బంగారు తెలంగాణలో భాగస్వాములు కండి
♦ పారిశ్రామికవేత్తలకు మంత్రి జూపల్లి పిలుపు
♦ మూడో విడతలో 16 పరిశ్రమలకు అనుమతి
సాక్షి, హైదరాబాద్ : స్థానికులకు ఉపాధి కల్పించడం ద్వారా రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమలు బంగారు తెలంగాణ సాధనలో భాగస్వాములు కావాలని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానం (టీఎస్ ఐపాస్)లో భాగంగా మూడో విడతలో నూతనంగా ఏర్పాటయ్యే 16 పరిశ్రమల ప్రతినిధులకు అనుమతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో రూ.1,046 కోట్ల పెట్టుబడులతో వస్తున్న ఈ పరిశ్రమల ద్వారా 2,988 మందికి ఉపాధి దక్కుతుందని మంత్రి వెల్లడించారు.
త్వరలో ఏర్పాటయ్యే స్కిల్ డెవలప్‌మెంట్ అకాడమీ ద్వారా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యత కలిగిన మానవ వనరులు అందుబాటులోకి వస్తాయన్నారు. పాశ్చాత్య దేశాల్లో పరిశ్రమల అనుమతులకు కనీసం 45 రోజులు పడుతుండగా, టీఎస్‌ఐపాస్ ద్వారా 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. అనుమతుల్లో జాప్యం వల్ల పెట్టుబడులతో రాష్ట్రానికి వచ్చే ఏ ఒక్క పారిశ్రామికవేత్త ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
ఎలాంటి ఆటంకాలు, అవినీతి లేని పారిశ్రామిక విధానానికి దేశ, విదేశాల్లో ప్రశంసలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. పెట్టుబడిదారులు తెలంగాణ రాష్ట్రానికి పారిశ్రామిక రాయబారులుగా వ్యవహరించాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో రాష్ట్రం బంగారు తెలంగాణగా ఆవిర్భవించడం ఖాయమన్నారు. జెనెసిస్ ప్రతినిధి వెంకట్‌రెడ్డి, అరబిందో పరిశ్రమ ప్రతినిధి ఐఎస్ రావు వేగంగా అనుమతులు జారీ చేయడంపై ప్రశంసలు కురిపించారు.