పులకుర్తి లిఫ్ట్ స్కీమ్‌ను ప్రారంభించి ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం చంద్రబాబు
కర్నూలు సిటీ: అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాప్రయోజనాల కంటే ప్రచారార్భాటానికే తెలుగు దేశం పార్టీ అధిక ప్రాధాన్యం ఇస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాల్లో ఈ విషయం తేటతెల్లమవుతోంది. ఏ పనైనా పూర్తయిన తరువాత ప్రారంభోత్సవం చేస్తుంటారు. అయితే టీడీపీ మాత్రం తమ ప్రచార అవసరాల కోసం పూర్తికాని పులకుర్తి ఎత్తిపోతల పథకాన్ని రెండు సార్లు జాతికి అంకితం చేసి ఔరా అనిపించింది. గతంలో ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం విషయంలోనూ ఇదే జరిగింది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గతంలో తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసిన సమయంలో ఏ ఒక్క రోజు కూడా సాగునీటి ప్రాజెక్టుల గురించి పట్టించుకోలేదు. ప్ర‘జల’ కష్టాలు తెలుసుకున్న దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి..సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. తన హయాంలో తుంగభద్ర దిగువ కాలువ చివరి ఆయకట్టుకు నీరు రావడం లేదని గుర్తించి, తుంగభద్ర నది నుంచి నీటిని ఎత్తిపోసేందుకు పులకుర్తి ఎత్తిపోతల పథకానికి అనుమతులు జారీ చేశారు. అదే విధంగా ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకానికి 2008లో శంకుస్థాపన చేశారు. ఈ రెండు పథకాల గురించి టీడీపీ అధినేత చంద్రబాబు ఏ రోజూ అలోచించ లేదు. అయితే అంతా తానే చేసినట్లు..పూర్తికాని ప్రాజెక్టులను రెండు సార్లు ప్రారంభోత్సవం చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. గతేడాది జనవరి 1వ తేదీన ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పూర్తికాకపోయినా ఒక మోటర్‌తోనే ప్రారంభోత్సవం చేశారు. అదే ఏడాది సెప్టెంబరు 7వ తేదీన రెండో సారి రెండో మోటర్ ఏర్పాటు చేసి ప్రారంభించారు. పులకుర్తి ఎత్తిపోతల పథకాన్ని గత నెల 23వ తేదీన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావులు ప్రారంభించారు. మళ్లీ శుక్రవారం.. శ్రీశైలం దగ్గర సీఎం చంద్రబాబు చేత ఎత్తిపోతల పథకాన్ని శుక్రవారం ప్రారంభింపజేశారు.
సాగునీటి విషయంలో టీడీపీకి చిత్తశుద్ధి కరువు
సాగునీటి ప్రాజెక్టుల విషయంలో టీడీపీ మొదటి నుంచి నిర్లక్ష్యమే చేస్తోంది. కేసీ కెనాల్ వాటాగా టీబీ డ్యాంలో నిల్వ ఉన్న 5 టీఎంసీల నీటిని 2004 జనవరి 21వ తేదీన అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు.. పెన్నా అహోబిలం రిజర్వాయర్‌కు మళ్లించారు. కేసీ ఆయకట్టు రైతులను పట్టించుకోలేదు. అయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్..కేసీ ఆయకట్టు రైతుల ఇబ్బందులు గమనించి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించేందుకు 2008లో శంకుస్థాపన చేశారు. మొదట్లో వేగంగానే పనులు జరిగినా మహానేత మరణం తరువాత మందగించాయి. పూర్తిస్థాయిలో పనులు చేపట్టకుండానే చంద్రబాబు ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడం విమర్శలకు తావిచ్చింది. ఎల్లెల్సీ చివరి ఆయకట్టు అయిన కోడుమూరు సబ్ డివిజన్ పరిధిలోని 9,830 ఎకరాలకు నీరు అందడం లేదని వైఎస్సార్ దృష్టికి వచ్చింది. దీంతో పులకుర్తి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించేందుకు మహానేత ఉత్తర్వులు ఇచ్చారు. 2014లోనే పూర్తి కావాల్సిన ఈ స్కీమ్‌ను టీడీపీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. టీడీపీ నాయకుల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుతో నేటికి పూర్తి స్థాయిలో çపనులు కాలేదు. అంసపూర్తి పనులతోనే ప్రారంభించిన పది రోజులకే లీకేజీలు, మోటర్లలోని సాంకేతిక సమస్యలతో నిలిచి పోయింది. నిలిచి పోయిన స్కీమ్‌ను, ఇప్పటికే మంత్రుల చేత ప్రారంభోత్సవం అయిన స్కీమ్‌ను సీఎం మరో సారి ప్రారంభించడం విమర్శలకు తావిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment