
భారత్‌లో నియామకాలు షురూ
కంపెనీ రాక ఇక లాంఛనమే
ముందుగా మోడల్–3తో ఎంట్రీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెస్లా.. ఎంతో కాలంగా ఊరిస్తూ వస్తున్న అమెరికాకు చెందిన ఈ ఈవీ దిగ్గజం ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెడుతోంది. ఇందుకోసం నియామకాలను మొదలుపెట్టింది. ఢిల్లీ, ముంబై కేంద్రంగా 13 రకాల పోస్టులకు సిబ్బంది అవసరమంటూ లింక్డ్‌ఇన్ వేదికగా కంపెనీ ఉద్యోగ ప్రకటన ఇచ్చింది.
దీంతో కంపెనీ రాక ఇక లాంఛనమే అయింది. ఇటీవలి అమెరికా పర్యటన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీతో టెస్లా వ్యవస్థాపకుడు, అమెరికన్ టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌లో టెస్లా నియామకాలు మొదలుపెట్టడం ఆసక్తి కలిగిస్తోంది. భారత మార్కెట్లోకి టెస్లా ప్రవేశం గురించి చాలా ఆసక్తిగా ప్రజలు ఎదురుచూస్తున్న విషయం విదితమే.
తొలుత మోడల్–3..
పూర్తిగా తయారైన ఎలక్ట్రిక్ వాహనాలను తొలుత భారత్‌కు టెస్లా దిగుమతి చేసుకోనుంది. అన్ని అనుకూలిస్తే తయారీ కేంద్రం కార్యరూపం దాల్చడం ఖాయంగా కనిపిస్తోంది. టెస్లా ఈ ఏడాది భారత్‌లో తక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ వాహనాన్ని విడుదల చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. యూఎస్‌లో కంపెనీ నుంచి చవక కారు ‘మోడల్–3’ ధర దాదాపు రూ.26 లక్షలు ఉంది. భారత మార్కెట్లో పోటీగా ఉండేందుకు మోడల్–3లో చవక వెర్షన్ ముందుగా రంగ ప్రవేశం చేసే చాన్స్ ఉంది.
దశాబ్దం తర్వాత క్షీణత..
టెస్లా ప్రపంచవ్యాప్తంగా 2024లో 17.9 లక్షల యూనిట్ల ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది. 2023తో పోలిస్తే అమ్మకాలు 1.1 శాతం క్షీణించాయి. విక్రయాలు 12 ఏళ్ల తర్వాత తగ్గడం గమనార్హం. కొనుగోలుదారులను ఆకర్షించడానికి, ప్రపంచంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో నంబర్–1 ర్యాంక్‌ను నిలబెట్టుకోవడానికి కంపెనీ గత సంవత్సరం ధరలను పదేపదే తగ్గించినప్పటికీ విక్రయాలు క్షీణించాయి. ప్రస్తుతం సగటు కారు విక్రయ ధర 41,000 డాలర్లు నమోదైంది. ప్రధానంగా చైనాకు చెందిన బీవైడీ నుంచి టెస్లా పోటీ ఎదుర్కొంటోంది. బీవైడీ గత ఏడాది 17.6 లక్షల యూనిట్లను విక్రయించింది. ఈ సంస్థ మొత్తం అమ్మకాల్లో చైనా వాటా ఏకంగా 90 శాతం ఉంది. భారత్‌లో 2024లో వివిధ కంపెనీల ఈవీల విక్రయాలు 99,068 యూనిట్లు నమోదయ్యాయి. చైనాలో ఈ సంఖ్య 1.1 కోట్లకుపైమాటే.
షోరూంలు ఎక్కడంటే..
న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఏరోసిటీలో, ముంబై విమానాశ్రయం సమీపంలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో టెస్లా షోరూంలు రానున్నాయి. దాదాపు 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్నాయి. ఇవి షోరూంలు మాత్రమే. సరీ్వస్ కేంద్రాలు కావు.
ఉద్యోగాలివీ..
బిజినెస్ ఆపరేషన్స్ అనలిస్ట్, సర్వీస్ అడ్వైజర్, పార్ట్స్ అడ్వైజర్, సర్వీస్ టెక్నీషియన్, సరీ్వస్ మేనేజర్, సేల్స్ అండ్ కస్టమర్ సపోర్ట్, స్టోర్ మేనేజర్, కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్ట్, కస్టమర్ సపోర్ట్ సూపర్‌వైజర్, డెలివరీ ఆపరేషన్స్ స్పెషలిస్ట్, ఆర్డర్ ఆపరేషన్స్ స్పెషలిస్ట్, ఇన్‌సైడ్ సేల్స్ అడ్వైజర్, కన్జూమర్ ఎంగేజ్‌మెంట్ మేనేజర్ కావాలంటూ కంపెనీ ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మరిన్ని వివరాలకు, దరఖాస్తుకు లింక్డ్‌ఇన్‌లో టెస్లా పేజీని చెక్ చేసుకోవచ్చు.

భారత్‌పై ఆసక్తి...
టెస్లా కొన్నేళ్లుగా భారత్‌లో అడుగుపెట్టాలని ఆసక్తిగా ఉంది. ఇక్కడి పన్నులే అడ్డంకిగా నిలిచాయి. దేశంలో దిగుమతి చేసుకున్న వాహనాలతో మొదట విజయం సాధిస్తే టెస్లా భారత్‌లో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయవచ్చని 2021 ఆగస్టులో మస్క్ ప్రకటించారు. టెస్లా తన వాహనాలను భారత్‌లో విడుదల చేయాలని భావిస్తోందని ఆయన చెప్పారు. అయితే దిగుమతి సుంకాలు ప్రపంచంలో ఏ పెద్ద దేశంలో కూడా లేనంతగా ఇక్కడ అత్యధికంగా ఉన్నాయని అన్నారు. కాగా, 40,000 డాలర్ల కంటే ఎక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ కార్లపై 110 శాతం దిగుమతి సుంకాన్ని గతంలో భారత్ విధించింది. విదేశీ ఈవీ సంస్థలను భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి ప్రోత్సహించే ప్రయత్నంలో ప్రభుత్వం ఇప్పుడు ఈ సుంకాన్ని 70 శాతానికి తగ్గించింది.
Comments
Please login to add a commentAdd a comment