ఒక్క ప్రాజెక్టునూ పూర్తిచేయలేకపోయారు. ఇంత ఖర్చుచేసినా కొత్త, పాత కలిపి కేవలం 3.4 లక్షల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే నీళ్లందించగలిగారు. వీటిని పరిశీలిస్తే.. సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో చంద్రబాబు ఏ స్థాయిలో దోపిడీ చేశారో అర్థంచేసుకోవచ్చు.
టీడీపీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి రాగానే.. పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మినహా జలయజ్ఞం కింద చేపట్టి, పూర్తికాని 40 ప్రాజెక్టుల్లో మిగిలిన పనులను పూర్తిచేయడానికి కేవలం రూ.17,368 కోట్లు మాత్రమే అవసరమని 2014, జూలై 28న నాటి సీఎం చంద్రబాబు శ్వేతపత్రంలో ప్రకటించారు. ఈ ప్రాజెక్టుల కోసం 2014, జూన్ 8 నుంచి 2019, మే 29 వరకూ రూ.68,293.94 కోట్లను ఖర్చుచేసినట్లు చంద్రబాబు ఘనంగా ప్రకటించుకుంటున్నారు.
ఇందులో పోలవరంపై ఖర్చుపెట్టిన రూ.10,860.67 కోట్లు, నీరు–చెట్టు పేరుతో కాజేసిన రూ.12,400.23 కోట్లు.. కమీషన్ల కోసం చేపట్టిన పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతలపై వ్యయం చేసిన రూ.3,199.92 వెరసి.. రూ.26,460.82 కోట్లను మినహాయిస్తే.. జలయజ్ఞం కింద చేపట్టిన 40 ప్రాజెక్టులకు రూ.41,833.12 కోట్లు వ్యయం చేసినట్లు స్పష్టమవుతోంది.
అంటే.. చంద్రబాబు చెప్పిన ప్రకారం ఆ ప్రాజెక్టులను పూర్తిచేయడానికి అవసరమైన దానికంటే రూ.24,465.12 కోట్లను అధికంగా వ్యయం చేశారు. పోనీ.. ఒక్క ప్రాజెక్టునైనా పూర్తిచేశారా అంటే అదీ లేదు. దీన్నిబట్టి చూస్తే.. కేవలం జలయజ్ఞం ప్రాజెక్టుల్లో మాత్రమే కాంట్రాక్టర్లకు ప్రభుత్వ ఖజానా నుంచి రూ.24 వేల కోట్లను దోచిపెట్టి.. అందులో చాలావరకూ ముడుపుల రూపంలో చంద్రబాబు రాబట్టుకున్నారన్నది బహిరంగ రహస్యం.
‘పోలవరం’తో కేంద్ర ఖజానాను సైతం..
ఇక కేంద్రమే నిరి్మంచాల్సిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను చంద్రబాబు దక్కించుకుని.. కేంద్ర ప్రభుత్వ ఖజానాను దోచేశారు. దేశ చరిత్రలో ఎక్కడాలేని రీతిలో పోలవరం హెడ్‌వర్క్స్‌లో రూ.2,917 కోట్ల విలువైన పనులను రామోజీరావు వియ్యంకుడికి చెందిన నవయుగకు.. ఎడమ కాలువలో ఐదో ప్యాకేజీలో రూ.142 కోట్ల విలువైన పనులను అప్పటి ఆర్థికమంత్రి యనమల వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్‌కు కట్టబెట్టి అక్రమాల్లో రికార్డు నెలకొల్పారు. అందుకే చంద్రబాబు కమీషన్ల కోసం పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నారని ప్రధాని మోదీ సైతం ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment