ఈ నెలలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యేందుకు అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ఈ నెలలో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన భారత్‌లో తమ కంపెనీ పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మస్క్ పర్యటన ఏప్రిల్ నాలుగో వారంలో ఉండొచ్చని, ఆయనతో పాటు కంపెనీ అధికారులు కూడా రావొచ్చని పేర్కొన్నాయి.
దేశీయంగా తయారీని ప్రోత్సహించే క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాల పాలసీని కేంద్రం ఇటీవల సవరించిన నేపథ్యంలో మస్క్ రాక ప్రాధాన్యం సంతరించుకుంది. దీని ప్రకారం భారత్‌లో కనీసం 500 మిలియన్ డాలర్లతో తయారీ ప్లాంటును పెట్టే విదేశీ కంపెనీలు తక్కువ సుంకాలతో ఎలక్ట్రిక్ కార్లను దిగుమతి చేసుకునేందుకు వెసులుబాటు లభిస్తుంది. ప్రస్తుతం పూర్తి స్థాయిలో తయారైన కారును (సీబీయూ) దిగుమతి చేసుకుంటే 70 శాతం నుంచి 100 శాతం వరకు కస్టమ్స్ సుంకాలు వర్తిస్తున్నాయి.
భారత మార్కెట్లో ప్రవేశించేందుకు టెస్లా వంటి కంపెనీలకు ఇది అవరోధంగా ఉంటోంది. దీంతో సుంకాలను తగ్గించాలంటూ కొన్నాళ్లుగా కేంద్రాన్ని కోరుతున్నాయి. దానికి అనుగుణంగా దేశీయంగా తయారీతో ముడిపెట్టి పాలసీని ప్రభుత్వం సవరించింది. గతేడాది మోదీ అమెరికాలో పర్యటించిన సందర్భంగా ఆయనతో మస్క్ సమావేశమయ్యారు. భారత మార్కెట్లో టెస్లా ఎంట్రీకి సంబంధించి 2024లో తాను వచ్చే అవకాశమున్నట్లు అప్పట్లో ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment