దేశంలో మూడో అతిపెద్ద ప్లాస్టిక్ ఎక్స్‌పో హైప్లెక్స్-2023 హైదరాబాద్‌లో శుక్రవారం (ఆగస్ట్ 4) ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ టీఎస్‌ఐఐసీ ఎండీ, వైస్ చైర్మన్ వెంకట నర్సింహా రెడ్డి ఇతర ప్రముఖులతో కలిసి ప్రారంభించారు. ఆగస్టు 4 నుంచి 7వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు నగరంలోని హైటెక్స్‌లో ఈ ప్రదర్శన జరగనుంది. ఎనిమిది సంవత్సరాల తర్వాత హైప్లెక్స్ అనే పేరుతో దీన్ని ఏర్పాటు చేశారు. ఇంతకుముందు ఐప్లెక్స్‌గా వ్యవహరించేవారు.
ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్ అండ్ ఫెసిలిటేషన్ ఆఫీస్ అడిషనల్ డెవలప్‌మెంట్ కమిషనర్ చంద్ర శేఖర్, హెచ్‌ఎంఈఎల్ ఎండీ, సీఈవో ప్రభుదాస్, గెయిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీవాస్తవ, ఇండియన్ ప్లాస్టిక్స్ ఇన్‌స్టిట్యూట్ నేషనల్ ప్రెసిడెంట్ అనిల్ రెడ్డి వెన్నం, ఎఫ్‌టీసీసీఐ ప్రెసిడెంట్ మీలా జయదేవ్ గౌరవ అతిథులుగా హాజరై ప్రసంగించారు. షో డైరెక్టరీ, డైలీ షో మ్యాగజైన్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా టీఎస్‌ఐఐసీ ఎండీ, వైస్ చైర్మన్ వెంకట నర్సింహా రెడ్డి మాట్లాడుతూ టీఎస్ ఐపాస్ చట్టం తెలంగాణ ప్రభుత్వ మైలురాయి నిర్ణయమని పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన లైసెన్సుల జారీ ప్రక్రియను ఈ చట్టం వేగవంతం చేస్తోందన్నారు. దీని కింద గత ఎనిమిదిన్నర సంవత్సరాలలో 24000 పరిశ్రమ ప్రతిపాదనలను ఆమోదించినట్లు చెప్పారు. మొదటి ప్లాస్టిక్ పార్క్ విజయవంతమైందని, రెండోది కావాలన్నా భూమి ఇచ్చేందుకు టీఎస్‌ఐఐసీ సిద్ధంగా ఉందని తెలిపారు.
దాదాపు 20,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ ఎక్స్‌పోలో ప్రపంచవ్యాప్తంగా 400 సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. తెలంగాణ అండ్ ఆంధ్రా ప్లాస్టిక్స్ మ్యాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (టాప్మా) ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న ఈ ప్రదర్శనలో రూ.500 కోట్ల మేర వ్యాపారం జరుగుతుందని అంచనా వేస్తున్నట్లు తాప్మా అధ్యక్షుడు విమలేష్ గుప్తా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment