హబ్సిగూడ(హైదరాబాద్)లోని స్వామి వివేకానంద ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో.. 'గ్రీన్‌వర్క్స్ బయో', సీఎస్‌ఐఆర్ - ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (సీఎస్‌ఐఆర్-ఐఐసీటీ) సహకారంతో పర్యావరణ అనుకూల ఉత్పత్తులైన.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌లకు (SUP) ప్రత్యామ్నాయాలను విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి సైన్స్ అండ్ టెక్నాలజీ రాష్ట్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మొదలైనవారు పాల్గొన్నారు.
ప్లాస్టిక్ కాలుష్యాన్ని స్థిరమైన పరిష్కారాలతో ఎదుర్కోవడమే లక్ష్యంగా గ్రీన్‌వర్క్స్ బయో పాలిమర్‌లను ప్రవేశపెట్టింది. ఇవి కంపోస్టబుల్, బయోడిగ్రేడబుల్. కాబట్టి భూమిలో తొందరగా కలిసిపోతాయి. సీఎస్‌ఐఆర్-ఐఐసీటీ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ఈ ఉత్పత్తులు స్టార్చ్.. వ్యవసాయ వ్యర్థాల వంటి పునరుత్పాదక వనరుల నుంచి తయారు చేశారు. ఇవి నేషనల్ కంపోజిబిలిటీ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి.
ఈ కార్యక్రమంలో మంత్రి జితేంద్ర సింగ్ ప్రసంగిస్తూ.. పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడంలో వినూత్నమైన సైన్స్ ఆధారిత పరిష్కారాల ప్రాముఖ్యతను వెల్లడించారు. సీఎస్‌ఐఆర్-ఐఐసీటీతో గ్రీన్‌వర్క్స్ బయో సహకారం సాంకేతికతతో స్థిరమైన అభివృద్ధిని ఎలా నడిపించగలదో చూపిస్తుంది. సాంప్రదాయ ప్లాస్టిక్‌లకు వినూత్నమైన, పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను పరిచయం చేయడమే కాకుండా.. ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన పర్యావరణ సవాళ్లను పరిష్కరించడానికి సైన్స్ అండ్ టెక్నాలజీ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్నామని అన్నారు.
ముఖ్య అతిథి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. హరిత ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో రాష్ట్ర నిబద్ధతను ఎత్తిచూపారు. తెలంగాణ స్వచ్ఛమైన.. ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు దోహదపడే కార్యక్రమాలను నిర్వహించడం, దానికి మేము మద్దతు ఇవ్వడం గర్వంగా ఉందన్నారు. ప్లాస్టిక్ కాలుష్యానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment