
చెన్నై: కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతి నెలా ఒక కొత్త బీమా ఉత్పత్తిని ఆవిష్కరించే ప్రణాళికతో ఉన్నట్టు ‘గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్’ ఎండీ, సీఈవో జి.శ్రీనివాసన్ తెలిపారు. కస్టమర్ల భిన్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని వీటిని తీసుకురానున్నట్టు చెప్పారు. అదే మాదిరి ఎస్‌ఎంఈ, ఎంఎస్‌ఎంఈ ఉద్యోగులకు ప్రత్యేక ప్లాన్లపైనా దృష్టి సారించినట్టు ప్రకటించారు. స్టాండలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ అయిన గెలాక్సీకి ఫ్యామిలీ టీవీఎస్ వేణు శ్రీనివాసన్‌తోపాటు, హెల్త్ ఇన్సూరెన్స్ రంగం వెటరన్, స్టార్ హెల్త్ వ్యవస్థాపకుడు వి.జగన్నాథన్ సహ ప్రమోటర్లుగా ఉన్నారు.
‘ఏదైనా భిన్నంగా చేయాలన్న లక్ష్యంతో ఈ రెండు కుటుంబాలు కలసి గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఏర్పాటు చేశాయి. కస్టమర్లకు కచ్చితంగా వినూత్నమైన, సమగ్రమైన పరిష్కారాలతో ఉత్పత్తులను తీసుకొస్తాం’ అని జి.శ్రీనివాసన్ తెలిపారు. కస్టమర్ క్లెయిమ్ దరఖాస్తును వేగంగా పరిష్కరించడంతోపాటు పూర్తి మొత్తాన్ని చెల్లించే విధంగా మెరుగైన సేవలు అందిస్తామన్నారు. రానున్న సంవత్సరాల్లో పెద్ద కంపెనీగా అవతరిస్తామని ప్రకటించారు. ఆరంభంలో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కువ దృష్టి పెడతామని చెప్పారు.
ఇదీ చదవండి: ఆకాశ ఎయిర్‌లో పెట్టుబడులకు అనుమతి
రూ.200 కోట్ల ప్రీమియం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్ల ప్రీమియం ఆదాయాన్ని అంచనా వేస్తున్నట్టు శ్రీనివాసన్ తెలిపారు. ప్రస్తుతం 60 ప్రాంతాల్లో కంపెనీకి కార్యాలయాలు ఉంటే, వీటిని 100కు పెంచుకోనున్నట్టు చెప్పారు. 90 శాతం వ్యాపారం రిటైల్ కస్టమర్ల నుంచి, మిగిలిన 10 శాతం కార్పొరేట్ క్లయింట్ల నుంచి ఉంటుందన్నారు. రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామన్నారు. తమ ఉత్పత్తులు జబ్బున పడినప్పుడే ఆదుకునే విధంగా ఉండకుండా.. కస్టమర్లు ఆరోగ్యంగా జీవించేందుకు సాయపడతాయని చెప్పారు. తమ ఉత్పత్తుల్లో వెల్‌నెస్ (ఆరోగ్య సంరక్షణ) అంతర్భాగంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం చాలా కంపెనీల హెల్త్ ప్లాన్లలో లేని ఔట్ పేషెంట్ చికిత్సలపైనా తాము దృష్టి సారిస్తామని తెలిపారు. దేశంలో దక్షిణాది రాష్ట్రాల్లోనే బీమా విస్తరణ మెరుగ్గా ఉందంటూ.. అదే సమయమంలో ఆరోగ్య బీమా కవరేజీ ఉన్న వారికి సైతం తగినంత రక్షణ లేకపోవడాన్ని గుర్తించినట్టు శ్రీనివాసన్ వెల్లడించారు.