టీఎస్‌ఐఐసీ భూములపై రుణాలు
♦ నెల రోజుల్లో పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి ప్రణాళిక
♦ ఉత్పత్తి ప్రారంభించాకే పరిశ్రమలకు భూ రిజిస్ట్రేషన్
♦ టీఎస్‌ఐఐసీ పనితీరుపై మంత్రి జూపల్లి సమీక్ష
సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక పార్కుల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు అవసరమైన నిధుల సమీకరణకు తమ ఆధీనంలోని భూములపై రుణాలు తీసుకునే అంశాన్ని పరిశీలించాలని పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సౌకర్యాల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ)కి సూచించారు. సంస్థ కార్యాలయంలో మంగళవారం మంత్రి టీఎస్‌ఐఐసీ పనితీరును సమీక్షించారు. సమీక్షలో సంస్థ ఎండీ ఈ.వి.నర్సింహారెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి అవసరమైన కన్సల్టెంట్ల ఎంపిక, ప్రాజెక్టు రిపోర్టుల తయారీ తదితరాలను నెల రోజుల్లో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూమిని గుర్తించడం, అభివృద్ధి చేయడం, పెట్టుబడిదారులకు రాష్ట్రంలో ఉన్న సౌకర్యాలను వివరించడంపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. టీఎస్‌ఐఐసీలో సిబ్బంది కొరతను తీర్చేందుకు టీఎస్‌పీఎస్సీ ద్వారా తక్షణమే నియామకాలు చేపట్టేందుకు అవసరమైన ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి పంపించాలని ఆదేశించారు. పరిశ్రమల నిర్మాణం పూర్తయి ఉత్పత్తి ప్రారంభించిన తర్వాతే సంబంధిత సంస్థ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని మంత్రి సూచించారు.
టీఎస్‌ఐపాస్ విధానంలోని ప్రత్యేకతలను ప్రస్తావించిన జూపల్లి పారిశ్రామిక రంగంలో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచేలా సిబ్బంది పనిచేయాలన్నారు. పారిశ్రామిక పార్కుల్లో ఖాళీగా ఉన్న స్థలాలు, పరిశ్రమలకు కేటాయించిన భూములు, రాయిదుర్గ్ ఫైనాన్షియల్ జిల్లాలో భూముల కేటాయింపు, కేటాయింపులు జరిగినా వినియోగంలోకి రాని భూముల రద్దు, పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులు, ఫుడ్‌పార్కులు, ఫైబర్‌గ్లాస్ పార్కు, డ్రైపోర్టులు, టెక్స్‌టైల్ పార్కుల పురోగతి, ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ వినియోగం, ఎంఎల్‌ఆర్ మోటార్స్, శ్రీదేవి ఫుడ్స్‌కు కేటాయించిన భూములు, గేమ్ సిటీ, టీ హబ్ డిజైనర్ ఎంపిక, మైక్రోసాఫ్ట్‌కు పొరుగున పుప్పాలగూడలో వీజేఐల్ కన్సల్టెంట్స్‌కు కేటాయించిన భూ కేటాయింపులు రద్దు తదితర అంశాలపై మంత్రి సమీక్షించారు.
పారిశ్రామికవాడల స్థానిక సంస్థలను (ఐలా)అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలోకి చేర్చే అంశంపై సూత్రప్రాయంగా అంగీకరించినా ఫైలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉందని అధికారులు జూపల్లి దృష్టికి తీసుకువచ్చారు. కోర్టులో ఉన్న కేసుల స్థితిగతులపై నివేదిక రూపొందించి క్రమం తప్పకుండా సమీక్షించాలని టీఎస్‌ఐఐసీ అధికారులను ఆదేశించారు.