హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా, కెమికల్ పరిశ్రమలకు ప్రత్యేక ఇంజనీరింగ్ పరికరాలను తయారు చేస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ 10వ ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్ సమీపంలోని బొంతపల్లి వద్ద 36 ఎకరాల్లో ఇది రానుంది. రూ.130 కోట్ల వ్యయంతో తొలి దశ 15 నెలల్లో పూర్తి అవుతుందని కంపెనీ ఎండీ నాగేశ్వర రావు కందుల వెల్లడించారు. 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులోకి వస్తుందని అన్నారు.
జనవరి 6న ప్రారంభం అవుతున్న ఐపీవో వివరాలను వెల్లడించేందుకు శనివారమిక్కడ జరిగిన సమావేశంలో కంపెనీ ఈడీ కాట్రగడ్డ మోహన రావు, సీఎఫ్‌వో పాతూరి ఆంజనేయులుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అయిదేళ్లలో అన్ని దశలు పూర్తి చేసుకుని ప్లాంటు మొత్తం 9 లక్షల చదరపు అడుగుల స్థాయికి చేరుతుందని చెప్పారు. ఇందుకు మొత్తం రూ.300 కోట్ల పెట్టుబడి అవసరమని వెల్లడించారు. నతన కేంద్రంలో చమురు, సహజ వాయువు, భారీ పరిశ్రమలు, వంట నూనెల రంగ సంస్థలకు అవసరమైన ఇంజనీరింగ్ పరికరాలను తయారు చేస్తామని నాగేశ్వర రావు వివరించారు.
అయిదేళ్లలో ఎగుమతులు సగం..
కంపెనీ ఆదాయంలో గత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల వాటా 0.5 శాతమే. 2024–25లో ఇది 15 శాతానికి చేరుతుందని నాగేశ్వర రావు వెల్లడించారు. ‘అయిదేళ్లలో ఎగుమతుల వాటా 50 శాతానికి చేరుస్తాం. యూఎస్‌కు చెందిన ఐపీపీ కంపెనీతో చేతులు కలిపాం.
ఆ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 1.5 లక్షలకుపైగా కంపెనీలు క్లయింట్లుగా ఉన్నాయి. ఐపీపీ సహకారంతో ఎగుమతి అవకాశాలను అందిపుచ్చుకుంటాం. అలాగే జపాన్‌కు రెండు నెలల్లో ఎగుమతులు ప్రారంభిస్తున్నాం. కంపెనీ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా 100 బిలియన్ డాలర్ల వ్యాపార అవకాశాలు ఉన్నాయి. అలాగే ఒక్క భారత్ నుంచే రూ.15,000 కోట్లు ఉంటుంది’ అని వివరించారు.
ఆర్డర్ బుక్ రూ.450 కోట్లు..
ప్రస్తుతం స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ 65 రకాల ఉత్పత్తులను తయారు చేస్తోంది. 15 కొత్త ఉత్పత్తులు అభివృద్ధి దశలో ఉన్నాయని నాగేశ్వర రావు వెల్లడించారు. ‘నెలకు 300 యూనిట్లు తయారు చేసే సామర్థ్యం ఉంది. రెండు నెలల్లో ర.40 కోట్ల మూలధన వ్యయం చేస్తాం. రెండేళ్లలో మరో ర.60 కోట్లు వెచ్చిస్తాం. 2023–24లో ర.549 కోట్ల టర్నోవర్ సాధించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది ర.700 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నాం. ఏటా టర్నోవర్‌లో 50 శాతం వృద్ధి నమోదు చేస్తున్నాం. ఆర్డర్ బుక్ రూ.450 కోట్లు ఉంది’ అని పేర్కొన్నారు.
జనవరి 6న ఐపీవో..
స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ ఐపీవో జనవరి 6న ప్రారంభమై 8న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ ర.123 కోట్లు అందుకుంది. ఒక్కొక్కటి ర.140 చొప్పున 87,86,809 ఈక్విటీ షేర్లను కేటాయించింది. అమన్సా హోల్డింగ్స్, క్లారస్ క్యాపిటల్–1, ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ ఎంఎఫ్, కోటక్ మహీంద్రా ట్రస్టీ కో లిమిటెడ్ ఏ/సీ కోటక్ మాన్యుఫ్యాక్చర్ ఇన్ ఇండియా ఫండ్, టాటా ఎంఎఫ్, మోతిలాల్ ఓస్వాల్ ఎంఎఫ్, 3పీ ఇండియా ఈక్విటీ ఫండ్–1, కోటక్ ఇన్ఫినిటీ ఫండ్–క్లాస్ ఏసీ, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐటీఐ లార్జ్ క్యాప్ ఫండ్ వీటిలో ఉన్నాయి.
ఇక ఐపీవోలో భాగంగా ర.210 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేస్తారు. 1,42,89,367 షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద ప్రమోటర్లు విక్రయిస్తారు. షేర్లను బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్ చేస్తారు. ప్రైస్ బ్యాండ్ ర.133–140గా నిర్ణయించారు. ఇన్వెస్టర్లు కనీసం 107 షేర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment