kandlakoya
-
20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ పార్కు
సాక్షి, మేడ్చల్‌జిల్లా: నగర శివారు మేడ్చల్ జిల్లా పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందుతోంది. వందలాది పరిశ్రమల ఏర్పాటుతో వేలాది మంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, లక్షలాది కుటుంబాలకు పరోక్షంగా ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ హైదరాబాద్ కు తూర్పు దిశలో ఉన్న ఘట్కేసర్ మండలం మాదారంలో కొత్తగా ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటునకు తొలి అడుగుపడింది. 150కి పైగా కంపెనీల స్థాపన.. శివారుల్లో ఇప్పటికే గ్రీడ్ పాలసీలో భాగంగా ఉప్పల్ జెన్‌ప్యాక్ వద్ద 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ పార్కు స్థాపనకు పునాది రాయి పడింది. నగరానికి ఉత్తరం వైపు కండ్లకోయలో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో గేట్‌వే ఐటీ పార్కుకు శ్రీకారం చుట్టారు. ఈ రెండు పార్కుల ఏర్పాటుతో 150కి పైగా సంస్థలు తమ కార్యకలాపాలను స్థాపించేందుకు ముందుకు వచ్చాయి. భూ పరిహారం సైతం చెల్లింపు... గ్రేటర్‌కు తూర్పు దిశలో ఘట్కేసర్ మండలం మాదారంలో త్వరలో ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు కానుండటంతో... జిల్లా నిరుద్యోగ యువతలో ఉపాధిపై ఆశలు చిగురించాయి. ఈ పార్కు స్థాపనకు రైతుల అంగీకారంతో 226 ఎకరాల భూ సేకరణ కార్యక్రమాన్ని పూర్తి చేసిన అధికార యంత్రాంగం వారికి చెల్లించాల్సిన భూ పరిహారాన్ని కూడా అందజేసింది. జిల్లా పరిశ్రమల శాఖ కూడా టీఎస్ ఐపాస్ ద్వారా ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటునకు అన్నీ అనుమతులు ఇప్పించింది. భూ నిధి ఎక్కువే... నగర శివారు మేడ్చల్ జిల్లాలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు తగినంత భూనిధి ఉంది. జిల్లా పరిధిలో 66.8 కిలోమీటర్ల జాతీయ రహదారులు, 65 కిలోమీటర్ల రాష్ట్రీయ రహదారులు ఉన్నాయి. వీటికి తోడు ఔటర్ రింగ్ రోడ్డు ఉండటంతో కొత్త పరిశ్రమల స్థాపనకు అనువైన ప్రాంతంగా పారిశ్రామికాధిపతులు భావిస్తున్నారు. రహదారుల సమీపంలో దాదాపు 10వేల ఎకరాల భూములు ఉన్నాయి. అందులో 6,084 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. కొత్తగా 5వేల ఉద్యోగాలు మేడ్చల్ జిల్లాలో కరోనా కష్టకాలం (2021–22 ఆర్థిక సంవత్సరం)లో రూ34.95 కోట్ల పెట్టుబడులతో కొత్తగా 685 పరిశ్రమలు ఏర్పడగా, 5,536 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించాయి. దీంతో పరోక్షంగా జిల్లాలో వందలాది మందికి ఉపాధి దక్కుతోంది. పరిశ్రమల స్థాపనతో 1.93 లక్షల ఉద్యోగాలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మేడ్చల్ జిల్లాగా ఏర్పడిన తర్వాత 2016 అక్టోబర్ నుంచి 2021 మార్చి వరకు ఐదేళ్ల కాలంలో రూ.14,762 కోట్ల పెట్టుబడులతో 8,461 సూక్ష్మ, చిన్న, మధ్యతరహ, భారీ పరిశ్రమలు ఏర్పడ్డాయి. తద్వారా 1,93,050 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించాయి. (క్లిక్: ఈవీ చార్జింగ్ స్టేషన్లొస్తున్నాయ్..) -
ఆక్సిజన్ ఫ్యాక్టరీలుగా అర్బన్ పార్కులు
సాక్షి,హైదరాబాద్/మేడ్చల్: రాష్ట్రంలో ప్రభుత్వపరంగా అభివృద్ధి చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్కులు రాబోయే రోజుల్లో ఆక్సిజన్ ఫ్యాక్టరీలుగా పనిచేస్తాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ పేర్కొన్నారు. శనివారం మేడ్చల్ జిల్లా కండ్లకోయ ఆక్సిజన్ అర్బన్ ఫారెస్ట్ పార్కును సీఎస్ సందర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోడల్ పార్కు (మియావాకి ప్లాంటేషన్)లో రాష్ట్రమంతటా కనీసం ఒక ఎకరంలో భారీగా మొక్కలు నాటి చిట్టడవులుగా మారుస్తామని చెప్పారు. నిధుల కొరతను అధిగమించి శాచురేషన్ పద్ధతిలో అటవీ పునరుజ్జీవ చర్యలు చేపడతామని,ఫెన్సింగ్ నిర్మిస్తామని చెప్పారు. కార్యక్రమంలో కొద్దిసేపు పాల్గొన్న మంత్రి సీహెచ్ మల్లారెడ్డి మాట్లాడుతూ.. మేడ్చల్ జిల్లాలో అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు బాగున్నాయని, పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసిన ఈ ఆక్సిజన్‌పార్కు ఆహ్లా దకరంగా ఉందన్నారు. రాష్ట్రంలో అటవీ పునరుజ్జీవనం, తేమ పరిరక్షణ తదితర వివరాలను సీఎస్‌కు అధికారులు వివరించారు. ఔటర్ రింగ్ రోడ్డుకు 5 కి.మీ పరిధిలో 59 అర్బన్ పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. ఈ నెల 16 న సీఎం కేసీఆర్ జిల్లా కలెక్టర్లతో, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి, ఉద్యానవనాల అభివృద్ధిపై చర్చిస్తారని వెల్లడించారు. వీటిలో 32 ఇప్పటికే పూర్తయ్యాయని సీఎస్‌కు పీసీసీఎఫ్ ఆర్.శోభ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 95 అటవీ పార్కులు ఏర్పాటు చేయాలనే ప్రణాళికలున్నాయని చెప్పారు. కార్యక్రమంలో అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్, జాయింట్ సెక్రటరీ ప్రశాంతి, మేడ్చల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, అదనపు పీసీసీఎఫ్‌లు డీఎఫ్‌వోలు పాల్గొన్నారు. -
పెళ్లయిన వారం రోజులకే యువతి..
మేడ్చల్‌రూరల్: పెళ్లయిన వారం రోజులకే ఓ యువతి అదృశ్యమైన ఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మేడ్చల్ మండలం కండ్లకోయ గ్రామానికి చెందిన యాదమ్మ, నర్సింహ్మ దంపతుల కూతురు దివ్య (21)కు ఈ నెల 22న మెదక్ జిల్లా జిన్నారం మండలం వావిలాల గ్రామానికి చెందిన మహేశ్‌తో వివాహం జరిగింది. పెళ్లి కార్యక్రమాలు పూర్తి కావడంతో ఈ నెల 27న దివ్య తన భర్త మహేశ్‌తో కలిసి కండ్లకోయలోని పుట్టింటికి వచ్చింది. ఆ సమయంలో ఆమె తల్లి యాదమ్మ డ్యూటీకి వెళ్లిపోయింది. దివ్య తన భర్త మహేశ్, తండ్రి నర్సింహలకు భోజనం వడ్డించి తానూ భుజించింది. సాయంత్రం తల్లి యాదమ్మ విధులు ముగించుకుని ఇంటికి చేరుకుంది. 28న ఉదయం యాదమ్మ డ్యూటీకి వెళ్లిపోయింది. తనకు ఆదాయ సర్టిఫికెట్ తీసుకురావాలని తండ్రి నర్సింహను దివ్య బయటికి పంపించింది. ఇంట్లో ఉన్న భర్త మహేశ్ నిద్రిస్తుండడంతో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఆమె ఇంట్లోంచి వెళ్లిపోయింది. విషయం గమనించిన కుటుంబికులు దివ్య ఆచూకీ కోసం బంధువుల ఇళ్లలో వెతికినా ఫలితం లేకపోవడంతో గురువారం మేడ్చల్ పోలీసులను ఆశ్రయించారు. దివ్య తల్లి యాదమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పెద్ద సార్ల ఆటవిడుపు
-
పెద్ద సార్ల ఆటవిడుపు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కొద్ది రోజులుగా తీరిక లేకుండా గడిపిన అఖిల భారత సర్వీసుల సీనియర్ అధికారులు ఈ ఆదివారం తమ కుటుంబాలతో కండ్లకోయలో హాయిగా సేద తీరారు. గడిచిన శుక్రవారం పోలింగ్ ముగిసేదాకా సెలవులు లేకుండా విధులు నిర్వహించిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులకు ఈ ఆదివారం మాత్రం ఆటవిడుపుగా మారింది. అటవీ శాఖకు చెందిన కండ్లకోయ వనక్షేత్రంలో కుటుంబ సభ్యులతో కలసి సరదాగా గడిపారు. నగర శివార్లలోని ఆక్సిజన్ అర్బన్ ఫారెస్ట్ పార్క్‌లో వీరు ఆత్మీయంగా కలుసుకుని వన భోజనాలు చేశారు. ఆటపాటలతో సరదాగా గడుపుతున్న సీపీ అంజనీకుమార్ తదితరులు ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్యకార్యదర్శి నర్సింగ్ రావు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డీజీపీ) మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్ చందా, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి అధర్ సిన్హా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, పీసీసీఎఫ్ పీకే ఝా, సీఎంఓ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ తదితర అధికారులు తమ కుటుంబ సభ్యులతో కలసి ఈ కార్యక్రమానికి హాజరై ఉల్లాసంగా గడిపారు. గత మూడు నెలలుగా ఎన్నికల విధుల్లో తీరిక లేకుండా గడిపిన డీజీపీ, సీపీతో పాటు పలువురు ఇతర అధికారులు కొద్దిసేపు రాజకీయ చర్చలు, పాలనా వ్యవహారాల ముచ్చట్లను పక్కనబెట్టి గ్రామీణ క్రీడలు, ఆటపాటలతో ఆహ్లాదంగా గడిపారు. -
ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించిన కేటీఆర్
హైదరాబాద్ : ఔటర్ రింగు రోడ్డులో భాగంగా కండ్లకోయ వద్ద నిర్మించిన 1.10 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్‌వేను తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీ రామారావు ప్రారంభించారు. సుమారు రూ.125 కోట్ల వ్యయంతో నిర్మించిన కండ్లకోయ ఎక్స్‌ప్రెస్‌వేతో 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం వినియోగంలోకి రానుంది. ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం రూ.6696 కోట్ల జైకా నిధులతో పూర్తి చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం 2005లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభమైంది. ఆయన హయాంలోనే దాదాపు 78 కిలోమీటర్ల ఔటర్ రింగు రోడ్డు వినియోగంలోకి వచ్చింది. ఆ తర్వాత రాష్ట్ర విభజన గొడవలతో పనుల్లో వేగం మందగించింది. తెలంగాణ ఏర్పాటై టీఆర్ఎస్ పాలనలోకి వచ్చిన తర్వాత పనులు వేగిరం పుంజుకున్నాయి. టోల్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్తోపాటు, టోలు వసూలు, టోలు కనోపీలను మంత్రి ప్రారంభించారు. కండ్లకోయ ఇంటర్చేంజ్ వద్ద 8 లేన్లతో నిర్మించిన రోడ్డులో రెండు ఎంట్రీ, రెండు ఎగ్జిట్ ర్యాంపులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ..కోర్టులో ఎన్ని చిక్కులు ఎదురైనా ఈ రోజు ఔటర్ రింగు రోడ్డు ప్రారంభమైందన్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై చాలా మంది ప్రయాణం కొనసాగిస్తున్నారని, అలాగే హైదరాబాద్ మహానగరంలో ఎస్ఆర్డీపీ పేరుతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. 19 ఇంటర్ చేంజ్‌లలో 19 టోల్ మెనేజ్మెంట్ బిల్డింగ్‌లకు ఈరోజు శంకుస్థాపన చేశామని తెలిపారు. నగరాన్ని కూడా విస్తరిస్తున్నామని, 35 రేడియల్ రోడ్డులను కూడా పూర్తి చేస్తామని వివరించారు. భవిష్యత్తులో ఔటర్ రింగ్ రోడ్డులో టౌన్ షిప్‌లను కూడా త్వరలోనే ప్రారంభిస్తామని వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన ముఖ్యమైన పనులు కూడా ప్రారంభిస్తామని చెప్పారు. మిషన్ భగీరథ పేరుతో ఔటర్ రింగ్ రోడ్డులో మొత్తం వాటర్ సదుపాయం కల్పించామని అన్నారు. ప్రజల అవసరాలను తీర్చే విధంగా ఇంటర్ గ్రిడ్ని కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. -
స్టెప్పులు అదుర్స్
మండలంలోని కండ్లకోయ గ్రామ పరిధిలోని టైమ్ స్కూల్ మొదటి వార్షికోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. చిన్నారులు నిర్వహించిన సాంస్కృతికకార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సంగీతం, పాటల పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. స్కూల్ డెరైక్టర్ మాణిక్ దారువాలా, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. - న్యూస్‌లైన్, మేడ్చల్ రూరల్