ఐటీ హాబ్‌గా మేడ్చల్‌ జిల్లా! | Medchal Malkajgiri District to turns IT hub Govt Special Focus | Sakshi
Sakshi News home page

IT Hub: హైద‌రాబాద్‌ నలువైపులా.. ఐటీ విస్తరణ

Published Thu, Feb 27 2025 7:45 PM | Last Updated on Thu, Feb 27 2025 8:13 PM

Medchal Malkajgiri District to turns IT hub Govt Special Focus

తూర్పు దిశలో పారిశ్రామిక అభివృద్ధి లక్ష్యంగా సర్కారు ఫోకస్‌

నగర శివారుల్లో సమాంతర అభివృద్ధిపై కార్యాచరణ ప్రణాళిక

భూముల గుర్తింపు కోసం అధికారుల కసరత్తు

హైద‌రాబాద్‌ నగర శివారుల్లో పారిశ్రామిక రంగ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కొత్త పరిశ్రమలతో వందలాది మంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, వేలాది కుటుంబాలకు పరోక్షంగా ఉపాధి అవకాశాలను కల్పించటమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తోంది. హైదరాబాద్‌– వరంగల్‌ పారిశ్రామిక కారిడార్‌తోపాటు హైదరాబాద్‌ (Hydearabad) మహానగరం నలువైపులా పారిశ్రామిక పార్కుల విస్తరణపై కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా (Rangareddy District) ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాటు ఐటీ శాఖ మంత్రి కావటంతో మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాపై ప్రత్యేక ఫోకస్‌ పెడుతున్నట్లు తెలుస్తోంది.

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉప్పల్‌ జెన్‌ ప్యాక్‌ వద్ద 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ పార్కు, నగరానికి ఉత్తరాన కండ్లకోయలో గేట్‌వే ఐటీ పార్కుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. వీటిని వేగవంతం చేయటంతోపాటు నగరానికి తూర్పు దిశలో ఉన్న ఘట్కేసర్‌ మండలం మాదారంలో ఇండ్రస్టియల్‌ పార్కు (Madaram Industrial Park) స్థాపనకు కాంగ్రెస్‌ సర్కారు చర్యలు తీసుకుంటోంది. ఇదే మండలంలోని పోచారంలో దాదాపు 450 ఎకరాల విస్తీర్ణంలో కొనసాగుతున్న ఇన్ఫోసిస్‌ను మరో రూ.750 కోట్ల పెట్టుబడులతో మరింత విస్తరింపజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

ముఖ్యమంతి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) దావోస్‌ పర్యటనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఇన్ఫోసిస్‌ (Infosys) విస్తరణపై ఇటీవల వారితో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే పోచారంలో ఇన్ఫోసిస్‌ వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పింస్తోంది. మరింత విస్తరింపజేయటం ద్వారా త్వరలో కొత్తగా వందలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశముంది. నరానికి తూర్పు వైపు ఐటీ విస్తరణలో భాగంగా ప్రభుత్వ భూముల వివరాల సేకరణకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది.  

ప్రపంచ స్థాయి ప్రమాణాలతో... 
పారిశ్రామిక పార్కుల ఏర్పాటు కోసం జాతీయ రహదారులకు ఇరువైపులా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించటంతోపాటు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు, రోడ్లు, రైల్వే సౌకర్యం, నీటి సరఫరా, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. కొండలు, గుట్టలు, అటవీ భూములు కాకుండా ఇతర భూములను ఎంపిక చేయాలని సూచించింది. ప్రభుత్వ భూములు అందుబాటులో లేకుంటే ప్రైవేట్‌ భూములను కూడా గుర్తించాలని, వాటి బహిరంగ మార్కెట్‌ ధరలు, ప్రభుత్వ ధరలను తెలపాలని పేర్కొంది.

చ‌ద‌వండి: హైదరాబాద్‌లో హెచ్‌సీఎల్‌ టెక్ మరో జీడీసీ

స్థానికంగా ఉన్న వనరుల వివరాలతోపాటు ఏఏ పరిశ్రమలకు భూములు, ప్రాంతాలు అనువుగా ఉంటాయన్న విషయాలతో అధికారులు నివేదికను సిద్ధం చేస్తున్నారు. భూములను గుర్తించిన తర్వాత ఆయా ప్రాంత చిత్రాలు (లొకేషన్‌ మ్యాప్‌లు) తయారు చేసి రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీఎస్‌ఐఐసీ)కి పంపించాలని నిర్దేశించటంతో అందుకు అనుగుణంగా కార్యాచరణకు వ్యూహా రచన చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మేడ్చల్‌–మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో ప్రభుత్వ భూముల సమగ్ర సర్వేలో రెవెన్యూ యంత్రాంగం తలములకలైనట్లు తెలుస్తోంది.  

సానుకూల చర్యలతో పారిశ్రామిక ప్రగతి 
తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న పలు సానుకూల చర్యలతో పారిశ్రామిక ప్రగతి సాధ్యమవుతుందని మేడ్చల్‌ జిల్లా (Medchal District) పరిశ్రమల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. మేడ్చల్‌ జిల్లాలో 2024 ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు అంటే.. తొమ్మిది నెలల కాలంలో రూ.380 కోట్ల పెట్టుబడులతో పారిశ్రామిక వేత్తలు 130 కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేశారు. 2,700 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. జిల్లాలో కొత్తగా 783 భారీ, సూక్ష్య, మధ్యతరహా పరిశ్రమలను రూ.12,523 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ కొత్త పరిశ్రమల ఏర్పాటుతో మేడ్చల్‌ జిల్లాలో మరో 46,356 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు అంచనా వేస్తున్నారు.

చ‌ద‌వండి: షంషేర్‌.. చార్మినార్‌..

కొత్త పరిశ్రమల ఏర్పాటుతో మేడ్చల్‌ జిల్లా ఐటీ హాబ్‌గా మారనుంది. ప్రస్తుతమున్న పరిశ్రమలకు తోడుగా మేడ్చల్‌లో హాస్పిటల్‌ అండ్‌ హెల్త్‌ ఇండస్ట్రీ, శామీర్‌పేటలో అమ్యూజ్‌మెంట్‌ అండ్‌ ఎగ్జిబిషన్‌ ఇండస్ట్రీ, కీసరలో నాలెడ్జ్‌ అండ్‌ సైన్స్‌ ఇండస్ట్రీ, ఘట్‌కేసర్‌లో ఐటీ అండ్‌ ట్రాన్స్‌పోర్టు ఇండస్ట్రీ, గుండ్ల పోచారంలో ఫార్మా అండ్‌ బల్క్‌ డ్రగ్స్‌ ఇండస్ట్రీ రానున్నాయి. మేడ్చల్‌ జిల్లా ఉప్పల్, మేడ్చల్‌ నియోజకవర్గాల పరిధిలోని పోచారం, ఘట్కేసర్, ఉప్పల్, శామీర్‌పేట, మేడ్చల్, కీసర, బోడుప్పల్, చెంగిచర్ల తదితర ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటు నిమిత్తం భూసేకరణకు టీఎస్‌ఐఐసీ ఏర్పాట్లు చేస్తోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement