Elon Musk Meets PM Modi, Discuss Tesla, Starlink India Plans, More Details Inside - Sakshi
Sakshi News home page

భారత్‌లోకి టెస్లా రాకను కేంద్రం ఎందుకు వ్యతిరేకించింది?

Published Wed, Jun 21 2023 4:21 PM | Last Updated on Wed, Jun 21 2023 5:30 PM

Elon Musk Meets Pm Modi, Discuss Tesla, Starlink India Plans - Sakshi

అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌తో భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా కాన్ఫరెన్స్‌లో మస్క్‌ మాట్లాడుతూ..టెస్లా కార్యకలాపాలు భారత్‌లో ప్రారంభమవుతాయని మస్క్‌ వెల్లడించారు. త్వరలో దీనిపై స్పష్టత ఇస్తామని అన్నారు. దీంతో భారత్‌కు టెస్లా రాకపై అనేక ప్రశ్నల పరంపర కొనసాగుతోంది.    

మస్క్‌ ఏం అన్నారు?
‘భారత ప్రధాని మోదీతో సమావేశం అద్భుతంగా జరిగింది. ఆయనంటే నాకు చాలా ఇష్టం. అంతేకాదు మోదీకి నేను పెద్ద అభిమానిని. 2015లో కాలిఫోర్నియా టెస్లా ఫ్యాక్టరీని సందర్శించారు. ఒకరికి గురించి ఒకరికి బాగా తెలుసు. భారతదేశ భవిష్యత్తు గురించి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. ప్రపంచంలోని ఏ పెద్ద దేశానికీ లేనంత శక్తిసామర్ధ్యాలు భారత్‌ కు మెండుగా ఉన్నాయని భావిస్తున్నాను’అని ఎలాన్‌ మస్క్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. 

త్వరలోనే భారత్‌కు టెస్లా..
అంతేకాదు, భారత్‌లో టెస్లా కార్య కాలాపాలపై మస్క్‌ మాట్లాడుతూ..త్వరలోనే టెస్లా భారత్‌కు వస్తుంది. దేశంలో పెట్టుబడులు పెట్టేలా మోదీ చేస్తున్న ప్రయత్నాలు అమోఘం అంటూ ప్రధానిపై ప్రశంసల వర్షం కురిపించారు. భారత్‌లో గణనీయమైన పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తున్నారు. సరైన సమయంలో భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధంగా ఉన్నామని అన్నారు. అవి ఏమేరకు కార్యరూపం దాల్చనుందనేది ప్రశ్నార్థకంగా ఉంది. ఎందుకంటే?

2019 నుంచి ప్రయత్నాలు ముమ్మరం..
ఎలక్ట్రిక్‌ కార్ల దిగ్గజం టెస్లా మోటార్స్‌ 2019 నుంచి భారత్‌లో ఈవీ మార్కెట్‌పై దృష్టిసారించింది. కానీ కార్లపై భారత్‌ విధించే దిగుమతి పన‍్ను టెస్లాకు అడ్డంకిగా మారింది. భారత ఆదాయపు పన్ను లెక్కల ప్రకారం.. భారత్‌లోని ఆటోమొబైల్‌ సంస్థలు ఇతర దేశాల నుంచి కార్లను భారత్‌కు దిగుమతి చేసుకునే కార్ల ధర 40,000 డాలర్ల లోపు ఉంటే 60 శాతం, 40,000 డాలర్లు దాటితే దాటితే 100 శాతం దిగుమతి సుంకం చెల్లించాలి. 

కానీ టెస్లా తయారీ చేసే అంత్యంత చవకైన కారు ధర 45,000 డాలర్లు (రూ.37లక్షలు). దీంతో టెస్లా సీఈవో భారత్‌ విధించే 100 శాతం పన్నును వ్యతిరేకిస్తున్నారు. దిగుమతి సుంకంతో టెస్లా కార్ల ధరలు పెరిగి, అమ్మే సామర్ధ్యం తగ్గిపోతుందని వాదిస్తున్నారు. రెండేళ్ల క్రితం ఓ ట్విటర్‌ యూజర్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా..టెస్లా భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించాలని అనుకుంటుంది. కానీ ప్రపంచంలోని ఏ అతి పెద్ద దేశంలో లేని విధంగా భారత్‌లో మాత్రమే ఇంపోర్ట్‌ ట్యాక్స్‌ ఉందని అన్నారు. 

టెస్లా రాకను కేంద్రం ఎందుకు వ్యతిరేకిస్తుంది?
ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ దేశాల్లోని పారిశ్రామిక వేత్తలకు ‘మేకిన్‌ ఇన్‌ ఇండియా’ నినాదాన్ని వినిపిస్తున్నారు. ‘భారత్‌కు రండి. పెట్టుబడులు పెట్టి పరిశ్రమల్ని స్థాపించండి. తద్వారా మీకు తయారీ ఖర్చుతగ్గుతుంది. లాభాల్ని గడించ వచ్చంటూ’ వారిని ఆహ్వానిస్తున్నారు. టెస్లా వద్ద కేంద్రం సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించింది. 

గతంలో జాతీయ మీడియా సంస్థ ఫైనాన్షియల్‌ ఎక్స్‌ప్రెస్‌ నిర్వహించిన సీఎఫ్‌వో అవార్డ్‌ల కార్యక్రమంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెస‍్లా తయారీ యూనిట్‌లను భారత్‌లో ప్రారంభించాలని అన్నారు. ఇక్కడే కార్లను తయారు చేసి రాయితీలు పొందవచ్చు. అలా కాకుండా చైనాలో తయారు చేసి భారత్‌లో అమ్ముతామంటే కుదరదు అని’ సూచించారు. 

టెస్లా ఏమన్నదంటే
టెస్లా మాత్రం.. ఏ దేశంలోనైనా తయారీ యూనిట్లను ఏర్పాటు చేయాలంటే ముందుగా.. ఆ దేశంలో మా కార్లను అమ్మేందుకు అనుమతి ఇవ్వాలి. అమ్మకాలు జరిపిన తర్వాతే కార్ల తయారీ యూనిట్‌ను ప్రారంభిస్తాం. అందుకు ఒప్పుకోని ఏ దేశంలోనూ తమ కార్లను తయారు చేసేందుకు ఒప్పుకోమని మస్క్‌ అన్నారు. దిగుమతి సుంకం తగ్గింపుపై టెస్లా పట్టుబట్టడం, మేక్ ఇన్ ఇండియా కోసం కేంద్రం ఒత్తిడి చేయడంతో భారత్‌లో అడుగు పెట్టడాన్ని టెస్లా సైతం వ్యతిరేకించింది.  

ఇప్పుడు భారత్‌కు టెస్లా రాక..
గత నెలలో మస్క్‌ మాట్లాడుతూ.. టెస్లా బహుశా ఈ సంవత్సరం చివరి నాటికి కొత్త తయారీ యూనిట్‌కు ఏర్పాటు కోసం భారత్‌లో స్థలాన్ని ఎంపిక చేసుకోవడం పూర్తవుతుందని అన్నారు. ఆ తర్వాత టెస్లా బృందం ఢిల్లీకి రావడం, ఇక్కడ పీఎంవో అధికారులతో మాట్లాడడం చకచకా జరిగాయి. అదే సమయంలో  కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, టెస్లా భారత్‌లో తన కార్లను తయారు చేసేందుకు ప్రయత్నిస్తుంది. భారత ప్రభుత్వం టెస్లాతో కలిసి పనిచేసుందుకు సుముఖంగా ఉందని రాయిటర్స్‌తో అన్నారు. 

భారత్‌కు ఎందుకు రావాలనుకుంటుంది..    
2030 నుండి ఏటా 20 మిలియన్ ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించాలనే లక్ష్యంతో ఎలాన్‌ మస్క్‌ భారత్‌లో టెస్లా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అంతకంటే ముందే మెర్సిడెస్, బిఎమ్‌డబ్ల్యూ, ఫోక్స్‌వ్యాగన్ వంటి సంస్థలు భారత్‌లో ఎలక్ట్రిక్ వెహికల్ విభాగంలో ముందంజలో ఉన్నాయి. కాబట్టే ఎంత వీలైతే అంత త్వరగా భారత్‌లో టెస్లా అడుగు పెట్టే దిశగా మస్క్‌ ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు.  

టెస్లా ప్రస్తుతం ఆరు తయారీ ప్లాంట్లలో కార్లను తయారు చేస్తుంది. వాటిలో నాలుగు అమెరికాలో ఉన్నాయి.  షాంఘై, బెర్లిన్‌లో రెండు గిగాఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇందులో కార్లలో ఉపయోగించే బ్యాటరీలతో పాటు, కార్లను తయారు చేసే సామర్ధ్యం ఉంది. మరో గిగాఫ్యాక్టరీని మెక్సికోలో స్థాపించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు మస్క్‌. 
 
భారత్‌లో టెస్లాకు ఎదురవుతున్న సవాళ్లు..
ఏరోడైనమిక్స్, మినిమలిస్ట్ డిజైన్‌లు, ఆటోపైలట్ వంటి హై-ఎండ్ ఫీచర్‌లు టెస్లా కార్లలో ప్రత్యేకం. దీంతో పాటు భారత ప్రభుత్వం క్లీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తుండడంతో ఎలక్ట్రిక్ వాహనాల రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ సెక్టార్‌లో ఆటో అమ్మకాలు ప్రస్తుతం టాటా మోటార్స్ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈవీ ఎలక్ట్రిక్‌ కార్లను రూ.20లక్షల కంటే తక్కువ ధరకు విక్రయిస్తోంది. ఇక, కార్ల ధరలు ఎక్కువ కావడంతో టెస్లా సవాళ్లను ఎదుర్కొనుంది. వాహనదారులకు వారి ప్రయాణాన్ని సులభతరం చేస్తున్నా.. మార్కెట్‌లో పెరిగిపోతున్న పోటీ దృష్ట్యా కార్ల ధరల తగ్గించి విక్రయించాల్సి ఉంటుంది. మరి అందుకు టెస్లా ఒప్పుకుంటుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది.

చదవండి👉 భారత్‌లో టెస్లా.. త్వరలో కార్ల తయారీ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటాం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement